
PAK VS NZ 4th ODI: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాబర్ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. గతంలో వేగవంతమైన 5000 పరుగుల రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు ఈ మైలురాయిని అందుకునేందుకు 101 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
న్యూజిలాండ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న నాలుగో వన్డేలో 19 పరుగుల వద్ద బాబర్ 5000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. గతేడాది బాబర్.. హషీమ్ ఆమ్లా పేరిటే ఉన్న వేగవంతమైన 4000 పరుగుల రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఆమ్లా 81 ఇన్నింగ్స్‌ల్లో ఆ ఫీట్‌ను సాధిస్తే, బాబార్ 82 ఇన్నింగ్స్‌ల్లో ఆ మైలురాయిని అధిగమించాడు. గత రెండేళ్లుగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బాబర్.. 5000 పరుగులు పూర్తి చేసిన 14వ పాకిస్తానీ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. 28 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఫకర్ జమాన్ (14) త్వరగా ఔటవ్వగా.. షాన్ మసూద్ (44), మహ్మద్ రిజ్వాన్ (24) పర్వాలేదనిపించారు. బాబర్ ఆజమ్ (55), అఘా సల్మాన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను పాక్ ఇదివరకే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కాకుండా సిరీస్‌లో మరో మ్యాచ్ (ఐదో వన్డే) మిగిలి ఉంది. అంతకుముందు ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ డ్రాగా ( 2-2) ముగిసింది.