రైజింగ్ పుణెకు ఎదురుదెబ్బ
పుణె: ఐపీఎల్-10లో ప్లే ఆఫ్ కు చేరి మంచి ఊపుమీద ఉన్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పెట్టి మరీ దక్కించుకున్న ఆ జట్టు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ప్లే ఆఫ్ కు దూరమవుతున్నాడు. బెన్ స్టోక్స్ ను ఉన్నపళంగా వచ్చేయమంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) హెచ్చరికలు జారీ చేయడంతో అతను స్వదేశానికి పయనం కానున్నాడు. స్టోక్స్ ప్లే ఆఫ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని కింగ్స్ పంజాబ్ మ్యాచ్ తరువాత పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. ప్లే ఆఫ్ కు స్టోక్స్ లేకపోవడం పూడ్చలేని లోటుగా స్మిత్ అభివర్ణించాడు.
'జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో స్టోక్స్ స్వదేశానికి వెళ్లనున్నాడు. స్టోక్స్ ప్లే ఆఫ్ కు లేకపోవడం పూడ్చలేని లోటు. అయినప్పటికీ మాకున్న అనేక ఆప్షన్లను పరిశీలించి స్టోక్స్ లేని లోటును పూడ్చుకుంటామని ఆశిస్తున్నా. రిజర్వ్ బెంచ్ లో మా జట్టు మెరుగ్గానే ఉంది. దాంతో స్టోక్స్ కు ప్రత్యామ్నాయం వెతుకుతాం' అని స్మిత్ పేర్కొన్నాడు. మరొకవైపు కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయంపై స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు. 'ఇది మాకు చాలా గొప్ప రోజు. మా బౌలర్లు చెలరేగి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లు ముగిసే వరకూ ఆటగాళ్ల కోసం అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలువురు కొత్త ఆటగాళ్లకు వెలుగులోకి వచ్చారు. దాంతో మా జట్టు సమతుల్యంగా తయారైంది. రెండో విడత మ్యాచ్ ల్లో మా జట్టు అనేక మంచి విజయాల్ని సొంతం చేసుకుంది' అని జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్లో 12 మ్యాచ్ లు ఆడిన స్టోక్స్ 316 పరుగులు నమోదు చేశాడు. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 నాటౌట్. ఇక బౌలింగ్ లో 12 వికెట్ల తీసి ఫర్వాలేదనిపించాడు.ప్రస్తుతం అతను స్వదేశానికి పయనం కానుండటంతో పుణెకు ప్లే ఆఫ్ కు ముందు గట్టి ఎదురుదెబ్బగా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.