భళా... బుమ్రా
ఆఖరి ఓవర్‌లో గెలిపించిన పేసర్
ఇంగ్లండ్‌పై రెండో టి20లో భారత్ గెలుపు
రాణించిన రాహుల్, నెహ్రా
సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించింది. రాహుల్ మినహా బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట.. బౌలర్లు మాత్రం స్ఫూర్తిదాయక ప్రదర్శనతో జట్టుకు కీలక విజయాన్ని అందించారు. ప్రారంభంలో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన నెహ్రా ఇంగ్లండ్ పతనానికి బాట వేయగా... ఆఖరి ఓవర్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు.
నాగ్‌పూర్: చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి కావాల్సిన పరుగులు 8... క్రీజులో ఉన్నది స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్‌తో పాటు బౌండరీలతో జోరు మీదున్న బట్లర్. భారత అభిమాని ఆశలు అడుగంటిన ఈ పరిస్థితిలో మీడియం పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమే చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్‌కు పంపించడంతోపాటు కేవలం రెండు పరుగులే ఇవ్వడంతో భారత జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా (3/28) కూడా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ 1–1తో సమం చేసింది. మూడో టి20 ఫిబ్రవరి 1న బెంగళూరులో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 71; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మనీష్ పాండే (26 బంతుల్లో 30; 1 సిక్స్), కోహ్లి (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 139 పరుగులు చేసి ఓడిపోయింది.
రాహుల్ ఒక్కడే: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. తొలి మూడు ఓవర్లలో ఐదు పరుగులే రాగా... నాలుగో ఓవర్‌లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్‌తో 15 పరుగులు రాబట్టి టచ్‌లోకి వచ్చాడు. అయితే మరుసటి ఓవర్‌లో జోర్డాన్ వేసిన స్లో బంతిని లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడి క్యాచ్ అవుటయ్యాడు. కొద్దిసేపటికే రైనా (7), యువరాజ్ (4) కూడా అవుట్ కావడంతో భారత్ 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మనీష్ పాండేతో కలిసి ఓపెనర్ రాహుల్ తన జోరును కొనసాగిస్తూ రన్‌రేట్ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు 36 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు.
నెహ్రా ఝలక్: స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు నాలుగో ఓవర్‌లోనే పేసర్ ఆశిష్ నెహ్రా గట్టి ఝలక్ ఇచ్చాడు.
అంతకుముందు ఓవర్‌లో ఓపెనర్లు బిల్లింగ్స్ (12), రాయ్ (10) చెరో సిక్స్ బాదినా నెహ్రా వీరిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో రూట్, మోర్గాన్ (17; 1 ఫోర్) పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. మిశ్రా వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో రూట్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే తన తర్వాతి ఓవర్ తొలి బంతికే మోర్గాన్ వికెట్ తీసి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత స్టోక్స్ రెచ్చిపోయి రైనా ఓవర్‌లో వరుసగా 4, 6.. చాహల్ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో బ్యాట్‌ను ఝళిపించాడు. నెహ్రా 17వ ఓవర్‌లో స్టోక్స్‌ను ఎల్బీగా అవుట్ చేయగా... 18వ ఓవర్‌లో బుమ్రా కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టడంతో పాటు చివరి ఓవర్‌లో మాయే చేసి అనూహ్య ఫలితాన్ని అందించాడు.