కెప్టెన్ ఎవరైనా.. చేసిందంతా ధోనీయే!
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీ చేశాడు. పుణె జట్టును దగ్గరుండి విజయపథంలో నడిపించాడు. అందుకు అంతా అతడి మీద ప్రశంసలు కురిపించారు. కానీ.. నిజానికి మ్యాచ్ చూసిన వారందరికీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది. కెప్టెన్ ఎవరైనా ఫీల్డ్‌లో అల్టిమేట్ బాస్‌గా మాత్రం ధోనీయే వ్యవహరించాడు. చాలా సందర్భాలలో ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లను ధోనీయే సెట్ చేశాడు. ఆ సమయంలో స్మిత్ మాత్రం బౌలర్లతో మాట్లాడుతూ కనిపించాడు. అంతేకాదు, చాలా సందర్భాల్లో ధోనీ సలహాలను కెప్టెన్ స్మిత్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని పుణె బ్యాట్స్‌మన్ అజింక్య రహానే కూడా చెప్పాడు.
ఆస్ట్రేలియా జట్టుకు స్మిత్ మంచి సారథే గానీ, తనకు మాత్రం ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ నాయకుడని రహానే అన్నాడు. అయితే నాయకత్వ నైపుణ్యాల విషయంలో మాత్రం ధోనీకి, స్మిత్‌కు మధ్య పోలికలు చూసేందుకు నిరాకరించాడు. తాను స్మిత్ కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడానని, ధోనీ కెప్టెన్సీలో మాత్రం విస్తృతంగా ఆడానని చెప్పాడు. ధోనీ ఇప్పటికీ వరల్డ్ క్లాస్ నాయకుడు, ఆటగాడని అభవర్ణించాడు.
ముంబై ఇండియన్స్ జట్టును 184 పరుగులకే నియంత్రించడంలో బౌలర్లు బాగా రాణించారని రహానే అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఓపెనర్లు పార్థివ్ పటేల్, జాస్ బట్లర్ అద్భుతమైన స్టార్టింగ్ ఇచ్చినా దాన్ని వీళ్లు బ్రేక్ చేశారని అన్నాడు. ఇమ్రాన్ తాహిర్ వెంటవెంటనే తీసిన మూడు వికెట్లు మ్యాచ్‌ని మంచి మలుపు తిప్పాయన్నాడు. తాహిర్, ఆడం జంపాల రూపంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లను వాడుకోవాలన్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చిందని రహానే వివరించాడు.