వన్డే వీరులెవరో..!  | first match between India and England today | Sakshi
Sakshi News home page

వన్డే వీరులెవరో..! 

Published Thu, Jul 12 2018 1:11 AM | Last Updated on Thu, Jul 12 2018 10:56 AM

first match between India and England today - Sakshi

ఏకంగా 31 సార్లు 300కు పైగా స్కోరు... 11 సార్లు 350కు పైగా... 3 సార్లు 400కు పైగా... గత వన్డే వరల్డ్‌ కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతి నుంచి ఇంగ్లండ్‌ జోరు ఇది. వన్డే ఆటకు కొత్త అర్థాన్ని చెబుతున్న మోర్గాన్‌ సేన ఒక వైపు... అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా ఎక్కడైనా సవాల్‌కు సిద్ధం అన్నట్లుగా చెలరేగిపోతూ వరుసగా ఆరు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న భారత్‌ మరోవైపు. సొంతగడ్డపై ఆడటం, అద్భుతమైన ఫామ్‌ ఇంగ్లండ్‌కు బలమైతే... ఇప్పటి వరకు మాలాంటి ప్రత్యర్థి మీకు ఎదురు కాలేదన్నట్లుగా టి20 సిరీస్‌లో విజయంతో చూపించిన దూకుడు కోహ్లి బృందం సొంతం. ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌–1 ఇంగ్లండ్, నంబర్‌–2 భారత్‌ మధ్య వన్డే వీరులెవరో తేలిపోయే సమరానికి నేడు తెర లేవనుంది.   

నాటింగ్‌హామ్‌: సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయంలో ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే వరల్డ్‌ కప్‌ ఆడనున్న భారత్‌కు అక్కడి పరిస్థితులు, పిచ్‌లపై ఒక అంచనాకు వచ్చేందుకు, తమ బలగాన్ని పరీక్షించుకునేందుకు ఇది సదవకాశం. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో నేడు భారత్, ఇంగ్లండ్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఇప్పటికే టి20 సిరీస్‌ గెలుచుకున్న టీమిం డియా ఇక్కడా విజయం సాధించాలని పట్టుదలతో ఉండగా, వన్డేల్లో ఇటీవలి తమ ధాటిని కొనసాగించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. 2014లో ఇక్కడ ఆడిన తమ చివరి పర్యటనలో భారత్‌ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.  

నాలుగో స్థానంలో కోహ్లి!  
టి20 సిరీస్‌లో విజయం సాధించిన తర్వాత వన్డేల కోసం కూడా భారత జట్టులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. దాదాపు అదే జట్టు ఇక్కడా కొనసాగవచ్చు. కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌ను బట్టి చూస్తే అతని కోసం కోహ్లి మరోసారి నాలుగో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. రోహిత్‌ శర్మ ఊపు మీదుండగా, ధావన్‌ ఫామ్‌ కొంత ఇబ్బందిగా మారింది. అయితే వన్డేల్లో ధావన్‌ ప్రమాదకరమైన ఆటగాడే కాబట్టి జట్టు బెంగ పడటం లేదు. టి20ల్లో అవకాశం దక్కని దినేశ్‌ కార్తీక్‌కు మిడిలార్డర్‌లో బ్యాట్స్‌మన్‌గా చోటు ఖాయమైంది. అతని కోసం రైనాను పక్కన పెట్టాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. చివరి ఓవర్లలో పాండ్యా, ధోని చెలరేగిపోగలరు. బౌలింగ్‌లో మరోసారి ఇద్దరు లెగ్‌స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టగలరు. పేస్‌లో ఉమేశ్‌కు చోటు ఖాయం కాగా, భువనేశ్వర్‌ కోలుకోకపోతే శార్దుల్‌ జట్టులోకి వస్తాడు. చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఆడిన 26 వన్డేల్లో 21 గెలవడం భారత్‌ ఫామ్‌కు సూచిక.  

హేల్స్‌ స్థానంలో స్టోక్స్‌!  
ఇటీవలే ఆస్ట్రేలియాను 5–0తో చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని కోరుకుంటోంది. ఓపెనర్లు జేసన్‌ రాయ్, బెయిర్‌ స్టో  ఇటీవల వందకు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్నారు. 864 పరుగులతో బెయిర్‌ స్టో 2018లో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతుండగా, జేసన్‌ రాయ్‌ మూడు సెంచరీలు బాదాడు. రూట్‌ చక్కటి వన్డే ఆటగాడు కాగా, మోర్గాన్‌ బ్యాటింగ్‌ కూడా కీలకం. ఐపీఎల్‌ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బట్లర్‌ ఈసారి మిడిలార్డర్‌లో తన సత్తా ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఆసీస్‌తో వన్డేలు ఆడని ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు ఇప్పుడు నేరుగా జట్టులో చోటు ఖాయం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో హిట్టర్‌ హేల్స్‌ను ఇంగ్లండ్‌ పక్కన పెట్టాల్సి వస్తోంది. బౌలింగ్‌ కొంత బలహీనంగా కనిపిస్తున్నా... బ్యాటింగ్‌ బలంతో దానిని అధిగమించగలమని ఇంగ్లండ్‌ నమ్ముతోంది. గత ఏడాది కాలంలో ఆడిన 21 వన్డేల్లో ఇంగ్లండ్‌ 4 మాత్రమే ఓడింది.  

పిచ్, వాతావరణం 
ఇంగ్లండ్‌లో ఇది నడి వేసవి. పొడిబారిన పిచ్‌ సిద్ధం. కాబట్టి పరుగుల వరద ఖాయం. ఇంగ్లండ్‌ రెండు వరల్డ్‌ రికార్డు స్కోర్‌లు (444, 481) గత రెండు మ్యాచ్‌లలో ఇదే మైదానంలో వచ్చాయి.  
సాయంత్రం గం. 5 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లో ప్రత్యక్ష ప్రసారం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement