టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో ఐపీఎల్ పదో సీజన్‌లో పెద్దగా మెరుపులు చూపించకపోయినా.. దాన్నుంచి బయటపడి ఎలా విజృంభించాలో అతడికి బాగా తెలుసని ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. తగినంత పాం లేకపోవడం ప్రతి క్రికెటర్‌తోనూ జరుగుతుందని, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విషయం తీసుకుంటే ఆయన కూడా ప్రతి సంవత్సరం ఒకేలా ఆడలేదని చెప్పాడు. మీడియా ప్రశ్నలు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయని, సమయంతో పాటే ఫాం కూడా మారుతుందని వీరూ అన్నాడు. బ్యాడ్ ఫాం నుంచి మళ్లీ గుడ్ ఫాంలోకి రావడమే మంచి ప్లేయర్‌కు హాల్‌మార్క్ లాంటిదని విశ్లేషించాడు. 92.7 బిగ్ ఎఫ్ఎం చానల్ నిర్వహించిన కార్యక్రమంలో.. ఐపీఎల్ పదో సీజన్‌లో ఆర్‌సీబీ జట్టు గురించి అడిగిన ప్రశ్నలకు సెహ్వాగ్ ఈ విధంగా బదులిచ్చాడు.
ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 27 సగటు, 64 పరుగుల అత్యధిక స్కోరుతో కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 250 పరుగులు మాత్రమే చేశాడు. జూన్ ఒకటో తేదీ నుంచి ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు కోహ్లీయే నేతృత్వం వహించనున్నాడు. టి20లు ఆడినంత మాత్రాన మళ్లీ 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సెహ్వాగ్ కచ్చితంగా చెప్పాడు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్ కూడా అయిన సెహ్వాగ్.. తమ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకుంటుందా లేదా అనేది ఇతర జట్ల మీద కూడా ఆధారపడి ఉందని తెలిపాడు. పుణె, హైదరాబాద్, కోల్‌కతా మూడు జట్లు ఓడిపోతే తమకు క్వాలిఫై అయ్యేందుకు ఒక చాన్స్ ఉంటుందన్నాడు. అదే సమయంలో తమ జట్టు రన్‌రేట్ బాగా ఉండాలని, అప్పుడే క్వాలిఫై అవుతామని వివరించాడు.
కోహ్లీ కుమ్ముడు గ్యారంటీ: సెహ్వాగ్
Published Fri, May 12 2017 5:26 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
Advertisement
Advertisement