
41/4... అడిలైడ్‌లో తొలి టెస్టు గంటన్నర గడిచిందో లేదో టీమిండియా స్కోరిది. ఓపెనర్ల పేలవ ఫామ్... కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్య వైఫల్యం... వైస్ కెప్టెన్ అజింక్య రహానే సైతం చేతులెత్తేయడంతో ఇంకేముంది? అంతా పాత కథే అనుకున్నారు. ఎన్నో అంచనాలు, మరెన్నో విశ్లేషణలు, ఇంకెన్నో ఆశలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్... ‘కొత్త చరిత్ర’ సృష్టించడం అటుంచి, ‘పాత చరిత్ర’నే పునరావృతం చేస్తుందని భావించారు. కానీ, ఇక్కడి నుంచి కథ మారింది. సరిగ్గా నెల రోజులు తిరిగేసరికి సిరీస్ దాసోహమైంది. దీని వెనుక పుజారా నిలకడ, బుమ్రా అద్భుతాలు, కోహ్లి వెన్నుదన్నుతో పాటు ‘టాస్’ రూపంలో అదృష్టం కూడా వెంట నడిచింది. ఫలితంగా, ఇంతకాలం అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఆసీస్‌లో సిరీస్ విజయం మన సొంతమైంది. దేశ క్రికెట్‌లో సువర్ణాధ్యాయం నమోదైంది. జట్టు సమష్టిగా సాధించిన ఈ ఘనతలో ఓ ఐదు అంశాలు కీలకంగా నిలిచాయి. అవేంటంటే!
సాక్షి క్రీడా విభాగం : అది 2003–04 సిరీస్. నాలుగు టెస్టు మ్యాచ్‌లకు గాను మొదటిది ‘డ్రా’ కాగా, రెండో దాంట్లో భారత్ గెలుపొంది... ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి ఆధిక్యంలో నిలిచింది. కానీ, మూడో టెస్టులోఓడటంతో గణాంకాలు సమమయ్యాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన చివరి టెస్టులో టీమిండియా కంగారూలకు 443 పరుగుల అతి భారీ లక్ష్యం విధించింది. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో ఐదో రోజు మైదానంలో దిగిన ఆసీస్... ఓ దశలో 196/4తో నిలిచింది. అప్పటికింకా 40 ఓవర్ల ఆట మిగిలుంది. ప్రత్యర్థి ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసి మన బౌలర్లు ఊపు మీదున్నారు. టీమిండియా విజయం ఖాయం అనుకుంటున్న ఇలాంటి స్థితిలో కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న నాటి కెప్టెన్ స్టీవ్ వా (159 బంతుల్లో 80), సైమన్ కటిచ్ (96 బంతుల్లో 77 నాటౌట్)తో కలిసి గోడ కట్టాడు. ఓవర్లన్నీ కరగదీసి... ‘డ్రా’గా ముగించాడు. అలా, అప్పుడు సిడ్నీలో త్రుటిలో చేజారిన ‘చారిత్రక విజయం’ సరిగ్గా పదిహేనేళ్లకు, అదేచోట, అటుఇటుగా అవే తేదీల్లో ఖాయమైంది. టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకుకు తాము అర్హులమేనని కోహ్లి సేన సగర్వంగా చెప్పుకొనేలా చేసింది. ఈ గొప్పదనంలో ఎవరి పాత్ర ఏంటంటే..?
అహో పుజారా...
521 పరుగులు, 74.22 సగటు, మూడు శతకాలు, ఒక అర్ధ శతకం! సిరీస్‌లో పుజారా గణాంకాలివి. అడిలైడ్‌లో టాపార్డర్ కుప్పకూలిన సందర్భంలో, మెల్‌బోర్న్‌లో జట్టుకు అత్యవసర సమయంలో, సిడ్నీలో ఆధిక్యాన్ని పెంచాల్సిన స్థితిలో పుజారా చేసిన శతకాలను పోల్చేందుకు ఏ గణాంకాలూ సాటి రావు. అతడు విఫలమైన పెర్త్‌లోనే టీమిండియా ఓడటం గమనార్హం. దీన్నిబట్టి విజయంలో తన పాత్రేమిటో చెప్పేయొచ్చు. అపరిమిత సహనం, చెక్కుచెదరని ఏకాగ్రత, సడలని డిఫెన్స్‌తో ఆసీస్ పేసర్ల బంతులను కాచుకున్న విధానం, క్రీజు వదిలి ముందుకొచ్చి స్పిన్నర్ లయన్‌ను దెబ్బకొట్టిన తీరు, ఇంత గొప్ప విజయంలో భాగమైనా కాసింతైనా గర్వం లేని నైజం కొత్త కుర్రాళ్లకు అచ్చమైన టెస్టు పాఠమే. ఇక అనేకానేక కారణాలతో జట్టులో చోటు కుర్చీలాటగా మారిన పరిస్థితుల్లో ఈ ఒక్క పర్యటన పుజారాను ఎక్కడికో తీసుకెళ్లింది. మరోవైపు ఈ సిరీస్‌తో కోహ్లికి తాను సమఉజ్జీనని చాటుకున్నాడు. తన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆటతో ఇకపై ఏ సిరీస్‌కూ తప్పించే ఆలోచనే రాకుండా చేశాడు.
భళా బుమ్రా...
సొంతగడ్డపై ఆసీస్ పేసర్లే తేలిపోతే, జస్‌ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 21 వికెట్లు (సిడ్నీలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ మినహా) పడగొట్టి ప్రత్యర్థి పనిపట్టాడు. అతడి 140 కి.మీ. నిలకడైన వేగం, వైవిధ్య శైలి, తెలివైన బౌలింగ్ ముందు కంగారూ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. మెల్‌బోర్న్‌లో కేవలం 115 కి.మీ. వేగంతో బుమ్రా సంధించిన బంతిని షాన్ మార్‡్ష వంటి సీనియర్ సైతం ఆడలేకపోయాడు. పాదాలను చితగ్గొట్టే పదునైన యార్కర్లు బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాయి. సుదీర్ఘ స్పెల్స్ వేయడంతో పాటు జట్టుకు కావాల్సిన సందర్భాల్లో వికెట్లు తీస్తూ బుమ్రా పైమెట్టులో నిలిచాడు. అతడి ఆరు వికెట్ల ప్రదర్శనే మెల్‌బోర్న్ టెస్టును భారత్ పరం చేసింది. ఈ పర్యటనతో ప్రపంచంలో ఎలాంటి పిచ్‌పైనైనా తాను రాణించగలనని బుమ్రా చాటాడు.
లయన్ జూలు విదిల్చకుండా...
కోహ్లిలాంటి బ్యాట్స్‌మన్‌ను పదేపదే ఔట్ చేస్తూ, అడిలైడ్, పెర్త్‌లో ఏకంగా 16 వికెట్లు నేలకూల్చి కలవరపెట్టాడీ ఆఫ్ స్పిన్నర్. ఇతడి జోరు చూస్తే భారత్ ఆశలకు గండికొట్టేవాడిలానే కనిపించాడు. కానీ, మెల్‌బోర్న్‌లో లయన్ జూలు పీకేశారు భారత బ్యాట్స్‌మెన్. అతడిని వ్యూహాత్మకంగా, ప్రణాళిక ప్రకారం ఎదుర్కొన్నారు. ఓవర్లకు ఓవర్లు వేసినా వికెట్ దక్కకుండా చేసి చివరకు ఎటూ పాలుపోని స్థితికి తీసుకొచ్చారు. దీంతో చివరి రెండు టెస్టుల్లో 328 పరుగులిచ్చి ఐదే వికెట్లు పడగొట్టగలిగాడు.
‘టాస్’ కూడా మేలు చేసింది...
ఏ దేశంలోనైనా ఈ కాలంలో టెస్టు విజయానికి సగం మార్గం టాస్‌తోనే పడుతోంది. ఇంగ్లండ్‌లో భారత్‌ను వెక్కిరించిన టాస్ ఈసారి మాత్రం కరుణించింది. పెర్త్ మినహా అన్నిచోట్లా కోహ్లినే టాస్ నెగ్గగా... బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి భారత్ మంచి స్కోర్లతో మ్యాచ్‌ను లాగేసుకుంది.
కుర్రాళ్ల తోడ్పాటు...
యువ పృథ్వీ షా గాయంతో దూరమై, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమై, ఓపెనింగ్ రెండు స్థానాలూ ఖాళీగా కనిపించిన స్థితిలో కొత్త కుర్రాళ్లు మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఇన్నింగ్స్‌ను ఆరంభించి జట్టును కాపాడారు. సిరీస్ 1–1తో ఉన్న స్థితిలో మెల్‌బోర్న్‌లో దాదాపు తొలి సెషన్ అంతా నిలిచి టీమిండియా ఆశలు నిలిపారు. ఆపద సమయంలో వీరు చూపిన సంయమనాన్ని స్కోర్లతో కొలవలేం. భిన్న నేపథ్యాల నుంచి నేరుగా క్రీజులో అడుగుపెట్టినా, ఏమాత్రం బెదురు లేకుండా ఆడారు. మయాంక్ తనదైన దూకుడుతో లయన్‌ను దెబ్బకొట్టిన తీరు చెప్పుకోదగ్గది. చివరి టెస్టులో అగర్వాల్ ఇన్నింగ్స్ శతకానికి పూర్తిగా అర్హమైనది. ఇక విహారి అప్పగించిన బాధ్యతను సమర్థంగా నెరవేర్చి తాను జట్టు మనిషినని చాటుకున్నాడు. సిడ్నీలో చక్కటి షాట్లతో అలరించాడు.
Comments
Please login to add a commentAdd a comment