గెలుస్తారా... నిలుస్తారా! | Australia v India 2014 - 3rd Test, Day 3: Facts and figures | Sakshi
Sakshi News home page

గెలుస్తారా... నిలుస్తారా!

Published Tue, Dec 30 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

గెలుస్తారా... నిలుస్తారా!

గెలుస్తారా... నిలుస్తారా!

ఎట్టకేలకు భారత బౌలర్లు అంచనాలను మించి రాణించారు. నిలకడైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిరోధించారు. బ్యాట్స్‌మెన్ చెలరేగిపోకుండా కీలక దశల్లో వికెట్లు తీసి మ్యాచ్‌పై ఆశలు రేపారు.

భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన నాలుగో రోజు ఆసీస్‌ను వెనుకంజ వేసేలా చేసింది. ఎప్పటిలాగే వేగంగా పరుగులు చేసి భారీ లక్ష్యం నిర్దేశించాలన్న ఆలోచనను కట్టి పడేసింది. అయితే ధోని సేనకు పట్టు చిక్కినట్లే కనిపించినా... షాన్ మార్ష్ చలవతో ఆ జట్టు నిలబడింది.

ఎంసీజీలో మూడు రకాల ఫలితాలు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. చివరి రోజు ఎంత పెద్ద లక్ష్యమైనా భారత్ ఛేదిస్తుందా, లేక ఆ ప్రయత్నంలో కుప్పకూలుతుందా చూడాలి. కంగారూలు ‘డ్రా’ వైపు మొగ్గుతున్నా... పోరాడితే పోయేదేం లేదు అన్న తరహాలో వాతావరణం ప్రతికూలంగా మారితే తప్ప భారత్ విజయం కోసమే ఆడటం మాత్రం ఖాయం.
 
ఉత్కంఠ స్థితిలో మెల్‌బోర్న్ టెస్టు
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 261/7
ప్రస్తుతం 326 పరుగుల ముందంజ
చివరి రోజు ఏ ఫలితమైనా సాధ్యం

మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు సమాన స్థితిలో నిలిచాయి. భారత బౌలర్లు నిలకడగా రాణించడంతో ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. క్రిస్ రోజర్స్ (123 బంతుల్లో 69; 8 ఫోర్లు), షాన్ మార్ష్ (131 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు.

ప్రస్తుతం మార్ష్‌తో పాటు హారిస్ (8 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 65 పరుగులు కలుపుకొని ఆసీస్ ప్రస్తుతం 326 పరుగులు ముందంజలో ఉంది. అయితే ఇంకా ఆసీస్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. చివరి రోజు ఆ జట్టు ఎన్ని పరుగులు అదనంగా జోడిస్తుందనేది ఆసక్తికరం. ఒక వేళ ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. తమ సాధారణ శైలికి భిన్నంగా నాలుగో రోజు చివర్లో ఆసీస్ ఆత్మరక్షణ ధోరణి చూస్తే ఆ జట్టు ‘డ్రా’ వైపే ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అదే జరిగితే భారత్ సిరీస్ కోల్పోతుంది. సోమవారం వర్షం కారణంగా అంతరాయంతో 77.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆఖరి రోజు ఆట అరగంట ముందుగా ప్రారంభమవుతుంది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 3 పరుగులు మాత్రమే జోడించి చివరి 2 వికెట్లు కోల్పోయింది. హారిస్‌కు 4, జాన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి.
 
స్కోరు వివరాలు:-

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 530; భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) మార్ష్ (బి) వాట్సన్ 68; ధావన్ (సి) స్మిత్ (బి) హారిస్ 28; పుజారా (సి) హాడిన్ (బి) హారిస్ 25; కోహ్లి (సి) హాడిన్ (బి) జాన్సన్ 169; రహానే (ఎల్బీ) (బి) లయోన్ 147; రాహుల్ (సి) హాజల్‌వుడ్ (బి) లయోన్ 3; ధోని (సి) హాడిన్ (బి) హారిస్ 11; అశ్విన్ (సి) అండ్ (బి) హారిస్ 0; షమీ (సి) స్మిత్ (బి) జాన్సన్ 12; ఉమేశ్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 0; ఇషాంత్ (నాటౌట్) 0,  ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (128.5 ఓవర్లలో ఆలౌట్) 465
వికెట్ల పతనం: 1-55; 2-108; 3-147; 4-409; 5-415; 6-430; 7-434; 8-462; 9-462; 10-465.
బౌలింగ్: జాన్సన్ 30.5-6-133-3; హారిస్ 26-7-70-4; హాజల్‌వుడ్ 25-6-75-0; వాట్సన్ 16-3-65-1; లయోన్ 29-3-108-2; స్మిత్ 2-0-11-0.
 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 40; రోజర్స్ (బి) అశ్విన్ 69; వాట్సన్ (సి) ధోని (బి) ఇషాంత్ 17; స్మిత్ (సి) రహానే (బి) ఉమేశ్ 14; మార్ష్ (బ్యాటింగ్) 62; బర్న్స్ (సి) ధోని (బి) ఇషాంత్ 9; హాడిన్ (సి) ధోని (బి) ఉమేశ్ 13; జాన్సన్ (సి) రహానే (బి) షమీ 15; హారిస్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (75 ఓవర్లలో 7 వికెట్లకు) 261
 వికెట్ల పతనం: 1-57; 2-98; 3-131; 4-164; 5-176; 6-202; 7-234;  బౌలింగ్: ఉమేశ్ 14-1-73-2; షమీ 20-2-75-1; ఇషాంత్ 19-4-49-2; అశ్విన్ 22-2-56-2.
 
సెషన్-1: వార్నర్ దూకుడు
నాలుగోరోజు భారత ఇన్నింగ్స్ 15 బంతుల్లోనే ముగిసిం ది. జాన్సన్ తన వరుస ఓవర్లలో ఉమేశ్, షమీలను పెవిలియన్ పంపించాడు. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను వార్నర్ (42 బంతుల్లో 40; 6 ఫోర్లు) దూకుడుగా ఆరంభించాడు. ఉమేశ్ బౌలింగ్‌లో ఐదు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2 పరుగుల వద్ద స్లిప్‌లో కొట్టిన షాట్‌కు బంతి ధావన్‌కు కాస్త ముందు పడటంతో రోజర్స్ బతికిపోయాడు. అయితే పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసిన అశ్విన్, ఈ భాగస్వామ్యాన్ని కూడా విడదీశాడు.
ఓవర్లు: 2.3, పరుగులు: 3, వికెట్లు: 2 (భారత్)
ఓవర్లు: 22, పరుగులు: 90, వికెట్లు: 1 (ఆస్ట్రేలియా)

 
సెషన్-2: రోజర్స్ నిలకడ
లంచ్ సమయంలో చాలా సేపు వర్షం కురిసి మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. కొంత విరామం తర్వాత ఆట ప్రారంభమైంది. రోజర్స్ చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 33 పరుగుల వద్ద అతను స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ధావన్ వదిలేశాడు. మరోవైపు వాట్సన్ (17)ను అవుట్ చేసి ఇషాంత్ దెబ్బ తీయగా, ఫామ్‌లో ఉన్న కెప్టెన్ స్మిత్ (14) ధోని వ్యూహానికి చిక్కాడు. ఉమేశ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ వైపు ఆడబోయిన స్మిత్ లెగ్ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. మరోసారి అశ్విన్, చక్కటి బంతితో రోజర్స్‌ను బోల్తా కొట్టించడంతో భారత్‌కు పట్టు చిక్కింది.
ఓవర్లు: 21, పరుగులు: 84, వికెట్లు: 3
సెషన్-3: ఆదుకున్న మార్ష్

 
గత టెస్టులో విఫలమైన షాన్ మార్ష్ విరామం తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు సహచరులు వెనుదిరుగుతున్నా... ఏకాగ్రత కోల్పోకుండా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు మరో సారి ప్రత్యర్థిని నియంత్రించగలిగారు. ఫలితంగా బర్న్స్ (9), హాడిన్ (13), జాన్సన్ (15) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. 112 బంతుల్లో మార్ష్ అర్ధ సెంచరీని చేరుకున్నాడు.
ఓవర్లు: 32, పరుగులు: 87, వికెట్లు: 3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement