రెండు సెంచరీలు... ప్చ్!
మొహాలీ: అతడు రెండుసార్లు సెంచరీ కొట్టినా జట్టు విజయం సాధించలేదు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడి శతకాలు బాదినా గెలుపు మాత్రం దక్కలేదు. ఐపీఎల్-10లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు హషిమ్ ఆమ్లా సెంచరీలు చేసిన రెండు సందర్భాల్లోనూ జట్టు పరాజయం పాలైంది. గుజరాత్ లయన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆమ్లా అద్భుతంగా ఆడి (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. అయితే చెత్త ఫీల్డింగ్‌తో పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆమ్లా శతకం వృధా అయింది.
అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆమ్లా శతకం బాదాడు. 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై టీమ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఆమ్లా శ్రమ ఫలించలేదు.
తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేయడం ఆనందంగా ఉందని ఆమ్లా తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన శైలి ఉంటుందని, తాను మంచి షాట్లు కొట్టానని చెప్పాడు. తమ జట్టు ప్లేఆఫ్ కు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. స్వదేశానికి పయనమవుతున్న ఆమ్లా మిగతా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఈ సీజన్‌లో అతడు 10 మ్యాచులు ఆడి 420 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.