ముంబై మెరిసింది | Mumbai beats Punjab by 25 runs | Sakshi
Sakshi News home page

ముంబై మెరిసింది

Published Mon, Apr 25 2016 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

ముంబై మెరిసింది

ముంబై మెరిసింది

25 పరుగులతో పంజాబ్‌పై విజయం
గెలిపించిన పార్థివ్, రాయుడు

 
ముందుగా పార్థివ్, అంబటి రాయుడు భారీ భాగస్వామ్యం... ఆ తర్వాత బుమ్రా పదునైన బౌలింగ్ కలగలిసి ముంబై ఇండియన్స్ మళ్లీ విజయం బాట పట్టింది. ఢిల్లీ చేతిలో అనూహ్య ఓటమితో కోలుకున్న రోహిత్ సేన సమష్టిగా రాణించి పంజాబ్‌ను చిత్తు చేసింది. బౌలింగ్ వైఫల్యంతో భారీగా పరుగులిచ్చిన కింగ్స్ ఎలెవన్, ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ అండతో పోరాడే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. ఫలితంగా మిల్లర్ బృందం పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది.
 
మొహాలీ: ఐపీఎల్-9లో పడుతూ లేస్తూ సాగుతున్న ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 25 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (58 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (37 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 85 బంతుల్లోనే 137 పరుగులు జోడించడం విశేషం. అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (39 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), షాన్ మార్ష్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆ జట్టుకు లీగ్‌లో వరుసగా ఇది మూడో పరాజయం.
 
 మెరుపు భాగస్వామ్యం...

ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ (0)ను సందీప్ శర్మ అవుట్ చేసి పంజాబ్ శిబిరంలో ఆనందం నింపాడు. అయితే ఆ తర్వాత పార్థివ్, రాయుడు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగడంతో ముంబై స్కోరు వేగంగా దూసుకుపోయింది. ఒక్క జాన్సన్ బౌలింగ్‌లోనే పార్థివ్ ఆరు ఫోర్లు బాది ఆధిపత్యం ప్రదర్శించగా, అక్షర్ బౌలింగ్‌లో రాయుడు మూడు భారీ సిక్సర్లు కొట్టి తన పదును చూపించాడు. ఇదే జోరులో రాయుడు 31 బంతుల్లో, పార్థివ్ 41 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

ఈ క్రమంలో రాయుడు టి20 క్రికెట్‌లో 3000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. తొలి ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసిన ముంబై, తర్వాతి పది ఓవర్లలో మరో వికెట్ మాత్రమే కోల్పోయి 115 పరుగులు చేసిందంటే దూకుడు ఎలా సాగిందో అర్థమవుతుంది. పొలార్డ్ (10), హార్దిక్ పాండ్యా (4) విఫలమైనా... బట్లర్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడటంతో చివరి ఐదు ఓవర్లలో ముంబై మరో 49 పరుగులు జత చేసింది. మోహిత్‌కు 3 వికెట్లు దక్కాయి.
 
రాణించిన మ్యాక్స్‌వెల్...
 భారీ లక్ష్య ఛేదనలో కింగ్స్ ఎలెవన్ తక్కువ వ్యవధిలోనే విజయ్ (13 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్), వోహ్రా (7) వికెట్లు కోల్పోయింది. అయితే మార్ష్, మ్యాక్స్‌వెల్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. విధ్వంసకరంగా ఆడకపోయినా, చక్కటి సమన్వయంతో వీరిద్దరూ చకచకా పరుగులు సాధించారు. మార్ష్ తన ఫామ్ కొనసాగించగా, చాలా కాలం తర్వాత మ్యాక్స్‌వెల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 61 బంతుల్లో 89 పరుగులు జోడించిన అనంతరం సౌతీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మార్ష్ వెనుదిరిగాడు.

ఆ తర్వాత 33 బంతుల్లో మ్యాక్స్‌వెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఎప్పుడో 2014 సీజన్‌లో కొట్టిన అనంతరం 25 ఇన్నింగ్స్‌ల తర్వాత మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. పంజాబ్ గెలుపుపై ఆశలు పెంచుకున్న సమయంలో బుమ్రా దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో అతను మ్యాక్స్‌వెల్‌తో పాటు నాయక్ (1)ను బౌల్డ్ చేయడంతో లక్ష్య ఛేదన కష్టం కాగా, మ్లిలర్ (17 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) పోరాడినా లాభం లేకపోయింది.
 
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నాయక్ (బి) సందీప్ 0; పార్థివ్ (సి) మార్ష్ (బి) జాన్సన్ 81; రాయుడు (సి) వోహ్రా (బి) అక్షర్ 65; బట్లర్ (బి) మోహిత్ 24; పొలార్డ్ (సి) సందీప్ (బి) మోహిత్ 10; హార్దిక్ పాండ్యా (సి) మిల్లర్ (బి) మోహిత్ 4; కృనాల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 189.

వికెట్ల పతనం: 1-0; 2-137; 3-174; 4-180; 5-189; 6-189.

బౌలింగ్: సందీప్ 4-0-20-1; జాన్సన్ 4-0-43-1; అక్షర్ 4-0-41-1; మోహిత్ 4-0-38-3; మ్యాక్స్‌వెల్ 1-0-11-0; సాహు 3-0-35-0.


కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) బట్లర్ (బి) సౌతీ 19; వోహ్రా (సి) బట్లర్ (బి) బుమ్రా 7; మార్ష్ (సి) రాయుడు (బి) సౌతీ 45; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 56; మిల్లర్ (నాటౌట్) 30; నాయక్ (బి) బుమ్రా 1; అక్షర్ (బి) మెక్లీన్‌గన్ 0; జాన్సన్ (బి) మెక్లీన్‌గన్ 1; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164.

వికెట్ల పతనం: 1-20; 2-32; 3-121; 4-139; 5-141; 6-149; 7-151.
బౌలింగ్: సౌతీ 4-0-28-2; మెక్లీన్‌గన్ 4-0-32-2; బుమ్రా 4-0-26-3; కృనాల్ పాండ్యా 2-0-20-0; హర్భజన్ 4-0-31-0; పొలార్డ్ 2-0-25-0.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement