2 పరుగులు తీద్దామని కొడితే.. సిక్సర్ వెళ్లింది!
ఐపీఎల్ పదో సీజన్ మొత్తం తీవ్రంగా నిరాశపరిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తాము ఢిల్లీ డేర్ డెవిల్స్ మీద ఆడిన చిట్టచివరి మ్యాచ్‌లో మాత్రం గెలిచింది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు. ముఖ్యంగా కోరీ ఆండర్సన్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన షాట్ ఎవరూ మర్చిపోలేరు. నిజానికి ఈ టోర్నమెంటు మొత్తమ్మీద కోహ్లీ కేవలం నాలుగే అర్ధసెంచరీలు చేశాడు. తొమ్మిదో సీజన్‌లో అయితే ఏకంగా 11 సార్లు 50కి పైగా పరుగులు కోహ్లీ ఖాతాలో పడ్డాయి. సీజన్ ప్రారంభంలో భుజానికి గాయం వల్ల కొన్ని మ్యాచ్‌లకు కూడా కోహ్లీ దూరంగా ఉన్నాడు. చివరిమ్యాచ్‌లో మాత్రం మళ్లీ తనదైన ఆటతీరు కనబరిచాడు.
అయితే.. కోహ్లీ కొట్టిన సిక్సర్లలో ఒకటి చూస్తే మాత్రం అసలు ఎవరూ తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. అప్పటికి 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆడుతున్న కోహ్లీ.. కోరీ ఆండర్సన్ బౌలింగ్‌లో ఓ చిత్రమైన షాట్ కొట్టాడు. ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి ఏదో చిన్న షాట్ కొట్టినట్లుగా కొడితే, అది కాస్తా ఏకంగా 67 మీటర్ల దూరం వరకు గాల్లోనే ప్రయాణించి సిక్సర్‌గా మారింది. ఆ షాట్ ఆడిన తర్వాత కోహ్లీ ఎందుకో నవ్వుకున్నాడు. ఆ నవ్వు ఎందుకో మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసింది. వాస్తవానికి తాను ఫీల్డర్ల మధ్య నుంచి బాల్ కొట్టి, రెండు పరుగులు తీయాలని అనుకున్నానని, కానీ కోరీ క్రాస్-సీమ్ బాల్ వేయడంతో తాను సంతోషంగా దాన్ని కొట్టానని, అనుకోకుండా అది సిక్స్ వెళ్లిపోయిందని కోహ్లీ మ్యాచ్ అయిపోయాక ప్రజంటేషన్ సమయంలో చెప్పాడు. అయితే మొత్తమ్మీద ఈ సీజన్‌లో మాత్రం కోహ్లీ ఆటతీరు గానీ, ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ గానీ ఏమాత్రం బాగోకపోవడం మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.