బెంగళూరును చెన్నై చుట్టేసింది | CSK Beat RCB By 7 Wickets | Sakshi
Sakshi News home page

బెంగళూరును చెన్నై చుట్టేసింది

Published Sun, Mar 24 2019 1:13 AM | Last Updated on Sun, Mar 24 2019 5:15 AM

CSK Beat RCB By 7 Wickets  - Sakshi

ఎంత ‘పొట్టి’ క్రికెటైతే మాత్రం ఎప్పుడు మెరుపులేనా? బ్యాట్లే ఝళిపించాలా? బంతులు బౌండరీని దాటాలా? బౌలర్లకే చుక్కల్ని చూపించాలా? వారే బలికావాలా..! అని అనుకుందేమో ఐపీఎల్‌. అందుకే ఈ సీజన్‌ ఆరంభం భారీ షాట్లతో, వీర విధ్వంసంతో కాకుండా బౌలర్ల చాణక్యంతో మొదలైంది. చెన్నై స్పిన్నర్లు కనికట్టుతో... మూకుమ్మడిగా పనిపట్టడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కుదేలైంది. స్పిన్‌తో మొదలుపెట్టి,  బెంగళూరును నిర్ణీత ఓవర్లకు ముందే చెన్నై చుట్టేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై ‘సూపర్‌ కింగ్స్‌’లా బోణీ కొట్టేసింది.  

చెన్నై: ఐపీఎల్‌ అంటే ధనాధన్‌ షాట్లు... ఫటాఫట్‌ మెరుపులు... కానీ ఆనవాయితీకి భిన్నంగా, విధ్వంసానికి విరుద్ధంగా 12వ సీజన్‌ మొదలైంది. కోహ్లి, డివిలియర్స్‌లాంటి బ్యాటింగ్‌ హేమాహేమీలున్న జట్టుపై ధోని సేన స్పిన్‌తో విన్నయింది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. పార్థివ్‌ పటేల్‌ (35 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌. హర్భజన్, ఇమ్రాన్‌ తాహిర్‌ చెరో 3 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి. తర్వాత చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (42 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. హర్భజన్‌ సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

ఇలా మొదలై... అలా ఆలౌటై 
బెంగళూరు ఇన్నింగ్స్‌లో పరుగులు, ఫోర్లు, సిక్సర్ల కన్నా నిలువెత్తు నిర్లక్ష్యమే నిండుగా కనిపించింది. బాధ్యత తీసుకునేందుకంటే వికెట్లను పారేసుకునేందుకే బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి వచ్చారనిపించింది. ఒకరిని మించి ఒకరు పెవిలియన్‌ చేరేందుకు అదేపనిగా పోటీపడ్డారు. పతనం కెప్టెన్‌ కోహ్లితో మొదలైంది. దీనికి మొయిన్‌ అలీ వికెట్‌ జతయ్యింది. ఇంకాసేపటికి డివిలియర్స్‌ వికెట్టూ పడింది. అయినా బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ కళ్లు తెరవలేదు. ఆ మూడు  వికెట్లూ వన్నె తగ్గిన వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ తీశాడని, పిచ్‌ స్పిన్‌కు వశమైందని దీంతో ఇక పదును ఉన్న ఇమ్రాన్‌ తాహిర్, జడేజాల బౌలింగ్‌ కష్టమని ఏ ఒక్కరూ అంచనాకు రాలేదు. వచ్చారు... ఆడారు... ఔటయ్యారు... అంతే! పరుగుల హోరులో జరగాల్సిన మ్యాచ్‌ వికెట్ల జోరుకు విలవిల్లాడింది. ఒక్కరంటే ఒక్కరు మూడు పదులైనా చేయలేదు. 10 మంది పదేసి చొప్పున కూడా పరుగులు చేయలేకపోయారు. అదేం చిత్రమో గానీ క్యాచ్‌ మిస్సయితే తర్వాతి బంతికి క్యాచ్‌ ఇచ్చి వెళ్లడం డివిలియర్స్‌కు చెల్లితే... రనౌట్‌ నుంచి తప్పించుకొని మళ్లీ మరుసటి బంతికే రనౌట్‌ కావడం హెట్‌మైర్‌కే సాధ్యమైంది.  

భజ్జీ భల్లే భల్లే... 
టాస్‌ నెగ్గిన చెన్నై కెప్టెన్‌ ధోని బౌలింగ్‌ ఎంచుకోగా... బెంగళూరు ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ కోహ్లి, పార్థివ్‌ పటేల్‌తో కలిసి ప్రారంభించాడు. మైదానంలోకి దిగిన ఆటగాళ్లను ఇంకా గుర్తుపట్టకముందే... చెన్నై బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ పనిపట్టారు. నాలుగో ఓవర్లో కోహ్లి (6) ఔటయ్యాడు. ఆరో ఓవర్లో మొయిన్‌ అలీ (9; 1 సిక్స్‌), 8వ ఓవర్లో డివిలియర్స్‌ (9) పెవిలియన్‌ చేరారు. ఈ ముగ్గురినీ హర్భజన్‌ సింగే ఔట్‌ చేశాడు. 8వ ఓవర్‌ రెండో బంతికి బెంగళూరు స్కోరు 38/3. ఈ ఓవర్‌ ముగిసేసరికి ఒక పరుగు వచ్చింది. మరో వికెట్‌ కూడా పడింది. హెట్‌మైర్‌ (0) రనౌట్‌. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ కూడా పిచ్‌ను పసిగట్టలేదు. స్పిన్నర్లను జాగ్రత్తగా ఎదుర్కోలేదు. క్రీజులో నిలబడే సాహసం చేయలేదు. ఓపెనర్‌ పార్థివ్‌ సరైన భాగస్వామి కోసం చూస్తుండగానే వచ్చినవారు వచ్చినట్లే ఔటయ్యారు. ఇమ్రాన్‌ తాహిర్‌ స్పిన్‌కు శివమ్‌ దూబే (2), నవ్‌దీప్‌ సైనీ (2), చహల్‌ (4) తలవంచారు. గ్రాండ్‌హోమ్‌ (4)ను, చివర్లో ఉమేశ్‌ (1)ను రవీంద్ర జడేజా పెవిలియన్‌ చేర్చితే,   పార్థివ్‌ వికెట్‌ తీసి బ్రేవో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.  

చెన్నై జాగ్రత్తగా... 
ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినా ఒక్క వికెట్‌ పడగానే చెన్నై జాగ్రత్త పడింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్‌ వాట్సన్‌ (0) చహల్‌ బౌలింగ్‌లో డకౌట్‌ కాగానే స్పిన్‌ తడాఖా తెలుసుకున్న సూపర్‌ కింగ్స్‌ నింపాదిగా ఆడింది. మరో ఓపెనర్‌ రాయుడు, రైనా (21 బంతుల్లో 19; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. పదో ఓవర్లో జట్టు స్కోరు 40 పరుగుల వద్ద రైనా కూడా మొయిన్‌ అలీ స్పిన్‌కే వెనుదిరిగాడు. కాసేపటికి రాయుడు ఔటయినప్పటికీ చెన్నై గెలిచే స్థితిలో నిలిచింది. మిగతా లాంఛనాన్ని జాదవ్‌ (13 నాటౌట్‌; 1 ఫోర్‌), జడేజా (6 నాటౌట్‌) పూర్తి చేశారు. వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద సురేశ్‌ రైనా ఐపీఎల్‌ చరిత్రలో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement