జైపూర్: చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి చాంపియన్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. గురువారం స్థానిక సవాయ్ మాన్‌సింగ్ మైదానంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంతమైదానంలో గెలిచి పునర్వైభవం అందుకోవాలనుకున్న రాజస్తాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. రాజస్తాన్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే.. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సీఎస్‌కే టాపార్డర్ పూర్తిగా విఫలమైనా రాయుడు(57), ధోని(58)లు బాధ్యాతయుతంగా ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో స్టోక్స్ రెండు వికెట్లు తీయగా.. కులకర్ణి, ఉనద్కత్, ఆర్చర్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు.
రాయుడు-ధోని సూపర్ ఇన్నింగ్స్
ఛేదనలో సీఎస్‌కేకు ఆదిలోనే షాక్ తగిలింది. వాట్సన్(0), రైనా(4)లు వెంటవెంటనే వెనుదిరిగారు. అనంతరం డుప్లెసిస్(7), జాదవ్(1)లు కూడా తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ధోని-రాయుడు బాధ్యాతాయుతంగా ఆడారు. మొదట మరో వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడారు. అనంతరం గేర్ మార్చి పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేశారు. స్కోర్ పెంచే క్రమంలో రాయుడు భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ అవుటయ్యాడు.
నాటకీయంగా చివరి ఓవర్
చివరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 18 పరుగులు కావాల్సి ఉంది. స్టోక్స్ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతిని జడేజా సిక్సర్ కొట్టాడు. రెండో బంతికి సింగిల్ తీయగా అది నోబాల్ కావడంతో ఫ్రీ హిట్ రూపంలో సీఎస్‌కేకు మరో అవకాశం వచ్చింది. తర్వాత బంతికి ధోని రెండు పరుగులు రాబట్టాడు. మూడో బంతికి ధోనిని స్టోక్స్ బౌల్డ్ చేశాడు. దీంతో సీఎస్‌కే శిబిరం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే క్రీజులోకి వచ్చిన సాంట్నర్ చాలా తెలివిగా ఆడాడు. నాలుగు, ఐదు బంతులకు రెండు పరుగుల చొప్పున చేశాడు. అయితే స్టోక్స్ వేసిన ఐదో బంతి తొలుత నోబాల్‌గా ప్రకటించిన అంపైర్ ఆతర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో కాసేపు మైదానంలో సీఎస్‌కే ఆటగాళ్లకు, అంపైర్ల మధ్య వాగ్వాదం జరిగింది. చివరి బంతికి సీఎస్‌కే విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా సాంటర్న్ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు.
స్వల్పస్కోర్‌కే పరిమితమైన రాజస్తాన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ అజింక్యా రహానే(14) నిరాశపరిచాడు. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్‌లో రహానే ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అటు తర్వాత జోస్ బట్లర్(23) కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. రాజస్తాన్ స్కోరు 47 పరుగుల వద్ద ఉండగా బట్లర్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు.
ఆపై సంజూ శాంసన్(6), రాహుల్ త‍్రిపాఠి(10), స్మిత్(15)లు సైతం విఫలమయ్యారు. కాగా, బెన్ స్టోక్స్(28) ఫర్వాలేదనిపించడంతో రాజస్తాన్ తేరుకుంది. చివర్లో రియాన్ పరాగ్(16), జోఫ్రా ఆర్చర్(13 నాటౌట్), శ్రేయస్ గోపాల్(19)లు బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లు సాధించగా, మిచెల్ సాంట్నర్‌కు వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment