సమరానికి సన్నాహం!
నేడు భారత్, వెస్టిండీస్ వార్మప్ మ్యాచ్ షమీపైనే అందరి దృష్టి
కోల్‌కతా: రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయాలు... ఆసియా కప్‌లో తిరుగులేని ప్రదర్శన... వేదిక ఎలాంటిదైనా... ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని అలవోకగా చిత్తు చేసిన వైనం... ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఇప్పట్నించి భారత్ ఆడబోతున్న మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తు. ప్రతి ప్రత్యర్థి చివరి బంతి వరకు పోరాటం చేసే అతి పెద్ద సమరం టి20 ప్రపంచకప్. ఇప్పుడు రెండోసారి ఈ కప్‌ను గెలవాలన్న ఏకైక లక్ష్యంతో భారత్ ఈ సమరానికి సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో నేడు (గురువారం) వెస్టిండీస్‌తో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
ప్రాక్టీస్‌లో షమీ
వాస్తవానికి ఇది వార్మప్ మ్యాచే. కానీ భారత్‌కు అతి కీలకమైన పేసర్ షమీ ఫిట్‌నెస్‌ను ఈ మ్యాచ్‌ల ద్వారా అంచనా వేయనున్నారు. మోకాలి శస్త్రచికిత్సతో ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతను ఏ మేరకు ఫిట్‌గా ఉన్నాడో చూడాలని మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తోంది. దీంతో ప్రస్తుతానికి అందరి దృష్టి షమీపైనే నెలకొంది. బుధవారం జరిగిన ప్రాక్టీస్‌లో షమీ ఫర్వాలేదనిపించాడు. కోహ్లి, రోహిత్, యువరాజ్‌లకు మంచి రిథమ్‌తో దాదాపు అరగంట పాటు బౌలింగ్ చేశాడు. అయితే పేస్, కదలికల పరంగా కాస్త ఇబ్బందిపడ్డాడు. మిగతా విభాగాల్లో టీమిండియాకు తిరుగులేదు.
బౌలింగ్‌లో బుమ్రా, నెహ్రాతో పాటు హార్దిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. డెత్ ఓవర్లలో బుమ్రా ప్రదర్శన భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రధాన స్పిన్నర్ అశ్విన్, జడేజాలు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు. ఇక తమ బ్యాటింగ్ బలమేంటో టీమిండియా ఇప్పటికే నిరూపించుకుంది. ఆసియా కప్ ఫైనల్‌తో ధావన్ కూడా గాడిలో పడ్డాడు. కోహ్లి, రోహిత్, ధోని సూపర్ ఫామ్‌లో ఉన్నారు. టి20ల్లో ఆసియా కప్ గెలవడం ద్వారా భారత్ కల సగం నెరవేరింది. ఇక ప్రపంచకప్‌ను కూడా సాధించి కలను పరిపూర్ణం చేసుకోవాలని ఆటగాళ్లు భావిస్తున్నారు.
ఎక్కడ చూసినా వారే...
మరోవైపు ప్రపంచంలో పొట్టి ఫార్మాట్‌లో ఎక్కడ ఏ లీగ్ జరిగినా... వెస్టిండీస్ ఆటగాళ్లు కచ్చితంగా అందులో ఉంటారు. కాబట్టి ఈ ఫార్మాట్ కరీబియన్లకు కొట్టిన పిండి. ప్రత్యర్థులు ఏమాత్రం అలసత్వం వహించినా క్షణాల్లో మ్యాచ్‌ను తారుమారు చేసే సత్తా ఉన్న ఆటగాళ్లకు కొదువలేదు. ఓవరాల్‌గా విండీస్ బ్యాటింగ్ మొత్తం డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్‌పైనే ఆధారపడి ఉంది. అతను క్రీజులో కుదురుకుంటే భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం, ఛేదించడం చాలా సులభం. అయితే మిగతా లైనప్‌లో నిలకడలేమీ ఆందోళన కలిగించే అంశం.
అలాగే పొలార్డ్, డారెన్ బ్రేవో, నరైన్‌లాంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం కూడా లోటుగానే కనిపిస్తోంది. గాయం కారణంగా లెండిల్ సిమ్మన్స్ చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలగడం మరో పెద్ద సమస్య. ఇతని స్థానంలో కొత్త కుర్రాడు ఇవిన్ లూయిస్‌కు అవకాశం దక్కింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కొన్ని ప్రయోగాలు చేసి తుది జట్టును ఎంపిక చేసుకోవాలని కెప్టెన్ స్యామీ భావిస్తున్నాడు.
ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. నిలకడగా ఆడితే టైటిల్ సాధించొచ్చు. మా జట్టులో మంచి సమతుల్యం ఉంది. ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయాలు సాధిస్తున్నాం. ఓ పెద్ద టోర్నీని గెలవాలంటే కనీసం ఏడుగురు మంచిగా ఆడాలి. కోహ్లి, రోహిత్, ధోనిలు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. యువరాజ్, ధావన్‌లు గాడిలో పడ్డారు.
ఆసియా కప్‌తో మంచి సన్నాహకం లభించింది. బుమ్రా, పాండ్యాల బౌలింగ్ సూపర్. మా రిజర్వ్ బెంచ్ కూడా బలంగా ఉంది. ధోని రిటైర్మెంట్‌పై విమర్శలు సరైనవికావు. అతను చాలా సాధించాడు. ఇక సాధించడానికి ఏమీ లేదు. మహీ చాంపియన్. ఎవరో ఒకరిద్దరు రిటైర్మెంట్ కోరుకుంటే సరిపోతుందా? అయినా మన దగ్గర ఇవన్నీ సర్వసాధారణం. -రవిశాస్త్రి (టీమ్ డెరైక్టర్)