
అవును మరి తలైవా ధోని అంటే ఏమనుకున్నారు. చెన్నైతో ఆడేటప్పుడు కేవలం పిచ్ ఎఫెక్ట్ మాత్రమే..
చెన్నై : ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న చెన్నై కెప్టెన్ ధోని(75 నాటౌట్; 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన మిస్టర్ కూల్‌కు రైనా(36), బ్రేవో(27) తోడవడంతో చెన్నై వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.
కాగా ఆరో ఓవర్లో రాజస్తాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ధోని డిఫెన్సివ్‌గా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జోఫ్రా సంధించిన బంతి ధోని పాదాలను తాకి స్టంప్స్ దిశగా వెళ్లింది. ఆ సమయంలో స్లిప్‌లో ఉన్న స్మిత్‌తో పాటు రాజస్తాన్ ఆటగాళ్లు కూడా ఎగ్జైట్‌మెంట్‌కు లోనయ్యారు. అయితే బంతి స్టంప్స్‌ను తాకినప్పటికీ బెయిల్స్ మాత్రం కిందపడలేదు. దీంతో ధోనికి లైఫ్ లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేయడంతో పాటు.. ‘ తాలా ధోని ఎఫెక్ట్? బెయిల్స్ కూడా కిందపడటానికి నిరాకరించిన వేళ ’అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియోకు ఫిదా అయినా ధోని అభిమానులు.. ‘అవును మరి తలైవా ధోని అంటే ఏమనుకున్నారు. చెన్నైతో ఆడేటప్పుడు కేవలం పిచ్ ఎఫెక్ట్ మాత్రమే కాదు ధోని ఎఫెక్ట్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అని కామెంట్లు చేస్తున్నారు.
WATCH: Thala Dhoni effect? When even bails refused to fall
— IndianPremierLeague (@IPL) March 31, 2019
📹📹https://t.co/ccTyMBLToc #CSKvRR