బూమ్ బూమ్ బుమ్రా...
♦ దూసుకొచ్చిన యువ పేసర్
♦ వన్డే, టి20ల్లో చక్కటి ప్రదర్శన
♦ యాక్షన్, యార్కర్లే బలం
అదృష్టమంటే అలా ఉండాలి... వీడు సుడిగాడురా అనిపించాలి...పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ అరంగేట్రం అలాగే అచ్చు సినిమా స్టోరీలా జరిగింది. టి20 జట్టులోకి ఎంపికైన అతను మ్యాచ్ కోసం అడిలైడ్ వెళ్లాల్సి ఉంది. తనతో పాటే వెళ్లాల్సిన ఐదుగురు భారత ఆటగాళ్లకు ఫ్లయిట్ ఖరారు కాగా... బుమ్రాకు మాత్రం టిక్కెట్ దొరకలేదు. దీంతో బీసీసీఐ అతడిని సిడ్నీకి పంపించింది.
ఆఖరి వన్డే కోసం సిడ్నీలోనే భారత జట్టు ఉండటం... భువనేశ్వర్‌కు గాయం కావడంతో... అనూహ్యంగా ధోని... బుమ్రాను ఆడించాడు. ఆ మ్యాచ్‌లో చెలరేగిన ఈ యువ పేసర్... టి20లోనూ కంగారూలకు చుక్కలు చూపించాడు. ఫలితంగా కేవలం రెండే మ్యాచ్‌ల్లో భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా మారాడు.
మూడేళ్ల క్రితం ఐపీఎల్‌లో బుమ్రా తొలి మ్యాచ్ ఆడే నాటికి అతనికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేదు. ముంబై ఇండియన్స్ కోచ్ జాన్‌రైట్ ప్రతిభాన్వేషణలో భాగంగా ‘వెరైటీ యాక్షన్’ అంటూ పట్టుకొచ్చి బెంగళూరుతో మ్యాచ్‌లో బరిలోకి దించారు. మొదటి నాలుగు బంతుల్లో కోహ్లి మూడు ఫోర్లు బాదాడు. దాంతో బెదిరిపోయిన బుమ్రా మైదానంలో సచిన్ సాయం కోరాడు.
‘ఎదురుగా ఎవరున్నారన్నది చూడకు. ఒక్క మంచి బంతి చాలు’ అంటూ మాస్టర్ ప్రోత్సహించాడు. ఐదో బంతి ఆఫ్ స్టంప్‌నుంచి వేగంగా లోపలికి దూసుకొచ్చింది. కోహ్లి ఎల్బీగా అవుటయ్యాడు. తర్వాతి ఏడాది ముంబై తరఫున 11 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు టీమిండియా తరఫున కూడా రెండు మ్యాచ్‌లలో చక్కటి ప్రదర్శనతో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు.
యార్కర్... యార్కర్...
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో కలిపి భారత పేసర్లు నాలుగు యార్కర్లు కూడా వేయలేదేమో! బుమ్రా తన ఒక్క ఓవర్లోనే ఐదు యార్కర్లు విసిరాడు. సాధారణంగా భారత పేసర్లనుంచి ఇది అనూహ్యం. అందుకే గవాస్కర్ కూడా యార్కర్ల విషయంలో బుమ్రాను చూసి నేర్చుకోవాలంటూ ఇషాంత్‌లాంటి సీనియర్లకు చురక అంటించారు. యాక్షన్‌లో చాలా వరకు మలింగను గుర్తుకు తెచ్చే అతను ముంబై ఇండియన్స్ జట్టు సహచరుడిగా అతడినుంచి ఈ విషయంలో ఎంతో నేర్చుకున్నాడు. యార్కర్ ఎలా వేయాలి, వేగంలో చేయాల్సిన మార్పులు... ఇలా చాలా అంశాలు లంక పేసర్ నేర్పించాడు.
దాంతో పాటు సంప్రదాయ బౌలర్‌గా ఎందుకుండాలి, యాక్షన్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా మలింగ ఇచ్చిన సూచనను బుమ్రా పాటించాడు. సహజంగానే అబ్బిన ఈ లక్షణం అతడిని అంచనా వేయడంలో ఇప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు సృష్టిస్తోంది. ఐదో వన్డేలో స్మిత్, అడిలైడ్ టి20లో వార్నర్‌లాంటి ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన అతను, రెండు సార్లు యార్కర్‌లతో ఫాల్క్‌నర్‌ను బౌల్డ్ చేసిన బంతులు సూపర్. 2/40, 3/23 బౌలింగ్ విశ్లేషణ కెప్టెన్ ధోనికి కూడా ఆనందం కలిగించడం ఒక యువ బౌలర్ కెరీర్‌కు మంచి ఆరంభం.
అమ్మను ఒప్పించి...
బుమ్రా తండ్రి ఏడేళ్ల వయసులోనే చనిపోయారు. తల్లి దల్జీత్ అతను చదువుతున్న స్కూల్‌లోనే జూనియర్ ప్రిన్సిపల్‌గా పని చేసేవారు. టెన్నిస్ బంతులతోనే యార్కర్లు విసిరిన అతడికి కోచ్ కిషోర్ త్రివేది (పేసర్ సిద్ధార్థ్ త్రివేది తండ్రి) స్కూల్ జట్టులో అవకాశం కల్పించి ప్రోత్సహించారు. 13 ఏళ్ల వయసులో అతను అండర్-16 ఆటగాళ్లను కూడా తన యార్కర్లతో బెదరగొట్టాడు.
దాంతో గుజరాత్ అండర్-16 జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే అద్భుత ప్రదర్శన తర్వాత కూడా అండర్-19 జట్టులో చోటు దక్కలేదు. దాంతో భవిష్యత్తు గురించి భయపడిన అతని తల్లి ‘క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోవద్దు. బాగా చదువుకో’ అనడంతో ఆటను ఆపినా...కొద్ది రోజులకే మళ్లీ క్రికెట్ వైపు వచ్చిన బుమ్రా ఈ సారి తల్లిని కూడా ఒప్పించి మైదానంలోకి అడుగు పెట్టాడు. మళ్లీ జోరు ప్రదర్శించి జట్టులోకి ఎంపిక కావడంతో అతని కెరీర్ మలుపు తిరిగింది. 2014లో ఐపీఎల్ తర్వాత కాలికి గాయంతో ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన బుమ్రా... ఈ ఏడాది రంజీ ట్రోఫీలో గుజరాత్ తరఫున 25.47 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. అయితే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శన అతడిని జాతీయ జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. కేవలం 16.09 సగటులో 21 వికెట్లు తీసి సీజన్ టాపర్‌గా నిలిచాడు. గుజరాత్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఈ పేసర్ ఫైనల్లో ఢిల్లీపై ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
జోరు కొనసాగించాలి
సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత వెనుకబడటం భారత పేసర్లు ఎంతో మందికి అనుభవంలోకి వచ్చిన విషయం. బుమ్రా స్వయంగా చెప్పినట్లు కనీసం ప్రస్తుతానికైతే తన యాక్షన్, యార్కర్లే తన బలం. అతని బౌలింగ్‌లో మంచి వేగం కూడా ఉంది. అయితే ఒక్కసారి ప్రత్యర్థి అతడి యాక్షన్‌ను అర్థం చేసుకుంటే అది బుమ్రా బలహీనతగా కూడా మారవచ్చు. కొంత కాలం తర్వాత మలింగలాంటి ఆటగాడికి కూడా ఇది తప్పలేదు! ఎప్పటికప్పుడు పేస్ సహా ఇతరత్రా తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకుంటూ, అనుభవంతో నేర్చుకుంటూ ఉంటే 22 ఏళ్ల బుమ్రా మరికొంత కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో తన హవా కొనసాగించవచ్చు.