అన్నీ మరచి ఆటపై దృష్టి!
►ఇటీవలి పరిణామాలు జట్టుపై ప్రభావం చూపించవు
►ఫలితాలు సాధించడమే కీలకం: భారత కెప్టెన్ కోహ్లి
►కోచ్‌ల కంటే ఆటగాళ్లు ముఖ్యం: రవిశాస్త్రి
►శ్రీలంక చేరిన భారత జట్టు
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన వార్తల్లో క్రికెట్ వెనక్కి వెళ్లిపోగా... వివాదాలు, విమర్శలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఒకవైపు ఎవరూ పట్టించుకోకుండా విండీస్ సిరీస్ సాగిపోగా... మరోవైపు కెప్టెన్, కోచ్ విభేదాలు, అనిల్ కుంబ్లే అనూహ్య రాజీనామా అనంతరం కొత్త కోచ్ ఎంపిక ప్రహసనంలాంటి అంశాలతో అంతా గందరగోళంగా సాగింది. సరిగ్గా నెల రోజుల పాటు సాగిన ఈ పరిణామాలను మరచి ఇప్పుడు ఆట వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. కెప్టెన్ కోరుకున్న కోచ్, కోచ్ కోరుకున్న సహాయక బృందంతో కలిసి భారత్ ఇప్పుడు శ్రీలంక పర్యటన నుంచి కొత్త ఆరంభం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.
ముంబై: భారత క్రికెట్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో తనపై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదని కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. మైదానం బయట చోటు చేసుకునే ఘటనలు జట్టుపై ప్రభావం చూపించవని అతను స్పష్టం చేశాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేల సిరీస్ కోసం బుధవారం భారత జట్టు శ్రీలంకకు వెళ్లింది. ఈ నెల 26 నుంచి భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు జరుగుతుంది. జట్టు బయల్దేరడానికి ముందు కోహ్లి మీడియాతో ముచ్చటించాడు. ‘కొన్ని సార్లు ఏం జరగాలో అది కచ్చితంగా జరిగి తీరుతుందని నేను నమ్ముతాను. ఇలాంటి వాటి వల్ల నాపై అదనపు ఒత్తిడి ఏమీ ఉండదు. ఒక జట్టుగా ఏం సాధించాలనే దానిపైనే మేం దృష్టి పెడతాం. గతంలోనూ అందరూ క్లిష్ట పరిస్థితులను అధిగమించారు. విమర్శలకు గురి కావడం మాకు కొత్త కాదు. నా బాధ్యతలను నేను ఎప్పుడూ భారంగా భావించను’ అని కోహ్లి స్పష్టం చేశాడు. తాను కెప్టెన్‌గా ఉన్నంత వరకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా దానిని నెరవేరుస్తానని, పాత విషయాలను మనసులోంచి తుడిచేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అతను అన్నాడు.
కుంబ్లేతో విభేదాల గురించి నేరుగా వ్యాఖ్యానించకపోయినా... పరోక్షంగా తన వ్యాఖ్యలతో కోహ్లి ‘సమన్వయం’ ఎలా ఉంటుందో గుర్తు చేయడం విశేషం. ‘ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన అనేది ఆటలోనే కాదు జీవితంలో కూడా బాగా పని చేస్తుంది. నేను దానిని పాటిస్తాను. ప్రతీ ఒక్కరికి జీవితంలో సంబంధాలు కొనసాగించే విషయంలో ఈ తరహా అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. సహకారం, సమన్వయం ఎంత కీలకమో అప్పుడే తెలుస్తుంది’ అని విరాట్ విశ్లేషించాడు. 2015లో శ్రీలంకతో ఆడిన సిరీస్ నుంచే భారత్ వరుస విజయాల జోరు మొదలైంది. నాటితో పోలిస్తే ఈ రెండేళ్లలో ఆటగాళ్లు మరింత పరిణతి చెందారని, తమపై తాము విశ్వాసం ఉంచడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని కోహ్లి అభిప్రాయపడ్డాడు.
సచిన్ కూడా కావాలన్న శాస్త్రి!
భారత సహాయక సిబ్బంది ఎంపికకు సంబంధించి రవిశాస్త్రి, బీసీసీఐ ప్రత్యేక కమిటీ మధ్య జరిగిన చర్చల గురించి ఒక ఆసక్తికర అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. జట్టు సలహాదారుడిగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉంటే బాగుంటుందని ఈ సమావేశంలో శాస్త్రి సూచించారు. అదే జరిగితే సచిన్ ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ పరిధిలోకి వచ్చే అవకాశం ఉండేది. తాత్కాలిక ప్రాతిపదికన కొద్ది రోజుల కోసం సలహాదారుడిగా పని చేసినా... సచిన్ ఐపీఎల్ సహా తన ఇతర అనేక ఒప్పందాలకు దూరం కావాల్సి ఉంటుంది. దాంతో ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కమిటీ బ్రేక్ వేసింది.
నేను చాలా మారిపోయాను....
హెడ్ కోచ్ హోదాలో రవిశాస్త్రి కూడా తొలిసారి మీడియాతో మాట్లాడి తన అభిప్రాయాలు వెల్లడించారు. భారత క్రికెట్ వ్యవస్థలో ఎంతో మంది వచ్చి వెళుతుంటారని, వారికంటే ఆట ముఖ్యమని ఆయన అన్నారు. కోచ్‌లకంటే కూడా ఆటగాళ్లు కీలకమని గుర్తు చేశారు. ‘ఇటీవలి ఘటనల బరువును నా నెత్తిన పెట్టుకొని నేను రాలేదు. గత మూడేళ్లుగా భారత జట్టు చాలా బాగా ఆడుతోంది. గొప్పతనమంతా ఆటగాళ్లదే. రవిశాస్త్రి కావచ్చు, కుంబ్లే కావచ్చు ఎవరైనా వచ్చి వెళుతుంటారు. భారత్ నంబర్‌వన్ అయిందంటే అది ఆటగాళ్ల శ్రమ వల్లే తప్ప కోచ్‌ల వల్ల కాదు. ఎవరు ఉన్నా లేకున్నా భారత క్రికెట్ స్వరూపంలో మార్పుండదు’ అని శాస్త్రి వ్యాఖ్యానించారు.
గతంలో శ్రీలంకలో పర్యటించడంతో పోలిస్తే తనలో చాలా మార్పు వచ్చిందని, గత మూడు వారాల్లో అయితే తాను మరింత పరిణతి చెందానని ఆయన చెప్పారు. తాను పట్టుబట్టి తీసుకున్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌పై శాస్త్రి ప్రశంసలు కురిపించారు. ‘దాదాపు పదిహేనేళ్లు ఆయన కోచింగ్‌లోనే గడిపారు. ఇండియా ‘ఎ’, అండర్–19 స్థాయిలో అరుణ్ మంచి ఫలితాలు సాధించారు. 2015 వరల్డ్ కప్‌లో మన బౌలర్లు ఎనిమిది మ్యాచ్‌లలో 77 వికెట్లు తీశారు. ఆటగాడిగా చెప్పుకోదగ్గ రికార్డు లేకపోవడం వల్లే ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. లేకపోతే అతని గురించి గొప్పగా చెప్పేవారు. నేను చెప్పడంకంటే అంతా అతడి పనితీరును చూస్తే బాగుంటుంది’ అని హెడ్ కోచ్ సమర్థించారు.
శాస్త్రి నాకు సరి జోడి!
హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి పని చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చని కోహ్లి అన్నాడు. గతంలోనూ తమ మధ్య మంచి సమన్వయం కొనసాగిందని అతను గుర్తు చేశాడు. ‘2014 నుంచి 2016 వరకు వరుసగా మూడేళ్ల పాటు కలిసి పని చేశాం. కాబట్టి మంచి అవగాహన ఉండటం సహజం. కొత్తగా నేను ఆయనను అర్థం చేసుకోవడానికేమీ లేదు. ఒకరి నుంచి మరొకరం ఏం ఆశిస్తున్నామో, అందుబాటులో ఎలాంటి వనరులు ఉన్నాయో ఇద్దరికీ బాగా తెలుసు. సమన్వయం కోసం కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు’ అని కోహ్లి తన భావాన్ని ప్రకటించాడు.