Bumra
-
‘అర్జున’కు బుమ్రా, షమీ, జడేజా, పూనమ్
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, మహిళా స్పిన్నర్ పూనమ్ యాదవ్ పేర్లను ‘అర్జున అవార్డు’కు బీసీసీఐ ప్రతిపాదించింది. శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల మండలి (సీఓఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుమ్రా, షమీ భారత పురుషుల జట్టు పేస్ దళంలో కీలకమైనవారు. జడేజా... స్పిన్ ఆల్ రౌండర్. అద్భుతమైన ఫీల్డర్. ఈ ముగ్గురికీ త్వరలో జరుగనున్న ప్రపంచ కప్‌నకు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కింది. గత ఏడాది ఓపెనర్ శిఖర్ ధావన్ పేరును అవార్డుల కమిటీకి పంపించినా తిరస్కరణకు గురైంది. ఈసారి మాత్రం ధావన్ పేరును ‘అర్జున’కు ప్రతిపాదించలేదు. ఇక 27 ఏళ్ల పూనమ్ యాదవ్ మహిళల జట్టులో రెగ్యులర్ సభ్యురాలు. ఈమె 41 వన్డేల్లో 63 వికెట్లు, 54 టి20ల్లో 74 వికెట్లు పడగొట్టింది. ఫుట్‌బాల్ నుంచి గుర్ప్రీత్, జెజె... సీనియర్ ఫుట్‌బాల్ జట్టు గోల్ కీపర్ గుర్ప్రీత్ సంధూ, స్ట్రయికర్ జెజె లాల్పెఖులా పేర్లను వరుసగా మూడో ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. జాతీయ జట్టుకు చాలా కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరికీ గత రెండేళ్లుగా అవార్డు దక్కలేదు. -
‘ఆసీస్’ ద్రాక్ష అందిందిలా..
41/4... అడిలైడ్‌లో తొలి టెస్టు గంటన్నర గడిచిందో లేదో టీమిండియా స్కోరిది. ఓపెనర్ల పేలవ ఫామ్... కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్య వైఫల్యం... వైస్ కెప్టెన్ అజింక్య రహానే సైతం చేతులెత్తేయడంతో ఇంకేముంది? అంతా పాత కథే అనుకున్నారు. ఎన్నో అంచనాలు, మరెన్నో విశ్లేషణలు, ఇంకెన్నో ఆశలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్... ‘కొత్త చరిత్ర’ సృష్టించడం అటుంచి, ‘పాత చరిత్ర’నే పునరావృతం చేస్తుందని భావించారు. కానీ, ఇక్కడి నుంచి కథ మారింది. సరిగ్గా నెల రోజులు తిరిగేసరికి సిరీస్ దాసోహమైంది. దీని వెనుక పుజారా నిలకడ, బుమ్రా అద్భుతాలు, కోహ్లి వెన్నుదన్నుతో పాటు ‘టాస్’ రూపంలో అదృష్టం కూడా వెంట నడిచింది. ఫలితంగా, ఇంతకాలం అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఆసీస్‌లో సిరీస్ విజయం మన సొంతమైంది. దేశ క్రికెట్లో సువర్ణాధ్యాయం నమోదైంది. జట్టు సమష్టిగా సాధించిన ఈ ఘనతలో ఓ ఐదు అంశాలు కీలకంగా నిలిచాయి. అవేంటంటే! సాక్షి క్రీడా విభాగం : అది 2003–04 సిరీస్. నాలుగు టెస్టు మ్యాచ్‌లకు గాను మొదటిది ‘డ్రా’ కాగా, రెండో దాంట్లో భారత్ గెలుపొంది... ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి ఆధిక్యంలో నిలిచింది. కానీ, మూడో టెస్టులోఓడటంతో గణాంకాలు సమమయ్యాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన చివరి టెస్టులో టీమిండియా కంగారూలకు 443 పరుగుల అతి భారీ లక్ష్యం విధించింది. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో ఐదో రోజు మైదానంలో దిగిన ఆసీస్... ఓ దశలో 196/4తో నిలిచింది. అప్పటికింకా 40 ఓవర్ల ఆట మిగిలుంది. ప్రత్యర్థి ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసి మన బౌలర్లు ఊపు మీదున్నారు. టీమిండియా విజయం ఖాయం అనుకుంటున్న ఇలాంటి స్థితిలో కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న నాటి కెప్టెన్ స్టీవ్ వా (159 బంతుల్లో 80), సైమన్ కటిచ్ (96 బంతుల్లో 77 నాటౌట్)తో కలిసి గోడ కట్టాడు. ఓవర్లన్నీ కరగదీసి... ‘డ్రా’గా ముగించాడు. అలా, అప్పుడు సిడ్నీలో త్రుటిలో చేజారిన ‘చారిత్రక విజయం’ సరిగ్గా పదిహేనేళ్లకు, అదేచోట, అటుఇటుగా అవే తేదీల్లో ఖాయమైంది. టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకుకు తాము అర్హులమేనని కోహ్లి సేన సగర్వంగా చెప్పుకొనేలా చేసింది. ఈ గొప్పదనంలో ఎవరి పాత్ర ఏంటంటే..? అహో పుజారా... 521 పరుగులు, 74.22 సగటు, మూడు శతకాలు, ఒక అర్ధ శతకం! సిరీస్‌లో పుజారా గణాంకాలివి. అడిలైడ్‌లో టాపార్డర్ కుప్పకూలిన సందర్భంలో, మెల్బోర్న్లో జట్టుకు అత్యవసర సమయంలో, సిడ్నీలో ఆధిక్యాన్ని పెంచాల్సిన స్థితిలో పుజారా చేసిన శతకాలను పోల్చేందుకు ఏ గణాంకాలూ సాటి రావు. అతడు విఫలమైన పెర్త్‌లోనే టీమిండియా ఓడటం గమనార్హం. దీన్నిబట్టి విజయంలో తన పాత్రేమిటో చెప్పేయొచ్చు. అపరిమిత సహనం, చెక్కుచెదరని ఏకాగ్రత, సడలని డిఫెన్స్‌తో ఆసీస్ పేసర్ల బంతులను కాచుకున్న విధానం, క్రీజు వదిలి ముందుకొచ్చి స్పిన్నర్ లయన్‌ను దెబ్బకొట్టిన తీరు, ఇంత గొప్ప విజయంలో భాగమైనా కాసింతైనా గర్వం లేని నైజం కొత్త కుర్రాళ్లకు అచ్చమైన టెస్టు పాఠమే. ఇక అనేకానేక కారణాలతో జట్టులో చోటు కుర్చీలాటగా మారిన పరిస్థితుల్లో ఈ ఒక్క పర్యటన పుజారాను ఎక్కడికో తీసుకెళ్లింది. మరోవైపు ఈ సిరీస్‌తో కోహ్లికి తాను సమఉజ్జీనని చాటుకున్నాడు. తన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆటతో ఇకపై ఏ సిరీస్‌కూ తప్పించే ఆలోచనే రాకుండా చేశాడు. భళా బుమ్రా... సొంతగడ్డపై ఆసీస్ పేసర్లే తేలిపోతే, జస్ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 21 వికెట్లు (సిడ్నీలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ మినహా) పడగొట్టి ప్రత్యర్థి పనిపట్టాడు. అతడి 140 కి.మీ. నిలకడైన వేగం, వైవిధ్య శైలి, తెలివైన బౌలింగ్ ముందు కంగారూ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. మెల్బోర్న్లో కేవలం 115 కి.మీ. వేగంతో బుమ్రా సంధించిన బంతిని షాన్ మార్‡్ష వంటి సీనియర్ సైతం ఆడలేకపోయాడు. పాదాలను చితగ్గొట్టే పదునైన యార్కర్లు బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాయి. సుదీర్ఘ స్పెల్స్ వేయడంతో పాటు జట్టుకు కావాల్సిన సందర్భాల్లో వికెట్లు తీస్తూ బుమ్రా పైమెట్టులో నిలిచాడు. అతడి ఆరు వికెట్ల ప్రదర్శనే మెల్బోర్న్ టెస్టును భారత్ పరం చేసింది. ఈ పర్యటనతో ప్రపంచంలో ఎలాంటి పిచ్‌పైనైనా తాను రాణించగలనని బుమ్రా చాటాడు. లయన్ జూలు విదిల్చకుండా... కోహ్లిలాంటి బ్యాట్స్‌మన్‌ను పదేపదే ఔట్ చేస్తూ, అడిలైడ్, పెర్త్‌లో ఏకంగా 16 వికెట్లు నేలకూల్చి కలవరపెట్టాడీ ఆఫ్ స్పిన్నర్. ఇతడి జోరు చూస్తే భారత్ ఆశలకు గండికొట్టేవాడిలానే కనిపించాడు. కానీ, మెల్బోర్న్లో లయన్ జూలు పీకేశారు భారత బ్యాట్స్‌మెన్. అతడిని వ్యూహాత్మకంగా, ప్రణాళిక ప్రకారం ఎదుర్కొన్నారు. ఓవర్లకు ఓవర్లు వేసినా వికెట్ దక్కకుండా చేసి చివరకు ఎటూ పాలుపోని స్థితికి తీసుకొచ్చారు. దీంతో చివరి రెండు టెస్టుల్లో 328 పరుగులిచ్చి ఐదే వికెట్లు పడగొట్టగలిగాడు. ‘టాస్’ కూడా మేలు చేసింది... ఏ దేశంలోనైనా ఈ కాలంలో టెస్టు విజయానికి సగం మార్గం టాస్‌తోనే పడుతోంది. ఇంగ్లండ్‌లో భారత్‌ను వెక్కిరించిన టాస్ ఈసారి మాత్రం కరుణించింది. పెర్త్ మినహా అన్నిచోట్లా కోహ్లినే టాస్ నెగ్గగా... బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి భారత్ మంచి స్కోర్లతో మ్యాచ్‌ను లాగేసుకుంది. కుర్రాళ్ల తోడ్పాటు... యువ పృథ్వీ షా గాయంతో దూరమై, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమై, ఓపెనింగ్ రెండు స్థానాలూ ఖాళీగా కనిపించిన స్థితిలో కొత్త కుర్రాళ్లు మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఇన్నింగ్స్‌ను ఆరంభించి జట్టును కాపాడారు. సిరీస్ 1–1తో ఉన్న స్థితిలో మెల్బోర్న్లో దాదాపు తొలి సెషన్ అంతా నిలిచి టీమిండియా ఆశలు నిలిపారు. ఆపద సమయంలో వీరు చూపిన సంయమనాన్ని స్కోర్లతో కొలవలేం. భిన్న నేపథ్యాల నుంచి నేరుగా క్రీజులో అడుగుపెట్టినా, ఏమాత్రం బెదురు లేకుండా ఆడారు. మయాంక్ తనదైన దూకుడుతో లయన్‌ను దెబ్బకొట్టిన తీరు చెప్పుకోదగ్గది. చివరి టెస్టులో అగర్వాల్ ఇన్నింగ్స్ శతకానికి పూర్తిగా అర్హమైనది. ఇక విహారి అప్పగించిన బాధ్యతను సమర్థంగా నెరవేర్చి తాను జట్టు మనిషినని చాటుకున్నాడు. సిడ్నీలో చక్కటి షాట్లతో అలరించాడు. -
చక్రం తిప్పిన భారత పేస్ బౌలింగ్ త్రయం
భారత జట్టు ఇలా ఎలా విజయం సాధించగలిగింది? విదేశీ గడ్డపై ఇంతగా ఎలా బెంబేలెత్తించగలిగింది? అదీ ఆస్ట్రేలియాలాంటి చోట వారికంటే మెరుగైన బౌలింగ్ ఎలా సాధ్యమైంది? అసలు ఇదంతా వాస్తవమేనా... సగటు క్రికెట్ అభిమానికి వచ్చే సందేహాలే ఇవి. కానీ ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల తర్వాత అందరికీ సమాధానం లభించింది. భారత పేస్ బౌలర్లు అన్ని రంగాల్లో కంగారూ పేసర్లకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన వేళ విజయం పరుగెత్తుకుంటూ వచ్చి వాలింది. ఆసీస్ పేసర్లతో పోలిస్తే పడగొట్టిన వికెట్లు, బంతిని స్వింగ్ చేసిన తీరు, గుడ్‌లెంగ్త్ బంతులు, సరిగ్గా వికెట్లపైకి దూసుకొచ్చిన బంతులు... ఇలా ఏ అంశం తీసుకున్నా మన ‘ముగ్గురు మొనగాళ్లు’ ప్రత్యర్థి ఫాస్ట్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. బుమ్రా, షమీ, ఇషాంత్ శర్మల ప్రదర్శన ముందు స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్ చిన్నబోయారు! అయితే ఇది ఆస్ట్రేలియాలోనే మొదలు కాలేదు. 2018లో మూడు ప్రతిష్టాత్మక విదేశీ పర్యటనల్లో సత్తా చాటి భారత్‌ను గెలిపించగలరని భావించిన మన పేసర్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. విదేశాల్లో 11 టెస్టు మ్యాచ్‌లు... ఇందులో 4 విజయాలు... భారత టెస్టు చరిత్రలో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత ఇది. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, సెహ్వాగ్, జహీర్, కుంబ్లేలాంటి దిగ్గజాలు ఉన్న కాలంలో కూడా టీమిండియా ఒకే ఏడాది విదేశాల్లో ఇంత మంచి ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఈ ఏడాది విదేశాల్లో భారత జట్టు గెలిచిన నాలుగు టెస్టుల్లో పేసర్ల ప్రదర్శనను విశ్లేషిస్తే... జొహన్నెస్‌బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగితే... రెండో ఇన్నింగ్స్‌లో షమీ 5 వికెట్లు తీసి ప్రత్యర్థి పని పట్టాడు. నాటింగ్‌హామ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 161 పరుగులకే కుప్పకూల్చి విజయానికి బాటలు పరచడంలో 5 వికెట్లతో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ బుమ్రా తన సత్తా చాటాడు. 5 వికెట్లు తీసి తన విలువేంటో చూపించాడు. అడిలైడ్ టెస్టులో ఐదు వికెట్ల ఘనతలు లేకపోయినా మన ముగ్గురు పేసర్లు కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి పట్టు చేజారకుండా ఉంచగలిగారు. ఇక మెల్బోర్న్లో అయితే బుమ్రా మెరుపులకు ఇషాంత్, షమీ జోరు కూడా తోడైంది. 1991–92 ఆస్ట్రేలియా సిరీస్‌లో ఐదు టెస్టుల్లో కలిపి భారత పేసర్లు 57 వికెట్లు తీస్తే ఇప్పుడు మూడు టెస్టుల్లోనే 47 వికెట్లు పడగొట్టడం విశేషం. గతంలో విదేశాల్లో భారత్ ఎప్పుడు పర్యటించినా ఒకరు లేదా ఇద్దరు పేసర్లు ఉండటం, వారిలోనూ ఒకరి వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే హైలైట్ అయ్యేవి. ఇంత సమష్టిగా ఒకరితో మరొకరు పోటీ పడి రాణించడం ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు అది సాధ్యం కావడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయి. బౌలర్లతో సమావేశం జరిగేటప్పుడు నేను వాళ్లు చెప్పిందే వింటాను. విదేశాల్లో టెస్టులు గెలవాలంటే వారు తమ ఆలోచనల ప్రకారం మ్యాచ్ దిశను నడిపించాలని నేను భావిస్తా. మా పేసర్ల బౌలింగ్ చూస్తుంటే కెప్టెన్‌గా చాలా గర్వపడుతున్నా. వారంతా ఎంతో బాధ్యత తీసుకోవడంతో పాటు తమ సత్తాపై నమ్మకంతో చెలరేగిపోయారు. ఇదంతా వారి సమష్టి ప్రదర్శన వల్లే సాధ్యమైంది’ –విరాట్ కోహ్లి -
నిలువునా కూల్చారు
టీమిండియా ఎక్కడా పట్టువిడవలేదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. నిప్పు కణికల్లాంటి జస్ప్రీత్ బుమ్రా బంతులు నిలువెల్లా వణికించడంతో ఆస్ట్రేలియన్లు చేతులెత్తేశారు. మిగతా బౌలర్లు సహాయక పాత్ర పోషించడంతో మెల్బోర్న్ టెస్టులో కోహ్లి సేన జయభేరి మోగించే దిశగా సాగుతోంది. ఇప్పటికే ఆధిక్యం 346 పరుగులకు చేరింది. మరో రెండు రోజుల సమయం ఉంది. అన్నింటికి మించి భారత్ జోరు మీదుంది. కంగారూలు తోక ముడవడం... సిరీస్‌లో మన జట్టు 2–1తో ముందంజ వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మెల్బోర్న్: అంతా కోరుకున్నట్లే ‘బాక్సింగ్ డే’ టెస్టులో భారత బౌలర్లు ఆస్ట్రేలియాకు పంచ్ ఇచ్చారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6/33) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో ఏకంగా నాకౌట్ పంచే కొట్టాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు శుక్రవారం ఆతిథ్య జట్టు కుదేలైపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే ఆలౌటైంది. టీమిండియాకు 292 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లి సేన... కమిన్స్ (4/10) ధాటికి తడబడింది. ఆట ముగిసే సమయానికి 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. టాప్ బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా, అరంగేట్ర ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (28 బ్యాటింగ్) నిలబడటంతో ఆధిక్యాన్ని 346కు పెంచుకుంది. అతడి తోడుగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బుమ్రా బెంబేలెత్తించాడు ఓపెనర్లు ఫించ్ (8), హారిస్ (22) సులువుగా పరుగులు సాధించడంతో శుక్రవారం ఉదయం ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగానే ప్రారంభమైంది. కానీ, ఇది ఎంతోసేపు నిలవలేదు. ఇషాంత్ వేసిన బంతిని లెగ్‌సైడ్ ఫ్లిక్ చేసేందుకు యత్నించిన ఫించ్... మయాంక్ చక్కటి క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. భుజం ఎత్తులో వచ్చిన బుమ్రా షార్ట్ బాల్‌ను హుక్ చేయబోయి విఫలమైన హారిస్... ఇషాంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దూకుడుగా కనిపించిన ఖాజా (21)ను జడేజా వెనక్కు పంపాడు. పాతుకుపోయేందుకు యత్నించిన షాన్ మార్‡్ష (19)ను రెండో స్పెల్‌కు దిగిన బుమ్రా బోల్తా కొట్టించాడు. 89/4తో ఆసీస్ లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత హెడ్ (20) వికెట్లను గిరాటేసి బుమ్రానే భారత్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు. మిషెల్ మార్‡్ష (9)ను జడేజా ఎక్కువసేపు నిలవనీయలేదు. ఈ దశలో కెప్టెన్ పైన్ (22)కు అండగా నిలిచిన కమిన్స్ (17)ను షమీ బౌల్డ్ చేశాడు. టీ తర్వాత మూడో విడత బౌలింగ్‌కు దిగుతూనే తొమ్మిది బంతుల వ్యవధిలో పైన్, లయన్ (0), హాజల్‌వుడ్ (0)లను ఔట్ చేసి కంగారూల ఇన్నింగ్స్‌కు బుమ్రా తెరదించాడు. నాలుగో వికెట్‌కు ఖాజా–షాన్ మార్‡్ష, ఏడో వికెట్‌కు పైన్–కమిన్స్ జోడించిన 36 పరుగులే ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యాలు కావడం గమనార్హం. టీమిండియా బౌలర్ల ధాటికి శుక్రవారం ఆ జట్టు 60.5 ఓవర్లే ఆడగలిగింది. కమిన్స్ మాయ చేశాడు... మ్యాచ్‌కు రెండు రోజులపైగా సమయం ఉండటం, ఆధిక్యాన్ని మరింత పెంచుకుని ఆసీస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టే ఉద్దేశంతో ఫాలోఆన్ ఇవ్వకుండా భారత్ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. సాధికారికంగా ఆడుతున్న మయాంక్‌కు విహారి (13) తోడ్పాటునందించాడు. ఈ జోడీ 13 ఓవర్లపాటు నిలిచింది. అయితే కమిన్స్ షార్ట్ బంతితో విహారిని పడగొట్టాడు. తర్వాతి ఓవర్లో గ్లాన్స్ ఆడేందుకు యత్నించిన పుజారా (0), కోహ్లి (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని ఆడబోయి రహానే (1) కీపర్‌కు చిక్కాడు. 8 బంతుల తేడాతోనే కమి న్స్ ఈ నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. హాజల్‌వుడ్ వేసిన షార్ట్ బంతి రోహిత్ (5) కథ ముగించింది. చివర్లో మయాంక్, పంత్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. బూమ్రా... భళా మెల్బోర్న్ టెస్టు మూడో రోజు భారత్ తరఫున బుమ్రా, ఆస్ట్రేలియా తరఫున కమిన్స్‌ల స్పెల్ హైలైట్‌గా నిలిచింది. ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం టీమిండియా బౌలర్లు, అందులోనూ బుమ్రా గురించే. మూడు స్పెల్‌లలోనూ షార్ట్ పిచ్, స్లో యార్కర్లు, స్వింగ్ బంతులతో అతడు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఆటాడుకున్నాడు. హుక్ షాట్ ఆడేలా ప్రేరేపించి హారిస్‌ను పెవిలియన్ చేర్చిన బుమ్రా... 115 కి.మీ. వేగం దాటని యార్కర్ లెంగ్త్ బంతితో షాన్ మార్‡్షను ఎల్బీ చేశాడు. దీనిపై ఆసీస్ సమీక్ష కూడా కోరే ఆలోచన చేయలేదంటే బంతి ఎంత కచ్చితంగా పడిందో అర్ధమవుతుంది. ఆ వెంటనే 142 కి.మీ. వేగంతో బెయిల్స్ లేపేసి హెడ్ దిమ్మతిరిగేలా చేశాడు. టీ తర్వాత బుమ్రా స్పెల్ గురించి మరింత చెప్పుకోవాలి. ఆడాలా వద్దా అన్నట్లు వచ్చిన బంతి పైన్ బ్యాట్ అంచును తాకుతూ కీపర్ పంత్ చేతుల్లో పడింది. కచ్చితమైన బంతులతో లయన్, హాజల్వుడ్లనూ ఔట్ చేసి ఆసీస్ ఆట కట్టించాడు. ఇదే సమయంలో ఇషాంత్ బౌలింగ్‌లో షార్ట్ మిడ్ వికెట్లో మయాంక్‌ను ఉంచడం వంటి కోహ్లి ఫీల్డింగ్ వ్యూహాలకూ ప్రశంసలు దక్కాయి. పించ్‌ను ఔట్ చేసి ఇషాంత్ (1/41) శుభారంభమిస్తే... ప్రత్యర్థి భాగస్వామ్యాలను ఎప్పటికప్పుడు విడగొట్టి జడేజా (2/45), షమీ (1/27) బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చారు. మొత్తం 66.5 ఓవర్లలో జడేజానే 25 వేయడం గమనార్హం. ఫాలోఆన్ ఇవ్వలేదంటే... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరుకు దాదాపు రెట్టింపు ఆధిక్యం దక్కినా, బుమ్రా సహా మిగతా పేసర్లు పెద్దగా అలసిపోకున్నా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాను ఫాలోఆన్ ఆడించకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది. కొన్ని కోణాల్లో చూస్తే ఇది సమంజసమే అనిపించింది. పేసర్లు మరింత తాజాగా బౌలింగ్‌కు దిగే వీలు కల్పించడం ఇందులో మొదటిది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ అనూహ్యంగా పుంజుకొని 400పైగా పరుగులు చేస్తే టీమిండియా నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాల్సి రావడం రెండోది. ఇదే జరిగితే పిచ్ అనూహ్య స్పందనల కారణంగా స్వల్ప లక్ష్యమే అయినా, ఇబ్బందులు తప్పేలా లేవు. అసలా పరిస్థితే రాకుండా ఉండాలంటే రెండో ఇన్నింగ్స్‌లో మనమే సాధ్యమైనన్ని పరుగులు చేసి, కంగారూల ముందు అందుకోలేనంత భారీ లక్ష్యాన్ని విధించాలని కోహ్లి భావించినట్లున్నాడు. అయితే, భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఈ ప్రణాళిక కొంత దెబ్బతిన్నా, ఇప్పటికే అతి భారీ లక్ష్యాన్ని నిర్దేశించే స్థితిలో ఉండటంతో ఆందోళన చెందాల్సిన పని లేకపోయింది. ఈ నేపథ్యంలో నాలుగో రోజు మయాంక్, పంత్ వేగంగా ఆడి లక్ష్యాన్ని 400 పరుగుల సమీపానికి చేరిస్తే ఆ వెంటనే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఎప్పటిలాగానే బౌలర్లు చెలరేగితే టెస్టు మన వశమౌతుంది. ► ఒకే ఏడాదిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డపై ఇన్నింగ్స్‌లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాపై (జొహన్నెస్‌బర్గ్‌లో 5/54); ఇంగ్లండ్‌పై (ట్రెంట్‌బ్రిడ్జ్‌లో 5/85); ఆస్ట్రేలియాపై (మెల్బోర్న్లో 6/33) ఈ ఘనత సాధించాడు. ► ఒకే ఏడాది విదేశీ గడ్డపై అత్యధిక (45) వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఇప్పటికే 45 వికెట్లు పడగొట్టిన బుమ్రా అరంగేట్రం చేసిన సంవత్సరమే ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గానూ గుర్తింపు పొందాడు. ► ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారతీయ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. ప్రస్తుత సిరీస్‌లో పంత్ 18 క్యాచ్‌లు అందుకున్నాడు. గతంలో సయ్యద్ కిర్మాణీ, ధోని అత్యధికంగా 17 క్యాచ్‌లు పట్టారు. మా బ్యాట్స్‌మెన్ పుజారా, కోహ్లిలా ఆడాలి మా బ్యాటింగ్ బాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేసి మ్యాచ్‌లో నిలవాలని భావించినా సాధ్యం కాలేదు. ఒత్తిడిని తట్టుకుంటూ భారత తొలి ఇన్నింగ్స్‌లో పుజారా, కోహ్లి ఆడినట్లుగా ఇప్పుడు మా బ్యాట్స్‌మెన్ ఆడాలి. ఈ పిచ్‌పై పరుగులు రావడం కష్టమే. అయితే, మేం గతేడాది నాలుగు, ఐదో రోజున చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చేశాం. – ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ రంజీ అనుభవంతో రివర్స్ స్వింగ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నెమ్మదైన పిచ్‌లపై బౌలింగ్ చేసిన అనుభవం మెల్బోర్న్లో ఉపయోగపడింది. దీంతో బంతిని రివర్స్ స్వింగ్ చేయగలిగా. నేను బౌలింగ్‌కు దిగినప్పుడు పిచ్ నెమ్మదిగా ఉంది. బంతి మెత్త బడింది. దీనికి తగ్గట్లే బంతులేశా. బంతి రివర్స్ స్వింగ్ అవుతుండటంతో ఫలితం దక్కింది. నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి కెరీర్ ప్రారంభ ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం నన్నేమీ ఆశ్చర్చపర్చలేదు. వివిధ దేశాల్లో ఆడటం కొత్త అనుభూతినిస్తోంది. – జస్ప్రీత్ బుమ్రా, భారత పేసర్ -
బుమ్రా లేని లోటు కనిపిస్తోంది
భారత్, ఇంగ్లండ్ జట్లు టి20 సిరీస్ లో తమ సత్తాను ప్రదర్శించి మున్ముందు ఎలాంటి ఆటను మనకు అందించబోతున్నాయో సంకేతమిచ్చాయి. మ్యాచ్‌లో ఒకవేళ కఠినమైన పరిస్థితిలో నిలిచినా... బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ కోలుకునేందుకు ఈ అదనపు 30 ఓవర్ల ఆట ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్ ఇటీవలే ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది. ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగలేదనేది వేరే విషయం. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్‌లో లోటు కనిపించింది. అయితే చివరి వన్డేలో బట్లర్ మెరుపు సెంచరీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు 90కి పైగా పరుగులు చేయడం ఇంగ్లండ్ జట్టు సమర్థతకు నిదర్శనం. గతంలో అయితే ఏదో కొంత పోరాడటం తప్ప ఇంగ్లండ్ జట్టు ఆసీస్‌కు దాసోహమైపోయేది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించని తత్వం మోర్గాన్ నేతృత్వంలోని కొత్త జట్టులో కనిపిస్తోంది. టి20ల్లో చూసినట్లు జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వారి బౌలింగ్ ఇంకా పూర్తి స్థాయిలో కుదురుకోకపోయినా, ఈ ఫార్మాట్లో చాలా మంది ఇతర జట్ల కెప్టెన్లు, కోచ్‌లకు అది సాధారణ సమస్యే. భారత్ కూడా కుల్దీప్, చహల్ ఇద్దరినీ ఆడించాలా లేకా ఒకే స్పిన్నర్‌ను ఎంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. బ్యాటింగ్ విభాగంలో శిఖర్ ధావన్ విషయంలో కొంత ఆందోళన ఉంది. చివరి టి20లో అద్భుత సెంచరీ సాధించిన రోహిత్ అలవోకగా ఈ ఫార్మాట్లోకి మారిపోగలడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, చివరి ఓవర్లలో భువనేశ్వర్‌తో జోడీగా చెలరేగిపోయే బుమ్రా లేని లోటు కచ్చితంగా కనిపిస్తోంది. బ్రిస్టల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ జోరును అడ్డుకున్న పాండ్యాపై రెండు రకాల బాధ్యతలూ ఉన్నాయి. భారత్ జోరు మీద కనిపిస్తున్నా, సొంతగడ్డపై ఇంగ్లండ్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది కాబట్టి ఎవరు గెలుస్తారనేది అంచనా వేయడం కష్టం. -
సింహం మళ్లీ గర్జిస్తుంది!
సెంచూరియన్ టెస్టులో పరాజయం తర్వాతి రోజు భారత క్రికెటర్లు అడవిలో సఫారీకి వెళ్లి సేద తీరారు. క్రూగర్స్ నేషనల్ పార్క్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సింహం పిల్లలతో ఫొటో దిగి దానికి వ్యాఖ్య కూడా జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘జీవితం మనల్ని వెనక్కి లాగినప్పుడు ఎప్పుడూ బాధ పడవద్దు. ఎందుకంటే సింహం కూడా అమాంతం దూకి దాడి చేసే ముందు ఒకడుగు వెనక్కి వేస్తుంది’ అంటూ తాము చివరి టెస్టులో కోలుకుంటామన్నట్లు పరోక్షంగా చెప్పాడు! -
ధోనినుంచి నేర్చుకుంటున్నాను!
విరాట్ కోహ్లి వ్యాఖ్య బెంగళూరు: కెప్టెన్సీ తనకు కొత్త కాకపోయినా కీలక సమయాల్లో ధోని అనుభవం తనకు ఎంతో ఉపయోగపడుతోందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్లలో మాజీ కెప్టెన్ సలహాలు తీసుకోవడంలో తప్పేమి లేదని అతను అన్నాడు. ‘కొంత కాలంగా నేను టెస్టు కెప్టెన్‌గా ఉన్నాను. కానీ వన్డేలు, టి20ల్లో పరిణామాలు వేగంగా మారిపోతుంటాయి. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా ఉండి ఆటను బాగా అర్థం చేసుకోగలిగిన ధోనిలాంటి వ్యక్తినుంచి కీలక సమయాల్లో సూచనలు తీసుకోవడం మంచిదే. చివరి మ్యాచ్‌లో చహల్ తర్వాత పాండ్యాకు బౌలింగ్ ఇద్దామని భావించినా, ఆఖరి ఓవర్ దాకా వేచి చూడవద్దనే అతని సలహాతోనే బుమ్రాకు బంతిని అందించాను’ అని కోహ్లి వివరించాడు. ఇంగ్లండ్‌తో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్ గెలుచుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందన్న కెప్టెన్... కొత్త కుర్రాళ్లు తమకు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవడమే ఈ సిరీస్‌ల ద్వారా భారత్‌కు దక్కిన అతి పెద్ద ప్రయోజనమని చెప్పాడు. మరో వైపు గత రెండేళ్లలో ఇంగ్లండ్ జట్టు ఇంత ఘోరంగా ఎప్పుడూ ఆడలేదని కెప్టెన్ మోర్గాన్ అభిప్రాయ పడ్డాడు. అయితే టి20 సిరీస్‌తో పోలిస్తే వన్డేల్లో ఓడిపోవడమే తమను ఎక్కువగా బాధించిందని అతను అన్నాడు. తాము గెలవాల్సిన మ్యాచ్‌లను చాలా తక్కువ తేడాతో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని అతను వ్యాఖ్యానించాడు. -
ఆఖరి ఓవర్లో గెలిపించిన ’బుమ్రా’
-
భళా... బుమ్రా
ఆఖరి ఓవర్లో గెలిపించిన పేసర్ ఇంగ్లండ్‌పై రెండో టి20లో భారత్ గెలుపు రాణించిన రాహుల్, నెహ్రా సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించింది. రాహుల్ మినహా బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట.. బౌలర్లు మాత్రం స్ఫూర్తిదాయక ప్రదర్శనతో జట్టుకు కీలక విజయాన్ని అందించారు. ప్రారంభంలో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన నెహ్రా ఇంగ్లండ్ పతనానికి బాట వేయగా... ఆఖరి ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీసి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. నాగ్‌పూర్: చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి కావాల్సిన పరుగులు 8... క్రీజులో ఉన్నది స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్‌తో పాటు బౌండరీలతో జోరు మీదున్న బట్లర్. భారత అభిమాని ఆశలు అడుగంటిన ఈ పరిస్థితిలో మీడియం పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమే చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్‌కు పంపించడంతోపాటు కేవలం రెండు పరుగులే ఇవ్వడంతో భారత జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా (3/28) కూడా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ 1–1తో సమం చేసింది. మూడో టి20 ఫిబ్రవరి 1న బెంగళూరులో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 71; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మనీష్ పాండే (26 బంతుల్లో 30; 1 సిక్స్), కోహ్లి (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 139 పరుగులు చేసి ఓడిపోయింది. రాహుల్ ఒక్కడే: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. తొలి మూడు ఓవర్లలో ఐదు పరుగులే రాగా... నాలుగో ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్‌తో 15 పరుగులు రాబట్టి టచ్‌లోకి వచ్చాడు. అయితే మరుసటి ఓవర్లో జోర్డాన్ వేసిన స్లో బంతిని లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడి క్యాచ్ అవుటయ్యాడు. కొద్దిసేపటికే రైనా (7), యువరాజ్ (4) కూడా అవుట్ కావడంతో భారత్ 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మనీష్ పాండేతో కలిసి ఓపెనర్ రాహుల్ తన జోరును కొనసాగిస్తూ రన్‌రేట్ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు 36 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు. నెహ్రా ఝలక్: స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు నాలుగో ఓవర్లోనే పేసర్ ఆశిష్ నెహ్రా గట్టి ఝలక్ ఇచ్చాడు. అంతకుముందు ఓవర్లో ఓపెనర్లు బిల్లింగ్స్ (12), రాయ్ (10) చెరో సిక్స్ బాదినా నెహ్రా వీరిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో రూట్, మోర్గాన్ (17; 1 ఫోర్) పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. మిశ్రా వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో రూట్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే తన తర్వాతి ఓవర్ తొలి బంతికే మోర్గాన్ వికెట్ తీసి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత స్టోక్స్ రెచ్చిపోయి రైనా ఓవర్లో వరుసగా 4, 6.. చాహల్ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో బ్యాట్‌ను ఝళిపించాడు. నెహ్రా 17వ ఓవర్లో స్టోక్స్‌ను ఎల్బీగా అవుట్ చేయగా... 18వ ఓవర్లో బుమ్రా కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టడంతో పాటు చివరి ఓవర్లో మాయే చేసి అనూహ్య ఫలితాన్ని అందించాడు. -
నాయకుడు గెలిపించాడు
►మరోసారి రాణించిన రోహిత్ శర్మ ► పుణేపై ముంబై ఇండియన్స్ విజయం పుణే: స్టార్ ఆటగాళ్లు... తెరవెనుక అతిపెద్ద మంత్రాంగం... అయినా ఆరంభంలో విజయాలు సాధించడంలో వెనుకబడ్డ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు పుంజుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (60 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ముందుండి జట్టును నడిపిస్తుండటంతో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్-9లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో పుణేపై నెగ్గింది. సీజన్ తొలి మ్యాచ్‌లో పుణే చేతిలో ఎదురైన పరాజయానికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత ముంబై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసింది. బట్లర్ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆరంభం అదుర్స్... ఓపెనర్లలో రహానే (4) విఫలమైనా... సౌరభ్ తివారితో కలిసి వన్‌డౌన్‌లో స్మిత్ మోత మోగించాడు. మూడు ఓవర్ల తేడాలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లేలో పుణే వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో తివారి రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్లో స్మిత్ మూడో సిక్సర్ బాదాడు. అయితే వేగంగా ఆడుతున్న ఈ జోడిని పదో ఓవర్లో బుమ్రా విడగొట్టాడు. అద్భుతమైన ఫుల్ లెంగ్త్ బంతితో స్మిత్‌ను పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ ఓవర్ ముగిసేసరికి పుణే స్కోరు 93/2కు చేరింది. అప్పటి వరకు వాయువేగంతో దూసుకుపోయిన పుణే స్కోరు బోర్డుకు హర్భజన్ కళ్లెం వేశాడు. బంతిని బాగా టర్న్ చేస్తూ ఓ వికెట్ తీయడంతో పాటు పరుగులూ నిరోధించాడు. దీంతో 11 నుంచి 15 ఓవర్ల మధ్య కేవలం 27 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ దశలో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తివారి, ధోని (24 బంతుల్లో 24; 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 33 పరుగులు జత చేశాక 18వ ఓవర్లో తివారి అవుటయ్యాడు. చివరి ఓవర్లో ధోని కూడా వెనుదిరిగాడు. మళ్లీ సారథే... తొలి రెండు ఓవర్లలో 8 పరుగులే రావడంతో కాస్త ఒత్తిడికి లోనైన రోహిత్ మూడో ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన పార్థీవ్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. తర్వాత రాయుడు (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) సింగిల్స్‌తో రోహిత్‌కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరు చెరో సిక్సర్ బాదడంతో పవర్‌ప్లేలో 51/1 ఉన్న స్కోరు పది ఓవర్లు ముగిసేసరికి 76/1కి చేరింది. వేగంగా ఆడే ప్రయత్నంలో రాయుడు 12వ ఓవర్లో వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన రోహిత్ ఆ తర్వాత వేగంగా ఆడాడు. రెండోఎండ్‌లో బట్లర్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి) క్రునాల్ (బి) మెక్లీనగన్ 4; సౌరభ్ తివారి (సి) హార్దిక్ (బి) బుమ్రా 57; స్మిత్ (సి) పార్థీవ్ (బి) బుమ్రా 45; హాండ్స్‌కాంబ్ (సి) బట్లర్ (బి) హర్భజన్ 6; ధోని (సి) రాయుడు (బి) బుమ్రా 24 ; పెరీరా నాటౌట్ 12; భాటియా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1-8; 2-92; 3-105; 4-138; 5-149. బౌలింగ్: సౌతీ 4-0-35-0; మెక్లీనగన్ 4-0-27- 1; క్రునాల్ 2-0-28-0; బుమ్రా 4-0-29-3; హార్దిక్ 2-0-14-0; హర్భజన్ 4-0-25-1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 85; పార్థీవ్ (సి) ధోని (బి) దిండా 21; రాయుడు (సి) రహానే (బి) అశ్విన్ 22; బట్లర్ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-39; 2-91. బౌలింగ్: పెరీరా 4-0-35-0; దిండా 3-0-33-1; బొలాండ్ 3-0-23-0; భాటియా 3-0-20-0; ఆర్. అశ్విన్ 3-0-21-0; ఎం.అశ్విన్ 2.3-0-25-0. -
ముంబై మెరిసింది
► 25 పరుగులతో పంజాబ్‌పై విజయం ► గెలిపించిన పార్థివ్, రాయుడు ముందుగా పార్థివ్, అంబటి రాయుడు భారీ భాగస్వామ్యం... ఆ తర్వాత బుమ్రా పదునైన బౌలింగ్ కలగలిసి ముంబై ఇండియన్స్ మళ్లీ విజయం బాట పట్టింది. ఢిల్లీ చేతిలో అనూహ్య ఓటమితో కోలుకున్న రోహిత్ సేన సమష్టిగా రాణించి పంజాబ్‌ను చిత్తు చేసింది. బౌలింగ్ వైఫల్యంతో భారీగా పరుగులిచ్చిన కింగ్స్ ఎలెవన్, ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ అండతో పోరాడే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. ఫలితంగా మిల్లర్ బృందం పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. మొహాలీ: ఐపీఎల్-9లో పడుతూ లేస్తూ సాగుతున్న ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 25 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (58 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (37 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 85 బంతుల్లోనే 137 పరుగులు జోడించడం విశేషం. అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (39 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), షాన్ మార్ష్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆ జట్టుకు లీగ్‌లో వరుసగా ఇది మూడో పరాజయం. మెరుపు భాగస్వామ్యం... ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ (0)ను సందీప్ శర్మ అవుట్ చేసి పంజాబ్ శిబిరంలో ఆనందం నింపాడు. అయితే ఆ తర్వాత పార్థివ్, రాయుడు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగడంతో ముంబై స్కోరు వేగంగా దూసుకుపోయింది. ఒక్క జాన్సన్ బౌలింగ్‌లోనే పార్థివ్ ఆరు ఫోర్లు బాది ఆధిపత్యం ప్రదర్శించగా, అక్షర్ బౌలింగ్‌లో రాయుడు మూడు భారీ సిక్సర్లు కొట్టి తన పదును చూపించాడు. ఇదే జోరులో రాయుడు 31 బంతుల్లో, పార్థివ్ 41 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో రాయుడు టి20 క్రికెట్లో 3000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. తొలి ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసిన ముంబై, తర్వాతి పది ఓవర్లలో మరో వికెట్ మాత్రమే కోల్పోయి 115 పరుగులు చేసిందంటే దూకుడు ఎలా సాగిందో అర్థమవుతుంది. పొలార్డ్ (10), హార్దిక్ పాండ్యా (4) విఫలమైనా... బట్లర్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడటంతో చివరి ఐదు ఓవర్లలో ముంబై మరో 49 పరుగులు జత చేసింది. మోహిత్‌కు 3 వికెట్లు దక్కాయి. రాణించిన మ్యాక్స్‌వెల్... భారీ లక్ష్య ఛేదనలో కింగ్స్ ఎలెవన్ తక్కువ వ్యవధిలోనే విజయ్ (13 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్), వోహ్రా (7) వికెట్లు కోల్పోయింది. అయితే మార్ష్, మ్యాక్స్‌వెల్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. విధ్వంసకరంగా ఆడకపోయినా, చక్కటి సమన్వయంతో వీరిద్దరూ చకచకా పరుగులు సాధించారు. మార్ష్ తన ఫామ్ కొనసాగించగా, చాలా కాలం తర్వాత మ్యాక్స్‌వెల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 61 బంతుల్లో 89 పరుగులు జోడించిన అనంతరం సౌతీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మార్ష్ వెనుదిరిగాడు. ఆ తర్వాత 33 బంతుల్లో మ్యాక్స్‌వెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఎప్పుడో 2014 సీజన్లో కొట్టిన అనంతరం 25 ఇన్నింగ్స్‌ల తర్వాత మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. పంజాబ్ గెలుపుపై ఆశలు పెంచుకున్న సమయంలో బుమ్రా దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో అతను మ్యాక్స్‌వెల్‌తో పాటు నాయక్ (1)ను బౌల్డ్ చేయడంతో లక్ష్య ఛేదన కష్టం కాగా, మ్లిలర్ (17 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నాయక్ (బి) సందీప్ 0; పార్థివ్ (సి) మార్ష్ (బి) జాన్సన్ 81; రాయుడు (సి) వోహ్రా (బి) అక్షర్ 65; బట్లర్ (బి) మోహిత్ 24; పొలార్డ్ (సి) సందీప్ (బి) మోహిత్ 10; హార్దిక్ పాండ్యా (సి) మిల్లర్ (బి) మోహిత్ 4; కృనాల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1-0; 2-137; 3-174; 4-180; 5-189; 6-189. బౌలింగ్: సందీప్ 4-0-20-1; జాన్సన్ 4-0-43-1; అక్షర్ 4-0-41-1; మోహిత్ 4-0-38-3; మ్యాక్స్‌వెల్ 1-0-11-0; సాహు 3-0-35-0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) బట్లర్ (బి) సౌతీ 19; వోహ్రా (సి) బట్లర్ (బి) బుమ్రా 7; మార్ష్ (సి) రాయుడు (బి) సౌతీ 45; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 56; మిల్లర్ (నాటౌట్) 30; నాయక్ (బి) బుమ్రా 1; అక్షర్ (బి) మెక్లీన్గన్ 0; జాన్సన్ (బి) మెక్లీన్గన్ 1; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-20; 2-32; 3-121; 4-139; 5-141; 6-149; 7-151. బౌలింగ్: సౌతీ 4-0-28-2; మెక్లీన్గన్ 4-0-32-2; బుమ్రా 4-0-26-3; కృనాల్ పాండ్యా 2-0-20-0; హర్భజన్ 4-0-31-0; పొలార్డ్ 2-0-25-0. -
‘డెత్’లో పడేస్తాడు...
పదునెక్కుతున్న బుమ్రా బౌలింగ్ చివరి ఓవర్లలో భారత్ ఆయుధం ఫలితం వెనుక కఠోర శ్రమ ఏంట్రా నీ అల్లరి... బయటకి వెళ్లి ఆడు కో... కొద్దిసేపు నిద్రపోవాలి... శబ్దం రాకుం డా ఆడు... 12 ఏళ్ల వయసులో బుమ్రా ఇంట్లో బౌలింగ్ చేస్తుంటే అతడి తల్లి మందలింపు ఇది. ఓవైపు ఆడాలని కోరిక... మరోవైపు అమ్మ నిద్రపోతోందనే ఆలో చన... ఏం చేయాలి..? శబ్దం రాకుండా గోడకు బంతి విసరడం ఎలా..? ఆ చిట్టి బుర్రకు ఓ ఆలోచన వచ్చింది. గోడ, గచ్చు కలిసే చోటకు బంతి విసిరితే పెద్దగా శబ్దం రాదు. అంతే... అదే పనిగా అక్కడే బంతులు వేయడం విసరడం మొదలుపెట్టాడు. నిజానికి అప్పుడు బుమ్రాకు తెలియదు. ఈ ఆలోచన తనని యార్కర్లు వేయడంలో నిష్ణాతుడిని చేస్తుందని... భారత్‌కు ‘డెత్’ ఓవర్లలో ఓ స్పెషలిస్ట్‌గా మారతానని..! ముంబై నుంచి సాక్షి క్రీడాప్రతినిధి : గతంతో పోలిస్తే భారత క్రికెట్లో వచ్చిన ఓ పెద్ద సానుకూల మార్పు... బుమ్రా. గతంలో ఎక్కడ ఏ టోర్నీ ఆడినా డెత్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చే బౌలర్లతో ధోని తలపట్టుకునేవాడు. కానీ బుమ్రా వచ్చిన తర్వాత కెప్టెన్‌కు పెద్ద తలనొప్పి తగ్గింది. చివరి ఓవర్లలో ప్రత్యర్థులను కదలనీయకుండా యార్కర్లు వేస్తూ బుమ్రా ఇప్పుడో సంచలనంగా మారాడు. బుమ్రా బలమంతా అతని బౌలింగ్ యాక్షన్‌తోనే ప్రారంభమవుతుంది. ఇది అతను ఎవరినో చూసి నేర్చుకున్నది కాదు. సహజంగానే తన ప్రయత్నం లేకుండా ఇదే తరహాలో అతను బౌలింగ్ మొదలు పెట్టాడు. అదృష్టం ఏమిటంటే స్కూల్ స్థాయినుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు కాస్త భిన్నంగా కనిపిస్తోంది అనే మాటే తప్ప ఏ కోచ్ కూడా యాక్షన్‌ను మార్చుకోమని సలహా ఇవ్వలేదు. ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీలో దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో బుమ్రాకు తనపై నమ్మకం ఏర్పడింది. ఇక తన బలమైన యార్కర్లను మరింతగా పదునెక్కించేందుకు అతను తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన తర్వాత అతను మలింగకు శిష్యుడిగా మారిపోయాడు. తనలాగే భిన్నమైన యాక్షన్ ఉండటం, ఈతరంలో అతనిలాగా యార్కర్లు వేసేవారు లేకపోవడంతో బుమ్రా నేర్చుకునేందుకు సరైన వేదిక లభించింది. చిన్న సందేహం మొదలు పెద్ద ఆలోచన వరకు అన్నీ అతనికి మలింగతోనే. ఐపీఎల్లో జట్టు మారమని కొందరు సలహా ఇచ్చినా మలింగ కోసమే బుమ్రా అక్కడే ఉండిపోయాడు. స్లో బంతులు, బౌన్సర్లు కూడా బాగానే వేస్తున్నా, నీకంటూ ఒక ప్రత్యేక బలం ఉండాలనే మలింగ సూచనతో పూర్తిగా యార్కర్లపైనే దృష్టి పెట్టాడు. టాప్ బౌలర్ల యార్కర్ల వీడియోలన్నీ సేకరించి తనను తాను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో ధోనిని అద్భుత యార్కర్‌తో బౌల్డ్ చేయడం... ఆ తర్వాత తనకు అలాంటి బౌలర్ కావాలని కెప్టెన్ కోరడమే బుమ్రాకు ఆసీస్ పర్యటన అవకాశం ఇప్పించింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే మిస్‌ఫీల్డ్, తర్వాత మరో సునాయాస క్యాచ్ వదిలేయడం, ఆ తర్వాత అదే బ్యాట్స్‌మన్ చేతిలో ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు బాదుడు... ఇంత జరిగాక ఒక 22 ఏళ్ల బౌలర్ స్థైర్యం దెబ్బ తింటుంది. కానీ బుమ్రా తన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 13 పరుగులే ఇచ్చాడు. ఇందులో ఏకంగా ఆరు యార్కర్లు ఉన్నాయి. అంటే సగం బంతులు అతను యార్కర్లను ఉపయోగిస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన అద్భుతం గురించే అంతా చర్చ జరిగింది కానీ అంతకుముందు ఓవర్లో బుమ్రా కేవలం 6 పరుగులే ఇవ్వడం అసలు విజయానికి పునాది వేసింది. ఆసీస్‌తో మ్యాచ్ కూడా అతని బౌలింగ్‌కు రీప్లేలా కనిపించింది. తొలి ఓవర్లోనే ఖాజా నాలుగు ఫోర్లు బాదడంతో 17 పరుగులు ఇచ్చేశాడు. అయితే తర్వాతి మూడు ఓవర్లలో బుమ్రా 3, 3, 9 పరుగులు ఇచ్చాడు. కీలకమైన సమయంలో మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్ చేశాడు. ఎంతటి ఒత్తిడిలోనూ నియంత్రణ తప్పకుండా బౌలింగ్ చేయడమే బుమ్రాపై కెప్టెన్ ప్రశంసలు కురిపించేలా చేస్తోంది. అవకాశం ఇవ్వకూడదు సాధారణంగా ప్రపంచ క్రికెట్లో భిన్నమైన శైలితో వచ్చిన ఆటగాళ్లు తొందరగానే ఆ ప్రభను కోల్పోవడం, ప్రత్యర్థులు వారిని పట్టేయడం చాలా సందర్భాల్లో జరిగింది. వైవిధ్యం కనబర్చలేక ఎంతో మంది సాధారణ క్రికెటర్లుగానే మిగిలిపోతే, కొంత మంది మాత్రమే ఎప్పటికప్పుడు తమని తాము అప్డేట్ చేసుకుంటూ నిలబడ్డారు. బుమ్రా ఇప్పటికి 15 టి20లతో పాటు ఒక వన్డే ఆడాడు. కానీ అంత సులభంగా ఎవరికీ లొంగలేదు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్‌లోని మైదానాల్లో అతని ప్రదర్శన ఆకట్టుకుంది. టి20 ప్రమాణాల ప్రకారం మంచి సగటు, ఎకానమీతో అతను బౌలింగ్ చేస్తున్నాడు. గత 3 నెలల వ్యవధిలోనే కీలక సభ్యుడిగా ఎదిగిన అతను ప్రపంచకప్ విజేత జట్టులో భాగం అయ్యేందుకు మరో రెండు మ్యాచ్‌ల దూరంలోనే ఉన్నాడు. ఆ కోరిక నెరవేరాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా సత్తా చాటాలి. -
సమరానికి సన్నాహం!
నేడు భారత్, వెస్టిండీస్ వార్మప్ మ్యాచ్ షమీపైనే అందరి దృష్టి కోల్‌కతా: రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయాలు... ఆసియా కప్‌లో తిరుగులేని ప్రదర్శన... వేదిక ఎలాంటిదైనా... ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని అలవోకగా చిత్తు చేసిన వైనం... ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఇప్పట్నించి భారత్ ఆడబోతున్న మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తు. ప్రతి ప్రత్యర్థి చివరి బంతి వరకు పోరాటం చేసే అతి పెద్ద సమరం టి20 ప్రపంచకప్. ఇప్పుడు రెండోసారి ఈ కప్‌ను గెలవాలన్న ఏకైక లక్ష్యంతో భారత్ ఈ సమరానికి సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో నేడు (గురువారం) వెస్టిండీస్‌తో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రాక్టీస్‌లో షమీ వాస్తవానికి ఇది వార్మప్ మ్యాచే. కానీ భారత్‌కు అతి కీలకమైన పేసర్ షమీ ఫిట్నెస్ను ఈ మ్యాచ్‌ల ద్వారా అంచనా వేయనున్నారు. మోకాలి శస్త్రచికిత్సతో ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతను ఏ మేరకు ఫిట్‌గా ఉన్నాడో చూడాలని మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోంది. దీంతో ప్రస్తుతానికి అందరి దృష్టి షమీపైనే నెలకొంది. బుధవారం జరిగిన ప్రాక్టీస్‌లో షమీ ఫర్వాలేదనిపించాడు. కోహ్లి, రోహిత్, యువరాజ్లకు మంచి రిథమ్‌తో దాదాపు అరగంట పాటు బౌలింగ్ చేశాడు. అయితే పేస్, కదలికల పరంగా కాస్త ఇబ్బందిపడ్డాడు. మిగతా విభాగాల్లో టీమిండియాకు తిరుగులేదు. బౌలింగ్‌లో బుమ్రా, నెహ్రాతో పాటు హార్దిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. డెత్ ఓవర్లలో బుమ్రా ప్రదర్శన భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రధాన స్పిన్నర్ అశ్విన్, జడేజాలు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు. ఇక తమ బ్యాటింగ్ బలమేంటో టీమిండియా ఇప్పటికే నిరూపించుకుంది. ఆసియా కప్ ఫైనల్‌తో ధావన్ కూడా గాడిలో పడ్డాడు. కోహ్లి, రోహిత్, ధోని సూపర్ ఫామ్‌లో ఉన్నారు. టి20ల్లో ఆసియా కప్ గెలవడం ద్వారా భారత్ కల సగం నెరవేరింది. ఇక ప్రపంచకప్‌ను కూడా సాధించి కలను పరిపూర్ణం చేసుకోవాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. ఎక్కడ చూసినా వారే... మరోవైపు ప్రపంచంలో పొట్టి ఫార్మాట్లో ఎక్కడ ఏ లీగ్ జరిగినా... వెస్టిండీస్ ఆటగాళ్లు కచ్చితంగా అందులో ఉంటారు. కాబట్టి ఈ ఫార్మాట్ కరీబియన్లకు కొట్టిన పిండి. ప్రత్యర్థులు ఏమాత్రం అలసత్వం వహించినా క్షణాల్లో మ్యాచ్‌ను తారుమారు చేసే సత్తా ఉన్న ఆటగాళ్లకు కొదువలేదు. ఓవరాల్‌గా విండీస్ బ్యాటింగ్ మొత్తం డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్‌పైనే ఆధారపడి ఉంది. అతను క్రీజులో కుదురుకుంటే భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం, ఛేదించడం చాలా సులభం. అయితే మిగతా లైనప్‌లో నిలకడలేమీ ఆందోళన కలిగించే అంశం. అలాగే పొలార్డ్, డారెన్ బ్రేవో, నరైన్లాంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం కూడా లోటుగానే కనిపిస్తోంది. గాయం కారణంగా లెండిల్ సిమ్మన్స్ చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలగడం మరో పెద్ద సమస్య. ఇతని స్థానంలో కొత్త కుర్రాడు ఇవిన్ లూయిస్‌కు అవకాశం దక్కింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కొన్ని ప్రయోగాలు చేసి తుది జట్టును ఎంపిక చేసుకోవాలని కెప్టెన్ స్యామీ భావిస్తున్నాడు. ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. నిలకడగా ఆడితే టైటిల్ సాధించొచ్చు. మా జట్టులో మంచి సమతుల్యం ఉంది. ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయాలు సాధిస్తున్నాం. ఓ పెద్ద టోర్నీని గెలవాలంటే కనీసం ఏడుగురు మంచిగా ఆడాలి. కోహ్లి, రోహిత్, ధోనిలు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. యువరాజ్, ధావన్‌లు గాడిలో పడ్డారు. ఆసియా కప్‌తో మంచి సన్నాహకం లభించింది. బుమ్రా, పాండ్యాల బౌలింగ్ సూపర్. మా రిజర్వ్ బెంచ్ కూడా బలంగా ఉంది. ధోని రిటైర్మెంట్పై విమర్శలు సరైనవికావు. అతను చాలా సాధించాడు. ఇక సాధించడానికి ఏమీ లేదు. మహీ చాంపియన్. ఎవరో ఒకరిద్దరు రిటైర్మెంట్ కోరుకుంటే సరిపోతుందా? అయినా మన దగ్గర ఇవన్నీ సర్వసాధారణం. -రవిశాస్త్రి (టీమ్ డెరైక్టర్) -
అస్త్రాలన్నీ సరిగానే..!
గతంలో ఏ టి20 ప్రపంచకప్ కోసం కూడా భారత్ ఇంతగా సన్నద్ధం కాలేదు. ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగుతుండటం వల్ల కావచ్చు... నెల రోజుల ముందు నుంచే ఈ ఫార్మాట్లోకి మారిపోయారు. ఆస్ట్రేలియాను వారి గడ్డపై చిత్తు చేసి, ఆ తర్వాత స్వదేశంలో లంకను ఓడించి... తాజాగా ఆసియాకప్‌లో టైటిల్‌తో ప్రపంచకప్‌కు ముందు కావలసినంత మ్యాచ్ ప్రాక్టీస్ సంపాదించారు. జట్టులో ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటం, ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యతగా ఉండటం వల్ల ధోనిసేన అప్రతిహత విజయాలు సాధించింది. జట్టులో అస్త్రాలన్నీ సరిగానే ఉన్నాయని ఆసియాకప్‌తో అర్థమైంది. ఇక వీటిని ప్రపంచకప్‌లో వినియోగించడమే తరువాయి. సాక్షి క్రీడావిభాగం ఆసియాకప్ టి20లో ఏ జట్టు కూడా భారత్‌కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన పాకిస్తాన్ జట్టు మన ముందు పూర్తిగా తేలిపోయింది. అలాగే పూర్తిస్థాయి జట్టుతో దిగిన డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ శ్రీలంక కూడా ధోనిసేన ముందు నిలబడలేకపోయింది. బంగ్లాదేశ్ జట్టు మిగిలిన ప్రత్యర్థులందరినీ ఓడించినా భారత్‌పై మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ పెద్దగా ప్రభా వం చూపలేదు. దీనికి కారణం భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉండ టం, తన బలానికి తగ్గ సాధికారికత ప్రదర్శించడం. ఆసియాకప్‌లో భారత ప్రదర్శన చూసిన తర్వాత ప్రపంచంలోని మిగిలిన జట్లు కూడా టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌కు బలంగా సన్నద్ధమవ్వాల్సిందే. టాప్ ఆర్డర్ సూపర్ టోర్నీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో బ్యాటింగ్‌కు కఠినమైన వికెట్‌పై సంచలన ఇన్నింగ్స్‌తో రోహిత్ తాను ఫామ్‌లోనే ఉన్నానని చూపించాడు. శిఖర్ ధావన్ పూర్తి సత్తా బయటకు రాకపోయినా... ఫైనల్లో సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా పర్యటన నుంచి అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యద్భుతం. ఎలాంటి క్లిష్టమైన పిచ్ అయినా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఇన్నింగ్స్‌ను నిర్మించుకుంటూ వంద స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేయడం సామాన్యమైన విషయం కాదు. కోహ్లి, రోహిత్ ఇద్దరూ ఆడితే భారత్ ఎలాంటి ప్రత్యర్థిపైనైనా గెలవడం ఖాయం. మొత్తం మీద టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉండటం మంచి పరిణామం. యువీ కుదురుకున్నాడు నాలుగో స్థానంలో రైనా ఆడతాడని ఈ టోర్నీకి ముందే నిర్ణయించారు. అతను కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా, అవసరమైన సమయంలో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చగలడని ఆస్ట్రేలియాలో చూపించాడు. ఐపీఎల్ అనుభవం దృష్ట్యా ప్రస్తుత లైనప్‌లో అత్యంత ముఖ్యమైన టి20 క్రికెటర్ రైనా. ఇక యువరాజ్ సింగ్ కూడా తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లికి అండగా నిలబడటం, శ్రీలంకపై మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్ల తను పూర్తిగా కుదురుకున్నట్లే. ఇక ధోని ఆఖరి ఓవర్లలో సిక్సర్లు బాదగల సత్తా తనలో ఇంకా ఉందని నిరూపించుకుని, పాత ధోనిలా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్ల బలం ఈ నెల రోజుల కాలంలో భారత క్రికెట్‌కు బాగా జరిగిన మేలు హార్దిక్ పాండ్యా. పేస్ బౌలర్‌గా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేస్తున్నాడు. నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లోనూ భారీ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా వల్ల పేస్ బౌలింగ్ వికెట్ మీద కూడా ఇద్దరే సీమర్లతో భారత్ నెట్టుకురాగలిగింది. మూడో పేసర్‌గా, ఆల్‌రౌండర్‌గా పాండ్యా ఈ ప్రపంచకప్‌లో కీలకం కానున్నాడు. ఇక జడేజాకు బ్యాటింగ్ విషయంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా బంతితో ఆకట్టుకున్నాడు. అలాగే మైదానంలో మెరుపు ఫీల్డింగ్‌తో అదరగొడుతున్నాడు. అశ్విన్ భారత్‌కు ప్రధాన బౌలర్. ఇన్నింగ్స్‌లో ఏ దశలో అయినా బౌలింగ్ చేయగల నైపుణ్యం, మ్యాచ్‌లు గెలిపించగల సామర్థ్యం ఉన్న అశ్విన్ బంగ్లాదేశ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇక తన దాకా బ్యాటింగ్ అవకాశం వస్తే తన వంతుగా కచ్చితంగా జట్టుకు పరుగులు సాయం చేయగల నైపుణ్యం అశ్విన్‌నూ ఆల్‌రౌం డర్‌ను చేసింది. మొత్తానికి ఈ త్రయం ప్రపంచకప్‌లో రాణిస్తే భారత్‌కు ఎదురుండదు. బుమ్రా, నెహ్రా జోడీ అదుర్స్ భారత్‌కు ఇద్దరు ప్రధాన పేసర్లుగా నెహ్రా, బుమ్రా ప్రపంచకప్ ఆడతారని రెండు నెలల క్రితం ఎవరూ ఊహించి కూడా ఉండరు. అనుకోకుండా ఈ ఇద్దరికీ ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో స్థానం దక్కింది. అక్కడ లభించిన అవకాశాలను ఈ ఇద్దరూ పూర్తిగా వినియోగించుకున్నారు. పవర్‌ప్లేలో ఆరు ఓవర్లు ఈ ఇద్దరూ పూర్తి చేస్తారు. నెహ్రా తన అనుభవాన్ని ఉపయోగించి స్వింగ్‌తో ఆరంభంలో అదరగొడుతున్నాడు. లేటు వయసులోనూ తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఇక బుమ్రా అయితే భారత జట్టుకు లభించిన వరం అ నుకోవాలి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు మలింగ నుంచి యార్కర్లు నేర్చుకున్న బుమ్రా... ఇప్పుడు అదే తన ప్రధాన ఆయుధంగా వాడుతున్నాడు. ఆరంభ ఓవర్లతో పోలిస్తే స్లాగ్ ఓవర్లలో తను బాగా ఉపయోగపడతాడు. పరిస్థితిని బట్టి ధోని తనని వాడుతున్నాడు. రిజర్వ్‌లూ ఫామ్‌లోనే... ఇక ఆసియాకప్ ద్వారా భారత్‌కు మరో అంశంలోనూ స్పష్టత వచ్చింది. ఒకవేళ తుది జట్టులో ఎవరైనా గాయపడితే ఆ స్థానంలో ఆడటానికి అందుబాటులో ఉన్న రిజర్వ్ ఆటగాళ్లు అందరూ ఫామ్‌లో ఉండటం శుభసూచకం. టాపార్డర్, మిడిలార్డర్... ఇలా ఏ స్థానంలో అయినా ఆడగల రహానే బ్యాట్స్‌మెన్ అందరికీ బ్యాకప్‌గా ఉన్నాడు. నిజానికి రహానే అద్భుతమైన ఆటగాడు. అయినా తుది జట్టులో చోటు లేదంటే భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జడేజాకు బ్యాకప్‌గా పవన్ నేగి, అశ్విన్‌కు బ్యాకప్‌గా హర్భజన్, పేసర్లిద్దరికీ బ్యాకప్‌గా భువనేశ్వర్ ఉన్నారు. వీళ్లు ముగ్గురు కూడా యూఏఈపై చక్కగా బౌలింగ్ చేశారు. కాబట్టి రిజర్వ్‌ల ఫామ్ విషయంలో ఎలాంటి అనుమానాలూ లేవు. అయితే ప్రపంచకప్ జట్టులో భువనేశ్వర్ లేడు. షమీ గాయం నుంచి కోలుకోకపోతేనే భువనేశ్వర్ వస్తాడు. ఏదేమైనా అన్ని విభాగాల్లోనూ భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉంది. ఎలాంటి పిచ్‌లపై అయినా విజయాలు సాధించగలమని ఈ రెండు నెలల్లో చూపించారు. -
బూమ్ బూమ్ బుమ్రా...
♦ దూసుకొచ్చిన యువ పేసర్ ♦ వన్డే, టి20ల్లో చక్కటి ప్రదర్శన ♦ యాక్షన్, యార్కర్లే బలం అదృష్టమంటే అలా ఉండాలి... వీడు సుడిగాడురా అనిపించాలి...పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ అరంగేట్రం అలాగే అచ్చు సినిమా స్టోరీలా జరిగింది. టి20 జట్టులోకి ఎంపికైన అతను మ్యాచ్ కోసం అడిలైడ్ వెళ్లాల్సి ఉంది. తనతో పాటే వెళ్లాల్సిన ఐదుగురు భారత ఆటగాళ్లకు ఫ్లయిట్ ఖరారు కాగా... బుమ్రాకు మాత్రం టిక్కెట్ దొరకలేదు. దీంతో బీసీసీఐ అతడిని సిడ్నీకి పంపించింది. ఆఖరి వన్డే కోసం సిడ్నీలోనే భారత జట్టు ఉండటం... భువనేశ్వర్‌కు గాయం కావడంతో... అనూహ్యంగా ధోని... బుమ్రాను ఆడించాడు. ఆ మ్యాచ్‌లో చెలరేగిన ఈ యువ పేసర్... టి20లోనూ కంగారూలకు చుక్కలు చూపించాడు. ఫలితంగా కేవలం రెండే మ్యాచ్‌ల్లో భారత క్రికెట్లో కొత్త సంచలనంగా మారాడు. మూడేళ్ల క్రితం ఐపీఎల్లో బుమ్రా తొలి మ్యాచ్ ఆడే నాటికి అతనికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేదు. ముంబై ఇండియన్స్ కోచ్ జాన్‌రైట్ ప్రతిభాన్వేషణలో భాగంగా ‘వెరైటీ యాక్షన్’ అంటూ పట్టుకొచ్చి బెంగళూరుతో మ్యాచ్‌లో బరిలోకి దించారు. మొదటి నాలుగు బంతుల్లో కోహ్లి మూడు ఫోర్లు బాదాడు. దాంతో బెదిరిపోయిన బుమ్రా మైదానంలో సచిన్ సాయం కోరాడు. ‘ఎదురుగా ఎవరున్నారన్నది చూడకు. ఒక్క మంచి బంతి చాలు’ అంటూ మాస్టర్ ప్రోత్సహించాడు. ఐదో బంతి ఆఫ్ స్టంప్నుంచి వేగంగా లోపలికి దూసుకొచ్చింది. కోహ్లి ఎల్బీగా అవుటయ్యాడు. తర్వాతి ఏడాది ముంబై తరఫున 11 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు టీమిండియా తరఫున కూడా రెండు మ్యాచ్‌లలో చక్కటి ప్రదర్శనతో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు. యార్కర్... యార్కర్... ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో కలిపి భారత పేసర్లు నాలుగు యార్కర్లు కూడా వేయలేదేమో! బుమ్రా తన ఒక్క ఓవర్లోనే ఐదు యార్కర్లు విసిరాడు. సాధారణంగా భారత పేసర్లనుంచి ఇది అనూహ్యం. అందుకే గవాస్కర్ కూడా యార్కర్ల విషయంలో బుమ్రాను చూసి నేర్చుకోవాలంటూ ఇషాంత్‌లాంటి సీనియర్లకు చురక అంటించారు. యాక్షన్‌లో చాలా వరకు మలింగను గుర్తుకు తెచ్చే అతను ముంబై ఇండియన్స్ జట్టు సహచరుడిగా అతడినుంచి ఈ విషయంలో ఎంతో నేర్చుకున్నాడు. యార్కర్ ఎలా వేయాలి, వేగంలో చేయాల్సిన మార్పులు... ఇలా చాలా అంశాలు లంక పేసర్ నేర్పించాడు. దాంతో పాటు సంప్రదాయ బౌలర్‌గా ఎందుకుండాలి, యాక్షన్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా మలింగ ఇచ్చిన సూచనను బుమ్రా పాటించాడు. సహజంగానే అబ్బిన ఈ లక్షణం అతడిని అంచనా వేయడంలో ఇప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు సృష్టిస్తోంది. ఐదో వన్డేలో స్మిత్, అడిలైడ్ టి20లో వార్నర్లాంటి ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన అతను, రెండు సార్లు యార్కర్లతో ఫాల్క్‌నర్‌ను బౌల్డ్ చేసిన బంతులు సూపర్. 2/40, 3/23 బౌలింగ్ విశ్లేషణ కెప్టెన్ ధోనికి కూడా ఆనందం కలిగించడం ఒక యువ బౌలర్ కెరీర్‌కు మంచి ఆరంభం. అమ్మను ఒప్పించి... బుమ్రా తండ్రి ఏడేళ్ల వయసులోనే చనిపోయారు. తల్లి దల్జీత్ అతను చదువుతున్న స్కూల్లోనే జూనియర్ ప్రిన్సిపల్‌గా పని చేసేవారు. టెన్నిస్ బంతులతోనే యార్కర్లు విసిరిన అతడికి కోచ్ కిషోర్ త్రివేది (పేసర్ సిద్ధార్థ్ త్రివేది తండ్రి) స్కూల్ జట్టులో అవకాశం కల్పించి ప్రోత్సహించారు. 13 ఏళ్ల వయసులో అతను అండర్-16 ఆటగాళ్లను కూడా తన యార్కర్లతో బెదరగొట్టాడు. దాంతో గుజరాత్ అండర్-16 జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే అద్భుత ప్రదర్శన తర్వాత కూడా అండర్-19 జట్టులో చోటు దక్కలేదు. దాంతో భవిష్యత్తు గురించి భయపడిన అతని తల్లి ‘క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోవద్దు. బాగా చదువుకో’ అనడంతో ఆటను ఆపినా...కొద్ది రోజులకే మళ్లీ క్రికెట్ వైపు వచ్చిన బుమ్రా ఈ సారి తల్లిని కూడా ఒప్పించి మైదానంలోకి అడుగు పెట్టాడు. మళ్లీ జోరు ప్రదర్శించి జట్టులోకి ఎంపిక కావడంతో అతని కెరీర్ మలుపు తిరిగింది. 2014లో ఐపీఎల్ తర్వాత కాలికి గాయంతో ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన బుమ్రా... ఈ ఏడాది రంజీ ట్రోఫీలో గుజరాత్ తరఫున 25.47 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. అయితే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శన అతడిని జాతీయ జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. కేవలం 16.09 సగటులో 21 వికెట్లు తీసి సీజన్ టాపర్‌గా నిలిచాడు. గుజరాత్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఈ పేసర్ ఫైనల్లో ఢిల్లీపై ఐదు వికెట్లతో సత్తా చాటాడు. జోరు కొనసాగించాలి సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత వెనుకబడటం భారత పేసర్లు ఎంతో మందికి అనుభవంలోకి వచ్చిన విషయం. బుమ్రా స్వయంగా చెప్పినట్లు కనీసం ప్రస్తుతానికైతే తన యాక్షన్, యార్కర్లే తన బలం. అతని బౌలింగ్‌లో మంచి వేగం కూడా ఉంది. అయితే ఒక్కసారి ప్రత్యర్థి అతడి యాక్షన్‌ను అర్థం చేసుకుంటే అది బుమ్రా బలహీనతగా కూడా మారవచ్చు. కొంత కాలం తర్వాత మలింగలాంటి ఆటగాడికి కూడా ఇది తప్పలేదు! ఎప్పటికప్పుడు పేస్ సహా ఇతరత్రా తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకుంటూ, అనుభవంతో నేర్చుకుంటూ ఉంటే 22 ఏళ్ల బుమ్రా మరికొంత కాలం అంతర్జాతీయ క్రికెట్లో తన హవా కొనసాగించవచ్చు.