ధోని దూకుడు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 163 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అజింక్యా రహానే(56;43 బంతుల్లో 5 ఫోర్లు 1సిక్స్), మనోజ్ తివారీ(58;;48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ల బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు, మహేంద్ర సింగ్ ధోని(40 నాటౌట్;26 బంతుల్లో 5 సిక్సర్లు) దూకుడు జత కావడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ త్రిపాఠి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(1) కూడా వెంటనే పెవిలియన్ చేరడంతో పుణె తొమ్మిదిపరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తరుణంలో రహానే -తివారీల జోడి స్కోరు బోర్డును చక్కదిద్దింది.ఈ క్రమంలోనే రహానే 39 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 80 పరుగులు జత చేసిన తరువాత రహానే మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అప్పుడు తివారీకి ధోని జతకలిశాడు. వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో పుణె రన్ రేట్ తగ్గింది. అయితే ఆఖరి రెండు ఓవర్లలో ధోని బ్యాట్ ఝుళిపించడంతో పుణె స్కోరు బోర్డులో వేగం పెరిగింది. చివరి రెండు ఓవర్లలో ధోని నాలుగు సిక్సర్లు సాధించడం ఇక్కడ విశేషం. దాంతో పుణె నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మలింగా, మెక్లీన్ గన్, కరణ్ శర్మలకు తలో వికెట్ దక్కింది.