ముంబై: ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఓటమికి కారణమేంటి? మన జట్టు సభ్యులను అడిగితే ‘అరటిపండ్లు’ అంటారేమో! ఎందుకంటే అక్కడి అధికారులు మనకు అరటిపండ్లు ఇవ్వలేదట!! అందుకే వచ్చే వరల్డ్ కప్‌లో అరటిపండ్లు కచ్చితంగా ఉండాలంటూ మనోళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారా... సీఓఏ ముందు క్రికెటర్లు ఉంచిన కోరికల జాబితాలో ఇది కూడా ఉంది మరి. వెస్టిండీస్‌తో రెండో టెస్టు సమయంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి జట్టు సభ్యుల డిమాండ్లను వెల్లడించారు. ఇందులో సీఓఏ చీఫ్ వినోద్ రాయ్‌తో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ‘ఇంగ్లండ్ పర్యటన సమయంలో మన ఆటగాళ్లు ఇష్టపడిన ఫలాలు ఆతిథ్య బోర్డు అందించలేదు. అయితే సీఓఏ ఈ డిమాండ్ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బీసీసీఐ ఖర్చులతో తమకు అరటిపండ్లు తెచ్చి పెట్టమని టీమ్ మేనేజర్‌ను క్రికెటర్లు అడగాల్సింది కదా అని వారు అభిప్రాయ పడ్డారు’ అని బోర్డులో కీలక సభ్యుడొకరు దీనిపై వ్యాఖ్యానించారు. సరైన జిమ్ సదుపాయాలు ఉన్న హోటళ్లను మాత్రమే తమ కోసం బుక్ చేయాలని కూడా కోహ్లి బృందం సీఓఏను కోరింది.
అన్నింటికి మించి వరల్డ్ కప్ సమయంలో తాము రైలులోనే ప్రయాణం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని, అందుకోసం ఒక ప్రత్యేక బోగీని బ్లాక్ చేయాలని కూడా భారత క్రికెటర్లు కోరుతున్నారు. ‘ఇంగ్లండ్‌లో రైలు ప్రయాణమే సౌకర్యవంతంగా ఉంటుందని టీమిండియా సభ్యులు చెప్పారు. అభిమానులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటం, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని అందుకు ముందుగా సీఓఏ అంగీకరించలేదు. అయితే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మాత్రం సీఓఏ కానీ బీసీసీఐ కానీ బాధ్యత వహించదని షరతు పెట్టి దీనికి అంగీకరించింది’ అని బోర్డు అధికారి వెల్లడించారు. పర్యటన మొత్తం తమ భార్యలను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే దీనిపై సీఓఏ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భార్యలు వెంట ఉంటేనే తమ ఏకాగ్రత చెడుతుందని కొందరు క్రికెటర్లు భావిస్తారని, అందరితో చర్చించిన తర్వాత దీనిపై ఆలోచిస్తామని సీఓఏ స్పష్టం చేసింది. త్వరలో జరిగే ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో మాత్రమే రెండు వారాల పాటు భార్యలను అనుమతిస్తామని, వారు టీమ్ బస్సులో ప్రయాణించడానికి వీల్లేదని సీఓఏ గతంలోనే నిర్ణయం తీసుకుంది.
ఆటలో ‘అరటిపండు’!
Published Wed, Oct 31 2018 1:36 AM | Last Updated on Wed, Oct 31 2018 1:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment