పుణే ఫటాఫట్
► 9 వికెట్లతో ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం
► తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్
► సమష్టిగా రాణించిన ధోని బృందం అదరగొట్టిన అజింక్య రహానే
కొత్త ఆశలతో... కొంగొత్త ఆశయాలతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఐపీఎల్-9 సీజన్ తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపుతూ... టి20 స్టార్లు, తలపండిన అనుభవజ్ఞులతో కూడిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో ధోని సేన 9 వికెట్లతో రోహిత్ బృందంపై నెగ్గి శుభారంభం చేసింది.
ముంబై: భారీ హిట్టర్లతో కూడిన ముంబై ఇండియన్స్‌ను... రైజింగ్ పుణే రఫ్ఫాడించింది. బంతితో నిప్పులు చెరుగుతూ స్టార్ బలగాన్ని ఓ మాదిరి స్కోరుకే కట్టిపడేసింది. దీంతో ఐపీఎల్-9లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోని బృందం 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు చేసింది. హర్భజన్ (30 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), అంబటి తిరుపతి రాయుడు (27 బంతుల్లో 22; 2 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 126 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అజింక్య రహానే (42 బంతుల్లో 66 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. డు ప్లెసిస్ (33 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్సర్లు) అండగా నిలిచాడు.
చకచకా వికెట్లు....
ఆరంభం నుంచే పుణే బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో ముంబై చకచకా వికెట్లు కోల్పోయింది. అడపాదడపా ఫోర్లు బాదినా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది. రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ (7), నాలుగో ఓవర్‌లో సిమన్స్ (8) అవుట్‌కాగా, ఐదో ఓవర్‌లో మార్ష్.... హార్దిక్ (9), బట్లర్ (0)లను పెవిలియన్‌కు పంపి షాకిచ్చాడు. పవర్‌ప్లేలో 4 వికెట్లకు 37 పరుగులు చేసిన ముంబైని మ్యాచ్ మధ్యలోనూ రజత్ భాటియా, మురుగన్ అశ్విన్‌లు కుదురుగా బౌలింగ్ చేసి కట్టడి చేశారు.
క్రీజులో పాతుకుపోయిన రాయుడు సింగిల్స్‌కు పరిమితమైతే... రెండో ఎండ్‌లో భారీ హిట్టర్ పొలార్డ్ (1), గోపాల్ (2)లను అవుట్ చేయడంతో రన్‌రేట్ పడిపోయింది. 16వ ఓవర్‌లో రాయుడు అవుటైన తర్వాత హర్భజన్ ఎదురుదాడి మొదలుపెట్టాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో చివరి మూడు ఓవర్లలో 41 పరుగులు రాబట్టడంతో ముంబై స్కోరు 120 పరుగులు దాటగలిగింది. పుణే బౌలర్లలో ఇషాంత్, మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు.
రహానే అదుర్స్...
తొలి బంతి నుంచే దూకుడు చూపెట్టిన ఓపెనర్లు రహానే, డు ప్లెసిస్‌లు శుభారంభాన్నిచ్చారు. తొలి నాలుగు ఓవర్లలో ఐదు ఫోర్లు బాదిన ఈ జోడి... ఐదో ఓవర్‌లో మాత్రం చెరో సిక్సర్ కొట్టింది. బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో డు ప్లెసిస్ మరో రెండు సిక్సర్లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో పుణే స్కోరు 57/0కు చేరుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు స్ట్రయిక్ రొటేషన్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించినా.. ఏ దశలోనూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 78 పరుగులు జోడించాక డు ప్లెసిస్ అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన పీటర్సన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్సర్లు) హర్భజన్ వేసిన వరుస ఓవర్లలో లాంగాన్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇక 36 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో అజింక్య రహానే రెండు సిక్సర్లు సాధించాడు. దాంతో 32 బంతులు మిగిలి ఉండగానే పుణేకు విజయం దక్కింది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమన్స్ (బి) ఇషాంత్ 8; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 7, హార్దిక్ పాండ్యా (సి) ధోని (బి) మార్ష్ 9; బట్లర్ (సి) ఆర్.అశ్విన్ (బి) మార్ష్ 0; రాయుడు (సి) డు ప్లెసిస్ (బి) ఆర్.అశ్విన్ 22; పొలార్డ్ ఎల్బీడబ్ల్యు (బి) భాటియా 1; గోపాల్ (సి) రహానే (బి) ఎం.అశ్విన్ 2; హర్భజన్ నాటౌట్ 45; వినయ్ (సి) స్మిత్ (బి) ఆర్పీ సింగ్ 12; మెక్లీంగన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 121.
వికెట్ల పతనం: 1-8; 2-29; 3-29; 4-30; 5-40; 6-51; 7-68, 8-96.
బౌలింగ్: ఆర్పీ సింగ్ 3-0-30-1; ఇషాంత్ శర్మ 4-0-36-2; మిషెల్ మార్ష్ 4-0-21-2; రజత్ భాటియా 4-1-10-1; మురుగన్ అశ్విన్ 4-0-16-1; రవిచంద్రన్ అశ్విన్ 1-0-7-1.
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 66; డు ప్లెసిస్ (బి) హర్భజన్ 34; పీటర్సన్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (14.4 ఓవర్లలో 1 వికెట్‌కు) 126.
వికెట్ల పతనం: 1-78.
బౌలింగ్: మెక్లీంగన్ 3-0-27-0; బుమ్రా 3-0-30-0; వినయ్ కుమార్ 2-0-14-0; గోపాల్ 3-0-18-0; హర్భజన్ 3-0-24-1; హార్దిక్ పాండ్యా 0.4-0-12-0.
► 1 ముంబై ఇండియన్స్ జట్టులో టాప్-4 బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయకుండా అవుటవ్వడం ఇదే ప్రథమం.
► 1 ఈ మ్యాచ్‌లో పుణే జట్టుకు చెందిన నలుగురు బౌలర్లు (ఇషాంత్, మిచెల్ మార్ష్, రజత్ భాటియా, అశ్విన్) ఇన్నింగ్స్‌లో తాము వేసిన తొలి బంతికే వికెట్‌ను తీశారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
► 300 ఈ మ్యాచ్‌తో కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) తన కెరీర్‌లో 300వ టి20 మ్యాచ్‌ను ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా పొలార్డ్ గుర్తింపు పొందాడు. ఇదే మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ 100వ టి20 మ్యాచ్‌ను... వినయ్ కుమార్ 100వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడారు.
► ఇంతకంటే మంచి ఆరంభం లభిస్తుందని అనుకోను. ఈ ఘనత బౌలర్లకే చెందుతుంది. పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై ప్రత్యర్థులు కూడా బాగానే పోరాడారు. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. వికెట్ ఎలా ఉన్నా... రహానే అద్భుతంగా ఆడతాడు. ఫినిషింగ్ కూడా బాగుంది. - ధోని (పుణే కెప్టెన్)