'లయన్' ముందు లేడి కూనల్లా... | Nathan Lyon Helps Australia Dominate Day 1 | Sakshi
Sakshi News home page

'లయన్' ముందు లేడి కూనల్లా...

Published Sun, Mar 5 2017 12:56 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

'లయన్' ముందు  లేడి కూనల్లా...

'లయన్' ముందు లేడి కూనల్లా...

బెంబేలెత్తిన భారత బ్యాట్స్‌మెన్‌ 
తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌట్‌ 
నాథన్‌ లయన్‌కు 8 వికెట్లు  
ఆస్ట్రేలియా 40/0  



కోహ్లి మాట తప్పాడు. పుణేలాంటి చెత్త ఆటను మళ్లీ చూపించబోమని హామీ ఇస్తున్నానని చెప్పిన అతను దాదాపు అదే సినిమాను మళ్లీ చూపించాడు. జట్టు పేలవంగా కుప్పకూలడమే కాదు, కోహ్లి కూడా ‘బ్యాట్‌ ఎత్తేసి’ మరీ ప్రత్యర్థికి దారి చూపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ తమ కెప్టెన్‌ను అనుసరించారంతే!

పిచ్‌ తొలి టెస్టులో ఉన్నంత ప్రమాదకరంగా లేదు. బ్యాటింగ్‌కు స్వర్గధామం కాకపోయినా, మరీ 200 పరుగులు కూడా చేయలేనంత ఘోరంగా కూడా ఏమీ లేదు. కాస్త జాగ్రత్తగా ఆడితే పరుగులు సాధించవచ్చని రాహుల్‌ చూపిస్తే... మిగతా వారంతా కలిసి రాహుల్‌ చేసినన్ని పరుగులు కూడా చేయలేదు.

గత మ్యాచ్‌ హీరో ఒకీఫ్‌ను అతి జాగ్రత్తగా ఎదుర్కోవడంపై మనోళ్లు దృష్టి పెడితే... మనం పట్టించుకోని మరో స్పిన్నర్‌ లయన్‌ ఈసారి మన బ్యాట్స్‌మెన్‌ పాలిట ‘సింహ’ స్వప్నంలా మారాడు. ఒకదాని తర్వాత మరో వికెట్‌... ఒక రికార్డు తర్వాత మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న లయన్‌ వేటకు భారత ఆటగాళ్లు జింకల్లా బెదిరిపోయారు.

బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు రెండు సెషన్ల దూరంలో ఉన్నామని స్మిత్‌ చెబితే కోహ్లి నవ్వేశాడు! కానీ తొలి ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ప్రారంభించి ఆసీస్‌ ఇప్పటికే పట్టుదలను ప్రదర్శించింది. లయన్‌ తరహాలోనే రెండో రోజు అశ్విన్‌ ఆఫ్‌ స్పిన్‌ తిరిగితే సరి... లేదంటే ఆదివారం సాయంత్రానికి మ్యాచ్‌ ఆసీస్‌ చేతుల్లోకి వచ్చేసినట్లే!  

బెంగళూరు: భారత బ్యాటింగ్‌ వ్యథ తీరలేదు. మరో మ్యాచ్‌లో కూడా మన స్టార్ల ‘స్పిన్‌’ వేదన అలాగే కొనసాగింది. ఫలితంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజే టీమిండియాకు భంగపాటు ఎదురైంది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 71.2 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లి సేన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. కేఎల్‌ రాహుల్‌ (205 బంతుల్లో 90; 9 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ (8/50) భారత గడ్డపై అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అనంతరం ఆసీస్‌ ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. వార్నర్‌ (23 బ్యాటింగ్‌), రెన్‌షా (15 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.

సెషన్‌–1:   రాహుల్‌ నిలకడ
భుజం గాయం కారణంగా విజయ్‌ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... అతని స్థానంలో ముకుంద్‌ను, జయంత్‌కు బదులుగా బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ను భారత్‌ తుది జట్టులోకి తీసుకుంది. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టి రాహుల్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా, ఆ తర్వాత స్టార్క్, హాజల్‌వుడ్‌ చక్కటి బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేశారు. భారత్‌ ఎదుర్కొన్న తొలి 12 ఓవర్లలో 6 మెయిడిన్‌లే ఉన్నాయి. ఐదున్నరేళ్ల తర్వాత టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ముకుంద్‌ (0) ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. 30 పరుగుల వద్ద షార్ట్‌లెగ్‌లో కష్టసాధ్యమైన క్యాచ్‌ను హ్యాండ్స్‌కోంబ్‌ వదిలేయడంతో రాహుల్‌ బతికిపోయాడు. అయితే క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇబ్బంది పడ్డ పుజారా (17) మరోసారి తక్కువ స్కోరు వెనుదిరిగాడు.
ఓవర్లు: 27.5, పరుగులు: 72: వికెట్లు: 2

సెషన్‌–2:   కోహ్లి విఫలం
లంచ్‌ తర్వాత 105 బంతుల్లో రాహుల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. కానీ లయన్‌ వేసిన బంతికి కోహ్లి (12) వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్‌కు షాక్‌ తగిలింది. తడబడుతూనే ఆడిన రహానే (17) కూడా ఎక్కువసేపు నిలవలేక లయన్‌ బౌలింగ్‌లో అనూహ్యంగా స్టంపౌ టయ్యాడు. ‘ట్రిపుల్‌ సెంచరీ’ మ్యాచ్‌ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన కరుణ్‌ నాయర్‌ (39 బంతుల్లో 26; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడినా... ఒకీఫ్‌ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చే సాహసం చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో పట్టుదలగా నిలబడిన రాహుల్‌ మాత్రం సమస్య లేకుండా చకచకా పరుగులు చేస్తూ పోయాడు.
ఓవర్లు: 31.1, పరుగులు: 96, వికెట్లు: 3

Üషన్‌–3:    టపటపా
టీ విరామం తర్వాత భారత బ్యాటింగ్‌ ఎంతోసేపు సాగలేదు. 14 పరుగుల వ్యవధిలో అశ్విన్‌ (7), సాహా (1), జడేజా (3) వెనుదిరిగారు. సెంచరీకి చేరువగా వచ్చినా... మరో ఎండ్‌ నుంచి సహకారం లేకపోవడంతో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో రాహుల్‌ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. మరుసటి బంతికే ఇషాంత్‌ (0) పని పట్టిన లయన్‌ భారత్‌ ఆట కట్టించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను వార్నర్, రెన్‌షా జాగ్రత్తగా ప్రారంభించారు. ఎంత ప్రయత్నించినా భారత్‌ తొలి రోజు వికెట్‌ తీయడంలో విఫలమైంది. కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా ఆసీస్‌ ఓపెనర్లు ప్రమాదం లేకుండా రోజును ముగించారు. 9 పరుగుల వద్ద ఇషాంత్‌ బౌలింగ్‌లో వార్నర్‌ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో రహానే వదిలేయడం ఆట ముగింపు సమయంలో భారత్‌ను మరింతగా బాధ పెట్టింది.
ఓవర్లు: 12.2, పరుగులు: 21, వికెట్లు: 5 (భారత్‌)
ఓవర్లు: 16, పరుగులు: 40, వికెట్లు: 0 (ఆస్ట్రేలియా)


కోహ్లి ఆర్ట్‌ ఆఫ్‌ ‘లీవింగ్‌’  
కోహ్లి మళ్లీ అదే చేశాడు... పుణే టెస్టులో ఒకీఫ్‌ బంతిని ఆడకుండా వదిలేసి క్లీన్‌బౌల్డ్‌ అయిన అతను ఈసారి లయన్‌కు అలాగే వికెట్‌ అందించాడు. నేరుగా వచ్చిన బంతి గమనాన్ని పొరబడి షాట్‌ ఆడకుండా బ్యాట్‌ ఎత్తాడు. బంతి ప్యాడ్‌కు తగలగానే మరో సందేహం లేకుండా అంపైర్‌ అవుట్‌గా ప్రకటించేశారు. అంతకుముందు లయన్‌ బంతులు అనూహ్యంగా టర్న్‌ కావడం, ఒక బంతి ఎక్కువగా బౌన్స్‌ అయి అతని ప్యాడ్‌ పైభాగంలో కూడా తగలడం కూడా జరిగాయి. దాంతో ఇది కూడా టర్న్‌ కావచ్చని అతను వేసిన అంచనా తప్పింది. పుణే టెస్టులో నేరుగా వెళుతుందనుకున్న ఒకీఫ్‌ బాల్‌ టర్న్‌ కాగా, ఈసారి బాల్‌ నేరుగా వచ్చింది. ఇలాంటి బంతికి తాను కచ్చితంగా అవుట్‌ అని కనిపిస్తున్నా కూడా ఆశగా రాహుల్‌ను సంప్రదించి మరీ కోహ్లి రివ్యూ కోరడం కూడా ఆశ్చర్యకరంగా అనిపించింది. అయితే భారీ స్క్రీన్‌పై రీప్లే చూపించగానే అంపైర్‌ నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండా కోహ్లి నిష్క్రమించాడు!  

ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈ రోజు నేను చాలా అదృష్టవంతుడిని. పిచ్‌పై కొన్ని చోట్ల ఉన్న పగుళ్ళపై పదే పదే బౌలింగ్‌ చేశాను. భారత్‌లో ఎలా బౌలింగ్‌ చేయాలో దుబాయ్‌లో బాగా ప్రాక్టీస్‌ చేశాం. సాధనలో నేను కనీసం 1200 బంతులు విసిరాను. గత మ్యాచ్‌ తర్వాత మాలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి ఇది సూచన. అశ్విన్‌ వీడియోలను చాలా చూశాను కానీ నాదైన శైలిలోనే బౌలింగ్‌ చేశాను. ఉపఖండంలో ఎలా బౌలింగ్‌ చేయాలో లంక స్పిన్నర్‌ హెరాత్‌నుంచి నేర్చుకున్న సూచనలు పనికొచ్చాయి. కోహ్లిలాంటి స్టార్‌ ఆటగాడి వికెట్‌ తీయడమే నాకు అమిత సంతృప్తినిచ్చిన క్షణం. నాకు తగిన టర్న్‌ కూడా లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇలాంటి ప్రదర్శనే ఇచ్చి జట్టును గెలిపించాలని కోరుకుంటున్నా.        
 – లయన్, ఆసీస్‌ బౌలర్‌

ఆరంభంలో బంతి చక్కగా బ్యాట్‌పైకి వచ్చింది. ఆ తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగాకే పరిస్థితి మారింది. అయితే మా జట్టులోనూ అశ్విన్‌లాంటి అగ్రశ్రేణి బౌలర్‌ ఉన్నాడు. రెండో రోజు ఆరంభంలో ఒకటి రెండు వికెట్లు తీయగలిగితే ఆ తర్వాత  ఆసీస్‌ను అతను సునాయాసంగా కుప్పకూల్చగలడు. మాకు ఆ నమ్మకముంది. తొలి రోజు జడేజా పెద్దగా బౌలింగ్‌ చేయలేదు కానీ అతను కూడా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఆఫ్‌ స్టంప్‌పై కచ్చితత్వంతో బౌలింగ్‌ చేయగలిగితే మరిన్ని వికెట్లు లభిస్తాయి.
– రాహుల్, భారత బ్యాట్స్‌మన్‌

1 భారత గడ్డపై ఒక విదేశీ బౌలర్‌ ఇచ్చిన అత్యుత్తమ ప్రదర్శన లయన్‌ (8/50)దే. గతంలో క్లూస్‌నెర్‌ (8/64) పేరిట ఈ రికార్డు ఉంది. మొత్తంగా ఏ బౌలర్‌కైనా భారత్‌లో ఇది నాలుగో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.

40 భారత్‌ వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో 200 పరుగుల లోపు ఆలౌట్‌ కావడం 40 ఏళ్ల తర్వాత (1977) ఇదే తొలిసారి.

        
1 భారత్‌పై అత్యధిక వికెట్లు (58) తీసిన ఆసీస్‌ బౌలర్‌గా లయన్‌ నిలిచాడు. అతను  భారత్‌పై 12 టెస్టులు ఆడగా, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది నాలుగోసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement