పుణే స్పిన్ బాగుంది | Pune spin Nice :- Harsh bhogle | Sakshi
Sakshi News home page

పుణే స్పిన్ బాగుంది

Published Fri, Apr 22 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

Pune spin Nice :- Harsh bhogle

 హర్షా భోగ్లే
ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభమైన 14 రోజులకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ సొంత వేదికకు చేరింది. అయితే ఆ జట్టుకిది ఇప్పుడు సొంత మైదానం అని చెప్పుకోవడానికి లేదు. మారిన పరిస్థితుల కారణంగా కేవలం తాత్కాలిక శిబిరంగానే ఉపయోగపడనుంది. ఇక లీగ్‌లో వారు కాస్త కఠినమైన దశకు చేరుకున్నారు. రానున్న పది రోజుల్లో ఐదు మ్యాచ్‌లు ఆడబోతున్నారు. వీటి తర్వాత తాజా లీగ్‌లో వారి అవకాశాలేమిటో అంచనా వేయవచ్చు. పుణే పిచ్‌పై నాకు ఆసక్తిగా ఉంది. ఎందుకంటే క్రితంసారి నేను చూసినప్పుడు ఇది మంచి సలాడ్ బౌల్‌లాగా అనిపించింది. ఎందుకంటే ఇది భారత్‌లోనే అత్యంత అందమైన స్టేడియాల్లో ఒకటి.

పుణే జట్టు ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. మురుగన్ అశ్విన్ ప్రభావం చూపిస్తున్నాడు. పేస్‌లో ఇషాంత్ శర్మ ముంబైతో మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లను కెప్టెన్ ధోని వేయనిస్తాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వికెట్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ జట్టు ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ డు ప్లెసిస్ వేగవంతమైన ఆటతో ఒత్తిడి లేకుండా చూస్తున్నాడు.

ఒక ఓపెనర్ స్ట్రయిక్ రేట్ 145-150 మధ ్య ఉంటే మంచిది. మరోవైపు మొత్తం పోస్టర్ బాయ్స్‌తో నిండిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని ఓడింది. ఇందులో ఓడిన రెండు మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్ చేసినవే. అయితే ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది కాబట్టి కెప్టెన్ విరాట్ కోహ్లి తమ తుది కూర్పు ఎలా ఉండాలో తెలుసుకోవాల్సి ఉంది. గత మ్యాచ్‌లో ఏకంగా వారు ఆరు మార్పులతో బరిలోకి దిగారు. ఇది తమ శిబిరంలో అనిశ్చితిని తెలియజేసింది. అయితే రిచర్డ్‌సన్, అబ్దుల్లాలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నావరకైతే స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై బెంగళూరు మరోసారి చేజ్ చేయడంతో పాటు ఆర్.అశ్విన్.. కోహ్లికి బౌలింగ్ వేస్తే చూడాలని ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement