అడిలైడ్‌ అందేందుకు ఆరు వికెట్లు | India On Top As Australia Falter In Chase Of 323 | Sakshi
Sakshi News home page

అడిలైడ్‌ అందేందుకు ఆరు వికెట్లు

Published Mon, Dec 10 2018 3:46 AM | Last Updated on Mon, Dec 10 2018 4:29 AM

India On Top As Australia Falter In Chase Of 323 - Sakshi

రహానే; కోహ్లి, పుజారా, అశ్విన్‌ సంబరాలు

అడిలైడ్‌: పట్టును మరింత బిగిస్తూ, పై చేయిని కొనసాగిస్తూ, ప్రత్యర్థి వికెట్లను ఒకదాని వెంట ఒకటి పడగొడుతూ అడిలైడ్‌ టెస్టులో భారత్‌ విజయం ముంగిట నిలిచింది. మ్యాచ్‌ను పూర్తి నియంత్రణలోకి తీసుకుని, ప్రత్యర్థికి పరాజయం తప్పదనే పరిస్థితి కల్పించింది. బ్యాట్స్‌మెన్‌ బాధ్యత నెరవేర్చడంతో 323 పరుగుల కఠిన లక్ష్యం విధించి... బౌలర్లు మరింత మెరుగ్గా రాణించడంతో నాలుగో రోజు ఆట ముగిసేసరికి 104 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఆత్మరక్షణలోకి నెట్టింది.

గెలవాలంటే కోహ్లి సేన ఆరు వికెట్లు పడగొట్టాల్సి ఉండగా, ఆతిథ్య జట్టు మరో 219 చేయాలి. క్రీజులో ఉన్న షాన్‌ మార్‌‡్ష (92 బంతుల్లో 31 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), ట్రావిస్‌ హెడ్‌ (37 బంతుల్లో 11 బ్యాటింగ్‌; 1 ఫోర్‌) మినహా మరో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ లేనందున ‘డ్రా’గా ముగించాలన్నా వారు సోమవారమంతా ఆడాల్సి ఉంటుంది. అశ్విన్‌ (2/44) స్పిన్‌తో పాటు, ప్రభావవంతంగా బంతులేస్తున్న షమీ (2/15), ఇషాంత్, బుమ్రాలను తట్టుకుని నిలవడం ఏమంత సులువు కాదు.

కాబట్టి... కంగారూల కథ చివరి రోజు రెండో సెషన్‌లోపే ముగిసేలా కనిపిస్తోంది. అంతకుముందు 151/3తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ చివరి 4 వికెట్లు 4 పరుగులకే చేజార్చుకుంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర్‌ పుజారా (204 బంతుల్లో 71; 9 ఫోర్లు); అజింక్య రహానే (147 బంతుల్లో 70; 7 ఫోర్లు) అర్ధశతకాలతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. రిషభ్‌ పంత్‌ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. ఆసీస్‌ బౌలర్లలో లయన్‌ (6/122) ఆరు వికెట్లు పడగొట్టగా, స్టార్క్‌ (3/40)కు మూడు వికెట్లు దక్కాయి.

అద‘రహానే’...
టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కోహ్లి, పుజారా తర్వాత నమ్మదగ్గ బ్యాట్స్‌మన్‌ అయిన వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే చాలా రోజుల తర్వాత చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టుకు బాగా అవసరమైన సమయంలో పుజారాతో కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. ఉదయం సెషన్‌ను వీరిద్దరూ నింపాదిగా ప్రారంభించారు. వ్యక్తిగత స్కోరు 40తో బరిలో దిగిన పుజారా కాసేపటికే అర్ధశతకం (140 బంతుల్లో) అందుకున్నాడు. 17 పరుగుల వద్ద ఉండగా అంపైర్‌ క్యాచ్‌ ఔట్‌ ఇచ్చినా సమీక్ష కోరి రహానే బయటపడ్డాడు.

తర్వాత నుంచి అతడు వేగం పెంచాడు. అయితే, లంచ్‌కు కొద్దిగా ముందు పుజారాను లయన్‌ పెవిలియన్‌ పంపి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అర్ధ శతకం (111 బంతుల్లో) పూర్తి చేసుకుని రహానే ఊపుమీదుండగా... సహకరించాల్సిన స్థితిలో రోహిత్‌శర్మ (1) మరింత పేలవంగా ఔటయ్యాడు. క్రీజు వదలి ముందుకొచ్చిన అతడు సిల్లీ పాయింట్‌లో సులువైన క్యాచ్‌ ఇచ్చాడు. పంత్‌ ఔటయ్యాక అశ్విన్‌ (5)ను స్టార్క్‌ పెవిలియన్‌కు పం పాడు. స్కోరును సాధ్యమైనంత పెంచే ఉద్దేశంతో రివర్స్‌ స్వీప్‌నకు యత్నించిన రహానే... స్టార్క్‌కు చిక్కాడు. తొలి బంతికే భారీ షాట్‌ ఆడబోయి షమీ (0) వెనుదిరిగాడు. ఏడు బంతుల వ్యవధిలో ఈ మూడు వికెట్లు పడిపోయాయి. ఇషాంత్‌ (0)ను పెవిలియన్‌ పంపి స్టార్క్‌ భారత్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

ఆసీస్‌... ఆపసోపాలు
ఒకరికి ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ నిలిస్తేనే ఛేదించగలిగే భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకు ఇషాంత్‌ మొదటి ఓవర్లోనే చుక్కలు చూపాడు. రెండో బంతికే ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ (11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ, బ్యాట్స్‌మన్‌ సమీక్ష కోరగా నోబాల్‌గా తేలింది. తర్వాత వంతుగా వచ్చిన షమీ... ఇంకా కట్టుదిట్టంగా బంతులేశాడు. అశ్విన్‌కు 9వ ఓవర్లో బంతినివ్వడం ఫలితమిచ్చింది. అతడి బౌలింగ్‌లో ఫించ్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే రీప్లేలో బంతి ఫించ్‌ బ్యాట్‌కు తాకలేదని తేలింది. ఫించ్‌ సమీక్ష కోరి ఉంటే బతికిపోయేవాడు! కంగారూలు 28/1తో టీకి వెళ్లారు. విరామం అనంతరం హారిస్‌ (26)ను వెనక్కు పంపి షమీ బ్రేక్‌ ఇచ్చాడు. మరోసారి క్రీజులో పాతుకుపోయేందుకు యత్నిస్తున్న ఉస్మాన్‌ ఖాజా (8)ను అశ్విన్‌ పెవిలియన్‌ చేర్చాడు. మార్‌‡్షకు కొద్దిసేపు తోడ్పాటు అందించిన హ్యాండ్స్‌కోంబ్‌(14)... షమీ బౌలింగ్‌లో పుల్‌ చేయబోయి మిడ్‌ వికెట్‌లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చాడు. జట్టు 84/4తో నిలిచిన సందర్భంలో మార్‌‡్ష, హెడ్‌ జోడీ 12 ఓవర్లపైగా వికెట్‌ కాపాడుకుని రోజును ముగించింది.

సోమవారం ఇదీ సీన్‌...
అడిలైడ్‌లో 315 పరుగులే ఇప్పటివరకు ఆసీస్‌కు అత్యధిక ఛేదన. అది కూడా 1902లో ఇంగ్లండ్‌పై సాధించింది. 323 లక్ష్యాన్ని అందుకుని వారిప్పుడు ఈ రికార్డును తిరగరాయాలంటే సోమవారం మార్‌‡్ష, హెడ్‌ సామర్థ్యానికి మించి ఆడాలి. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో మార్‌‡్ష టచ్‌లోకి వచ్చాడు. హెడ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేశాడు. వీరితో పాటు టిమ్‌ పైన్‌ ఒక సెషన్‌ అయినా నిలవాల్సి ఉంటుంది. భారత పేస్‌ త్రయం, ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను ఎదుర్కొంటూ ఇదేమంత సులువు కాదు.

పంత్‌ పటాకా...
భారత ఇన్నింగ్స్‌లో కాసేపే అయినా, రిషభ్‌ పంత్‌ ఆట హైలైట్‌గా నిలిచింది. లంచ్‌ నుంచి రాగానే పంత్‌... లయన్‌పై విరుచుకుపడి మూడు ఫోర్లు, సిక్స్‌ బాదాడు. స్వే్కర్‌ లెగ్‌ దిశగా అతడు కొట్టిన సిక్స్‌కు బంతి డగౌట్‌ రూఫ్‌పై పడింది. కానీ, మరుసటి ఓవర్‌ తొలి బంతికే లయన్‌ తన ఆట కట్టించాడు.   

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 250
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 235
 
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) పైన్‌ (బి) హాజల్‌వుడ్‌ 44; విజయ్‌ (సి) హ్యాండ్స్‌కోంబ్‌ (బి) స్టార్క్‌ 18; పుజారా (సి) ఫించ్‌ (బి) లయన్‌ 71; కోహ్లి (సి) ఫించ్‌ (బి) లయన్‌ 34; రహానే (సి) స్టార్క్‌ (బి) లయన్‌ 70; రోహిత్‌ శర్మ (సి) హ్యాండ్స్‌కోంబ్‌ (బి) లయన్‌ 1; పంత్‌ (సి) ఫించ్‌ (బి) లయన్‌ 28; అశ్విన్‌ (సి) హారిస్‌ (బి) స్టార్క్‌ 5; ఇషాంత్‌ (సి) ఫించ్‌ (బి) స్టార్క్‌ 0; షమీ (సి) హారిస్‌ (బి) లయన్‌ 0; బుమ్రా (0 నాటౌట్‌); ఎక్స్‌ట్రాలు 36; మొత్తం (106.5 ఓవర్లలో ఆలౌట్‌) 307.

వికెట్ల పతనం: 1–63, 2–76, 3–147, 4–234, 5–248, 6–282, 7–303, 8–303, 9–303, 10–307.
బౌలింగ్‌: స్టార్క్‌ 21.5–7–40–3; హాజల్‌వుడ్‌ 23–13–43–1; కమిన్స్‌ 18–4–55–0; లయన్‌ 42–7–122–6; హెడ్‌ 2–0–13–0.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: ఫించ్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 11; హారిస్‌ (సి) పంత్‌ (బి) షమీ 26; ఖాజా (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 8; షాన్‌ మార్‌‡్ష (31 బ్యాటింగ్‌); హ్యాండ్స్‌కోంబ్‌ (సి) పుజారా (బి) షమీ 14; హెడ్‌ (11 బ్యాటింగ్‌); ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (49 ఓవర్లలో 4 వికెట్లకు) 104. వికెట్ల పతనం: 1–28, 2–44, 3–60, 4–84. బౌలింగ్‌: ఇషాంత్‌ 8–3–19–0; బుమ్రా 11–5–17–0; అశ్విన్‌ 19–4–44–2; షమీ 9–3–15–2; విజయ్‌ 2–0–7–0.


హారిస్‌ వికెట్‌ తీసిన  షమీ ఉత్సాహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement