బెంగళూరుకు తొలిసారి అదృష్టం కలిసి వచ్చింది. చివరి బంతికి గెలుపు రుచి చూసింది. విజయానికి 6 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన స్థితిలో చెన్నై గెలుపు అసాధ్యమే అనుకున్నారంతా... కానీ ఉమేశ్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్లో ధోని వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 2, 6తో 24 పరుగులు పిండుకున్నాడు. ఉత్కంఠ తారాస్థాయికి చేరగా... చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని షాట్ గురి తప్పడం... పరుగు కోసం ప్రయత్నించడం... బెంగళూరు కీపర్ పార్థివ్ డైర్టెక్ హిట్‌తో శార్దుల్‌ను రనౌట్ చేయడం... బెంగళూరు విజయం ఖాయమవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ గెలుపుతో ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఎదురైన ఓటమికి బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది.
బెంగళూరు: పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి బతికిపోయింది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆఖరి బంతికి ఒక పరుగు తేడాతో ‘టేబుల్ టాపర్’ చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలుపొంది లీగ్‌లో మూడో విజయాన్ని దక్కించుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పార్థివ్ పటేల్ (37 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ కోహ్లి (9), ఏబీ డివిలియర్స్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించలేకపోయారు. మొయిన్ అలీ (16 బంతుల్లో 26; 5 ఫోర్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. ధోని (48 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ వృథా అయింది.
ఏబీ, కోహ్లి విఫలం...
అరుదైన రీతిలో కెప్టెన్ కోహ్లి... ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా పార్థివ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అక్ష్‌దీప్ నాథ్ (20 బంతుల్లో 24, ఫోర్, సిక్స్), స్టొయినిస్ (14) పరవాలేదనిపించారు. క్రీజులోకి వస్తూనే బౌండరీతో దూకుడు కనబరిచిన అలీ చివర్లో విలువైన పరుగుల్ని జోడించాడు.
నిలిచిన పార్థివ్...
రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్‌ను ఈసారి ఓపెనర్ పార్థివ్ నిలబెట్టాడు. ఠాకూర్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన అతను జడేజా బౌలింగ్‌లోనూ డీప్ మిడ్ వికెట్ మీదుగా మరో సిక్సర్‌తో అలరించాడు. తాహిర్ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో జోరు పెంచాడు. సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసిన అతను వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరును పెంచాడు. బ్రేవో బౌలింగ్ (16వ ఓవర్)లో బౌండరీ బాది మరుసటి బంతికి ఔటయ్యాడు.
ధోని అర్ధసెంచరీ...
లక్ష్యఛేదనలో చెన్నై టాపార్డర్ విఫలమైంది. వాట్సన్ (5), డు ప్లెసిస్ (5), రైనా (0) క్రీజులో నిలవలేకపోయారు. జాదవ్ (9) కూడా నిరాశ పరచడంతో 28 పరుగులకే 4 కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడు, ధోని ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ ధోని స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఉమేశ్ బౌలింగ్‌లో 6, 4తో జోరు పెంచిన రాయుడును చహల్ ఔట్ చేశాడు. ఈ దశలో ధోని, జడేజా (12 బంతుల్లో 11) సింగిల్స్ తీయడంతో స్కోరు వేగం మందగించింది. 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ధోని జట్టును గెలిపించేందుకు తీవ్రంగా కృషిచేశాడు. జడేజా, బ్రేవో (5) పెవిలియన్ చేరినా... ధోని చివరి వరకు పోరాడాడు. కానీ విజయాన్ని అందించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment