నిలువునా  కూల్చారు | India vs Australia 3rd Test Day 3: India 54/5 at Stumps | Sakshi
Sakshi News home page

నిలువునా  కూల్చారు

Published Sat, Dec 29 2018 12:51 AM | Last Updated on Sat, Dec 29 2018 3:12 AM

India vs Australia 3rd Test Day 3: India 54/5 at Stumps  - Sakshi

టీమిండియా  ఎక్కడా పట్టువిడవలేదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. నిప్పు కణికల్లాంటి జస్‌ప్రీత్‌ బుమ్రా బంతులు నిలువెల్లా వణికించడంతో ఆస్ట్రేలియన్లు చేతులెత్తేశారు. మిగతా బౌలర్లు సహాయక పాత్ర పోషించడంతో మెల్‌బోర్న్‌ టెస్టులో కోహ్లి సేన జయభేరి మోగించే దిశగా సాగుతోంది. ఇప్పటికే ఆధిక్యం 346 పరుగులకు చేరింది. మరో రెండు రోజుల సమయం ఉంది. అన్నింటికి మించి భారత్‌ జోరు మీదుంది. కంగారూలు తోక ముడవడం... సిరీస్‌లో మన జట్టు 2–1తో ముందంజ వేయడం ఖాయంగా కనిపిస్తోంది.   

మెల్‌బోర్న్‌: అంతా కోరుకున్నట్లే ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో భారత బౌలర్లు ఆస్ట్రేలియాకు పంచ్‌ ఇచ్చారు. పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (6/33) కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలతో ఏకంగా నాకౌట్‌ పంచే కొట్టాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు శుక్రవారం ఆతిథ్య జట్టు కుదేలైపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే ఆలౌటైంది. టీమిండియాకు 292 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విరాట్‌ కోహ్లి సేన... కమిన్స్‌ (4/10) ధాటికి తడబడింది. ఆట ముగిసే సమయానికి 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. టాప్‌ బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైనా, అరంగేట్ర ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (28 బ్యాటింగ్‌) నిలబడటంతో ఆధిక్యాన్ని 346కు పెంచుకుంది. అతడి తోడుగా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. 

బుమ్రా బెంబేలెత్తించాడు 
ఓపెనర్లు ఫించ్‌ (8), హారిస్‌ (22) సులువుగా పరుగులు సాధించడంతో శుక్రవారం ఉదయం ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సాఫీగానే ప్రారంభమైంది. కానీ, ఇది ఎంతోసేపు నిలవలేదు. ఇషాంత్‌ వేసిన బంతిని లెగ్‌సైడ్‌ ఫ్లిక్‌ చేసేందుకు యత్నించిన ఫించ్‌... మయాంక్‌ చక్కటి క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. భుజం ఎత్తులో వచ్చిన బుమ్రా షార్ట్‌ బాల్‌ను హుక్‌ చేయబోయి విఫలమైన హారిస్‌... ఇషాంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దూకుడుగా కనిపించిన ఖాజా (21)ను జడేజా వెనక్కు పంపాడు. పాతుకుపోయేందుకు యత్నించిన షాన్‌ మార్‌‡్ష (19)ను రెండో స్పెల్‌కు దిగిన బుమ్రా బోల్తా కొట్టించాడు. 89/4తో ఆసీస్‌ లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత హెడ్‌ (20) వికెట్లను గిరాటేసి బుమ్రానే భారత్‌కు మరో బ్రేక్‌ ఇచ్చాడు. మిషెల్‌ మార్‌‡్ష (9)ను జడేజా ఎక్కువసేపు నిలవనీయలేదు. ఈ దశలో కెప్టెన్‌ పైన్‌ (22)కు అండగా నిలిచిన కమిన్స్‌ (17)ను షమీ బౌల్డ్‌ చేశాడు. టీ తర్వాత మూడో విడత బౌలింగ్‌కు దిగుతూనే తొమ్మిది బంతుల వ్యవధిలో పైన్, లయన్‌ (0), హాజల్‌వుడ్‌ (0)లను ఔట్‌ చేసి కంగారూల ఇన్నింగ్స్‌కు బుమ్రా తెరదించాడు. నాలుగో వికెట్‌కు ఖాజా–షాన్‌ మార్‌‡్ష, ఏడో వికెట్‌కు పైన్‌–కమిన్స్‌ జోడించిన 36 పరుగులే ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యాలు కావడం గమనార్హం. టీమిండియా బౌలర్ల ధాటికి శుక్రవారం ఆ జట్టు 60.5 ఓవర్లే ఆడగలిగింది. 

కమిన్స్‌ మాయ చేశాడు... 
మ్యాచ్‌కు రెండు రోజులపైగా సమయం ఉండటం, ఆధిక్యాన్ని మరింత పెంచుకుని ఆసీస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టే ఉద్దేశంతో ఫాలోఆన్‌ ఇవ్వకుండా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది.  సాధికారికంగా ఆడుతున్న మయాంక్‌కు విహారి (13) తోడ్పాటునందించాడు. ఈ జోడీ 13 ఓవర్లపాటు నిలిచింది. అయితే కమిన్స్‌ షార్ట్‌ బంతితో విహారిని పడగొట్టాడు. తర్వాతి ఓవర్లో గ్లాన్స్‌ ఆడేందుకు యత్నించిన పుజారా (0), కోహ్లి (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. లెగ్‌సైడ్‌ వెళ్తున్న బంతిని ఆడబోయి రహానే (1) కీపర్‌కు చిక్కాడు. 8 బంతుల తేడాతోనే కమి న్స్‌ ఈ నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. హాజల్‌వుడ్‌ వేసిన షార్ట్‌ బంతి రోహిత్‌ (5) కథ ముగించింది. చివర్లో మయాంక్, పంత్‌  మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు.

బూమ్‌రా... భళా
మెల్‌బోర్న్‌ టెస్టు మూడో రోజు భారత్‌ తరఫున బుమ్రా, ఆస్ట్రేలియా తరఫున కమిన్స్‌ల స్పెల్‌ హైలైట్‌గా నిలిచింది. ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం టీమిండియా బౌలర్లు, అందులోనూ బుమ్రా గురించే. మూడు స్పెల్‌లలోనూ షార్ట్‌ పిచ్, స్లో యార్కర్లు, స్వింగ్‌ బంతులతో అతడు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఆటాడుకున్నాడు. హుక్‌ షాట్‌ ఆడేలా ప్రేరేపించి హారిస్‌ను పెవిలియన్‌ చేర్చిన బుమ్రా... 115 కి.మీ. వేగం దాటని యార్కర్‌ లెంగ్త్‌ బంతితో షాన్‌ మార్‌‡్షను ఎల్బీ చేశాడు. దీనిపై ఆసీస్‌ సమీక్ష కూడా కోరే ఆలోచన చేయలేదంటే బంతి ఎంత కచ్చితంగా పడిందో అర్ధమవుతుంది. ఆ వెంటనే 142 కి.మీ. వేగంతో బెయిల్స్‌ లేపేసి హెడ్‌ దిమ్మతిరిగేలా చేశాడు. టీ తర్వాత బుమ్రా స్పెల్‌ గురించి మరింత చెప్పుకోవాలి. ఆడాలా వద్దా అన్నట్లు వచ్చిన బంతి పైన్‌ బ్యాట్‌ అంచును తాకుతూ కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. కచ్చితమైన బంతులతో లయన్, హాజల్‌వుడ్‌లనూ ఔట్‌ చేసి ఆసీస్‌ ఆట కట్టించాడు. ఇదే సమయంలో ఇషాంత్‌ బౌలింగ్‌లో షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో మయాంక్‌ను ఉంచడం వంటి కోహ్లి ఫీల్డింగ్‌ వ్యూహాలకూ ప్రశంసలు దక్కాయి. పించ్‌ను ఔట్‌ చేసి ఇషాంత్‌ (1/41) శుభారంభమిస్తే... ప్రత్యర్థి భాగస్వామ్యాలను ఎప్పటికప్పుడు విడగొట్టి జడేజా (2/45), షమీ (1/27) బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చారు. మొత్తం 66.5 ఓవర్లలో  జడేజానే 25 వేయడం గమనార్హం. 

ఫాలోఆన్‌ ఇవ్వలేదంటే...
ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరుకు దాదాపు రెట్టింపు ఆధిక్యం దక్కినా, బుమ్రా సహా మిగతా పేసర్లు పెద్దగా అలసిపోకున్నా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆస్ట్రేలియాను ఫాలోఆన్‌ ఆడించకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది. కొన్ని కోణాల్లో చూస్తే ఇది సమంజసమే అనిపించింది. పేసర్లు మరింత తాజాగా బౌలింగ్‌కు దిగే వీలు కల్పించడం ఇందులో మొదటిది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ అనూహ్యంగా పుంజుకొని 400పైగా పరుగులు చేస్తే టీమిండియా నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాల్సి రావడం రెండోది. ఇదే జరిగితే పిచ్‌ అనూహ్య స్పందనల కారణంగా స్వల్ప లక్ష్యమే అయినా, ఇబ్బందులు తప్పేలా లేవు. అసలా పరిస్థితే రాకుండా ఉండాలంటే రెండో ఇన్నింగ్స్‌లో మనమే సాధ్యమైనన్ని పరుగులు చేసి, కంగారూల ముందు అందుకోలేనంత భారీ లక్ష్యాన్ని విధించాలని కోహ్లి భావించినట్లున్నాడు. అయితే, భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో ఈ ప్రణాళిక కొంత దెబ్బతిన్నా, ఇప్పటికే అతి భారీ లక్ష్యాన్ని నిర్దేశించే స్థితిలో ఉండటంతో ఆందోళన చెందాల్సిన పని లేకపోయింది. ఈ నేపథ్యంలో నాలుగో రోజు మయాంక్, పంత్‌ వేగంగా ఆడి లక్ష్యాన్ని 400 పరుగుల సమీపానికి చేరిస్తే ఆ వెంటనే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసే అవకాశం ఉంది. తర్వాత ఎప్పటిలాగానే బౌలర్లు చెలరేగితే టెస్టు మన వశమౌతుంది.

► ఒకే ఏడాదిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డపై ఇన్నింగ్స్‌లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాపై (జొహన్నెస్‌బర్గ్‌లో 5/54); ఇంగ్లండ్‌పై (ట్రెంట్‌బ్రిడ్జ్‌లో 5/85); ఆస్ట్రేలియాపై (మెల్‌బోర్న్‌లో 6/33) ఈ ఘనత సాధించాడు.  


► ఒకే ఏడాది విదేశీ గడ్డపై అత్యధిక (45) వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఇప్పటికే 45 వికెట్లు పడగొట్టిన బుమ్రా అరంగేట్రం చేసిన సంవత్సరమే ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గానూ గుర్తింపు పొందాడు.  

► ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారతీయ వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ నిలిచాడు. ప్రస్తుత సిరీస్‌లో పంత్‌ 18 క్యాచ్‌లు అందుకున్నాడు. గతంలో సయ్యద్‌ కిర్మాణీ, ధోని అత్యధికంగా 17 క్యాచ్‌లు పట్టారు.   

మా బ్యాట్స్‌మెన్‌ పుజారా, కోహ్లిలా ఆడాలి 
మా బ్యాటింగ్‌ బాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేసి మ్యాచ్‌లో నిలవాలని భావించినా సాధ్యం కాలేదు. ఒత్తిడిని తట్టుకుంటూ భారత తొలి ఇన్నింగ్స్‌లో పుజారా, కోహ్లి ఆడినట్లుగా ఇప్పుడు మా బ్యాట్స్‌మెన్‌ ఆడాలి. ఈ పిచ్‌పై పరుగులు రావడం కష్టమే. అయితే, మేం గతేడాది నాలుగు, ఐదో రోజున చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన చేశాం. 
– ఆస్ట్రేలియా  పేసర్‌ కమిన్స్‌

రంజీ అనుభవంతో రివర్స్‌ స్వింగ్‌ 
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నెమ్మదైన పిచ్‌లపై బౌలింగ్‌ చేసిన అనుభవం మెల్‌బోర్న్‌లో ఉపయోగపడింది. దీంతో బంతిని రివర్స్‌ స్వింగ్‌ చేయగలిగా. నేను బౌలింగ్‌కు దిగినప్పుడు పిచ్‌ నెమ్మదిగా ఉంది. బంతి మెత్త బడింది. దీనికి తగ్గట్లే బంతులేశా. బంతి రివర్స్‌ స్వింగ్‌ అవుతుండటంతో ఫలితం దక్కింది. నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి కెరీర్‌ ప్రారంభ ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం నన్నేమీ ఆశ్చర్చపర్చలేదు. వివిధ దేశాల్లో ఆడటం  కొత్త అనుభూతినిస్తోంది. 
– జస్‌ప్రీత్‌ బుమ్రా, భారత పేసర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement