రైజింగ్ పుణె వ్యూహం ఫలించింది..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్. ఐపీఎల్ ఆరంభంలో మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్ గా తప్పించి పెద్ద సాహసమే చేసింది పుణె. ఆ జట్టు కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ను నియమించడంతో పాటు ఫ్రాంచైజీ పేరులో కూడా కొద్ది పాటి మార్పు చేసింది. గతేడాది రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ గా బరిలోకి దిగిన ఆ జట్టు.. ప్రస్తుత సీజన్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్గా పోరుకు సిద్ధమైంది. ఇదిలా ఉంచితే, టోర్నీ ఆరంభంలో ఆడపా దడపా విజయాలతో వెనుకబడినప్పటికీ, చివరికి వచ్చేసరికి ఫైనల్ కు చేరి భళా అనిపించింది.
అయితే పుణె తుది పోరుకు చేరడంలో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు వాషింగ్టన్ సుందర్ పాత్ర వెలకట్టలేనిది. ముంబై ఇండియన్స్ తో్ జరిగిన క్వాలిఫయర్ -1లో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. . నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ వేసి మూడు వికెట్లు సాధించాడు. దాంతో పాటు 16 పరుగులు మాత్రమే ఇచ్చి పటిష్టమైన ముంబైని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 10 మ్యాచ్ లాడిన సుందర్ ఎనిమిది వికెట్లు తీసి పుణె విజయాల్లో తన వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించాడు. కేవలం ఓ అనామక క్రికెటర్ లా లీగ్ లో కి ప్రవేశించిన సుందర్ ఇప్పుడు స్టార్ బౌలర్ మాదిరి ప్రశంసలు అందుకుంటున్నాడు
స్మిత్ వికెట్ పడగొట్టి జట్టులోకి వచ్చాడు..
రైజింగ్ పుణే జట్టుకు గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సుందర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అశ్విన్ లోటును భర్తీ చేసేందుకు సుందర్ ఎంపిక చేసింది పుణె. సుందర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి స్పిన్ బౌలర్. బంగ్లాలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ జట్టులో సుందర్ కీలక ఆటగాడు. విజయ్‌హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.
అశ్విన్ స్థానానికి సుందర్ జమ్ముకశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణే జట్టు నెట్స్‌లో బౌలింగ్ పరీక్ష చేసింది. వీరిద్దరూ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోని, బెన్ స్ట్రోక్స్ లకు నెట్స్‌లో బౌలింగ్ చేశారు. అయితే సుందర్ కెప్టెన్ స్మిత్ వికెట్ పడగొట్టడంతో అవకాశం పొందాడు. వాషింగ్టన్ ఎంపికలో పుణె వ్యూహం ఫలించిందనే చెప్పాలి. కీలక మ్యాచ్ లో సాధారణ స్కోరును కాపాడుకుని పుణె విజయంలో సాధించడంలో సుందర్ పాత్ర వెలకట్టలేనిది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను తన స్పిన్ మ్యాజిక్ తో బోల్తా కొట్టించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.