photo credit: IPL Twitter
ఐపీఎల్ 2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయాలు సాధిస్తూ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. చివరి నుంచి రెండో స్థానంతో గత సీజన్‌ను ముగించిన సీఎస్‌కే.. ప్రస్తుత సీజన్‌లో అనూహ్యంగా పుంజుకుని ఓ రేంజ్‌లో ఇరగదీస్తుంది. ఈ సీజన్‌ను సైతం ఓటమితో (గుజరాత్ చేతిలో) ప్రారంభించిన ధోని సేన.. ఆతర్వాత ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క ఓటమిని (రాజస్థాన్) మూటగట్టుకుని బ్రేకుల్లేని బుల్‌డోజర్‌గా దూసుకుపోతుంది.
నిన్న (ఏప్రిల్ 23) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా భారీ జంప్ చేసింది. కేకేఆర్‌పై భారీ స్కోర్ చేయడంతో ఆ జట్టు రన్‌రేట్ సైతం గణనీయంగా మెరుగుడింది. సీఎస్‌కేలో ఒక్క సీజన్‌లో ఇంత మార్పు రావడంతో ఆ జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు ఇదే జోరును కొనసాగించి, ఐదో టైటిల్ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు యువకులు, వెటరన్ ఆటగాళ్ల సమ్మేళనంలా ఉన్న సీఎస్‌కే సైతం ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని దృడ నిశ్చయంతో ఉంది. తమ సారధి ధోనికి బహుశా ఈ సీజన్ ఆఖరిది కావొచ్చనే సంకేతాలు అందడంతో సీఎస్‌కే సభ్యులంతా తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు లాంటి వెటరన్‌లకు కూడా ఇదే సీజన్ ఆఖరిది అయ్యే అవకాశం ఉండటంతో, వారిని సైతం ఘనంగా సాగనంపాలని భారీగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అయిన తమ నాయకుడికి టైటిల్‌తో వీడ్కోలు పలకడమే తామందించగలిగే గౌరవమని సీఎస్‌కే సభ్యులు భావిస్తున్నారు.
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్ బౌలర్లపై సీఎస్‌కే బ్యాటర్లు ఓ రేంజ్‌లో డామినేషన్ చలాయించారు. రహానే (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినప్పటికీ కేకేఆర్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment