గతంలో ఏ టి20 ప్రపంచకప్ కోసం కూడా భారత్ ఇంతగా సన్నద్ధం కాలేదు. ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగుతుండటం వల్ల కావచ్చు... నెల రోజుల ముందు నుంచే ఈ ఫార్మాట్‌లోకి మారిపోయారు. ఆస్ట్రేలియాను వారి గడ్డపై చిత్తు చేసి, ఆ తర్వాత స్వదేశంలో లంకను ఓడించి... తాజాగా ఆసియాకప్‌లో టైటిల్‌తో ప్రపంచకప్‌కు ముందు కావలసినంత మ్యాచ్ ప్రాక్టీస్ సంపాదించారు. జట్టులో ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటం, ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యతగా ఉండటం వల్ల ధోనిసేన అప్రతిహత విజయాలు సాధించింది. జట్టులో అస్త్రాలన్నీ సరిగానే ఉన్నాయని ఆసియాకప్‌తో అర్థమైంది. ఇక వీటిని ప్రపంచకప్‌లో వినియోగించడమే తరువాయి.
సాక్షి క్రీడావిభాగం ఆసియాకప్ టి20లో ఏ జట్టు కూడా భారత్‌కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన పాకిస్తాన్ జట్టు మన ముందు పూర్తిగా తేలిపోయింది. అలాగే పూర్తిస్థాయి జట్టుతో దిగిన డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ శ్రీలంక కూడా ధోనిసేన ముందు నిలబడలేకపోయింది. బంగ్లాదేశ్ జట్టు మిగిలిన ప్రత్యర్థులందరినీ ఓడించినా భారత్‌పై మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ పెద్దగా ప్రభా వం చూపలేదు. దీనికి కారణం భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉండ టం, తన బలానికి తగ్గ సాధికారికత ప్రదర్శించడం. ఆసియాకప్‌లో భారత ప్రదర్శన చూసిన తర్వాత ప్రపంచంలోని మిగిలిన జట్లు కూడా టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌కు బలంగా సన్నద్ధమవ్వాల్సిందే.
టాప్ ఆర్డర్ సూపర్
టోర్నీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో బ్యాటింగ్‌కు కఠినమైన వికెట్‌పై సంచలన ఇన్నింగ్స్‌తో రోహిత్ తాను ఫామ్‌లోనే ఉన్నానని చూపించాడు. శిఖర్ ధావన్ పూర్తి సత్తా బయటకు రాకపోయినా... ఫైనల్లో సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా పర్యటన నుంచి అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యద్భుతం. ఎలాంటి క్లిష్టమైన పిచ్ అయినా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఇన్నింగ్స్‌ను నిర్మించుకుంటూ వంద స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేయడం సామాన్యమైన విషయం కాదు. కోహ్లి, రోహిత్ ఇద్దరూ ఆడితే భారత్ ఎలాంటి ప్రత్యర్థిపైనైనా గెలవడం ఖాయం. మొత్తం మీద టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉండటం మంచి పరిణామం.
యువీ కుదురుకున్నాడు
నాలుగో స్థానంలో రైనా ఆడతాడని ఈ టోర్నీకి ముందే నిర్ణయించారు. అతను కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా, అవసరమైన సమయంలో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చగలడని ఆస్ట్రేలియాలో చూపించాడు. ఐపీఎల్ అనుభవం దృష్ట్యా ప్రస్తుత లైనప్‌లో అత్యంత ముఖ్యమైన టి20 క్రికెటర్ రైనా. ఇక యువరాజ్ సింగ్ కూడా తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లికి అండగా నిలబడటం, శ్రీలంకపై మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్ల తను పూర్తిగా కుదురుకున్నట్లే. ఇక ధోని ఆఖరి ఓవర్లలో సిక్సర్లు బాదగల సత్తా తనలో ఇంకా ఉందని నిరూపించుకుని, పాత ధోనిలా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు.
ఆల్‌రౌండర్ల బలం
ఈ నెల రోజుల కాలంలో భారత క్రికెట్‌కు బాగా జరిగిన మేలు హార్దిక్ పాండ్యా. పేస్ బౌలర్‌గా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేస్తున్నాడు. నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లోనూ భారీ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా వల్ల పేస్ బౌలింగ్ వికెట్ మీద కూడా ఇద్దరే సీమర్లతో భారత్ నెట్టుకురాగలిగింది. మూడో పేసర్‌గా, ఆల్‌రౌండర్‌గా పాండ్యా ఈ ప్రపంచకప్‌లో కీలకం కానున్నాడు. ఇక జడేజాకు బ్యాటింగ్ విషయంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా బంతితో ఆకట్టుకున్నాడు. అలాగే మైదానంలో మెరుపు ఫీల్డింగ్‌తో అదరగొడుతున్నాడు. అశ్విన్ భారత్‌కు ప్రధాన బౌలర్. ఇన్నింగ్స్‌లో ఏ దశలో అయినా బౌలింగ్ చేయగల నైపుణ్యం, మ్యాచ్‌లు గెలిపించగల సామర్థ్యం ఉన్న అశ్విన్ బంగ్లాదేశ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇక తన దాకా బ్యాటింగ్ అవకాశం వస్తే తన వంతుగా కచ్చితంగా జట్టుకు పరుగులు సాయం చేయగల నైపుణ్యం అశ్విన్‌నూ ఆల్‌రౌం డర్‌ను చేసింది. మొత్తానికి ఈ త్రయం ప్రపంచకప్‌లో రాణిస్తే భారత్‌కు ఎదురుండదు.
బుమ్రా, నెహ్రా జోడీ అదుర్స్
భారత్‌కు ఇద్దరు ప్రధాన పేసర్లుగా నెహ్రా, బుమ్రా ప్రపంచకప్ ఆడతారని రెండు నెలల క్రితం ఎవరూ ఊహించి కూడా ఉండరు. అనుకోకుండా ఈ ఇద్దరికీ ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో స్థానం దక్కింది. అక్కడ లభించిన అవకాశాలను ఈ ఇద్దరూ పూర్తిగా వినియోగించుకున్నారు. పవర్‌ప్లేలో ఆరు ఓవర్లు ఈ ఇద్దరూ పూర్తి చేస్తారు. నెహ్రా తన అనుభవాన్ని ఉపయోగించి స్వింగ్‌తో ఆరంభంలో అదరగొడుతున్నాడు. లేటు వయసులోనూ తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఇక బుమ్రా అయితే భారత జట్టుకు లభించిన వరం అ నుకోవాలి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు మలింగ నుంచి యార్కర్లు నేర్చుకున్న బుమ్రా... ఇప్పుడు అదే తన ప్రధాన ఆయుధంగా వాడుతున్నాడు. ఆరంభ ఓవర్లతో పోలిస్తే స్లాగ్ ఓవర్లలో తను బాగా ఉపయోగపడతాడు. పరిస్థితిని బట్టి ధోని తనని వాడుతున్నాడు.
రిజర్వ్‌లూ ఫామ్‌లోనే...
ఇక ఆసియాకప్ ద్వారా భారత్‌కు మరో అంశంలోనూ స్పష్టత వచ్చింది. ఒకవేళ తుది జట్టులో ఎవరైనా గాయపడితే ఆ స్థానంలో ఆడటానికి అందుబాటులో ఉన్న రిజర్వ్ ఆటగాళ్లు అందరూ ఫామ్‌లో ఉండటం శుభసూచకం. టాపార్డర్, మిడిలార్డర్... ఇలా ఏ స్థానంలో అయినా ఆడగల రహానే బ్యాట్స్‌మెన్ అందరికీ బ్యాకప్‌గా ఉన్నాడు. నిజానికి రహానే అద్భుతమైన ఆటగాడు. అయినా తుది జట్టులో చోటు లేదంటే భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జడేజాకు బ్యాకప్‌గా పవన్ నేగి, అశ్విన్‌కు బ్యాకప్‌గా హర్భజన్, పేసర్లిద్దరికీ బ్యాకప్‌గా భువనేశ్వర్ ఉన్నారు. వీళ్లు ముగ్గురు కూడా యూఏఈపై చక్కగా బౌలింగ్ చేశారు. కాబట్టి రిజర్వ్‌ల ఫామ్ విషయంలో ఎలాంటి అనుమానాలూ లేవు. అయితే ప్రపంచకప్ జట్టులో భువనేశ్వర్ లేడు. షమీ గాయం నుంచి కోలుకోకపోతేనే భువనేశ్వర్ వస్తాడు. ఏదేమైనా అన్ని విభాగాల్లోనూ భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉంది. ఎలాంటి పిచ్‌లపై అయినా విజయాలు సాధించగలమని ఈ రెండు నెలల్లో చూపించారు.
అస్త్రాలన్నీ సరిగానే..!
Published Mon, Mar 7 2016 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM
Advertisement