ఐపీఎల్ విజేత ఎవరో?
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 విజేత ఎవరో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్- ముంబై ఇండియన్స్ ల మధ్య తుది సమరం జరుగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 3–0తో పుణెదే పైచేయి అయినా... ‘ఫైనల్ పంచ్’తో ఆ మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. తన సారథ్యంలో మరో లీగ్ టైటిల్‌ను సాధించాలని రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతుండగా... కెప్టెన్‌గా తనపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌కు ట్రోఫీ విజయాన్ని కానుకగా అందించాలని స్టీవ్ స్మిత్ పట్టుదలగా ఉన్నాడు.
పుణె అసాధారణ ప్రదర్శనలో కెప్టెన్ స్మిత్‌తో పాటు ధోని పాత్ర కూడా చాలా ఉంది. ఐపీఎల్‌లో తను అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్‌కు అండగా నిలిచాడు. మేనేజ్‌మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నా... బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతని అంకిత భావంలో ఎలాంటి లోపం లేకుండా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. స్మిత్‌కు ఇప్పుడు మరో మ్యాచ్‌లో ఆ అవసరం ఉంది. ఏడో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న ధోని, స్మిత్‌తో కలిసి జట్టును నడిపిస్తే పుణెకు తిరుగుండదు.
మరొకవైపు బ్యాటింగ్‌లో కూడా ముంబైకి తిరుగులేదు. ప్రధానంగా రోహిత్ , అంబటి రాయుడు, పాండ్యా బ్రదర్స్, పొలార్డ్‌లపైనే ముంబై బ్యాటింగ్ లో కీలకం. ఇరు జట్లు గత మ్యాచ్ లో ఆడిన తుది జట్టుతోనే బరిలోకి దిగుతున్నాయి. దాంతో ముంబై ఇండియన్స్ జట్టులో హర్భజన్ సింగ్ కు స్థానం దక్కలేదు.
ముంబై తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), పార్ధీవ్ పటేల్, అంబటి రాయుడు, సిమన్స్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, మిచెల్ జాన్సన్, కరణ్ శర్మ, బూమ్రా, మలింగా
పుణె తుది జట్టు: :స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, మనోజ్ తివారీ,ఎంఎస్ ధోని, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గ్యుసన్, ఆడమ్ జంపా, శార్దూల్ ఠాకూర్, ఉనద్కత్