ధావన్ చాలా ప్రమాదకారి: వార్నర్
హైదరాబాద్: ఐపీఎల్ తాజా సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, గతేడాది రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో విజయం తమదేనని సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ధీమ్ వ్యక్తం చేశాడు. పొట్టి ఫార్మాట్ లో శిఖర్ ధావన్ చాలా ప్రమాదకారి అని అతడు విధ్వసం మొదలుపెడితే సగం విజయం మాదేనన్నాడు. అతడితో పాటు యువరాజ్ సింగ్, భువనేశ్వర్, అశీస్ నెహ్రాలపై తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నాడు. గతేడాది నెగ్గిన ఉత్సాహంతో డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు. కేన్ విలియమ్సన్, మోసెస్ హెన్రిక్స్, నమన్ ఓజా, దీపక్ హూడాలు సాధ్యమైనంత త్వరగా ఫార్మాట్లో అద్భుతాలు చేస్తే అద్బుత విజయాలు సాధ్యమని అభిప్రాయపడ్డాడు.
‘గత సీజన్ ఫైనల్లో బెంగళూరును ఓడించడం నిజంగానే ఓ అచీవ్ మెంట్. అయితే మొదట మేం చాంపియన్లం అనే విషయాన్ని జీర్ణించుకోవాలి. స్వల్ప స్కోర్లు చేసిన మ్యాచ్ లను శాసించాం. గతేడాది దిగిన బ్యాటింగ్ లైనప్ తోనే బరిలోకి దిగుతాం. ఇంకా కొంత అదనపు బలం చేకూరింది. కుర్రాళ్లంతా ఎంతో ఉత్సాహంగా ఆట మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గతేడాది ఫైనల్లో వచ్చిన ఫలితాన్ని నేటి మ్యాచ్ లో పునరావృతం చేస్తాం’ అని డాషింగ్ ప్లేయర్ వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–పదో సీజన్ తొలి మ్యాచ్ కు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికైంది. నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రాంరంభం కానుంది.