అత్యుత్తమ జట్టు తయారవుతుంది!
భారత కోచ్ రవిశాస్త్రి ఆశాభావం
ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ జట్టుగా ఎదిగే లక్షణాలు ప్రస్తుత టీమ్‌కు ఉన్నాయని కొత్త కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజులన్నీ గొప్పగా ఉంటాయని ఆయన అన్నారు. ‘గతంలో ఎప్పుడూ లేనంత బలమైన భారత టెస్టు జట్టు త్వరలో సిద్ధం కావచ్చు. అన్ని పరిస్థితుల్లోనూ రాణిస్తూ 20 వికెట్లు తీయగల పేస్ బలగం మనకుంది. వారి వయసు కూడా అందుకు తగిన అవకాశం కల్పిస్తోంది’ అని శాస్త్రి అన్నారు. కోహ్లి అద్భుతంగా ఆడుతున్నా... రాబోయే ఐదారేళ్లు అతని అత్యుత్తమ ఆటను చూస్తామని, అతని గొప్పతనం అప్పుడు కనిపిస్తుందని శాస్త్రి చెప్పారు.
తాను ఇప్పుడే ఎంపికయ్యానని, కోహ్లితో చర్చించిన తర్వాతే 2019 ప్రపంచకప్‌తో పాటు ధోని, యువరాజ్ తదితరుల గురించి ఆలోచిస్తామని చెప్పారు. మరోవైపు సౌరవ్ గంగూలీతో విభేదాలు అనేది ముగిసిన అంకమని, ఎవరు ఏం మాట్లాడినా భారత జట్టు ప్రయోజనాల కోసమేనన్న రవిశాస్త్రి... ఇంటర్వ్యూలో గంగూలీ తనను చక్కటి ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు.