ధోని వ్యూహాలకు కోహ్లి వద్ద జవాబుందా? రహానే ప్రణాళికలు రోహిత్‌ను అడ్డుకోగలవా? అశ్విన్ ఆలోచనలకు దినేశ్ కార్తీక్ ఇచ్చే కౌంటర్ ఏమిటి? అయ్యర్ ఢిల్లీ శ్రేయస్సు కోసం ఎంతగా శ్రమించాల్సి ఉంది? విలియమ్సన్ కెప్టెన్సీకి వార్నర్ సలహాలు తోడైతే ఫలితం ఎలా ఉండబోతోంది...? అభిమానుల అందరి మదిలో ఉండే ప్రశ్నలివే... సమాధానాల కోసం మాత్రం ఒక్కో రోజు ఆసక్తిగా ఎదురు చూడటం వారి వంతు. స్టేడియాలు దద్దరిల్లే విధ్వంసకర ప్రదర్శనలు, ఆటోమీటర్ గిర్రున తిరిగినంత వేగంగా మీటర్ల లెక్కలు చూపే సిక్సర్లు, స్టార్ల కళకళ, కొత్త కుర్రాళ్ల కదనోత్సాహం... ఇలాంటి దృశ్యాలు ఇన్నేళ్లుగా చూస్తున్నా మరో ఐపీఎల్ వచ్చిందంటే మనసు మళ్లీ మళ్లీ అలాంటి వినోదాన్నే కోరుకుంటుంది.
ఒకటి కాదు రెండు కాదు విరామం లేకుండా పదకొండేళ్లు గడిచిపోయాయి. అటు ఆటగాళ్లలో, ఇటు అభిమానుల్లో ఇప్పటికీ అదే జోష్. వేసవి అడుగు పెట్టిందంటే చాలు ఆటలకు విరామం అనిపించిన రోజుల నుంచి వేసవి అంటేనే ఫన్‌గా మార్చేసిన ఘనత ఐపీఎల్‌దే. ఎందుకంటే ఐపీఎల్‌లోని అరవై మ్యాచ్‌లు అందించే అచ్చమైన వినోదానికి, అనూహ్య మలుపులకు అభిమానులంతా సిద్ధమైపోయారు. అటు క్లాస్, ఇటు మాస్... వారు వీరు అని తేడా లేకుండా ఐపీఎల్‌తో అంతా పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. ఇప్పుడు ‘ద్వాదశ ఘట్టం’కు వేళయింది. రాబోయే 51 రోజులు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ సమాజం మొత్తం ఐపీఎల్‌తో బంధాన్ని ముడేసుకోబోతోంది. ఈ వేడుకలో భాగమయ్యేందుకు మీరు కూడా సిద్ధమా!
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2019కు విజిల్ మోగింది. నేటి నుంచి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తెర లేవనుంది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్–12 ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎనిమిది జట్లు బరిలోకి దిగనుండగా, లీగ్ దశలో 56 మ్యాచ్‌లు... అనంతరం మూడు ప్లే ఆఫ్‌లు, ఫైనల్ కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మే 12న చెన్నైలోనే తుది పోరు జరుగుతుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించరాదని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఫలితంగా నేడు నేరుగా మ్యాచ్‌తోనే లీగ్ మొదలవుతుంది. మ్యాచ్ సమయాల (సా.4 గం., రా. 8. గం.)లో కూడా మార్పు లేదు. వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్‌ను రెండు వారాలు ముందుకు జరిపారు. వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్, అలసటవంటి అంశాలు కూడా చర్చకు వస్తున్న నేపథ్యంలో అన్ని జట్లు వారిని ఎలా ఉపయోగించుకుంటాయనేది చూడాలి.
ఎవరికి దక్కేనో...
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లతో పాటు ఒక్కసారి కూడా విజయానందం రుచి చూడని టీమ్‌లు ఉన్నాయి. ప్రతీ ఏటా శక్తిమేర ప్రయత్నించడం, చివరకు నిరాశకు గురి కావడం ఎన్నో జట్లకు అనుభవమే. అయితే కొత్త సీజన్ రాగానే ప్రతీ జట్టు ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నాలుగోసారి టైటిల్ ఆశిస్తోంది. గత ఏడాది టీమ్‌ను గెలిపించిన ‘ప్రధాన బృందం’ మొత్తం ఈసారి కూడా కొనసాగుతోంది. అటు ముంబై ఇండియన్స్ కూడా నాలుగోసారి ట్రోఫీని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని స్వల్ప మార్పులు మినహా ముంబైలో కూడా సీనియర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇక మాజీ చాంపియన్ కోల్‌కతా కూడా వరుసగా రెండో ఏడాది కార్తీక్ నాయకత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గత ఏడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విలియమ్సన్ నేతృత్వంలోనే బరిలోకి దిగుతోంది. వార్నర్ రాకతో జట్టు బలం పెరిగిందనడంలో సందేహం లేదు. ఇక తొలి సీజన్ తర్వాత మళ్లీ ఆ మెరుపులు చూపించని రాజస్తాన్ రాయల్స్ కూడా రేసులో ఉంది. రహానే కెప్టెన్సీకి తోడు స్టీవ్ స్మిత్ రావడం జట్టుకు మేలు చేయవచ్చు. తొలి సీజన్‌నుంచి లీగ్‌లో ఉన్నా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని మూడు జట్ల బాధ వేరు! పేరునుంచి మొదలు పెట్టి ఆటగాళ్లు, సిబ్బంది సహా ఎన్నో మార్పులు చేసిన ఢిల్లీకి ఈ సారైనా అదృష్టం కలిసొస్తుందా చూడాలి. గత ఏడాది ఆరంభంలో చెలరేగిపోయి విశ్రాంతి తర్వాత వరుస ఓటములు ఎదుర్కొన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మళ్లీ అలాంటి తప్పు చేయరాదని భావిస్తోంది. ఇక అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా, టీమిండియాకు కెప్టెన్‌గా తిరుగు లేని విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లికి మాత్రం ఐపీఎల్ టైటిల్ లోటుగా ఉండిపోయింది. ఎనిమిదేళ్లు ప్రయత్నించినా అతను సఫలం కాలేకపోయాడు. అతని టి20 నాయకత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసారి జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. మొత్తంగా తుది విజేతగా ఎవరు నిలిచినా... ఐపీఎల్‌లో అభిమానుల వినోదానికి మాత్రం వంద శాతం గ్యారంటీ ఖాయం!
మలింగ ఔట్!
ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్ లసిత్ మలింగ టోర్నీకి దూరమయ్యాడు. శ్రీలంక దేశవాళీ వన్డే టోర్నీ ‘సూపర్ ప్రొవిన్షియల్ టోర్నమెంట్’లో ఆడితేనే ప్రపంచ కప్ జట్టుకు పరిగణలోకి తీసుకుంటామని లంక బోర్డు ఆటగాళ్లకు హుకుం జారీ చేసింది. దాంతో అందులో పాల్గొనేందుకు మలింగ సిద్ధమయ్యాడు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన రైనా ఇప్పటివరకు 176 మ్యాచ్‌లు ఆడి 4,985 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రైనా తర్వాతి స్థానాల్లో కోహ్లి (బెంగళూరు; 4948 పరుగులు), రోహిత్ (ముంబై ఇండియన్స్; 4493 పరుగులు) ఉన్నారు. ఐపీఎల్‌లో మొత్తం 52 సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి 12 సెంచరీలు వచ్చాయి. మరో ఐదు క్యాచ్‌లు పడితే సురేశ్ రైనా ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఫీల్డర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో 95 క్యాచ్‌లతో రైనా అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (79), డివిలియర్స్ (78) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ లసిత్ మలింగ. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ శ్రీలంక క్రికెటర్ ఇప్పటివరకు 110 మ్యాచ్‌లు ఆడి 154 వికెట్లు తీశాడు. తర్వాతి స్థానాల్లో అమిత్ మిశ్రా (ఢిల్లీ ; 146 వికెట్లు), పీయూష్ చావ్లా (కోల్‌కతా నైట్‌రైడర్స్; 140 వికెట్లు) ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టు ఇప్పటివరకు 171 మ్యాచ్‌లు ఆడి 97 విజయాలు నమోదు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 148 మ్యాచ్‌లు ఆడి 90 విజయాలతో రెండో స్థానంలో... కోల్‌కతా నైట్‌రైడర్స్ 164 మ్యాచ్‌లు ఆడి 86 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాయి. మరో ఎనిమిది సిక్స్‌లు కొడితే క్రిస్ గేల్ కేవలం ఐపీఎల్‌లోనే 300 సిక్సర్ల మైలురాయిని అందుకుంటాడు. 112 మ్యాచ్‌లు ఆడిన గేల్ ఖాతాలో 292 సిక్సర్లున్నాయి. 187 సిక్సర్లతో డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు.
వన్డే వరల్డ్ కప్‌నకు ముందు అలసటకు గురి కాకుండా ఉండేందుకు నేను కూడా ఐపీఎల్‌లో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇది వ్యక్తిగత విషయం. ఫిట్‌నెస్‌కు సంబంధించి చిన్నపాటి ఇబ్బంది ఉన్నా సరే ఆటగాళ్లు సమాచారం అందించి దానికి అనుగుణంగా తమ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఫిట్‌గా లేకుంటే పూర్తిగా మ్యాచ్‌కు దూరం కావాలే తప్ప ఒకసారి బరిలోకి దిగితే వంద శాతం శ్రమించాలి. ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఇంత కాలం ఆర్‌సీబీ కెప్టెన్‌గా కొనసాగడం అదృష్టమేనని గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోను. బయట ఉన్నవారి ఆలోచనల ప్రకారమే నేను కూడా పని చేస్తే కనీసం ఐదు మ్యాచ్‌లు కూడా ఆడకుండా ఇప్పటికే ఇంట్లో కూర్చునేవాడిని. ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. కానీ నా బాధ్యతలేమిటో బాగా తెలుసు. కెప్టెన్‌గా నేను కూడా ఐపీఎల్ గెలవాలనే కోరుకుంటా. అందుకోసం నేను చేయగలిగినంత చేస్తున్నా. కానీ కొన్నిసార్లు అనుకున్నవి జరగవు. అయినా ఐపీఎల్ విజయంతోనే నా గురించి మాట్లాడతారంటే అలాంటివి నేను పట్టించుకోను.
–విరాట్ కోహ్లి, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment