2-1కి... 2 వికెట్లు కావాలి | India vs Australia: India two wickets away from winning Boxing Day Test | Sakshi
Sakshi News home page

2-1కి... 2 వికెట్లు కావాలి

Published Sun, Dec 30 2018 1:51 AM | Last Updated on Sun, Dec 30 2018 4:52 AM

India vs Australia: India two wickets away from winning Boxing Day Test - Sakshi

ఆస్ట్రేలియా గడ్డపై మరో ప్రతిష్టాత్మక విజయానికి భారత్‌ మరింత చేరువైంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో టాస్‌ వేసిన దగ్గరి నుంచి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన టీమిండియా నాలుగో రోజు ముగిసేసరికి గెలుపునకు కేవలం 2 వికెట్ల దూరంలో నిలిచింది. మయాంక్, పంత్‌ దూకుడు తర్వాత వేగంగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి భారీ లక్ష్యంతో ప్రత్యర్థికి సవాల్‌ విసిరిన కోహ్లి సేన ఎనిమిది ఆసీస్‌ వికెట్లు పడగొట్టి సిరీస్‌లో ఆధిక్యానికి సన్నద్ధమైంది. బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకునే క్రమంలో భారత్‌కు శనివారం పేసర్‌ కమిన్స్‌ నుంచే కాస్త ప్రతిఘటన ఎదురైంది. కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చడంతో పాటు బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ కూడా సాధించిన కమిన్స్‌ అడ్డుగోడగా నిలిచాడు. నాలుగో రోజు తరహాలోనే ఆదివారం కూడా ఆటకు ముందు కొన్ని చిరుజల్లులకు అవకాశం ఉన్నా... పూర్తి రోజు వర్షం బారిన పడే ప్రమాదం లేదు కాబట్టి భారత్‌ గెలుపు ఇక లాంఛనమే కావచ్చు.

మెల్‌బోర్న్‌: కంగారూ నేలపై సిరీస్‌ విజయంతో చరిత్ర సృష్టించే లక్ష్యంతో అడుగు పెట్టిన భారత జట్టు మరో అడుగు ముందుకు వేసింది. మూడో టెస్టు మ్యాచ్‌లో గెలుపునకు అతి చేరువలో నిలిచి 2–1 ఆధిక్యం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. భారత్‌ విధించిన 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ప్యాట్‌ కమిన్స్‌ (103 బంతుల్లో 61 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), షాన్‌ మార్‌‡్ష (72 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ప్రస్తుతం కమిన్స్‌తో పాటు లయన్‌ (6 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు అభేద్యంగా 43 పరుగులు జోడించారు. అరగంట అదనపు సమయం తీసుకొని ఎనిమిది ఓవర్లు వేసినా టీమిండియా ఈ జోడీని విడదీయలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు కొంత పోరాటపటిమ కనబర్చినా ఓటమి నుంచి తప్పించుకునేందుకు అది సరిపోయేలా లేదు. 

అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 106 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (102 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (43 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు. ప్యాట్‌ కమిన్స్‌ (6/27) ఆరు వికెట్లతో చెలరేగాడు. సొంతగడ్డపై 2016–17 సీజన్‌లో ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని గెలుచుకున్న భారత్‌... ఈ టెస్టులో గెలిస్తే తర్వాతి మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ట్రోఫీని నిలబెట్టుకుంటుంది. సిడ్నీ టెస్టును ‘డ్రా’ చేసుకున్నా సరే తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలుచుకున్నట్లవుతుంది.

10.3 ఓవర్లు...52 పరుగులు...
ఓవర్‌నైట్‌ స్కోరు 54/5తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తక్కువ ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మయాంక్‌ అగర్వాల్, పంత్‌ దూకుడుగా ఆడారు. లయన్‌ ఓవర్లో మయాంక్‌ రెండు భారీ సిక్సర్లతో చెలరేగడం విశేషం. అయితే ఆ తర్వాత కమిన్స్‌ అద్భుత బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో మయాంక్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ముగిసింది. రవీంద్ర జడేజా (6 బంతుల్లో 5; ఫోర్‌) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. హాజల్‌వుడ్‌ వేసిన తర్వాతి ఓవర్లో లాంగాన్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదిన పంత్‌... తర్వాత బంతిని కీపర్‌ మీదుగా ఆడబోయి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తున్నట్లు కోహ్లి ప్రకటించాడు. 

పేలవ బ్యాటింగ్‌...
ఆస్ట్రేలియా ఓపెనర్ల పేలవ ప్రదర్శన రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగింది. 10 ఓవర్లు కూడా పూర్తి కాక ముందే ఇద్దరూ పెవిలియన్‌ చేరారు. బుమ్రా తొలి ఓవర్లోనే స్లిప్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఫించ్‌ (3) వెనుదిరగ్గా, జడేజా బౌలింగ్‌లో డిఫెన్స్‌ ఆడబోయి షార్ట్‌లెగ్‌లో అగర్వాల్‌ చేతికి హారిస్‌ (13) చిక్కాడు. ఈ దశలో షాన్‌ మార్‌‡్ష, ఖాజా (59 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కొద్దిసేపు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ లంచ్‌ వరకు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. విరామం తర్వాత షమీ... ఖాజాను; షాన్‌ మార్ష్‌ను బుమ్రా ఎల్బీగా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు. మిషెల్‌ మార్ష్‌ (21 బంతుల్లో 10; సిక్స్‌) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. 

కమిన్స్‌ అర్ధ సెంచరీ...
చివరి సెషన్‌లో కూడా ఆస్ట్రేలియా ఆటలు సాగలేదు. షమీ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి పైన్‌ పైచేయి సాధించే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు తమ ఒత్తిడిని కొనసాగించగలిగారు. హెడ్‌ (92 బంతుల్లో 34; 2 ఫోర్లు)ను ఇషాంత్‌ బౌల్డ్‌ చేయగా, కొద్ది సేపటికే జడేజా బౌలింగ్‌లో పంత్‌ చేతికి పైన్‌ (26; 4 ఫోర్లు) చిక్కాడు. అయితే ఎనిమిదో వికెట్‌ (39 పరుగులు), తొమ్మిదో వికెట్‌ (43 పరుగులు) భాగస్వామ్యాలు భారత్‌ కు అసహనాన్ని కలిగించాయి. ఈ రెండు భాగస్వామ్యాల్లో కమిన్స్‌ కీలక పాత్ర పోషించగా, స్టార్క్‌ (18), లయన్‌ అండగా నిలిచారు. ఈ క్రమంలో కమిన్స్‌ 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లయన్, కమిన్స్‌జోడి 14.1 ఓవర్ల పాటు వికెట్‌ కోల్పోకుండా నిలబడగలిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement