జట్టుకు దూకుడు నేర్పిన సారథి... విదేశీ పిచ్‌లపై సైతం అలవోకగా పరుగులు చేయగల నేర్పరి... టెక్నిక్, టెంపర్‌మెంట్‌లో అతడికెవరూ రారు సాటి! కంగారూ గడ్డపై పరుగులు చేసేందుకు సహచరలంతా తీవ్రంగా తడబడుతుంటే... ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో నిరూపించిన అసలు సిసలు నాయకుడు అతడు. అందుకే ప్రస్తుతం అతడు పెద్దగా ఫామ్‌లో లేకపోయినా... కీలక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్‌కు ముందు ఎవరినోట విన్నా అతడి గురించే చర్చ. ‘బాడీలైన్’ బౌలింగ్‌తో ఇబ్బంది పట్టాలని ఒకరు... రెచ్చగొట్టకుండా వదిలేయాలని మరొకరు... ఇలా ఆ్రస్టేలియా మాజీ ఆటగాళ్లంతా తీవ్రంగా చర్చిస్తున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు... టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కు గురైన టీమిండియా... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకోవాలంటే అతడు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది!
సుదీర్ఘ ఫార్మాట్‌ను అమితంగా ఇష్టపడే విరాట్ కోహ్లికి ఆ్రస్టేలియాపై మెరుగైన రికార్డు ఉంది. క్రీజులో కుదురుకుంటే మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టే విరాట్... ఆసీస్‌లో ఆసీస్‌పై అదరగొట్టాడు. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడిన కోహ్లి 1352 పరుగులు చేశాడు. 54.08 సగటు నమోదు చేసిన విరాట్... 6 సెంచరీలు, 4 అర్ధశతకాలు కొట్టాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై యాభైకి పైగా సగటుతో పరుగులు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా సాగుతున్న విరాట్ తన కెరీర్‌లో దాదాపు చివరి ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు.
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌లో అందరి దృష్టి కోహ్లిపైనే నిలవనుంది. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం... మరో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమవడం... గత పర్యటనలో అదరగొట్టిన సీనియర్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇప్పుడు జట్టులోనే లేకపోవడం... ఇవన్నీ వెరసి విరాట్ కోహ్లీ విలువను మరింత పెంచాయి.
పెద్దగా అనుభవం లేని యశస్వి జైస్వాల్, ఇప్పటి వరకు అరంగేట్రమే చేయని అభిమన్యు ఈశ్వరన్, నిలకడ లోపించిన కేఎల్ రాహుల్, తొలిసారి ఆసీస్‌లో పర్యటిస్తున్న ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ వంటి వాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లీ ఒక్కడే శిఖరంలా కనిపిస్తున్నాడు. పరీక్ష పెట్టే పేస్ పిచ్‌లు, సవాలు విసిరే బౌన్సీ వికెట్‌లు స్వాగతం పలుకుతున్న సమయంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలంటే బ్యాటింగ్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిదే.
ఫామ్ అందుకుంటాడా...
గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌ను ఒడిసి పట్టింది. ముచ్చటగా మూడోసారి అదే జోరు కొనసాగాలంటే బ్యాటింగ్ బలగం రాణించాల్సిన అవసరముంది. అయితే సహనానికి పరీక్ష పెట్టే ఆసీస్ పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన చేయాలంటే మొక్కవోని దీక్ష ముఖ్యం. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన కోహ్లి... మూడు మ్యాచ్‌ల్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేదు. మరి ఇలాంటి స్థితిలో పెద్దగా అనుభవం లేని బ్యాటింగ్ ఆర్డర్‌తో భారత జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే కోహ్లి సత్తా చాటాల్సిన అవసరముంది.
భారత జట్టు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియా ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా... 4–0తో ట్రోఫీ చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇది సాధ్యపడాలంటే కోహ్లి తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టి లేపాల్సిన అవసరముంది. గతంతో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగిపోయిన కోహ్లీ... కొంతకాలంగా నెమ్మదించాడు. మునుపటి మెరుపులు మెరిపించ లేకపోతున్నాడు. ఈ ఏడాది 6 టెస్టులు ఆడిన కోహ్లి... అందులో 22.72 సగటుతో కేవలం 250 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తాడనే నమ్మకం సాధించిన కోహ్లి... ఆసీస్ పర్యటనలో అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
కోహ్లిని వదిలేయండి: వాట్సన్
కీలక సిరీస్‌కు ముందు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు... ఆ దేశ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ కీలక సూచన చేశాడు. మైదానంలో కోహ్లి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని తమ ప్లేయర్లకు చెప్పాడు. రెచ్చగొడితే కోహ్లిలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడని హితవు పలికాడు. ‘విరాట్‌ను దగ్గర నుంచి గమనించా. అతడిలో మెరుగైన ప్రదర్శన చేయాలనే కసి ఎక్కువ. అది లోలోపల ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టి బయటకు తీయకపోవడమే మేలు. అందుకే ఆసీస్ ఆటగాళ్లు అతడిని వదిలేయాలి. లేకుంటే అతడు చాలా ప్రమాదకరం’ అని వాట్సన్ అన్నాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఆసీస్‌లో పర్యటించిన కోహ్లి... 2014–15 పర్యటనలో 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ‘ఆసీస్‌లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబర్చాడో అందరికీ తెలుసు. అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు అతడు ప్రతి బంతిని మెరుగ్గా అర్థం చేసుకుంటాడు. అది జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నా’ అని వాట్సన్ అన్నాడు.
కోహ్లికి బాడీలైన్ బౌలింగ్ చేయాలి: హీలీ
భారత ప్రధాన ఆటగాడు కోహ్లిని అడ్డుకోవాలంటే బాడీలైన్ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాలని ఆసీస్ ఆటగాళ్లకు ఆ దేశ మాజీ ప్లేయర్ ఇయాన్ హీలీ సూచించాడు. పదే పదే ముందరి ప్యాడ్‌ను లక్ష్యంగా చేసుకొని బంతులేయడం ద్వారా అతడిని బ్యాక్‌ఫుట్‌కు పరిమితం చేసి త్వరగా అవుట్ చేయవచ్చని సూచించాడు. ‘తొలి టెస్టులో ఆ్రస్టేలియా పేసర్లు కోహ్లికి ఎలా బౌలింగ్ చేస్తారో చూసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. క్రీజులో కోహ్లీ మెరుగైన కాళ్ల కదలికలు కనబర్చితే అతడు త్వరగా కుదురుకుంటాడు. అందుకే ముందరి ప్యాడ్ లక్ష్యంగా ప్రయతి్నంచాలి. అప్పుడే అతడిని నియంత్రించవచ్చు. ఒకవేళ అది ఫలితాన్ని ఇవ్వకపోతే. బాడీలైన్ బౌలింగ్ చేయడం మంచిది’ అని హీలీ ఆసీస్ పేసర్లకు హితవు పలికాడు.
విరాట్ ఒక చాంపియన్: లయన్
భారత సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ఆ్రస్టేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ అసలు సిసలు చాంపియన్ అని అన్నాడు. గత 60 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి కేవలం 2 సెంచరీలు, 11 అర్ధశతకాలు మాత్రమే చేసినా... అతడిని తక్కువ అంచనా వేయడం లేదని లయన్ పేర్కొన్నాడు. ‘ఫామ్‌లో ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే... అతడి రికార్డులు నమ్మశక్యం కానివి. అతడి పట్ల నాకు గౌరవం ఉంది. అతడిని అవుట్ చేయాలని తప్పక ప్రయతి్నస్తా. కానీ అది ఎంత కష్టమో నాకు తెలుసు. చాన్నాళ్లుగా మా మధ్య రసవత్తర సమరం జరుగుతుంది. కోహ్లి, స్మిత్ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు’ అని లయన్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment