‘టై’తక్కలాడించాడు | gujarat lions beat Rising Pune Supergiant | Sakshi
Sakshi News home page

‘టై’తక్కలాడించాడు

Published Sat, Apr 15 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

‘టై’తక్కలాడించాడు

‘టై’తక్కలాడించాడు

ఆండ్రూ టైకి ఐదు వికెట్లు
హ్యాట్రిక్‌ సాధించిన లయన్స్‌ బౌలర్‌
గుజరాత్‌ తొలి విజయం
7 వికెట్లతో రైజింగ్‌ పుణే చిత్తు  


ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఆండ్రూ టై సంచలన బౌలింగ్‌కు తోడు మెకల్లమ్, డ్వేన్‌ స్మిత్‌ మెరుపు బ్యాటింగ్‌తో లయన్స్‌ విజయాల బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన రైనా సేన సొంతగడ్డపై చెలరేగి జెయింట్‌కు ఝలక్‌ ఇచ్చింది. సమష్టి ప్రదర్శనతో గుజరాత్‌ సత్తా చాటగా... సీజన్‌లో శుభారంభం తర్వాత తడబడుతూ వచ్చిన రైజింగ్‌ పుణే ఖాతాలో ‘హ్యాట్రిక్‌’ పరాజయం చేరింది.  

రాజ్‌కోట్‌: ఐపీఎల్‌ కెరీర్‌లో 150వ మ్యాచ్‌ ఆడిన సురేశ్‌ రైనా, పదో సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌కు తొలి విజయం అందించి ఈ మ్యాచ్‌ను మరింత మధురంగా మార్చుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో లయన్స్‌ 7 వికెట్ల తేడాతో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (28 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ త్రిపాఠి (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనోజ్‌ తివారి (27 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండ్రూ టై (5/17) అద్భుత బౌలింగ్‌తో చెలరేగాడు. అనంతరం గుజరాత్‌ 18 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. మెకల్లమ్‌ (32 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డ్వేన్‌ స్మిత్‌ (30 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 53 బంతుల్లోనే 94 పరుగులు జోడించి గుజరాత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించగా...చివర్లో రైనా (22 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఫించ్‌ (19 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) 31 బంతుల్లోనే 61 పరుగులు జత చేసి మ్యాచ్‌ను ముగించారు.  

కీలక భాగస్వామ్యం...
ఇన్నింగ్స్‌ మూడో బంతికే గుజరాత్‌కు షాక్‌ తగిలింది. స్లిప్‌లో రైనా ఒంటి చేత్తో అత్యద్భుత క్యాచ్‌ పట్టడంతో రహానే (0) వెనుదిరిగాడు. ఈ దశలో త్రిపాఠి,, స్మిత్‌ దూకుడైన భాగస్వామ్యం (32 బంతుల్లో 64 పరుగులు) పుణేను నిలబెట్టింది. ముఖ్యంగా ప్రవీణ్‌ వేసిన ఐదో ఓవర్లో సూపర్‌ జెయింట్‌ పండుగ చేసుకుంది. ఈ ఓవర్లో త్రిపాఠి తొలి మూడు బంతుల్లో 6, 6, 4 బాదగా చివరి రెండు బంతులకు స్మిత్‌ 2 ఫోర్లు కొట్టడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. అయితే టై తన తొలి ఓవర్లోనే త్రిపాఠిని అవుట్‌ చేసి ఈ జోడీని విడదీశాడు. మరికొద్దిసేపటికే స్మిత్‌ కూడా అవుటయ్యాడు. స్టోక్స్‌ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జోరును టై అడ్డుకోగా... ధోని (5) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. అయితే తివారి, అంకిత్‌ శర్మ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆరో వికెట్‌కు 29 బంతుల్లోనే 47 పరుగులు జత చేసి జెయింట్‌ను ఆదుకున్నారు. చివరి ఓవర్లో ‘హ్యాట్రిక్‌’తో టై పుణేను పూర్తిగా కట్టి పడేశాడు. తొలి మూడు బంతులకు టై వరుసగా అంకిత్‌ శర్మ, మనోజ్‌ తివారి, శార్దుల్‌ ఠాకూర్‌లను అవుట్‌ చేశాడు.

ఆరంభం అదిరింది...
ఛేదనను లయన్స్‌ విధ్వంసకర రీతిలో ప్రారంభించింది. అంకిత్‌ వేసిన తొలి ఓవర్లో స్మిత్‌ 2 ఫోర్లు, సిక్స్‌ బాదడంతో 16 పరుగులు రాగా... 2వ, 4వ ఓవర్లలో లయన్స్‌ 11 పరుగుల చొప్పున రాబట్టింది. ఆ తర్వాత తాహిర్‌ మొదటి ఓవర్లో మెకల్లమ్‌ 2 ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగిపోయాడు. తాహిర్‌ తర్వాతి ఓవర్‌ గుజరాత్‌కు మరింత కలిసొచ్చింది. మొదటి మూడు బంతుల్లో మెకల్లమ్‌ 4, 4, 6 కొట్టగా, స్మిత్‌ మరో బౌండరీ బాదడంతో ఏకంగా 20 పరుగులు లభించాయి. ఎట్టకేలకు స్మిత్‌ను ఠాకూర్‌ అవుట్‌ చేసి పుణేకు ఊరటనందించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే తక్కువ వ్యవధిలో మెకల్లమ్, కార్తీక్‌ (3) వెనుదిరిగారు. అయితే రైనా, ఫించ్‌ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా రెండు ఓవర్ల ముందే జట్టును గెలిపించారు.  

16 ఐపీఎల్‌ చరిత్రలో నమోదైన మొత్తం ‘హ్యాట్రిక్‌’ల సంఖ్య. లక్ష్మీపతి బాలాజీ, మఖాయ ఎన్తిని, రోహిత్‌ శర్మ, ప్రవీణ్‌ కుమార్, అజిత్‌ చండిలా, సునీల్‌ నరైన్, ప్రవీణ్‌ తాంబే, షేన్‌ వాట్సన్, అక్షర్‌ పటేల్, సామ్యూల్‌ బద్రీ, ఆండ్రూ టై ఒక్కోసారి ‘హ్యాట్రిక్‌’ సాధించగా... యువరాజ్‌ సింగ్‌ రెండు సార్లు, అమిత్‌ మిశ్రా అత్యధికంగా మూడుసార్లు ‘హ్యాట్రిక్‌’ నమోదు చేశారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement