దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో ఆంధ్ర జట్టు అదరగొడుతోంది. గ్రూప్-‘బి’లో భాగంగా మేఘాలయతో పోరులో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 10 వికెట్ల తేడాతో మేఘాలయ(Andhra vs Meghalaya )ను మట్టికరిపించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ జట్టు 48.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ నిశాంత చక్రవర్తి (108 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... అర్పిత్ (90 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించాడు. దీంతో ఒకదశలో మేఘాలయ జట్టు 182/1తో పటిష్ట స్థితిలో కనిపించింది.
యారా సందీప్ 5 వికెట్లతో అదరగొట్టాడు
అయితే ఆ తర్వాత ఆంధ్ర బౌలర్లు విజృంభించి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో మేఘాలయ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర బౌలర్లలో యారా సందీప్ 28 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ఆంజనేయులు, మహీప్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర 29.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 228 పరుగులు చేసింది.
భరత్, అశ్విన్ అజేయ శతకాలు
ఆంధ్ర కెప్టెన్ శ్రీకర్ భరత్ (KS Bharat- 81 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించాడు. మరో ఓపెనర్ అశ్విన్ హెబర్ (Ashwin Hebbar- 96 బంతుల్లో 108 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) కూడా ‘శత’క్కొట్టడంతో ఆంధ్ర జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మేఘాలయ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న భరత్... సిక్స్‌లతో చెలరేగిపోతే అశి్వన్ బౌండరీలతో హోరెత్తించాడు. వీరిద్దరూ పోటీపడి పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది.
రెండో స్థానంలో
గత మ్యాచ్‌లో సర్వీసెస్‌పై అజేయ అర్ధశతకాలతో వికెట్ నష్టపోకుండానే జట్టును గెలిపించిన భరత్, అశ్విన్... ఈసారి కూడా దాన్ని పునరావృతం చేశారు. 5 వికెట్లు తీసిన సందీప్‌నకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 4 విజయాలు, ఒక పరాజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర జట్టు తలపడుతుంది.
చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్
Comments
Please login to add a commentAdd a comment