తలవంచారు...
బ్యాటింగ్‌లో మెరుపులు లేవు, మొదటి బంతినుంచే వినోదాన్ని పంచే ధనాధన్ షాట్లు అసలే లేవు... రిపబ్లిక్ డే నాడు పరుగుల మోతతో పండగ చేసుకుందామనుకున్న భారత అభిమానులను పూర్తిగా నిరాశ పరిచే ఫలితం... అతి సాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన భారత్‌కు టి20 తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భంగపాటు... టెస్టు, వన్డే సిరీస్ విజయాల జోరులో ఉన్న కెప్టెన్ కోహ్లికి నాయకత్వం వహించిన తొలి మ్యాచ్‌లోనే పరాజయం...
కోహ్లి ఓపెనింగ్ చేసినా ఆరంభం అంతంత మాత్రమే... మూడు ఓవర్ల వ్యవధిలో ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు... ఒక దశలో వరుసగా ఏడు ఓవర్లలో కలిపి వచ్చిన పరుగులు 37 మాత్రమే... రైనా పర్వాలేదనిపించినా, ధోని చివర్లో కొన్ని పరుగులు జోడించినా అదీ అల్ప సంతోషమే... భారత బ్యాట్స్‌మెన్ స్థాయికి తగిన ప్రదర్శన ఎక్కడా కనిపించకపోగా, ఇంగ్లండ్ బౌలర్ల క్రమశిక్షణ ఇన్నింగ్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది.
సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తమ ఆటతో మరింత చిన్నదిగా మార్చేశారు. ఏమాత్రం తడబాటు లేకుండా అలవోకగా మన బౌలింగ్‌ను ఎదుర్కొన్న ప్రత్యర్థి సిరీస్‌లో ముందంజ వేసింది. కెప్టెన్ మోర్గాన్ సిక్సర్ల మోతకు తోడు రూట్ సాధికారిక బ్యాటింగ్ కలిసి ఇంగ్లండ్‌కు 11 బంతుల ముందే విజయాన్ని అందించింది.
కాన్పూర్: భారత్‌తో టి20 సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్‌లో విజయంతో ఆ జట్టు సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. గురువారం ఇక్కడి గ్రీన్‌పార్క్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ధోని (27 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు), సురేశ్ రైనా (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొయిన్ అలీ 2 కీలక వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్ (38 బంతుల్లో 51; 1 ఫోర్, 4 సిక్సర్లు), జో రూట్ (46 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 69 బంతుల్లో 83 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం నాగపూర్‌లో జరుగుతుంది.
ఆదుకున్న రైనా, ధోని...
భారత్ ఇన్నింగ్స్ చెప్పుకోదగ్గ మెరుపులు లేకుండా ఆసాంతం సాదాసీదాగా సాగింది. ఒక ఓవర్లో అత్యధికంగా 12 పరుగులే (20వ ఓవర్) భారత్ రాబట్టగలిగింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి (26 బంతుల్లో 29; 4 ఫోర్లు) ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా, రెండో ఎండ్‌లో రాహుల్ (8) విఫలమయ్యాడు. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న రైనా, వరుస ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 47 పరుగులకు చేరింది. అయితే అలీ తన తొలి ఓవర్లోనే కోహ్లిని పెవిలియన్ పంపించి భారత్‌ను దెబ్బ తీయగా, షార్ట్ బాల్‌ను ఆడలేక యువరాజ్ (12) వెనుదిరిగాడు. మరో వైపు స్టోక్స్ బౌలింగ్‌లో ఈ ఇన్నింగ్స్‌లో ఏకైక సిక్సర్ బాదిన రైనా, తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాండే (3), పాండ్యా (9) కూడా విఫలం కావడంతో భారీ స్కోరు అందించాల్సిన బాధ్యత ధోనిపై పడింది. అయితే సింగిల్స్‌పైనే ఎక్కువగా (14) ఆధారపడిన ధోని, చివరి ఓవర్లో మాత్రం వరుసగా రెండు ఫోర్లు కొట్టి స్కోరును 147 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్‌తో రసూల్ భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేశాడు.
మోర్గాన్ సిక్సర్ల వర్షం...
స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు రాయ్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), బిల్లింగ్స్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్లో నెహ్రా 4 పరుగులే ఇచ్చినా... బుమ్రా వేసిన రెండో ఓవర్లో బిల్లింగ్స్ 3 ఫోర్లు, సిక్సర్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. అయితే తొలి 3 ఓవర్లలో 36 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. తర్వాతి ఐదు ఓవర్లలో 26 పరుగులే ఇచ్చారు. చహల్ తన తొలి ఓవర్లోనే రాయ్, బిల్లింగ్స్‌లను బౌల్డ్ చేయడం విశేషం. అయితే ఈ తర్వాత ఇంగ్లండ్ మరో అవకాశం ఇవ్వకుండా ఆడింది. మోర్గాన్ తనదైన శైలిలో సిక్సర్లతో చెలరేగగా, రూట్ అతనికి అండగా నిలిచాడు. రసూల్ ఓవర్లో భారీ సిక్సర్‌తో 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్, అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయినా, అది నోబాల్ కావడంతో బతికిపోయిన రూట్... స్టోక్స్ ( నాటౌట్)తో కలిసి మిగతా పని పూర్తి చేశాడు.