
ధోనినుంచి నేర్చుకుంటున్నాను!
విరాట్ కోహ్లి వ్యాఖ్య
బెంగళూరు: కెప్టెన్సీ తనకు కొత్త కాకపోయినా కీలక సమయాల్లో ధోని అనుభవం తనకు ఎంతో ఉపయోగపడుతోందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్లలో మాజీ కెప్టెన్ సలహాలు తీసుకోవడంలో తప్పేమి లేదని అతను అన్నాడు. ‘కొంత కాలంగా నేను టెస్టు కెప్టెన్‌గా ఉన్నాను. కానీ వన్డేలు, టి20ల్లో పరిణామాలు వేగంగా మారిపోతుంటాయి. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా ఉండి ఆటను బాగా అర్థం చేసుకోగలిగిన ధోనిలాంటి వ్యక్తినుంచి కీలక సమయాల్లో సూచనలు తీసుకోవడం మంచిదే. చివరి మ్యాచ్‌లో చహల్ తర్వాత పాండ్యాకు బౌలింగ్ ఇద్దామని భావించినా, ఆఖరి ఓవర్ దాకా వేచి చూడవద్దనే అతని సలహాతోనే బుమ్రాకు బంతిని అందించాను’ అని కోహ్లి వివరించాడు.
ఇంగ్లండ్‌తో మూడు ఫార్మాట్‌లలోనూ సిరీస్ గెలుచుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందన్న కెప్టెన్... కొత్త కుర్రాళ్లు తమకు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవడమే ఈ సిరీస్‌ల ద్వారా భారత్‌కు దక్కిన అతి పెద్ద ప్రయోజనమని చెప్పాడు. మరో వైపు గత రెండేళ్లలో ఇంగ్లండ్ జట్టు ఇంత ఘోరంగా ఎప్పుడూ ఆడలేదని కెప్టెన్ మోర్గాన్ అభిప్రాయ పడ్డాడు. అయితే టి20 సిరీస్‌తో పోలిస్తే వన్డేల్లో ఓడిపోవడమే తమను ఎక్కువగా బాధించిందని అతను అన్నాడు. తాము గెలవాల్సిన మ్యాచ్‌లను చాలా తక్కువ తేడాతో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని అతను వ్యాఖ్యానించాడు.