అప్పటివరకూ ఐపీఎల్ ఆడను: కోహ్లీ
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటని ఐపీఎల్-10లో ఎప్పుడు చూస్తామా అని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. వారం రోజుల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీని మైదానంలో చూసే వీలుందని కథనాలు వచ్చాయి. మరోవైపు కోహ్లీ మాత్రం ఈ ఊహాగానాలకు తెరదించాడు. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఈ ఐపీఎల్‌ను ఏ మ్యాచ్‌తో స్టార్ట్ చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను కచ్చితంగా 120 శాతం ఫిట్‌గా ఉన్నట్లు భావిస్తేనే ఈ ఐపీఎల్‌లో ఆడతానని లేనిపక్షంలో ఆడే అవకాశమే లేదన్నాడు. అందుకే పలానా రోజు బరిలోకి దిగుతున్నట్లు ఇప్పుడే చెప్పడం కష్టమన్నాడు. త్వరలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం కావాలంటే ఇప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు.
'ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో గాయపడ్డ నేను ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఆడలేకపోయాను. ఇప్పుడు సన్ రైజర్స్‌తో మ్యాచ్‌కూ దూరమయ్యాను. గాయం నుంచి త్వరగా కోలుకుని బరిలోకి దిగాలని ఉంది. అయితే చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా వ్యహరించాల్సి ఉంటుంది. యువరాజ్ మళ్లీ ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇది జట్టుకు కలిసొచ్చే అంశం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెగ్గిన విషయం తెలిసిందే.