కోల్‌కతా తీన్‌మార్
► వరుసగా మూడో విజయం
► రాణించిన సూర్యకుమార్, యూసుఫ్
► రహానే శ్రమ వృథా
పుణే: జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్న ఓపెనర్లు తొలిసారి విఫలమైనా... చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుతంగా కాపాడుకుంది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐపీఎల్-9లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో పుణేను ఓడించి వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. రహానే (52 బంతుల్లో 67; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్ (28 బంతుల్లో 31; 2 ఫోర్లు) రాణించారు. ఆరంభంలో నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభించడంతో నాలుగో ఓవర్‌లోనే డు ప్లెసిస్ (4) వికెట్ కోల్పోయింది. అయితే స్మిత్, రహానే నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు రాణించడంతో పుణే తొలి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ దశలో పెరీరా (9 బంతుల్లో 12; 1 సిక్స్) నిరాశపర్చినా.... ఆల్బీ మోర్కెల్ (9 బంతుల్లో 16; 2 సిక్సర్లు), రహానేలు భారీ సిక్సర్లతో రన్‌రేట్‌ను పెంచారు. ఆఖర్లో ధోని (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. చివరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు సమకూరడంతో పుణే భారీ స్కోరు సాధించింది.
తర్వాత కోల్‌కతా 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్ (27 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కదంతొక్కాడు. మూడు ఓవర్లు ముగియకముందే ఓపెనర్లు ఉతప్ప (0), గంభీర్ (11) అవుట్‌కాగా, వన్‌డౌన్‌లో షకీబ్ (3) కూడా నిరాశపర్చాడు. దీంతో కోల్‌కతా 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్, యూసుఫ్ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించినా...వరుస ఓవర్లలో అవుట్ కావడం దెబ్బతీసింది. తర్వాత రసెల్ (11 బంతుల్లో 17; 2 సిక్సర్లు) వేగంగా ఆడినా వికెట్‌ను కాపాడుకోలేకపోయాడు. ఇక 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో సతీష్ (10) సిక్స్ కొట్టి అవుట్ కావడంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఈ దశలో చావ్లా (8) కూడా అవుటైనా... ఉమేశ్ (7 నాటౌట్) భారీ సిక్సర్‌తో జట్టును గెలిపించాడు.
స్కోరు వివరాలు
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి అండ్ బి) నరైన్ 67; డు ప్లెసిస్ (బి) షకీబ్ 4; స్మిత్ రనౌట్ 31; పెరీరా (బి) సతీష్ 12; ఆల్బీ మోర్కెల్ (బి) ఉమేశ్ 16; ధోని నాటౌట్ 23; భాటియా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 160.
వికెట్ల పతనం: 1-24; 2-80; 3-99; 4-119; 5-133.
బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 3-0-30-0; రసెల్ 2-0-16-0; షకీబ్ 3-0-14-1; నరైన్ 4-0-32-1; చావ్లా 3-0-26-0; సతీష్ 3-0-20-1; ఉమేశ్ 2-0-16-1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 0; గంభీర్ రనౌట్ 11; సూర్యకుమార్ ఎల్బీడబ్ల్యు (బి) ఎం.అశ్విన్ 60; షకీబ్ (బి) భాటియా 3; యూసుఫ్ ఎల్బీడబ్ల్యు (బి) భాటియా 36; రసెల్ (సి) డు ప్లెసిస్ (బి) పెరీరా 17; సతీష్ (బి) మోర్కెల్ 10; చావ్లా (సి) స్మిత్ (బి) పెరీరా 8; ఉమేశ్ నాటౌట్ 7; నరైన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (19.3 ఓవర్లలో 8 వికెట్లకు) 162.
వికెట్ల పతనం: 1-0; 2-31; 3-60; 4-111; 5-119; 6-139; 7-151, 8-156.
బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 3-0-36-2; పెరీరా 3.3-0-28-2; ఆర్.అశ్విన్ 2-0-21-0; భాటి యా 4-0-19-2; అంకిత్ శర్మ 3-0-26-0; ఎం.అశ్విన్ 4-0-32-1.