శివమెత్తిన ధోని  | Chennai Super Kings beat Rajasthan Royals | Sakshi
Sakshi News home page

శివమెత్తిన ధోని 

Published Mon, Apr 1 2019 1:08 AM | Last Updated on Mon, Apr 1 2019 4:06 AM

Chennai Super Kings beat Rajasthan Royals - Sakshi

చెన్నై: చెన్నై సూపర్‌కింగ్స్‌ దూసుకెళుతోంది. ఐపీఎల్‌–12లో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన పోరులో సూపర్‌ కింగ్స్‌ 8 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ధోని (46 బంతుల్లో 75; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడగా... రైనా (32 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. రాజస్తాన్‌ బౌలర్‌ అర్చర్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది.  స్టోక్స్‌ (26 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. చహర్, శార్దుల్, బ్రేవో, తాహిర్‌ తలా 2 వికెట్లు తీశారు.  

పది ఓవర్లకు 55 పరుగులే 
టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ ఫీల్డింగ్‌కే మొగ్గుచూపింది. చెన్నై బ్యాటింగ్‌ తీరు,  పరుగుల ప్రయాస చూశాక రాయల్స్‌ నిర్ణయం 15 ఓవర్లదాకా సబబుగానే అనిపించింది. సూపర్‌కింగ్స్‌ ఓపెనర్లు, టాపార్డర్‌ విఫలమైంది. రాయుడు ఒక పరుగుకే ఔట్‌. అప్పుడు జట్టు స్కోరు కూడా ఒకటే! మరో ఓపెనర్‌ వాట్సన్‌ (13 బంతుల్లో 13) ఒక్కో ఫోర్, సిక్సర్‌తో తన ధాటిని రుచి చూపించాడు. కానీ జోరు అప్పటికప్పుడే ముగిసింది. 14 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన చెన్నైకి కేదార్‌ జాదవ్‌ (8)రూపంలో మరో షాక్‌ ఎదురైంది. అంతే 27 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై 50 పరుగులు చేసేందుకు పదో ఓవర్‌దాకా ఆడాల్సి వచ్చింది. మొత్తానికి తొలి సగం ఓవర్లు ముగిసేసరికి చెన్నై 3 వికెట్లకు 55 పరుగులు చేసింది. ఇది టి20ల్లో చాలా తక్కువ స్కోరు. 60 బంతులాడి ఆరే ఫోర్లు కొట్టింది.  

ధోని దూకుడు 
రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 17 ఓవర్లు ముగిసేదాకా చెన్నై స్కోరు 115/4. కానీ రెండే ఓవర్లు సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌ను మలుపుతిప్పాయి. అప్పటిదాకా నింపాదిగా ఆడుతున్న ధోని ధనాధన్‌ మొదలుపెట్టాడు. కులకర్ణి వేసిన 18వ ఓవర్లో ధోని సిక్స్, బ్రేవో ఫోర్, సిక్స్‌ కొట్టడంతో పాటు నోబాల్, వైడ్‌ కలుపుకొని 24 పరుగులు వచ్చాయి. అర్చర్‌ 19వ ఓవర్లో 8 పరుగులిచ్చి బ్రేవో (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ తీశాడు. ఇక మిగిలింది ఒకే ఓవర్‌. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో ధోని చెలరేగాడు. మొదట జడేజా సిక్సర్‌ బాదగా... ధోని చివరి 3 బంతుల్ని 6, 6, వైడ్, 6గా బాదేశాడు. 28 పరుగులు రావడంతో చెన్నై భారీస్కోరు చేయగలిగింది. 

రాయల్స్‌ చెన్నైలాగే... 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఆట కూడా చెన్నై తరహాలోనే మొదలైంది. ఖాతా తెరవకముందే రహానే (0)ను, 14 పరుగుల వద్ద సంజూ సామ్సన్‌ (8), బట్లర్‌ (6) వికెట్లను చేజార్చుకుంది. ఈ దశలో రాహుల్‌ త్రిపాఠి, స్టీవ్‌ స్మిత్‌ జాగ్రత్తగా ఆడారు. నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించాక... త్రిపాఠి ఇన్నింగ్స్‌కు తాహిర్‌ రిటర్న్‌ క్యాచ్‌తో తెరదించాడు. దీంతో 75 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ పడింది. ఆ తర్వాత స్మిత్‌కు స్టోక్స్‌ జతయినా మెరుపులు తక్కువయ్యాయి. జట్టు స్కోరు వంద పరుగులకు ముందే స్మిత్‌ (30 బంతుల్లో 28; 2 ఫోర్లు) వికెట్‌ను తాహిరే పడగొట్టడంతో రాజస్తాన్‌ కష్టాలు పెరిగాయి. అయితే స్టోక్స్‌కు జతయిన ఆర్చర్‌ (11 బంతుల్లో 24 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) సిక్సర్లు బాదడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సివుండగా బ్రేవో బౌలింగ్‌లో తొలిబంతికే స్టోక్స్‌ ఔటయ్యాడు. దీంతో రాజస్తాన్‌ శిబిరంలో ఏ మూలనో మిగిలున్న ఆశలు అడుగంటాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement