చెన్నై 6 బంతుల్లో 18 పరుగులు చేయాలి. ధోని, జడేజా క్రీజులో ఉండగా... స్టోక్స్ బౌలింగ్‌కు దిగాడు. తొలిబంతిని జడేజా సిక్సర్‌గా బాదేశాడు. రెండో బంతి నోబాల్. జడేజా ఓ పరుగు చేశాడు. ఇక 5 బంతుల్లో 10 పరుగులు చేస్తే చాలు. స్ట్రయిక్‌లోకి వచ్చిన ధోని 2 పరుగులు చేశాడు.
కానీ ఆ మరుసటి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సాన్‌ట్నర్ రెండు పరుగులు చేశాడు. అయితే ఇది స్వల్ప వివాదాన్ని రేపింది. చివరకు ఐదో బంతికి మరో 2 పరుగులు తీశాడు. ఆఖరి బంతిని వైడ్‌గా వేయడంతో... చివరి బంతికి 3 చేస్తే సరిపోతుంది. సాన్‌ట్నర్ సిక్సర్ కొట్టడంతో ఉత్కంఠకు తెరపడి చెన్నై గెలిచింది.
జైపూర్: ఆఖరి బంతిదాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్లతో గెలుపొందింది. రాజస్తాన్ గెలిచేదాకా వచ్చినా గెలవలేకపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. స్టోక్స్ (26 బంతుల్లో 28; 1 ఫోర్) ఫర్వాలేదనిపించాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (47 బంతుల్లో 57; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ధోని (43 బంతుల్లో 58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. స్టోక్స్‌కు 2 వికెట్లు దక్కాయి.
ధాటిగా మొదలైంది కానీ...
టాస్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రహానే, బట్లర్ ప్రారంభించారు. దీపక్ చహర్ తొలి ఓవర్లో బట్లర్ ఫోర్, సిక్సర్‌తో 11 పరుగులు రాబట్టాడు. సాన్‌ట్నర్ రెండో ఓవర్లో రహానే రెండు వరుస బౌండరీలు బాదడంతో మరో 14 పరుగులొచ్చాయి. ఈ రెండు ఓవర్లలో 25 స్కోరు చేసిన రాయల్స్ తర్వాత వరుస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయింది. చహర్... రహానే (14) వికెట్ తీయగా, సంజూ సామ్సన్ క్రీజులోకి రాగానే బౌండరీ కొట్టాడు. తర్వాత శార్దుల్ బౌలింగ్‌లో బట్లర్ (10 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్)వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. కానీ తర్వాతి బంతికే ఔటయ్యాడు. పవర్‌ప్లే ముగియక ముందే సామ్సన్ (6) రూపంలో మరో వికెట్ కోల్పోయింది.
6 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 54/3. ఇక్కడి నుంచి ఇన్నింగ్స్ చప్పగా సాగిపోయింది. ఓవర్‌కు 3, 4, 5, 6, 7 పరుగులను మించి చేయలేకపోయింది. 13 ఓవర్లు ముగిసే సరికి త్రిపాఠి (10), స్మిత్ (15)ల వికెట్లను చేజార్చుకొని 89 పరుగులు చేసింది. తర్వాత రెండు ఫోర్లు కొట్టిన పరాగ్ ఆట ఎంతో సేపు సాగలేదు. ఆఖర్లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న స్టోక్స్‌ను 19వ ఓవర్లో చహర్ బౌల్డ్ చేశాడు. చివరి ఓవర్లో శ్రేయస్ గోపాల్ (7 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆర్చర్ (13 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి 18 పరుగులు బాదడంతో రాజస్తాన్ స్కోరు 150 పరుగులు దాటింది.
చెన్నైకి ఆదిలోనే కష్టాలు
ధోని సేన ఫామ్ దృష్ట్యా ఈ లక్ష్యమేమీ కష్టమైంది కాదు. కానీ పిచ్ బౌలర్లకు చక్కగా సహకరించడంతో చెన్నైకి కష్టాలు తప్పలేదు. తొలి ఓవర్ వేసిన ధావళ్ కులకర్ణి పరుగే ఇవ్వకుండా వాట్సన్‌ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్లో రైనా (4)రనౌటయ్యాడు. కాసేపటికే మరో ఓపెనర్ డుప్లెసిస్ (7)ను ఉనాద్కట్ ఔట్ చేయడంతో చెన్నై 15 పరుగులకే టాపార్డర్‌ను కోల్పోయింది. ఇది చాలదన్నట్లు స్టోక్స్ అద్భుతమైన క్యాచ్‌కు జాదవ్ (1) నిష్క్రమించాడు. పవర్ ప్లేలో సూపర్‌కింగ్స్ 4 వికెట్లకు 24 పరుగులే చేయగలిగింది. ఈ దశలో ధోని ఛేజింగ్ బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నాడు. పదో ఓవర్లో అతను సిక్సర్ కొట్టడంతో కష్టంగా 50 పరుగులు చేసింది.
మిగతా పది ఓవర్లలో 102 పరుగులు చేయాల్సిరావడంతో జాగ్రత్తపడిన ధోని అడపాదడపా సిక్సర్లతో జట్టును నడిపించాడు. రాయుడు కూడా వేగం పెంచడంతో పరుగుల జోరుపెరిగింది. 15వ ఓవర్లో అతను 6, 4తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతోపాటే జట్టు స్కోరు వందకు చేరింది. ఇక 30 బంతుల్లో చెన్నై విజయానికి 51 పరుగులు చేయాలి. ఈ దశలో 16వ ఓవర్లో గోపాల్ 5 పరుగులు, 17వ ఓవర్లో ఆర్చర్ 7 పరుగులే ఇచ్చారు. 18వ ఓవర్ వేసిన స్టోక్స్ 9 పరుగులిచ్చినా... రాయుడు వికెట్ తీసి 95 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. తర్వాత జడేజా (4 బంతుల్లో 9 నాటౌట్; 1 సిక్స్) క్రీజులోకి రాగా... ధోని 39 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు.
►100 ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనికి ఇది 100వ విజయం. మొత్తం 166 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా, 65 మ్యాచ్‌లలో అతని జట్టు ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
►100స్మిత్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment