ధూమ్‌ ధామ్‌ | India won the last test | Sakshi
Sakshi News home page

ధూమ్‌ ధామ్‌

Published Sun, Mar 10 2024 12:58 AM | Last Updated on Sun, Mar 10 2024 12:58 AM

India won the last test - Sakshi

ఇన్నింగ్స్‌ విజయంతో సిరీస్‌ను ముగించిన భారత్‌  

చివరి టెస్టులో భారత్‌ ఘన విజయం

ఇన్నింగ్స్, 64 పరుగులతో ఇంగ్లండ్‌ చిత్తు 

4–1తో సిరీస్‌ టీమిండియా సొంతం  

హిమాలయాల చెంత భారత టెస్టు క్రికెట్‌ ప్రదర్శన మరింత ఉన్నతంగా శిఖరానికి చేరింది...ధర్మశాలలో అంచనాలకు అనుగుణంగా చెలరేగిన మన జట్టు ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టి టెస్టు సిరీస్‌ను 4–1తో సగర్వంగా గెలుచుకుంది... 259 పరుగుల ఆధిక్యం అంటేనే టీమిండియా గెలుపు లాంఛనం అనిపించింది... కానీ ఇంగ్లండ్‌ కనీస స్థాయి పోరాటపటిమ కూడా ప్రదర్శించలేక చేతులెత్తేసింది.

బజ్‌బాల్‌ ముసుగులో అసలు టెస్టును ఎలా ఆడాలో మరచిపోయిన ఆ జట్టు ఆటగాళ్లు గుడ్డిగా బ్యాట్లు ఊపి పేలవ షాట్లతో వేగంగా తమ ఓటమిని ఆహ్వానించారు. తన వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో అశ్విన్ ఈ మ్యాచ్‌ను  చిరస్మరణీయం చేసుకోగా...విజయంతో తమ వంతు పాత్ర పోషించిన కుర్రాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఓటమితో మొదలైన ఈ ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌కు ఇన్నింగ్స్‌ విజయంతో భారత్‌ ఘనమైన ముగింపునిచ్చింది. 

ధర్మశాల: సొంతగడ్డపై టెస్టుల్లో భారత జట్టు తమ స్థాయి ఏమిటో మరోసారి చూపించింది. మూడో రోజే ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు వెనుకబడి శనివారం రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌ 48.1 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్‌ (128 బంతుల్లో 84; 12 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, అశ్విన్ (5/77) ఐదు వికెట్లు పడగొట్టాడు.

7 వికెట్లతో పాటు కీలక పరుగులు చేసిన కుల్దీప్‌ యాదవ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్‌ తర్వాతి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. 2 డబుల్‌ సెంచరీలు సహా మొత్తం 712 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది.  

రూట్‌ మినహా... 
వెన్నునొప్పితో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో కెపె్టన్‌ రోహిత్‌ మైదానంలోకి దిగలేదు. దాంతో బాధ్యతలు తీసుకున్న బుమ్రా ఆలస్యం చేయకుండా రెండో ఓవర్‌లోనే అశ్విన్ కు బౌలింగ్‌ బాధ్యత అప్పగించాడు. అంతే...ఐదో బంతికి డకెట్‌ (2) అవుట్‌తో మొదలైన ఇంగ్లండ్‌ పతనం వేగంగా సాగింది. కొద్ది సేపటికి క్రాలీ (0) కూడా వెనుదిరగ్గా, ఒలీ పోప్‌ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేదు.

ఈ దశలో జానీ బెయిర్‌స్టో (31 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూట్‌ మాత్రమే 56 పరుగుల భాగస్వామ్యంతో కొద్దిసేపు ప్రతిఘటించారు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లోనే మూడు సిక్సర్లతో బెయిర్‌స్టో దూకుడు ప్రదర్శించాడు. అయితే కుల్దీప్‌ తన తొలి ఓవర్లోనే బెయిర్‌స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, స్టోక్స్‌ (2) పేలవ ఫామ్‌ కొనసాగింది. లంచ్‌ వరకే ఇంగ్లండ్‌ 5 వికెట్లు కోల్పోయింది.

విరామం తర్వాత ఫోక్స్‌ (8)ను పడగొట్టి అశ్విన్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లతో దెబ్బ కొట్టగా...తర్వాతి వికెట్‌ జడేజా ఖాతాలో చేరింది. మరో ఎండ్‌లో పోరాడుతున్న రూట్‌ ఇక లాభం లేదనుకొని ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్‌ బౌలింగ్‌లో కొట్టిన షాట్‌కు లాంగాన్‌ వద్ద బుమ్రా క్యాచ్‌ అందుకోవడంతో ఇంగ్లండ్‌ ఆట ముగిసింది.  

టెస్టు క్రికెట్‌కు ప్రోత్సాహకాలు... 
యువ ఆటగాళ్లు టెస్టు ఫార్మాట్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు బీసీసీఐ కొత్త తరహా ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. టెస్టులు రెగ్యులర్‌గా ఆడే ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజుతో పాటు ‘టెస్టు క్రికెట్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ పేరుతో భారీ మొత్తం అందించనుంది. 2022–23 సీజన్‌నుంచే దీనిని వర్తింపజేస్తారు. దీని ప్రకారం ఏడాదిలో భారత జట్టు ఆడే టెస్టుల్లో కనీసం సగానికి పైగా టెస్టులు ఆడితే రూ. 30 లక్షలు అందిస్తారు.

75 శాతం పైగా మ్యాచ్‌లు ఆడితే ఈ మొత్తం రూ.45 లక్షలు అవుతుంది. తుది జట్టులో లేని ప్లేయర్‌కు ఇందులో సగం లభిస్తుంది. ఉదాహరణకు భారత జట్టు ఏడాదిలో 10 టెస్టులో ఆడితే ఒక ఆటగాడు అన్ని మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగితే అతనికి రూ.4.50 కోట్లు లభిస్తాయి. ఒక్కో మ్యాచ్‌ ఫీజు రూ.15 లక్షల ద్వారా వచ్చే రూ.1.50 కోట్లకు ఇది అదనం. సగంకంటే తక్కువ టెస్టులు ఆడితే ఇది వర్తించదు.   

స్కోరు వివరాలు: 
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 218;
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 477;

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (సి)  సర్ఫరాజ్‌ (బి) అశ్విన్ 0; డకెట్‌ (బి) అశ్విన్ 2; పోప్‌ (సి) యశస్వి (బి) అశ్విన్ 19; రూట్‌ (సి) బుమ్రా (బి) కుల్దీప్‌ 84; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 39; స్టోక్స్‌ (బి) అశ్విన్ 2; ఫోక్స్‌ (బి) అశ్విన్ 8; హార్ట్‌లీ (ఎల్బీ) (బి) బుమ్రా 20; వుడ్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 0; బషీర్‌ (బి) జడేజా 13; అండర్సన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్‌) 195. వికెట్ల పతనం: 1–2, 2–21, 3–36, 4–92, 5–103, 6–113, 7–141, 8–141, 9–189, 10–195. బౌలింగ్‌: బుమ్రా 10–2–38–2, అశ్విన్ 14–0–77–5, జడేజా 9–1–25–1, కుల్దీప్‌ 14.1–0–40–2, సిరాజ్‌ 1–0–8–0. 

జిమ్మీ@ 700 
ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టు క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా, తొలి పేసర్‌గా ఘనతకెక్కాడు. శనివారం కుల్దీప్‌ను అవుట్‌ చేయడంతో ఈ వికెట్‌ అతని ఖాతాలో చేరింది. అత్యధిక వికెట్ల జాబితాలో స్పిన్నర్లు మురళీధరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708) మాత్రమే అతనికంటే ముందున్నారు. 41 ఏళ్ల 7 నెలల వయసులో తన 187వ టెస్టులో అతను ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. మే 2003లో జింబాబ్వేపై అండర్సన్‌ తన తొలి టెస్టు ఆడాడు.

178 = 178 
భారత జట్టు టెస్టు చరిత్రలో తొలి సారి విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా వచ్చింది. ఇప్పటివరకు మన విజయాలకంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. భారత్‌ మొత్తం 579 టెస్టులు ఆడగా 222 మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది.  

36 అశ్విన్‌ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 36వ సారి. రిచర్డ్‌ హ్యాడ్లీ (36)ని సమం చేశాడు.   

‘ఒక టెస్టు గెలవాలంటే అన్నీ సరిగ్గా కుదరాలి. ఈ సారి మేం అలాగే చేయగలిగాం. కొందరు ఆటగాళ్లు ఏదో ఒక దశలో సిరీస్‌లో అందుబాటులో ఉండరని తెలుసు. టెస్టులు ఎక్కువగా ఆడకపోయినా ఈ కుర్రాళ్లందరికీ మంచి అనుభవం ఉంది. మ్యాచ్‌కు అనుగుణంగా వారిని వాడుకున్నాం. ఒత్తిడి ఎదురైనప్పుడు అంతా సరిగా స్పందించారు. ఇది సమష్టి విజయం. పరుగులు చేయడం గురించే చర్చిస్తాం కానీ టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. మా బౌలర్లు దానిని చేసి చూపించారు. కుల్దీప్, యశస్వి గొప్పగా ఆడారు’   –రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement