చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌.. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి | Tri Series Final, PAK VS NZ: Babar Azam Becomes The Joint Fastest To Complete 6000 Runs In ODI History | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌.. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి

Published Fri, Feb 14 2025 3:42 PM | Last Updated on Fri, Feb 14 2025 3:50 PM

Tri Series Final, PAK VS NZ: Babar Azam Becomes The Joint Fastest To Complete 6000 Runs In ODI History

పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిమ్‌ ఆమ్లాతో (Hashim Amla) కలిసి వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా బాబర్‌ రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో 6000 పరుగులు పూర్తి చేసేందుకు ఆమ్లా, బాబర్‌కు తలో 123 ఇన్నింగ్స్‌ అవసరమయ్యాయి.

కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్రై సిరీస్‌ (Pakistan Tri Series) ఫైనల్లో బాబర్‌ ఈ ఘనత సాధించాడు. ఆమ్లా, బాబర్‌ తర్వాత టీమిండియా స్టార్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి (Viart Kohli) వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని తాకేందుకు విరాట్‌కు 136 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. 

వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్‌-5 ఆటగాళ్లలో బాబర్‌, ఆమ్లా, విరాట్‌ తర్వాతి స్థానాల్లో కేన్‌ విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌ ఉన్నారు. కేన్‌ మామ, వార్నర్‌ భాయ్‌ తలో 139 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రై సిరీస్‌లోనే (సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో) కేన్‌ విలియమ్సన్‌ 6000 పరుగుల క్లబ్‌లో చేరాడు.

ట్రై సిరీస్‌ ఫైనల్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. పాక్‌ 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. గత కొంతకాలంగా ఫామ్‌లో లేని బాబర్‌ ఆజమ్‌ (29) ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఫకర్‌ జమాన్‌ (10), సౌద్‌ షకీల్‌ (8) కూడా తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (0), సల్మాన్‌ అఘా (0) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో విలియమ్‌ ఓరూర్కీ, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, నాథన్‌ స్మిత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

కాగా, పాకిస్తాన్‌, దుబాయ్‌ వేదికలుగా ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్‌ స్వదేశంలో ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో పాక్‌ సహా సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నీలో ఫైనల్‌ ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్‌ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్‌లో పాక్‌ 353 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరింది.

ఇదిలా ఉంటే, ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు గ్రూప్‌-ఏలో ఉండగా.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు పోటీపడుతున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement