ధోనీ వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా? | MS Dhoni proves his age is not on obstacle | Sakshi
Sakshi News home page

ధోనీ వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా?

Published Sat, May 13 2017 5:40 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

ధోనీ వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా?

ధోనీ వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా?

మహేంద్ర సింగ్ ధోనీ.. కాగితాల్లో లెక్కల ప్రకారం అతడి వయసు 35 సంవత్సరాలు. కానీ అతడి ఫిట్‌నెస్ లెవెల్స్, వికెట్ల వెనక చురుగ్గా చిరుతలా కదిలే విధానం చూస్తే మాత్రం పాతికేళ్ల కుర్రాళ్లు కూడా అతడి ముందు బలాదూర్‌గానే కనిపిస్తారు. నిజంగా అసలు ధోనీ వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా అనే అనుమానం సగటు ప్రేక్షకులతో పాటు అతడి అభిమానులకు కూడా కలుగుతోంది. వికెట్ల వెనక ధోనీ ఉన్నాడంటే బౌలర్‌కు కొండంత బలం. వందలో వెయ్యోవంతు అవకాశం వచ్చినా బ్యాట్స్‌మన్ ఇక ఇంటికి వెళ్లాల్సిందే. శుక్రవారం నాటి మ్యాచ్‌లో తనలో ఉన్న అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలను ధోనీ మరోసారి ప్రదర్శించాడు. కనురెప్ప వాల్చి మళ్లీ తెరిచేలోగా బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసి ఔరా అనిపించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ మ్యాజిక్ చూసి ప్రేక్షకులు స్టేడియంను హోరెత్తించారు. అయితే, ధోనీ అంత ప్రయత్నించినా తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

ఢిల్లీ జట్టులో అత్యంత ప్రమాదకారి అయిన మార్లన్ శామ్యూల్స్‌ను ఔట్ చేసిన విధానం చూసి జనమంతా ఔరా అన్నారు. డాన్ క్రిస్టియన్ వేసిన షార్ట్ డెలివరీని శామ్యూల్స్ పైకి లేపాడు. వాస్తవానికి అది వికెట్ కీపర్‌కు అందేంత దూరం కానే కాదు. కానీ ధోనీ ఒక్కసారిగా ఎడమ పక్కకు స్ట్రెచ్ అయ్యి, గాల్లోకి లేచి ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు. ఇంకా తాను కొట్టిన షాట్‌కు ఆ బాల్ ఎక్కడికో వెళ్లి పడుతుందనుకున్న శామ్యూల్స్.. ఒక్కసారిగా షాకై పెవిలియన్ బాట పట్టాడు. ఇక మరో హిట్టర్ కోరీ ఆండర్సన్‌ను ధోనీ ఔట్ చేసిన తీరు అతడి మెరుపు వేగాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించింది. పుణె జట్టులోని స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్టంప్‌కు దూరంగా కొట్టిన బంతిని కొట్టడానికి ఆండర్సన్ విఫలయత్నం చేసి క్రీజ్ నుంచి ఒక కాలు బాగా బయటపెట్టి రెండోకాలు గాల్లోకి లేపాడు. చిరుత వేగంతో కదిలిన ధోనీ.. వెంటనే అరక్షణంలో ధోనీ అతడిని స్టంప్ చేశాడు. అంపైర్లు కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేక థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. ధోనీ కదలడం, వికెట్ పడకపోవడం ఉంటాయా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement