fourth ODI
-
ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాక్ కెప్టెన్
PAK VS NZ 4th ODI: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాబర్ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. గతంలో వేగవంతమైన 5000 పరుగుల రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు ఈ మైలురాయిని అందుకునేందుకు 101 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. న్యూజిలాండ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న నాలుగో వన్డేలో 19 పరుగుల వద్ద బాబర్ 5000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. గతేడాది బాబర్.. హషీమ్ ఆమ్లా పేరిటే ఉన్న వేగవంతమైన 4000 పరుగుల రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఆమ్లా 81 ఇన్నింగ్స్‌ల్లో ఆ ఫీట్‌ను సాధిస్తే, బాబార్ 82 ఇన్నింగ్స్‌ల్లో ఆ మైలురాయిని అధిగమించాడు. గత రెండేళ్లుగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బాబర్.. 5000 పరుగులు పూర్తి చేసిన 14వ పాకిస్తానీ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. 28 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఫకర్ జమాన్ (14) త్వరగా ఔటవ్వగా.. షాన్ మసూద్ (44), మహ్మద్ రిజ్వాన్ (24) పర్వాలేదనిపించారు. బాబర్ ఆజమ్ (55), అఘా సల్మాన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను పాక్ ఇదివరకే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కాకుండా సిరీస్‌లో మరో మ్యాచ్ (ఐదో వన్డే) మిగిలి ఉంది. అంతకుముందు ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ డ్రాగా ( 2-2) ముగిసింది. -
గెలిస్తేనే... సిరీస్‌లో నిలుస్తాం
లక్నో: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో వెనుకబడిన భారత మహిళల జట్టు కఠిన సవాల్ ముందు నిలబడింది. ఆదివారం జరిగే నాలుగో వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో మిథాలీ సేన నిలిచింది. లేదంటే ఈ మ్యాచ్ ఓడితే ఐదు వన్డేల సిరీస్‌ను ఆఖరి వన్డేకు ముందే ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 2–1తో ముందంజలో ఉన్న దక్షిణాఫ్రికా మహిళలు... సిరీసే లక్ష్యంగా నాలుగో వన్డే బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తీవ్ర ఒత్తిడిలో ఉన్న మిథాలీ జట్టు సర్వశక్తులు ఒడ్డి అయినా సిరీస్‌లో సజీవంగా నిలవాలని ఆశిస్తోంది. గడిచిన మూడు మ్యాచ్‌ల్లో నిలకడలేని టాపార్డర్ ప్రదర్శన జట్టుకు సమస్యగా మారింది. యువ ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ వరుసగా 1, 9, 0లతో తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి వన్డేలో విఫలమైన స్మృతి మంధాన రెండో వన్డేలో అదరగొట్టింది. కానీ గత మ్యాచ్‌లో దాన్ని పునరావృతం చేయలేకపోయింది. పూనమ్ రౌత్ మాత్రం గత రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీలతో ఫామ్‌లోకి వచ్చింది. ఈ టాప్–3 బ్యాటర్స్ పటిష్టమైన పునాది వేస్తే కెప్టెన్ మిథాలీ రాజ్, ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ మిగతా ఇన్నింగ్స్‌ను నిలబెడతారు. ఇక దక్షిణాఫ్రికా మహిళల జట్టులో ఓపెనర్ లిజెల్ లీ టాప్ ఫామ్‌లో ఉంది. సఫారీ గెలిచిన తొలి, మూడో వన్డేల్లో ఆమె అర్ధసెంచరీ, అజేయ సెంచరీలతో కీలక భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో మిథాలీ సేన లిజెల్ లీని తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ పట్టుబిగించేందుకు ఆస్కారముంటుంది. అనుభవజ్ఞురాలైన వెటరన్ సీమర్ జులన్ గోస్వామి నిప్పులు చెరిగితే భారత మహిళల జట్టు 2–2తో సమం చేసే అవకాశాలు మెరుగవుతాయి. -
నాలుగో వన్డేలోనూ ఆసీస్‌దే గెలుపు
దుబాయ్: కెరీర్లో తొలి వన్డే ఆడిన ఆబిద్ అలీ (119 బంతుల్లో 112; 9 ఫోర్లు)తో పాటు మొహమ్మద్ రిజ్వాన్ (102 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో కదం తొక్కినా... పాకిస్తాన్‌ను గెలిపించలేకపోయారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 6 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌లో 4–0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (82 బంతుల్లో 98; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) 2 పరుగులతో సెంచరీని కోల్పోగా... ఓపెనర్ ఖాజా (78 బంతుల్లో 62; 6 ఫోర్లు), క్యారీ (67 బంతుల్లో 55; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత పాక్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఆబిద్, రిజ్వాన్ మూడో వికెట్‌కు 144 పరుగులు జోడించి గెలుపుపై ఆశలు పెంచినా ఆబిద్ ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. నేడు ఆఖరి వన్డే ఇక్కడే జరుగనుంది. -
నాలుగో వన్డే: టాస్ గెలిచిన భారత్
మొహాలి: ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 తేడాతో ముందజలో ఉండగా.. ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు భారత్ ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను ఖతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ధోని స్థానంలో యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌కు భారత జట్టులో చోటు కల్పించారు. జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, బుమ్రా. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్‌వెల్, ఆస్టాన్ టర్నర్, క్యారీ, రిచర్డ్సన్, కమిన్స్, జాసన్ బెహ్రండోర్ఫ్, జంపా. -
సిరీస్... నేడు గెలుస్తారా? ఆఖరి దాకా రానిస్తారా?
వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌కు గత మ్యాచ్‌లో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో నేడు నాలుగో మ్యాచ్‌కు కోహ్లి సేన సిద్ధమైంది. ఇక్కడే సిరీస్‌ను గెలుపుతో ముగిస్తారా లేక ఆఖరిదాకా తీసుకొస్తారా అనేది నేటి మ్యాచ్ ఫలితంతో తేలుతుంది. కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉండగా... అతనికి అండగా నిలిచేవారూ, బాగా ఆడేవారు కరువయ్యారు. ఆ ఒక్కడిపైనే భారం వేయకుండా బాధ్యతగా అందరూ ఆడితేనే జట్టు సమష్టితత్వంతో గెలుస్తుంది. లేదంటే ఆసీస్ సిరీస్‌ను సమం చేయడం గ్యారెంటీ! మొహాలి: భారత్ ఇక్కడ గెలవాలన్నా... ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్నా... టీమిండియా ఆటగాళ్లంతా కష్టపడాలి. అప్పుడే ప్రపంచకప్ సన్నాహాన్ని విజయంతో ముగించగలం. అలా కాదని ఏ ఒక్కరి మీదో ఆధారపడితే మళ్లీ చేదు ఫలితం... ఆఖరిదాకా (ఐదో వన్డే) పోరాటం... ఈ రెండూ తప్పవు. ఈ సిరీస్‌లో గెలుపు రుచి చూసిన ఆస్ట్రేలియా ఇప్పుడు సమంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నాలుగో వన్డే రసవత్తర పోరుకు తెరతీస్తుందేమో చూడాలి. ఆస్ట్రేలియా గత మ్యాచ్ విజయంతో టచ్‌లోకి వచ్చింది. భారత్ బలగాన్ని దెబ్బ తీసింది. భారత బలం కూడా అర్థమైపోయింది. ధోని దూరమైన బృందంలో ఒకే ఒక్కడి (కోహ్లి) వికెట్‌తో మళ్లీ మ్యాచ్ గెలవొచ్చని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్‌లో కోహ్లి... భారత సారథి కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌ను మజా చేసుకుంటున్నాడు. సెంచరీలతో పండగ చేసుకుంటున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో మూడే మ్యాచ్‌లాడిన కెప్టెన్ మూడొందలకు (283 పరుగులు) చేరువయ్యాడు. ఇందులో రెండు సెంచరీలుండటం విశేషం. అతను ఐదునెలల క్రితమే (అక్టోబర్)లో 10 వేల పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆడింది 12 మ్యాచ్‌లే... కానీ స్కోరేమో 10, 816కు చేరింది. ఇంతగా ఎవరికీ సాధ్యంకానీ నిలకడతో, ఎవరికీ సాధ్యంకానీ ఆటను అతను ఆడుతున్నాడు. కానీ సహచరులే టీమిండియా కొంపముంచుతున్నారు. గత మ్యాచ్‌లో ఏ ఒక్కరైనా ఫిఫ్టీ చేసినా, లేదంటే ఏ ఇద్దరు 30 చొప్పున పరుగులు చేసినా భారతే గెలిచేది. కానీ ఎవరూ ఆ బాధ్యత తీసుకోలేదు. కనీసం పీకలమీదికి (ఐదో వన్డే దాకా) రాకముందే ఈ మ్యాచ్‌లోనైనా భారత ఆటగాళ్లు తమ వంతు సహకారాన్ని కెప్టెన్‌కు అందించాలి. కలిసికట్టుగా కంగారూ పనిపట్టాలి. ప్రపంచకప్ దగ్గరవుతున్న కొద్దీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్‌కు దూరమవుతుండటం టీమ్ మేనేజ్మెంట్కు సమస్యగా మారింది. రోహిత్ ప్రదర్శన అతని కంటే మెరుగే కానీ గొప్పగా ఏమీ లేదు. 51 పరుగులే చేయగలిగాడు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (33 పరుగులు) ఇచ్చిన అవకాశాలన్నీ చేజార్చుకున్నాడు. ఇప్పుడైనా అతను కళ్లు తెరవాలి. బ్యాట్‌కు పనిచెప్పాలి. లేదంటే ప్రపంచకప్ సంగతేమో గానీ... ఐదో వన్డేకే బెర్తు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే కోహ్లి జట్టులో మార్పులుంటాయని కరాఖండీగా చెప్పేశాడు. రిషభ్, భువీ వచ్చేశారు రెగ్యులర్ వికెట్ కీపర్ ధోని విశ్రాంతి తీసుకోవడం రిషభ్ పంత్‌కు కలిసొచ్చింది. అతన్ని తుది జట్టులోకి తెచ్చింది. ధోని ఉండగా కేవలం బ్యాట్స్‌మన్‌గా పనికొచ్చే పంత్‌కు ఇప్పుడు కీపర్‌గానూ నైపుణ్యం చాటుకునే అవకాశాన్ని ఈ రెండు వన్డేలు ఇస్తున్నాయి. ఇది అతని ప్రపంచకప్ పయనాన్ని కచ్చితంగా నిర్ణయిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సీనియర్ సీమర్ భువనేశ్వర్ కూడా ఫైనల్ ఎలెవన్‌లోకి వచ్చాడు. దీంతో షమీ, బుమ్రాలలో ఒకరికే చాన్స్ దక్కొచ్చు. బహుశా భువీ–బుమ్రా కాంబినేషన్‌కే జట్టు యాజమాన్యం సై అనే అవకాశముంది. స్పిన్నర్ యజువేంద్ర చహల్వైపు జట్టు మేనేజ్మెంట్ మొగ్గడంతో రవీంద్ర జడేజా మ్యాచ్‌కు దూరమవుతున్నాడు. కుల్దీప్కు జతయిన చహల్ రాణిస్తే ఆస్ట్రేలియాను స్పిన్‌తో దెబ్బకొట్టొచ్చు. అప్పుడే సిరీస్‌కు గెలుపుతో తెరదించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా... మూడో వన్డేలో సాధించిన సాధికార విజయం ఆస్ట్రేలియాను సిరీస్ వేటలోకి తెచ్చింది. రాంచీ మ్యాచ్‌లో కంగారూ జట్టు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అదరగొట్టింది. వీళ్ల టాపార్డరేమో భారీగా పరుగులు చేసింది. ప్రత్యర్థి టాపార్డర్‌ను నిలువునా కూల్చేసింది. కోహ్లి గనక ఆడకపోతే భారత్‌కు భారీ పరాభవం ఖాయమయ్యేది. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, ఫించ్ ఫామ్‌లోకి వచ్చారు. మిడిలార్డర్లో స్టోయినిస్ నిలకడగా రాణిస్తుంటే గత మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు. హ్యాండ్స్కోంబ్ గత మ్యాచ్‌లో డకౌటైనా... రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. టెయిలెండర్లలో క్యారీ జట్టుకు ఉపయుక్తమైన స్కోర్లు చేస్తున్నాడు. బౌలింగ్‌లో ఆడమ్ జంపా తన స్పిన్ మాయాజాలంతో టీమిండియా వెన్నెముకను విరిచేస్తున్నాడు. కీలక వికెట్లను చేజిక్కించుకోవడం ద్వారా అతను భారత బ్యాట్స్‌మెన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. పేసర్లలో కమిన్స్, రిచర్డ్‌సన్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో మొహాలిలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచి, మూడింటిలో ఓడిపోవడం గమనార్హం. 1996లో టైటాన్ కప్‌లో భాగంగా ఈ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచిన భారత్... 2006, 2009, 2013లలో జరిగిన మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా మొహాలిలో భారత్ ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడింది. 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐదింటిలో ఓడింది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రాయుడు, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా/షమీ. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, షాన్ మార్‡్ష, మ్యాక్స్‌వెల్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, క్యారీ, కమిన్స్, లయన్, రిచర్డ్సన్, జంపా. పిచ్, వాతావరణం ఫ్లాట్ వికెట్ ఇది. దీంతో ఇక్కడ బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకోవచ్చు. వర్షం ముప్పేమీ లేదు. మ్యాచ్‌కు అడ్డంకీ లేదు. కానీ మంచు ప్రభావం ఉంటుంది. -
భారత్‌కు ఎదురుందా!
ఐదేళ్ల క్రితం భారత జట్టు న్యూజిలాండ్‌లో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. నాలుగు మ్యాచ్‌లు ఓడగా ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. కానీ ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించిన తర్వాత కూడా ఈసారి కివీస్ గడ్డపై భారత్ ప్రదర్శన ఇంత అద్భుతంగా, ఏకపక్షంగా ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. సొంతగడ్డపై ప్రత్యర్థికి ఉండే బలం, పరిస్థితులువంటి ప్రతికూలతలను సునాయాసంగా అధిగమించిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకోగా... అటు స్వదేశంలో చేతులెత్తేసిన విలియమ్సన్ బృందం పరువు కాపాడుకోవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో మరో పోరుకు రంగం సిద్ధమైంది. తన 200వ వన్డేను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్న రోహిత్ నాయకత్వంలో భారత్ సిరీస్ స్కోరును 4–0గా మారుస్తుందో లేదో చూడాలి. హామిల్టన్: న్యూజిలాండ్‌తో తమ రెండో వన్డే సిరీస్‌ను గెలిచిన భారత్ ఆ రికార్డును మరింత ఘనంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. 2009లో ఇక్కడ సిరీస్ గెలిచినప్పుడు మూడు వన్డేలు నెగ్గిన టీమిండియా తొలిసారి సిరీస్‌లో నాలుగో విజయంపై కన్నేసింది. జట్టు ఫామ్‌ను బట్టి చూస్తే అదేమీ అసాధ్యం కాకపోవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య నేడు జరిగే నాలుగో వన్డే కివీస్‌కు కీలకంగా మారింది. సిరీస్ గెలిపించిన అనంతరం విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకోగా... రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గిల్ సందేహమే! తొలి మూడు వన్డేల్లో భారత జట్టు ఆటతీరు చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదు. అయితే కోహ్లి దూరం కావడంతో ఆ ఒక్క స్థానానికి ఖాళీ ఏర్పడింది. కోహ్లి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు పొందిన శుబ్‌మన్ గిల్‌ను మూడో స్థానంలో ఆడించే అవకాశం కనిపించింది. అయితే కండరాల గాయం నుంచి కోలుకున్న ధోని మ్యాచ్ కోసం సిద్ధమయ్యాడు. బుధవారం అతను పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నాడు. దినేశ్ కార్తీక్, రాయుడు కూడా తమ బాధ్యతను సమర్థంగా నెరవేరుస్తున్నారు. కాబట్టి కొత్త కుర్రాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంటే తప్ప గిల్‌కు చోటు దక్కదు. మార్పులు లేకపోతే రాయుడు మూడో స్థానంలో బరిలోకి దిగవచ్చు. ఓపెనర్లు రోహిత్, ధావన్ చెలరేగుతుండగా, మిగతా బ్యాట్స్‌మెన్‌లో జాదవ్ కూడా బాగా ఆడుతున్నాడు. పాండ్యా గత మ్యాచ్‌లో తన విలువేంటో చూపించాడు. ఇక స్పిన్ ద్వయం కుల్దీప్, చహల్ మరోసారి ప్రత్యర్థిని దెబ్బ తీసే వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. సిరీస్‌లో ఇప్పటి వరకు వీరిద్దరు కలిసి 14 వికెట్లు పడగొట్టారు. పేసర్లు భువనేశ్వర్, షమీ చెలరేగిపోతున్నారు. వీరి లయను కొనసాగించాలని జట్టు భావిస్తే ఇద్దరికీ అవకాశం దక్కుతుంది. లేదా కుర్రాళ్లు ఖలీల్, సిరాజ్‌లలో ఒకరికి మరో అవకాశం ఇచ్చి ప్రయత్నించాలని భావిస్తే షమీకి విశ్రాంతి ఇవ్వవచ్చు. మొత్తంగా అందరూ మెరుగ్గా ఆడుతుండటంతో జట్టులో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. కివీస్ కష్టాలు తీరేనా... సొంతగడ్డపై తమ వన్డే చరిత్రలో న్యూజిలాండ్ మూడు సార్లు మాత్రమే ఒకే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరాభవం ముంగిట నిలిచింది. భారత జట్టు దూకుడుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో కివీస్ టీమ్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు చూస్తే జట్టులో ఏ ఒక్కరు కూడా కనీసం రెండు మ్యాచ్‌లలోనైనా బాగా ఆడారని చెప్పలేం. విలియమ్సన్, టేలర్, లాథమ్ తలా ఒక అర్ధ సెంచరీ చేసినా అవి జట్టుకు ఉపయోగపడలేదు. ఓపెనింగ్ కూడా జట్టు ప్రధాన సమస్యగా మారింది. తమ ధాటి ప్రదర్శనతో సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తారని భావించిన గప్టిల్, మున్రోలు ఘోరంగా విఫలం కావడం జట్టును దెబ్బ తీస్తోంది. మిడిలార్డర్లో నికోల్స్ కూడా అదే తరహాలో విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో ఏ ఒక్కరి మీద జట్టు ఆధారపడలేకపోయింది. బ్యాటింగ్‌లో అందరూ సమష్టిగా రాణిస్తేనే జట్టు కోలుకోగలుగుతుంది. ముఖ్యంగా స్పిన్ ద్వయం కుల్దీప్, చహల్‌లను సమర్థంగా ఎదుర్కోవడంపైనే జట్టు విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. కివీస్ బౌలింగ్ కూడా ప్రభావవంతంగా లేదు. బౌల్ట్ తన స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోగా, బ్రేస్‌వెల్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ‘ఫాస్టెస్ట్’ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లోకీ ఫెర్గూసన్ భారత బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపలేకపోయాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన నీషమ్, టాడ్ ఆస్టల్లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇది గెలిస్తే కనీసం క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకునే అవకాశం కివీస్‌కు కలుగుతుంది. విజయాలను అలవాటుగా మార్చుకున్న మేం అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాం. ప్రధాన జట్టంతా ప్రపంచ కప్‌కు సన్నద్ధమై ఉంది. అయితే రిజర్వ్ ఆటగాళ్లకు కూడా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వడం మంచిది. ఎందుకంటే మెగా టోర్నీలో అనుకోకుండా బరిలోకి దిగాల్సి వస్తే అప్పటికి తగిన మ్యాచ్ అనుభవం లేకపోతే కష్టం. అందుకే ఈవిషయంపై మేనేజ్మెంట్ దృష్టి పెట్టింది. ఇంగ్లండ్ తరహా పరిస్థితులే న్యూజిలాండ్‌లో ఉంటాయి కాబట్టి మా ప్రపంచకప్ సన్నాహాలకు ఇది సరైన వేదిక. –ఆర్. శ్రీధర్, భారత ఫీల్డింగ్ కోచ్ తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాయుడు, కార్తీక్/గిల్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, షమీ, కుల్దీప్, చహల్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, నీషమ్, సాన్‌ట్నర్, ఆస్టల్, ఫెర్గూసన్, బౌల్ట్. పిచ్, వాతావరణం సెడన్ పార్క్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. గత మూడు వన్డేల్లో 300 పరుగుల లోపు లక్ష్యాలను జట్లు సునాయాసంగా ఛేదించాయి. స్పిన్ ప్రభావం చూపిస్తుంది. వర్షంతో సమస్య లేదు. -
రోహిత్ ధమాకా రాయుడు పటాకా
టీమిండియా గర్జించింది. పుణేలో పల్టీ కొట్టినా ముంబైలో మేల్కొంది. కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను పసికూనలా మార్చేసి ఓడించింది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌శర్మ... తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు అమోఘమైన భాగస్వామ్యంతో శతకాల మోత మోగించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ మాయాజాలంతో ప్రత్యర్థిని చుట్టేసింది. సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ముంబై: కోహ్లి సేన దుమ్మురేపింది. నాలుగో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (137 బంతుల్లో 162; 20 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు (81 బంతుల్లో 100; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాల మోతతో టీమిండియా తిరుగులేని విజయాన్ని అందు కుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... మూడో వికెట్‌కు రోహిత్, రాయుడు 211 పరుగుల అద్భుత భాగస్వామ్యంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటితో పాటు ఫీల్డర్ల చురుకుదనంతో ఛేదనలో వెస్టిండీస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 36.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జాసన్ హోల్డర్ (70 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మినహా మరే బ్యాట్స్‌మన్ నిలవలేకపోవడంతో విండీస్ 224 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (3/13), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/42) మూడేసి వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని పతనంలో పాలుపంచుకున్నారు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే గురువారం తిరువనంతపురంలో జరుగుతుంది. శుభారంభం... ఆపై అమోఘం సిరీస్‌లో తొలిసారిగా ఓపెనర్లిద్దరూ నిలవడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. ముందుగా రోహితే మొదలుపెట్టినా, కొద్దిసేపటికే జోరందుకున్న శిఖర్ ధావన్ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లతో అతడిని మించిపోయాడు. అయితే, కీమో పాల్ ఓవర్లో పుల్ చేయబోయి మిడ్ వికెట్లో రావ్మన్ పావెల్‌కు చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హ్యాట్రిక్ సెంచరీల ఊపులో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (16) ఈసారి ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన రోచ్ బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా ఆడే ప్రయత్నంలో విఫలమై కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ ఏడాది వన్డేల్లో కోహ్లికిదే తక్కువ స్కోరు. భారీ ఇన్నింగ్స్‌లతో టీమిండియాకు వెన్నెముకలా నిలుస్తున్న కెప్టెన్ వెనుదిరగడంతో జట్టుకు సవాల్ అనదగ్గ పరిస్థితి ఎదురైంది. దీనిని రోహిత్, రాయుడు దీనిని సమర్థంగా ఎదుర్కొన్నారు. కుదురుకునేందుకు సమయం తీసుకున్నా, తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో రోహిత్ 60 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అనంతరం రావ్మన్ పావెల్ ఓవర్లో మూడు, నర్స్ ఓవర్లో రెండు బౌండరీలతో చకచకా 90ల్లోకి వెళ్లిపోయాడు. మరో ఎండ్‌లో రాయుడు పూర్తి సంయమనం చూపాడు. అలెన్ బౌలింగ్‌లో ఫోర్‌తో కెరీర్లో రోహిత్ 21వ వన్డే సెంచరీని పూర్తిచేసుకున్నాడు. కాసేపటికే రాయుడు అర్ధశతకం మార్క్‌ను చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి బౌలర్ ఎవరన్నది లెక్క చేయకుండా ఫోర్లు, సిక్స్‌లతో ఇద్దరూ ధాటైన ఆటను కనబర్చారు. 33 ఓవర్లకు 199/2తో ఉన్న స్కోరు 43వ ఓవర్‌కు 300 దాటిందంటేనే ఈ ద్వయం ఎంత జోరుగా బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఊపులో రోహిత్ 150 పరుగుల మైలురాయి (131 బంతుల్లో)ని అధిగమించాడు. కానీ, కాసేపటికే అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. రోచ్ ఓవర్లో యార్కర్ లెంగ్త్ బంతిని సిక్స్ బాది 90ల్లోకి చేరుకున్న రాయుడు... అనంతరం ఒక్కో పరుగు జోడిస్తూ వన్డేల్లో మూడో శతకాన్ని (80 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అయిన వెంటనే రాయుడు రనౌటయ్యాడు. ధోని (23; 2 ఫోర్లు), కేదార్ జాదవ్ (16 నాటౌట్; 3 ఫోర్లు), జడేజా (7 నాటౌట్; 1 ఫోర్) ఆఖర్లో తమవంతుగా జట్టు స్కోరును పెంచారు. విండీస్... పేలవంగా: అతి భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ తేలిపోయింది. గత మూడు మ్యాచ్‌ల్లో తలా కొన్ని పరుగులతో జట్టు భారీ స్కోర్లకు ఉపయోగపడిన బ్యాట్స్‌మెన్... ఈసారి పూర్తిగా చేతులెత్తేశారు. ఓపెనర్లు కీరన్ పావెల్ (4), హేమ్రాజ్ (14)తో పాటు నిలకడగా రాణిస్తున్న షై హోప్ (0) వికెట్లను ఒకే స్కోరు వద్ద కోల్పోయిన జట్టు ముందే కుదేలైంది. ఖలీల్ స్వింగ్ బంతులకు మార్లోన్ శామ్యూల్స్ (18), అద్భుత ఫామ్‌లో ఉన్న హెట్‌మైర్ (13), రావ్మన్ పావెల్ (1) వరుస కట్టడంతో చేసేదేమీ లేకపోయింది. 56/6తో నిలిచిన జట్టును హోల్డర్ మరీ తక్కువ స్కోరుకే పరిమితం కాకుండా చూశాడు. కోహ్లి... సూపర్ రనౌట్ మ్యాచ్ ఏదైనా తనదైన ముద్ర ఉండేలా చూసే కోహ్లి... ముంబైలో తక్కువ స్కోరుకే ఔటైనా మెరుపు ఫీల్డింగ్‌తో తళుక్కుమన్నాడు. విండీస్ బ్యాట్స్‌మన్ శామ్యూల్స్ కవర్స్ దిశగా కొట్టిన షాట్‌ను అడ్డుకున్న కోహ్లి... అంతే వేగంగా డైవ్‌తో బంతిని నాన్ స్ట్రయికింగ్ వైపు వికెట్లకేసి విసిరాడు. అది గురి చూసి వదిలిన బాణంలా తగలడం క్షణాల్లో జరిగి పోయింది. అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్ పావెల్ తిరిగి క్రీజును చేరే అవకాశమూ లేకపోయింది. ►భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ (196)ను దాటి రెండో స్థానానికి చేరిన రోహిత్ శర్మ (198). ధోని (211) తొలి స్థానంలో ఉన్నాడు. ►పరుగుల పరంగా (224) భారత్‌కిది మూడో పెద్ద విజయం. ఇంతకుముందు 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై 257 పరుగులతో, 2008లో హాంకాంగ్‌పై 256 పరుగులతో నెగ్గింది. ►వన్డేల్లో రోహిత్ ఏడుసార్లు 150 పైగా స్కోరు చేశాడు. సచిన్ (5), జయసూర్య, గేల్, ఆమ్లా, కోహ్లి (4 సార్లు చొప్పున) తర్వాత ఉన్నారు. -
శ్రీలంక ఖాతాలో తొలి విజయం
కాండీ: హ్యాట్రిక్ ఓటముల అనంతరం శ్రీలంకకో గెలుపు. ఉత్కంఠను అధిగమిస్తూ... దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరిగిన డే నైట్ నాలుగో వన్డేలో ఆ జట్టు 3 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక... షనక (34 బంతుల్లో 65; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో 39 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు డికెవెలా (34), తరంగ (36) శుభారంభం అందించగా... కుశాల్ పెరీరా (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిసారా పెరీరా (45 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. లంక ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఉండగా వర్షం కారణంగా అరగంటపైగా ఆట నిలిచిపోవడంతో మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. ఛేదనలో సఫారీ ఇన్నింగ్స్ రెండు ఓవర్లు కాగానే మరోసారి వర్షం గంటపైగా ఆటంకం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 21 ఓవర్లలో 191 పరుగులుగా నిర్దేశించారు. దక్షిణాఫ్రికా 21 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్లు డికాక్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆమ్లా (23 బంతుల్లో 40; 6 ఫోర్లు) జోరుతో దక్షిణాఫ్రికా దీటుగానే ఆరంభించింది. డుమిని (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా జోరు చూపడంతో విజయం తేలికేననిపించింది. అయితే, లంక బౌలర్లు తేరుకుని వరుసగా క్లాసెన్ (17), హెండ్రిక్స్(2), ఫెలూక్వాయో(9)లను పెవిలి యన్‌కు పంపారు. ఓ ఎండ్‌లో మిల్లర్ (21) నిలిచినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో సఫారీలు గెలవాలంటే 8 పరుగులు అవసరం కాగా, లక్మల్ (3/ 46)... మిల్లర్‌ను ఔట్ చేయడంతో పాటు నాలుగే పరుగులు ఇచ్చి లంకను గెలిపించాడు. -
ఆస్ట్రేలియా 310/8
చెస్టర్ లి స్ట్రీట్: వరుసగా నాలుగో వన్డేలోనూ ఆస్ట్రేలియాపై ఆతిథ్య ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 3–0తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్ నామమాత్రమైన నాలుగో మ్యాచ్‌లోనూ జోరు కనబర్చింది. గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్ (106 బంతుల్లో 100; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), షాన్ మార్‡్ష (92 బంతుల్లో 101; 5 ఫోర్లు; 4 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. హెడ్ (63; 9 ఫోర్లు) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లీకి 4, వుడ్, ఆదిల్ రషీద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకుపోతోంది. కడపటి వార్తలు అందేసరికి 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 146 పరుగులు చేసింది. ఓపెనర్లు రాయ్ (84; 11 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్‌స్టో (61; 9 ఫోర్లు) అదరగొట్టారు. -
ఆసీస్‌ను గెలిపించిన బౌలర్లు
అడిలైడ్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా ...ఇంగ్లండ్‌తో శుక్ర వారం జరిగిన నాలుగో వన్డేలో మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఆసీస్ పేసర్లు కమిన్స్ (4/24), హజల్‌వుడ్ (3/39), టై (3/33) ధాటికి ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. వోక్స్ (78; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఓపెనర్ ట్రావిస్ హెడ్ (107 బంతుల్లో 96; 15 ఫోర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 37 ఓవర్లలో ఏడు వికెట్లకు 197 పరుగులు చేసి గెలుపొందింది. చివరి వన్డే ఆదివారం పెర్త్‌లో జరుగనుంది. -
దంచి కొట్టారు
►సెంచరీలతో చెలరేగిన కోహ్లి, రోహిత్ ►నాలుగో వన్డేలో 168 పరుగులతో భారత్ విజయం నాలుగో వన్డేలో భారత్ మరింత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా రెండో శతకంతో చెలరేగగా కెప్టెన్ విరాట్ కోహ్లి తన క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించి సిరీస్‌లో తొలిసెంచరీతో అదరగొట్టాడు. దాదాపు 28 ఓవర్ల వరకు సాగిన వీరి విధ్వంసంతో స్టేడియం పరుగుల వర్షంతో తడిసి ముద్దయ్యింది. ఆ తర్వాత భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. ప్రారంభం నుంచే ఎలాంటి ఆశలు లేకుండా ఆడటంతో భారత్ సునాయాసంగా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కొలంబో: సిరీసే పోయింది.. ఇక ఆడి ఏం లాభం అనుకున్నారేమో లంక ఆటగాళ్లు.. గురువారం జరిగిన నాలుగో వన్డేలో మరింత చెత్తగా ఓడారు. కోహ్లి (96 బంతుల్లో 131; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ (88 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో లంక ముందు కొండంత లక్ష్యం ఏర్పడింది. అయితే కనీస పోరాటమే లేకుండా ఆతిథ్య జట్టు తోకముడిచింది. ఫలితంగా భారత్ 168 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రేమదాస స్టేడియంలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 375 పరుగుల భారీ స్కోరు సాధించింది. మనీష్ పాండే (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, 300వ వన్డే ఆడిన ఎంఎస్ ధోని (42 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) తన ఫామ్‌ను కొనసాగించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 42.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటయ్యింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా కోహ్లి నిలిచాడు. విరాట్, రోహిత్ పరుగుల మోత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో ఓవర్లో ధావన్ (4) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత రోహిత్, కోహ్లి వీరవిహారంతో లంక ఆటగాళ్లు చేష్టలుడిగిపోయారు. నాలుగో ఓవర్లో కోహ్లి వరుసగా మూడు ఫోర్లతో తన ప్రతాపం చూపెట్టాడు. ఆ తర్వాత కూడా తన వేగం కొనసాగడంతో 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అటు రోహిత్ కూడా 14వ ఓవర్లో వరుసగా 4, 6 బాదడంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. అంతేకాకుండా లంక బౌలర్లపై యథేచ్చగా విరుచుకుపడిన కోహ్లి 76 బంతుల్లో ఓ ఫోర్‌తో సెంచరీని అందుకున్నాడు. 26 ఓవర్లలోనే జట్టు స్కోరు 200కు చేరింది. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన తను 26వ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదినా 30వ ఓవర్లో మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే అప్పటికే రెండో వికెట్‌కు 219 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. మరో వైపు రోహిత్ 34వ ఓవర్లో ఫోర్‌తో కెరీర్లో 13వ శతకం అందుకున్నాడు. అయితే ఆ మరుసటి ఓవర్లోనే మాథ్యూస్ వరుస బంతుల్లో పాండ్యా (19), రోహిత్‌లను పెవిలియన్‌కు పంపాడు. రాహుల్ (7) మరోసారి విఫలం కాగా ఇక చివరి 10 ఓవర్లలో మనీష్ పాండే, ధోని జోడి లంక బౌలర్లను ఆటాడుకుంది. ముఖ్యంగా తనకు వచ్చిన అవకాశాన్ని పాండే చక్కగా వినియోగించుకుని ఇన్నింగ్స్ చివరి బంతికి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అటు ధోని ఎప్పటిలాగే తన సూపర్ బ్యాటింగ్‌తో అలరించగా ఆరో వికెట్‌కు అజేయంగా 101 పరుగులు వచ్చాయి. ఇందులో ఆఖరి ఏడు ఓవర్లలోనే 70 పరుగులు చేరాయి. శ్రీలంక ఎప్పటిలాగే.. ఈ సిరీస్‌లో 200 పరుగులు దాటడానికే ఆపసోపాలు పడుతున్న శ్రీలంక.. ఇక 376 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? శార్దుల్ వేసిన మూడో ఓవర్లో డిక్వెల్లా వికెట్‌ను భారత్ రివ్యూ ద్వారా సాధించింది. ఆ తర్వాత కూడా లంక ఆటతీరులో మార్పు లేకపోవడంతో 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మాథ్యూస్ ఒక్కడే తన స్థాయికి తగ్గట్టుగా ఆడాడు. తనకు సిరివర్ధన కొద్దిసేపు సహకారం అందించాడు. వీరిద్దరూ కుదురుకుంటున్న దశలో సిరివర్ధనను పాండ్యా అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం 38వ ఓవర్లో మాథ్యూస్‌ను అక్షర్ అవుట్ చేయడంతో లంక ఆశలు వదిలేసుకుంది. ఎప్పటికీ నువ్వే మా కెప్టెన్! కెరీర్లో 300వ వన్డే ఆడిన ధోనిని జట్టు సహచరులు అభినందనలతో ముంచెత్తారు. మ్యాచ్‌కు ముందు టీమ్ తరఫున ఒక ప్రత్యేక జ్ఞాపికను ధోనికి అందజేశారు. ఈ సందర్భంగా కోహ్లి ‘ఈ క్షణం గురించి ఏమని మాట్లాడను. మనలో 90 శాతం మంది అతని నాయకత్వంలోనే జట్టులోకి వచ్చారు. అలాంటి వ్యక్తికి చిరు జ్ఞాపిక అందించడం కూడా గౌరవంగా భావిస్తున్నాం. మా అందరికి ఎప్పటికీ నువ్వే కెప్టెన్‌వి’ అని వ్యాఖ్యానించాడు. సచిన్ ‘10’ రిటైర్ కాలేదా! జెర్సీ నంబర్ 10... క్రికెట్ ప్రపంచంలో ఈ అంకె గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. భారత దిగ్గజం సచిన్ ‘టెన్’డుల్కర్ కెరీర్ ఆసాంతం వాడిన ఈ నంబర్ అతనికి పర్యాయపదంగా మారిపోయింది. సచిన్ రిటైర్ అయిన సమయంలో గౌరవపూర్వకంగా తాము 10 నంబర్‌కు కూడా రిటైర్మెంట్ ఇస్తున్నామని... భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ కూడా ఆ అంకెతో జెర్సీ ధరించడని బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. అయితే గురువారం ఆశ్చర్యకరంగా అది మరోసారి మైదానంలో కనిపించింది. తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పేసర్ శార్దుల్ ఠాకూర్ 10 నంబర్ జెర్సీతో ఆడటం అందరినీ ఆశ్చర్యపరచింది. బీసీసీఐ తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని సచిన్ అభిమానులుతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 218వ క్రికెటర్‌గా శార్దుల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ►29 వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. సచిన్ (49), పాంటింగ్ (30) తనకన్నా ముందున్నారు. ►300 వన్డేల్లో మలింగ వికెట్ల సంఖ్య. ఓవరాల్‌గా 11వ బౌలర్ ►73 అత్యధిక సార్లు నాటౌట్ (73)గా నిలిచిన ఆటగాడిగా ధోని రికార్డు -
ప్రయోగాల సమయం
∙ తుది జట్టులో మార్పులకు భారత్ సిద్ధం ∙ నేడు శ్రీలంకతో నాలుగో వన్డే ∙ ఆతిథ్య జట్టుకు విజయం దక్కేనా! టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్... వన్డే సిరీస్ ఇప్పటికే సొంతం... శ్రీలంక గడ్డపై అడుగు పెట్టిన నాటినుంచి ఎదురు లేకుండా సాగుతున్న భారత క్రికెట్ జట్టు ఆడుతూ పాడుతూ విజయాలు అందుకుంటోంది. ఇప్పుడు ఇదే జోరులో మరో మ్యాచ్ కోసం కోహ్లి సేన సన్నద్ధమైంది. దాంతో పాటు ఇప్పటి వరకు అవకాశం దక్కని ఆటగాళ్లను పరీక్షించేందుకు కూడా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే లక్ష్యం మాత్రం మరో గెలుపే.వరుసగా మూడు వన్డేల్లో ఓటమి, ఆటగాళ్ల సమష్టి వైఫల్యం, ఇప్పటికే ఇద్దరు కెప్టెన్లు మారారు... సెలక్టర్ల రాజీనామా, గత మ్యాచ్‌పై విచారణ, మరో కెప్టెన్‌తో మ్యాచ్ బరిలోకి... శ్రీలంక కష్టాల జాబితా చాంతాడంత ఉంది. ఇలాంటి స్థితిలో ఆ జట్టు ఎంత వరకు కోలుకోగలదు? సమస్యలను పక్కన పెట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలదా? సొంతగడ్డపై ఆ జట్టు ఆశిస్తున్న మొదటి విజయం దక్కే అవకాశం ఏమాత్రమైనా ఉందా! కొలంబో: శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 3–0తో సొంతం చేసుకున్న భారత్, ఈ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉండగా... స్వదేశంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక కాస్తయినా పరువు దక్కించుకోవాలంటే ఒక మ్యాచ్‌లోనైనా విజయం సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు ఇక్కడ జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్ ఆడిన టీమ్‌నుంచి ఒకటి, రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉండగా...లంక జట్టులో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పాండే, కుల్దీప్లకు చాన్స్! ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా అందరికీ అవకాశాలు కల్పిస్తామని కెప్టెన్ కోహ్లి పదే పదే చెబుతున్నాడు. ఇప్పటికే సిరీస్ గెలవడంతో నాలుగో వన్డేలో భారత జట్టులో మార్పులు ఉండవచ్చు. కుల్దీప్ను ఆడించేందుకు సిద్ధమంటూ కోహ్లి ఇప్పటికే పరోక్షంగా చెప్పేశాడు. కాబట్టి అక్షర్, చహల్‌లో ఒకరిని తప్పించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో రోహిత్ గత రెండు మ్యాచ్‌లలోనూ చెలరేగాడు. ధావన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లి, ధావన్ బ్యాటింగ్ గురించి ఆందోళనే అనవసరం. అయితే తనకు పెద్దగా అలవాటు లేని నాలుగో స్థానంలో రాహుల్ కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. అతను ఒక చక్కటి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక ధనంజయ స్పిన్‌ను ఆడలేక వరుసగా విఫలమైన కేదార్ జాదవ్ స్థానంలో మనీశ్ పాండేను ఆడించవచ్చు. మున్ముందు తుది జట్టులో రెగ్యులర్ అయ్యే అవకాశం ఉన్న పాండేకు ఇక్కడ కనీసం రెండు మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వడం ముఖ్యం. అయితే తుది జట్టు కూర్పును బట్టి చూస్తే రహానే, శార్దుల్ ఠాకూర్లు మాత్రం మళ్లీ బెంచీకే పరిమితం అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇక కెరీర్లో 300వ వన్డే మ్యాచ్ బరిలోకి దిగుతున్న ధోని ఈ మ్యాచ్‌ను ఎలా చిరస్మరణీయం చేసుకుంటాడనేది ఆసక్తికరం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, పాండే, పాండ్యా, ధోని, అక్షర్/చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా. శ్రీలంక: మలింగ (కెప్టెన్), డిక్వెలా, మునవీరా, కుషాల్ మెండిస్, తిరిమన్నె, మాథ్యూస్, ధనంజయ డి సిల్వ, సిరివర్ధన, అఖిల ధనంజయ, చమీరా, ఫెర్నాండో కపుగెడెరపై విచారణ మూడో వన్డేలో టాస్ గెలిచిన తర్వాత కూడా బ్యాటింగ్ ఎంచుకోవడంపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టనుంది. మ్యాచ్‌కు ముందు రోజు టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. టాస్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా ఫీల్డింగ్‌కు సిద్ధమైపోయారు. అయితే కెప్టెన్ కపుగెడెర వచ్చి అనూహ్యంగా బ్యాటింగ్ అని చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. పరిస్థితులు పేస్‌కు అనుకూలంగా ఉండటంతో లంక తొలుత బ్యాటింగ్ చేసి 217 పరుగులు మాత్రమే చేసింది. పిచ్, వాతావరణం: ప్రేమదాస స్టేడియంలోని పిచ్‌పై ఎక్కువ సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే ఆరంభంలో పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. వర్షం అంతరాయం కలిగించవచ్చు. కెప్టెన్‌గా మలింగ... తొలి రెండు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఉపుల్ తరంగ సస్పెన్షన్‌తో దూరం కాగా, మూడో వన్డేలో కెప్టెన్‌గా ఉన్న కపుగెడెర గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో లసిత్ మలింగ నాయకత్వంలో శ్రీలంక బరిలోకి దిగుతోంది. అయితే కెప్టెన్ ఎవరైనా జట్టులో ఇప్పుడు స్ఫూర్తి నింపడం అవసరం. గత ఏడాది కాలంలో శ్రీలంక వన్డే జట్టులోకి 40 మంది ఎంపిక కావడం ఆ టీమ్ నిలకడలేమిని చూపిస్తోంది. గత మ్యాచ్‌లో ఆడిన చండిమాల్ కూడా గాయంతో తప్పుకున్నాడు. ఇలాంటి స్థితిలో లంక విజయం సాధించాలంటే అసాధారణ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌లో డిక్వెలా, కుషాల్ పెరీరా మాత్రం కొంత వరకు ఫర్వాలేదనిపిస్తున్నారు. గత మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన తిరిమన్నె మళ్లీ రాణించాలని లంక కోరుకుంటోంది. మాజీ కెప్టెన్ మాథ్యూస్ ఇప్పటి వరకు టీమ్‌కు ఉపయుక్తమైన ఆటతీరు ప్రదర్శించలేకపోవడం జట్టును మరింత దెబ్బ తీస్తోంది. మలింగ బౌలింగ్‌లో మునుపటి వాడి లేకపోవడంతో లంక పేస్ బలహీనంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ధనంజయ డి సిల్వ, దిల్షాన్ మునవీరాలను లంక జట్టులోకి తీసుకుంది. ►మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రయోగాలకు వేళాయె!
-
ప్రయోగాలకు వేళాయె!
♦ మార్పులపై కెప్టెన్ కోహ్లి దృష్టి ♦ రిషభ్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి చోటు? ♦ నేడు వెస్టిండీస్‌తో నాలుగో వన్డే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలతో ఊపు మీదున్న భారత జట్టు ఇక ప్రయోగాలకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. 2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని మిడిలార్డర్లో తమ రిజర్వ్ బెంచ్ సత్తా ఏమిటో పరీక్షించుకోవాల్సి ఉంది. ఇప్పటికే మూడో ఓపెనర్‌గా ఉన్న రహానే భీకర ఫామ్‌ను చాటుకుంటుండటంతో మిడిలార్డర్లో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. అలాగే ఈ మ్యాచ్ నెగ్గి సిరీస్ కూడా దక్కించుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది. నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): ఏ మాత్రం పోటీనివ్వలేకపోతున్న ప్రత్యర్థి వెస్టిండీస్‌పై తమ ప్రయోగాలకు ఇదే సరైన అవకాశమని భారత జట్టు భావిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయం కూడా ఇలాగే ఉండటంతో.. నేడు (ఆదివారం) వెస్టిండీస్‌తో జరిగే నాలుగో వన్డేలో ఏదో ఒక మార్పు ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే 2–0తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక జట్టుకు ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ ఖాయమవుతుంది. మరో మ్యాచ్ కూడా మిగిలి ఉండటంతో రిజర్వ్ బెంచ్‌ను బరిలోకి దింపాలని కెప్టెన్ భావిస్తున్నాడు. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి కావడంతో విండీస్ తమ స్థాయికి మించి ఆడి ఏమేరకు ఆడుతుందో వేచి చూడాలి.. రిషభ్ ఖాయమేనా? 2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుంటే ధోని, యువరాజ్‌లలో ఒక్కరికే చోటు ఉండే అవకాశాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ ఇదే నిజమైతే జట్టు ఇప్పటి నుంచే తమ మిడిలార్డర్‌ను పటిష్ట పరచుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా యువ సంచలనం రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరిని తుది జట్టులో తీసుకునే ఆలోచనలో కెప్టెన్ ఉన్నాడు. రిషభ్ ఇప్పటిదాకా వన్డేలు ఆడలేదు. భవిష్యత్ తారగా పిలుచుకుంటున్న అతడికి తగిన అంతర్జాతీయ అనుభవం కావాల్సి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో అతనికే ఎక్కువ అవకాశాలున్నాయి. పేలవ ఫామ్‌తో ఉన్న యువరాజ్ మూడో వన్డేలో కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ అతడి స్థాయికి అది తక్కువే. ధోని మరోసారి తన బ్యాటింగ్‌లో చమక్కులు చూపించాడు. ఓపెనింగ్‌లో ఎలాంటి సమస్య లేదు. బౌలింగ్‌లో స్పిన్నర్లు కుల్దీప్, అశ్విన్‌లతో పాటు పేసర్లలో భువనేశ్వర్, ఉమేశ్ మెరుస్తున్నారు. జట్లు: (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, ధావన్, ధోని, యువరాజ్/రిషభ్, జాదవ్, పాండ్యా, అశ్విన్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్. విండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయిస్, కైల్ హోప్, షాయ్ హోప్, మొహమ్మద్, చేజ్, పావెల్, నర్స్, జోసెఫ్, బిషూ, కమిన్స్. సా. 6.30 నుంచిసోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వార్నర్ సెంచరీ, మాక్స్ వెల్ మెరుపులు
సిడ్నీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ(119 బంతుల్లో 130: 11 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్ వెల్(44 బంతుల్లో 78 పరుగులు: 10 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. వన్డే సిరీస్‌లో భాగంగా ఇక్కడ వన్డేలో ఆసీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసి, ప్రత్యర్థి పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(49 బంతుల్లో 30: 2 ఫోర్లు), వార్నర్ శుభారంభాన్నిచ్చారు. 17.2 ఓవర్లలో 92 పరుగల వద్ద హసన్ అలీ బౌలింగ్‌లో కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌కు క్యాచిచ్చి ఖవాజా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకొచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి వార్నర్ పరుగుల వరద పారించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని(120 రన్స్) నెలకొల్పారు. 212 స్కోరు వద్ద వార్నర్ వెనుదిరిగాడు. హెడ్ హాఫ్ సెంచరీ (36 బంతుల్లో 51: 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయగా, స్మిత్(48 బంతుల్లో 149: 5 ఫోర్లు) తృటిలో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. మాక్స్ వెల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో ఓవర్‌కు మూడు చొప్పున ఫోర్లు బాదిన మాక్స్ వెల్ ఇన్నింగ్ చివరి బంతికి ఔటయ్యాడు. పాక్ బౌలర్ హసన్ అలీ 5 వికెట్లు సాధించగా, ఆమిర్ ఒక వికెట్ తీశాడు. సిరీస్‌లో 2-1తో ఆసీస్ ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
అతన్ని త్వరగా ఔట్ చేయడం వల్లే..!
సిరీస్ నిలబడాలంటే చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ సత్తా చాటింది. 261 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కివీస్ బౌలర్లు సఫలం అయ్యారు. స్టార్ బ్యాట్స్‌మెన్‌తో కూడిన భారత లైనప్‌ను 241 పరుగులకే నిలువరించి.. 19 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకున్నారు. సిరీస్ 2-2తో సమం చేసి.. చివరిదైనా ఐదో వన్డేలో క్లైమాక్స్‌కు తెరతీశారు. నిజానికి రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో భారత జట్టు మొదట్లో నిలకడగా ఆడింది. ఓపెనర్ రహానే 57 పరుగులతో జట్టును లక్ష్యసాధన దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. అతడు సెకండ్ వికెట్‌గా వచ్చిన కోహ్లి (45)తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఆ తర్వాత ధోనీ-రహానే జోడీ కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది, 11 పరుగులు చేసి ధోనీ ఔటవ్వడం.. ఆ తర్వాత 39 పరుగులకే ఐదు వికెట్లు చకచకా పడటంతో టీమిండియా పని అయిపోయింది. చివర్లో టెయిల్ ఎండర్లు పోరాటపటిమ చూపినా పరాజయం తప్పలేదు. అయితే.. న్యూజిలాండ్ గెలుపులో కోహ్లినే త్వరగా ఔట్ చేయడమే అత్యంత కీలక పరిణామమని కివీస్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ అభిప్రాయపడ్డాడు. 84 బంతుల్లో 72 పరుగులు చేసి కివీస్ ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచిన అతడికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45 పరుగుల వద్ద కోహ్లిని ఔట్ చేయడం తమకు ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. 'విరాట్ క్లాస్ ఆటగాడు. అతన్ని త్వరగా ఔట్ చేయడం ఆనందమే కదా’ అని అన్నాడు. మాస్టర్ ఛేజర్గా పేరొందిన డ్యాషింగ్ బాట్స్మన్ కోహ్లి ఇటీవల టీమిండియాకు లక్ష్యసాధనలో అద్భుత విజయాలు అందించిన సంగతి తెలిసిందే. మొహాలీలో జరిగిన మూడో వన్డేలో అజేయంగా 154 పరుగులు చేసిన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ధర్మశాలలో జరిగిన మొదటి వన్డేలో 85 పరుగులు చేసి కివీస్ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. కాబట్టి ఈసారి అతన్ని త్వరగా ఔట్ చేయడం వల్లే తమకు విజయం దక్కిందని కివీస్ జట్టు ఆనందపడుతోంది. -
ఈ మ్యాజిక్.. మ్యాచ్‌కే హైలెట్!
రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను ధోని రనౌట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్.. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఫైన్‌లెగ్ దిశగా ఆడిన టేలర్ వేగంగా సింగిల్ పూర్తి చేసుకొని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో ధావల్ విసిరిన త్రో కోసం ధోని ముందుకు దూసుకొచ్చాడు. బౌన్స్ అయి వచ్చిన బంతిని అందుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండానే అదే వేగంతో రెప్పపాటులో వికెట్లపైకి విసిరేశాడు ధోనీ.. బంతి స్టంప్స్‌కు తగలడం, టేలర్ రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. గతంలోనూ ధోని కొన్నిసార్లు ఇలా బంతిని పూర్తిగా అందుకోకుండా వికెట్ల పైకి మళ్లించిన ఘటనలు ఉన్నాయి.. ఈ సారి అతను వికెట్లకు బాగా దూరంలో ఉండి అత్యంత కచ్చితంగా ఇలా త్రో చేయగలగడం మ్యాచ్‌లోనే మ్యాజిక్ హైలెట్‌గా నిలిచింది. ధోనీ చేసిన మ్యాజిక్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. Watch the Mahi magic on loop #INDvNZ https://t.co/btMoJF0xC3 — BCCI (@BCCI) 26 October 2016 -
రాంచీలో ఢమాల్.. వైజాగ్ లో క్లైమాక్స్
నాలుగో వన్డేలో న్యూజిలాండ్ విజయం ►19 పరుగులతో భారత్ ఓటమి ►సిరీస్ 2-2తో సమం ►చివరి వన్డే శనివారం చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ సమష్టిగా రాణించింది. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్‌ను మరపించేలా వన్డేల్లో స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది. రాంచీలోనే సిరీస్‌ను ముగించాలన్న భారత ఆశలపై నీళ్లు జల్లుతూ నాలుగో వన్డేలో నెగ్గింది. దీంతో సిరీస్ ఫలితం కోసం శనివారం వైజాగ్‌లో జరిగే ఐదో వన్డే వరకూ ఆగాల్సిందే. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పిచ్‌పై లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. రహానే, కోహ్లి మెరుగ్గా ఆడినా, ఇతర ఆటగాళ్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. కివీస్ వ్యూహాత్మక బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్‌కు భారత్ తలవంచింది. సిరీస్ మొత్తం విఫలమైన గప్టిల్ తొలిసారి న్యూజిలాండ్‌ను ఆదుకుంటే... సౌతీ, నీషమ్ చక్కగా బౌలింగ్ చేసి కివీస్‌ను రేసులో నిలబెట్టారు. రాంచీ: సొంతగడ్డపై భారత కెప్టెన్ ధోని పూర్తిగా నిరాశపర్చగా, జట్టు కూడా విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. ధోని సేన స్థారుుకి తగ్గట్లుగా ఆడకపోవడంతో నాలుగో వన్డే న్యూజిలాండ్ వశమైంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కివీస్ 19 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (84 బంతుల్లో 72; 12 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే (70 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఫలితంతో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచారుు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన ఐదో వన్డే ఈ నెల 29న విశాఖపట్నంలో జరుగుతుంది. తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం భారత పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచ్ సహా మొత్తం ఏడు సార్లు టాస్ ఓడిపోరుున న్యూజిలాండ్ ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు మూడు మార్పులు చేయగా, అనారోగ్యంతో ఉన్న బుమ్రా స్థానంలో ధావల్ భారత జట్టులోకి వచ్చాడు. తొలి 15.2 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు స్కోరు... వికెట్ నష్టపోకుండా 96 పరుగులు. ఈ ఆరంభం చూస్తే ఆ జట్టు కనీసం 300 పరుగులు దాటుతుందనిపించింది. కానీ మరో సారి మిడిలార్డర్ వైఫల్యంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. మధ్య ఓవర్లలో మన స్పిన్నర్లు పూర్తిగా కట్టి పడేశారు. ఇన్నింగ్స తొలి ఓవర్‌ను ఉమేశ్ మెరుుడిన్గా వేసినా... ధావల్ వేసిన తర్వాతి ఓవర్లో గప్టిల్ మూడు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. ధావల్ తర్వాతి ఓవర్లోనూ లాథమ్ (40 బంతుల్లో 39; 4 ఫోర్లు) మరో రెండు బౌండరీలు బాదాడు. 29 పరుగుల వద్ద గప్టిల్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను మిశ్రా వదిలేయడం అతనికి కలిసొచ్చింది. దూసుకుపోతున్న ఈ జోడీని ఎట్టకేలకు 16వ ఓవర్లో పటేల్ విడదీశాడు. ఆ తర్వాత గప్టిల్, విలియమ్సన్ (59 బంతుల్లో 41; 4 ఫోర్లు) కలిసి 42 పరుగులు జోడించినా పరుగుల వేగం మందగించింది. 11నుంచి 24 మధ్య 13 ఓవర్లలో స్పిన్నర్లు 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. గప్టిల్‌ను పాండ్యా అవుట్ చేసిన తర్వాత విలియమ్సన్, టేలర్ (58 బంతుల్లో 35; 1 ఫోర్) కలిసి మళ్లీ ఇన్నింగ్‌సను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అరుుతే పిచ్ కూడా నెమ్మదించడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. మూడో వికెట్‌కు 46 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపించిన మిశ్రా, తర్వాతి ఓవర్లో నీషమ్ (6) కథ ముగించాడు. వాట్లింగ్ (14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రతీ పరుగు కోసం కష్టపడ్డ టేలర్ రనౌట్ కావడంతో కివీస్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది. మ్యాచ్‌లో ముగ్గురు భారత స్పిన్నర్లు కలిపి 28 ఓవర్లలో 107 పరుగులు మాత్రమే ఇవ్వగా... చివరి పది ఓవర్లలో కివీస్ మూడు బౌండరీలు మాత్రమే కొట్టగలిగింది. రాణించిన రహానే లక్ష్య ఛేదనలో భారత్ మరోసారి తొందరగానే రోహిత్ (11) వికెట్ కోల్పోరుుంది. అరుుతే ఆ తర్వాత రహానే, కోహ్లి (51 బంతుల్లో 45; 2 ఫోర్లు, 1 సిక్స్) మంచి సమన్వయంతో దూసుకుపోయారు. గత మూడు మ్యాచ్‌లలో వైఫల్యం తర్వాత ఒత్తిడిలో ఉన్న రహానే ఈ సారి స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. బౌల్ట్ వేసిన ఓవర్లో ముందుగా ఫోర్ కొట్టిన అతను, ఆ తర్వాత చూడచక్కటి అప్పర్ కట్‌తో సిక్సర్ బాదాడు. అనంతరం సౌతీ ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు కొట్టాడు. మరో వైపు కోహ్లి చకచకా పరుగులు సాధించాడు. అరుుతే వీరిద్దరి 79 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి సోధి తెర దించాడు. దూరంగా వెళుతున్న బంతిని వేటాడి కోహ్లి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం 61 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరుుతే ఏడు పరుగుల వ్యవధిలో రహానే, ధోని (31 బంతుల్లో 11) అవుట్ కావడం భారత్ కష్టాలు పెంచింది. నిలదొక్కుకునేందుకు చాలా సమయం తీసుకున్న తర్వాత ధోని క్లీన్‌బౌల్డయ్యాడు. అరుుతే మరికొద్ది సేపటికే సౌతీ వరుస బంతుల్లో రెండు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. లాథమ్ అద్భుత క్యాచ్‌కు మనీశ్ పాండే (12) వెనుదిరగ్గా, జాదవ్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో అక్షర్ పటేల్ (40 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్), ధావల్ కులకర్ణి (26 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోరుుంది. ‘వికెట్లు చేతిలో ఉంటే లక్ష్యాన్ని ఛేదించగలిగేవాళ్లం. వికెట్ నెమ్మదిగా మారుతూ రావడం వల్ల బ్యాటింగ్‌కు కష్టమైంది. 5-6 స్థానాల్లో ఆడిన ఆటగాళ్లకు అనుభవం తక్కువగా ఉంది. అరుుతే క్రికెట్ ఎంతో మారిపోరుున ఈ రోజుల్లో వాళ్లను భారీ షాట్లు ఆడకుండా ఆపడం మంచిది కాదు. 15-20 మ్యాచ్‌లు ఆడితే వారే నేర్చుకుంటారు. సిరీస్ గెలవాలంటే చివరి వన్డేలో మేం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది’ - ధోని -
ఇంగ్లండ్‌దే నాలుగో వన్డే
హెడింగ్లీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ దిశగా సాగుతోంది. గురువారం జరిగిన నాలుగో వన్డేలోనూ ఆతిథ్య జట్టు 4 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 247 పరుగులు చేసింది. కెప్టెన్ అజహర్ అలీ (104 బంతుల్లో 80; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇమాద్ వాసిమ్ (41 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. రషీద్‌కు మూడు... మోయిన్ అలీ, జోర్డాన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48 ఓవర్లలో ఆరు వికెట్లకు 252 పరుగులు చేసి విజయం సాధించింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా మిడిల్ ఆర్డర్లో స్టోక్స్ (70 బంతుల్లో 69; 6ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (83 బం తుల్లో 61; 4 ఫోర్లు, 1 సిక్స్), మోయిన్ అలీ (48 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఇర్ఫాన్ రెండు వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లో 4-0 ఆధిక్యానికి వచ్చింది. కార్డిఫ్‌లో ఆదివారం చివరిదైన ఐదో వన్డే జరుగుతుంది. -
వార్నర్ సెంచరీ: ఆసీస్ గెలుపు
బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో ముక్కోణపు సిరీస్‌లోని నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 36 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. వార్నర్ (120 బంతుల్లో 109; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... ఉస్మాన్ ఖాజా (71 బంతుల్లో 59; 4 ఫోర్లు,1 సిక్సర్), స్మిత్ (49 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తాహిర్ 2 వికె ట్లు తీశాడు. అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.4 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. 38వ ఓవర్లో 210/4తో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా... కేవలం 42 పరుగుల వ్యవధిలోనే మిగతా ఆరు వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఆమ్లా (64 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్సర్), డుప్లెసిస్ (76 బంతుల్లో 63; 5 ఫోర్లు), డివిలియర్స్ (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (39 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజెల్‌వుడ్, జంపా తలా 3 వికెట్లను చేజిక్కించుకున్నారు. -
మనీశ్ మహిమ...
-
మనీశ్ మహిమ...
♦ అజేయ సెంచరీతో గెలిపించిన పాండే ♦ రాణించిన రోహిత్, శిఖర్, ధోని ♦ చివరి వన్డేలో నెగ్గిన టీమిండియా ఆడుతోంది కెరీర్లో నాలుగో వన్డే మాత్రమే. ఎదురుగా ఆస్ట్రేలియాతో వారి గడ్డపై భారీ లక్ష్యఛేదన. కానీ యువ ఆటగాడు మనీశ్ పాండే ఏ దశలోనూ తొణకలేదు. ఆద్యంతం సాధికారిక షాట్లు ఆడిన అతను చివరకు అదే దూకుడుతో భారత్‌కు అద్వితీయ విజయాన్ని అందించాడు. 11 పరుగుల వ్యవధిలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు అవుటైన స్థితిలో బరిలోకి దిగి ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా అత్యుత్తమ ఆటతీరు కనబర్చాడు. ధోని అండగా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి తన విలువేమిటో చూపించాడు. చివరి మూడు ఓవర్లలో భారత్ విజయానికి 35 పరుగులు కావాలి. క్రీజ్‌లో ధోని, పాండే ఉన్నారు. రెండు ఓవర్లలో 22 పరుగులు వచ్చాయి. దాంతో ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. మిషెల్ మార్ష్ వేసిన తొలి బంతి వైడ్ కాగా, ఆ వెంటనే భారీ సిక్సర్ బాదిన ధోని తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అయితే బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్న పాండే మరుసటి బంతికే ఆటను ముగించాడు. లక్ష్యానికి చేరువగా వచ్చినా... మళ్లీ విజయంపై సందేహాలు రేకెత్తించిన టీమిండియా ఈసారి మ్యాచ్ చేజారనివ్వలేదు. మొత్తానికి 4 పరాజయాల తర్వాత దక్కిన విజయంతో భారత్ పరువు నిలిచింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీల మోత మోగించగా, పలు రికార్డులు వెల్లువెత్తిన చివరి వన్డేలో భారత్‌కు గెలుపు దక్కింది. టి20 సిరీస్‌కు ముందు ధోని సేనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ధోనికి కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది. వహ్వా పాండేజీ..! ఆ ఇన్నింగ్స్‌లో బాధ్యత ఉంది, దూకుడూ ఉంది... బ్యాటింగ్‌లో జాగ్రత్త కనిపించింది, గెలిపించాలన్న పట్టుదలా కనిపించింది. ఫామ్‌లో ఉన్న టాప్ ఆటగాళ్లు వెనుదిరిగాక, రన్‌రేట్ కొండలా పెరిగిపోతుండగా, ఎవరూ నమ్మకం పెట్టుకోని దశ నుంచి ‘ఫినిషింగ్ టచ్’ ఇచ్చే వరకు 26 ఏళ్ల మనీశ్ పాండే బ్యాటింగ్ అద్భుతంలా కనిపించింది. నేను ఎదురు చూస్తోంది ఇలాంటి చాన్స్ కోసమే అన్నట్లుగా అతను చెలరేగిపోయిన తీరు మరో ప్రతిభ గల యువ ఆటగాడిని క్రికెట్ ప్రపంచం గుర్తించేలా చేసింది. మూడో వన్డేలో ఐదు బంతులే ఆడే అవకాశం రాగా, తర్వాతి మ్యాచ్‌లో అతను పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. రహానే లేకపోవడంతో బరిలోకి దిగిన ఈ కర్ణాటక స్టార్ భారత అభిమానుల్లో ఆనందం నింపాడు. రోహిత్, ధావన్‌లు కూడా బాగా ఆడినా... జట్టును విజయం దిశగా తీసుకెళ్లింది మాత్రం పాండేనే. తీవ్రమైన ఒత్తిడి మధ్య బరిలోకి దిగినా ఎక్కడా అతను దానిని కనబడనీయకుండా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం ఈ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ అంశం. క్రీజ్‌లో వెనక్కి వెళుతూ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్ దిశగా కొట్టిన మూడు బౌండరీలు సూపర్ అయితే హేస్టింగ్స్ బౌలింగ్‌లో ఒంటికాలిపై కొట్టిన అప్పర్కట్ మరో స్పెషల్ షాట్. చివర్లో విజయానికి కీలకంగా మారిన రెండు థర్డ్‌మ్యాన్ బౌండరీలు అతని తెలివితేటలకు నిదర్శనం. ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఐపీఎల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా వెలుగులోకి వచ్చిన మనీశ్ పాండే 2014 ఐపీఎల్ ఫైనల్లో మరో మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించి అందరినీ ఆకర్షించాడు. నైనిటాల్లో పుట్టినా... తండ్రి ఆర్మీ ఉద్యోగం కారణంగా బెంగళూరులో స్థిరపడిన మనీశ్... ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల కర్ణాటక జట్లలో సత్తా చాటాడు. 2009-10 రంజీ సీజన్లో నాలుగు సెంచరీలతో 882 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచిన అతను, కర్ణాటక జట్టు వరుసగా రెండేళ్లు రంజీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సీనియర్ల గైర్హాజరీతో గత ఏడాది జింబాబ్వేతో కెరీర్లో తొలి వన్డే ఆడి 71 పరుగులు చేసిన మనీశ్, ఈ సిరీస్‌లో తన ఫీల్డింగ్ మెరుపులు కూడా ప్రదర్శించాడు. సిడ్నీలో అద్భుత ప్రదర్శన తర్వాత కూడా అతను మంగళవారం తొలి టి20లో ఆడే అవకాశం లేదు. ఎందుకంటే పాండే ఎంపికైంది వన్డేలకే! -సాక్షి క్రీడావిభాగం సిడ్నీ: ఎట్టకేలకు ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఓ విజయం దక్కింది. భారీ ఛేదనలో కాస్త తడబడినా చివరకు టీమిండియా లక్ష్యాన్ని చేరి క్లీన్‌స్వీప్ కాకుండా తప్పించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. వార్నర్ (113 బంతుల్లో 122; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (84 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 4 వికెట్లకు 331 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మనీశ్ పాండే (81 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, రోహిత్ శర్మ (108 బంతుల్లో 99; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో కోల్పోయాడు. శిఖర్ (56 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హేస్టింగ్స్‌కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 4-1 తో సొంతం చేసుకుంది. మొత్తం 441 పరుగులు చేసిన రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ మంగళవారం మొదలవుతుంది. సెంచరీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కెరీర్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. తొలి ఓవర్లోనే ఫించ్ (6)ను అవుట్ చేసి ఇషాంత్ భారత్‌కు శుభారంభం అందించాడు. కొద్దిసేపటికే తన మూడో ఓవర్లో స్మిత్ (28)ను అవుట్ చేసి బుమ్రా వన్డేల్లో తొలి వికెట్ సాధిం చాడు. ఆ వెంటనే బెయిలీ, షాన్ మార్ష్ కూడా అవుటవ్వడంతో ఆసీస్‌పై ఒత్తిడి పెరిగింది. దాంతో వార్నర్ కూడా తన సహజశైలికి భిన్నంగా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. జట్టు స్కోరు 117/4గా ఉన్న దశలో జత కలిసిన వార్నర్, మిషెల్ మార్ష్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 100 బంతుల్లో భారత్‌పై తొలి సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ చివరకు ఇషాంత్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఒక దశలో అద్భుతంగా ఆడిన మిషెల్ మార్ష్ తొలి సెంచరీ కోసం చివర్లో తడబడటంతో ఆసీస్ పరుగుల జోరు తగ్గింది. భారత బౌలర్లలో బుమ్రా ఆకట్టుకోగా... ఉమేశ్ పేలవ బౌలింగ్ ఆసీస్‌కు కోలుకునే అవకాశం ఇచ్చింది. రోహిత్ సెంచరీ మిస్... భారీ ఛేదనలో మరోసారి రోహిత్, శిఖర్ శుభారంభం అందించారు. ప్రతి బౌలర్‌ను చితకబాది వేగంగా పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 68 పరుగులకు చేరింది. లయోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న శిఖర్... షాన్ మార్ష్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 123 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. సిరీస్‌లో చెలరేగుతూ వచ్చిన కోహ్లి (8) ఈసారి విఫలమయ్యాడు. రహానే స్థానంలో జట్టులోకి వచ్చిన మనీశ్ పాండే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడి సిరీస్‌లో మూడో సెంచరీకి చేరువైన రోహిత్‌ను దురదృష్టం వెంటాడింది. 99 వద్ద హేస్టింగ్స్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా ఆడబోయి అతను కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 91 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన దశలో ధోని (42 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్) బరిలోకి దిగాడు. కెప్టెన్, పాండే మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. 7 పరుగుల వద్ద ధోని ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను డీప్ మిడ్వికెట్లో లయోన్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. ఒకవైపు పాండే దూకుడు ప్రదర్శించగా, ధోని జాగ్రత్తగా ఆడాడు. తాను ఎదుర్కొన్న 36వ బంతికి గానీ ధోని ఫోర్ కొట్టలేదు! గెలిచేందుకు ఆరు పరుగులు చేయాల్సిన దశలో ధోని అవుటైనా, పాండే మిగతా పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 6; వార్నర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 122; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 28; బెయిలీ (సి) ఇషాంత్ (బి) రిషి ధావన్ 6; షాన్ మార్ష్ (రనౌట్) 7; మిషెల్ మార్ష్ (నాటౌట్) 102; వేడ్ (సి) ధోని (బి) ఉమేశ్ 36; ఫాల్క్‌నర్ (బి) బుమ్రా 1; హేస్టింగ్స్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 330. వికెట్ల పతనం: 1-6; 2-64; 3-78; 4-117; 5-235; 6-320; 7-323. బౌలింగ్: ఇషాంత్ 10-0-60-2; ఉమేశ్ 8-0-82-1; జస్ప్రీత్ బుమ్రా 10-0-40-2; రిషి ధావన్ 10-0-74-1; రవీంద్ర జడేజా 10-0-46-0; గుర్కీరత్ 2-0-17-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వేడ్ (బి) హేస్టింగ్స్ 99; శిఖర్ ధావన్ (సి) షాన్ మార్ష్ (బి) హేస్టింగ్స్ 78; కోహ్లి (సి) వేడ్ (బి) హేస్టింగ్స్ 8; మనీశ్ పాండే (నాటౌట్) 104; ధోని (సి) వార్నర్ (బి) మిషెల్ మార్ష్ 34; గుర్కీరత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49.4 ఓవర్లలో 4 వికెట్లకు) 331. వికెట్ల పతనం: 1-123; 2-134; 3-231; 4-325. బౌలింగ్: హేస్టింగ్స్ 10-1-61-3; బోలండ్ 10-0-58-0; మిషెల్ మార్ష్ 9.4-0-77-1; ఫాల్క్‌నర్ 10-0-54-0; లయోన్ 8-0-58-0; స్మిత్ 2-0-20-0. -
చివరి వన్డేకు అనుమానం
భారత్‌తో నాలుగో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా మోకాలికి దెబ్బ తగలడంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ ఆడకపోవచ్చు. ఇషాంత్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు దెబ్బతగలడం వల్ల మోకాలు వాచిందని జట్టు తెలిపింది. -
ఓటమికి నాదే బాధ్యత: ధోని
కాన్బెర్రా: నాలుగో వన్డేలో అనూహ్య పరాజయం కెప్టెన్ ధోనిని కూడా ఇరకాటంలో పడేసింది. ఒక వైపు మ్యాచ్ ఓడగా, కీలక సమయంలో డకౌట్‌తో తాను కూడా దానికి కారణమయ్యాడు. అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఓటమి భారాన్ని అతను తనపై వేసుకున్నాడు. ‘నాకు కోపం రావడం లేదు కానీ బాగా నిరాశ చెందాననేది వాస్తవం. ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నా. నేను అవుట్ కావడం మ్యాచ్ ఫలితం మార్చింది. ’ అని ధోని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. నొప్పి తగ్గే వరకు రహానేను బ్యాటింగ్‌కు పంపలేకపోయామని, అతను ఆలస్యంగా బరిలోకి దిగడం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించిందని కెప్టెన్ అన్నాడు. ఇంతటి ఒత్తిడిలో కొత్త కుర్రాళ్లు ఆడటం కష్టమని గుర్కీరత్, రిషి ధావన్‌లకు మద్దతు పలికిన మహి... జడేజాను మాత్రం విమర్శించాడు. ‘లోయర్ ఆర్డర్లో జడేజా బ్యాట్స్‌మెన్‌కు తగిన సూచనలిస్తూ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తే బాగుండేది. కానీ అతను ఆ పని చేయలేదు’ అని చురక అంటించాడు. -
సిగ్గు... సిగ్గు...
► నాలుగో వన్డేలో భారత్ అనూహ్య పరాజయం ► 25 పరుగులతో ఆసీస్ గెలుపు ► పనికి రాని కోహ్లి, ధావన్ సెంచరీలు ► ఆఖరి వన్డే శనివారం 76 బంతుల్లో చేయాల్సిన పరుగులు 72, రన్‌రేట్ ఆరుకంటే తక్కువ, చేతిలో 9 వికెట్లు...ఈ స్థితిలో ఏ జట్టయినా మ్యాచ్ ఓడిపోతుందా..! పటిష్ట జట్లతో తలపడినా పసి కూనలు కూడా సంచలనం కోసం పట్టుదలగా ఆడతాయి. కానీ భారత స్టార్ బ్యాట్స్‌మెన్ మాత్రం బొక్కబోర్లా పడిపోయారు. 46 పరుగుల వ్యవధిలో అన్ని వికెట్లూ చేజార్చుకొని ఓటమిని కావలించుకున్నారు. ఫించ్ సెంచరీ, వార్నర్ మెరుపులతో ఆస్ట్రేలియా ఏకంగా 349 పరుగుల కొండలాంటి లక్ష్యం భారత్ ముందుంచింది. ఫామ్‌లోకి వచ్చిన ధావన్, ఫామ్ అంటిపెట్టుకునే ఉన్న కోహ్లి శతకాల మోతతో స్కోరును 277 పరుగుల దాకా తెచ్చాక ఇక గెలుపు ఖాయమనిపించింది. కానీ భారత్ చేతకానితనం, ఆసీస్ పోరాటం కలిసి ఫలితాన్ని మనకు వ్యతిరేకంగా మార్చి పడేశాయి. కాన్బెర్రా: కచ్చితంగా గెలుస్తారనుకున్న మ్యాచ్‌లో ధోని సేన భంగపడింది. గత మూడు వన్డేలలో 300 పరుగుల స్కోరును కాపాడుకోలేకపోయిన టీమిండియా ఈసారి అంతకంటే భారీ స్కోరును ఛేదించే ప్రయత్నం చేసినా... చివరకు ఓటమి తప్పలేదు. బుధవారం ఇక్కడి మనుకా ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (107 బంతుల్లో 107; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా, డేవిడ్ వార్నర్ (92 బంతుల్లో 93; 12 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో చేజార్చుకున్నాడు. ఇషాంత్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (113 బంతుల్లో 126; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (92 బంతుల్లో 106; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకాలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 177 బంతుల్లోనే 212 పరుగులు జోడించడం విశేషం. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ రిచర్డ్సన్ (5/68) కీలక వికెట్లు తీసి భారత్‌ను పడగొట్టాడు. తాజా ఫలితంతో సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం 4-0కు చేరగా... చివరి వన్డే శనివారం జరుగుతుంది. ఆసీస్‌కు శుభారంభం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ఫించ్ శుభారంభం ఇచ్చారు. భువనేశ్వర్ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన వార్నర్... ఉమేశ్ వేసిన తర్వాతి ఓవర్లో మరో మూడు బౌండరీలు కొట్టాడు. కొద్ది సేపటికి జడేజాకు కూడా ఇదే ఫలితాన్ని అతను రుచి చూపించాడు. మరో వైపు ఫించ్ కూడా జోరు పెంచాడు. భువీ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 16 పరుగులు రాబట్టాడు. చివరకు వార్నర్‌ను ఇషాంత్ బౌల్డ్ చేయడంతో ఈ భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరోవైపు 97 బంతుల్లో ఫించ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్మిత్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇదే జోరును కొనసాగించాడు. స్మిత్, మిషెల్ మార్ష్ (33) కలిసి 7 ఓవర్లలో 67 పరుగులు జత చేశారు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఇషాంత్ వేసిన 50వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 18 పరుగులు కొల్లగొట్టడం విశేషం. ఆస్ట్రేలియా చివరి 10 ఓవర్లలో 111 పరుగులు చేసింది. చెలరేగిన ధావన్, కోహ్లి ఆసీస్ స్పిన్నర్ లయోన్‌తో బౌలింగ్ ప్రారంభించగా భారత్ అతని 2 ఓవర్లలోనే 23 పరుగులు రాబట్టి మెరుపు ఆరంభం చేసింది. మరోసారి ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రిచర్డ్సన్ ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్ బాది అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో జత కలిసిన ధావన్, కోహ్లి ఆసీస్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్నారు. చక్కటి షాట్లు ఆడుతూ, అవసరమైన చోట ధాటిని పెంచుతూ, బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. 92 బంతుల్లోనే ఈ భాగస్వామ్యం వంద పరుగులకు చేరింది. ఈ క్రమంలో ముందుగా 92 బంతుల్లో ధావన్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత కోహ్లి 84 బంతుల్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం భారత్ పతనానికి ధావన్ వికెట్‌తో హేస్టింగ్స్ శ్రీకారం చుట్టాడు. ఆ దశలో... 37.2 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు 277/1...తర్వాతి బంతిని కట్ చేయబోయి బ్యాక్వర్డ్ పాయింట్లో ధావన్ క్యాచ్ ఇచ్చాడు. అయితే మరో మూడు బంతులకు ధోని (0) అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వికెట్‌కు దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి ధోని కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మరో పరుగు తర్వాత అనవసరపు షాట్‌కు ప్రయత్నించి కోహ్లి మిడాఫ్‌లో ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను స్మిత్ అందుకోవడంతో ఆ జట్టులో ఉత్సాహం పెరిగింది. అంతే...ఆ తర్వాత ఆస్ట్రేలియా మరో అవకాశం ఇవ్వకుండా భారత్ ఇన్నింగ్స్‌ను చుట్టేసింది. ‘తప్పనిసరి’ అయితేనే బరిలోకి దిగుతానని చెప్పిన రహానే (2) క్రీజ్‌లోకి రాక తప్పలేదు. అయినా అతనూ ఓటమిని తప్పించలేకపోయాడు. 18ఆస్ట్రేలియాకు సొంతగడ్డపై ఇది వరుసగా 18వ విజయం. 4 వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి నాలుగో స్థానానికి (25 సెంచరీలు) చేరుకున్నాడు. సచిన్ (49), పాంటింగ్ (30), జయసూర్య (28) అతనికంటే ముందుండగా...సంగక్కర కూడా 25 సెంచరీలే చేశాడు. నిర్లక్ష్యానికి పరాకాష్ట! ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజం. భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఓడిపోవడం ఇవాళ కొత్తేం కాదు. ఆ మాట కొస్తే ఆస్ట్రేలియాలో వారం రోజుల్లో మూడు వన్డేలు ఓడిపోయారు. సిరీస్ ఓడిపోయిన తర్వాత నాలుగో మ్యాచ్ గెలిస్తే ఎంత? గెలవకపోతే ఎంత? కానీ సగటు భారత క్రికెట్ అభిమాని ఎవరైనా సరే ఈ మ్యాచ్ చూస్తే బాధతో తల్లడిల్లిపోతాడు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న అభిమాని ఆనందాన్ని కేవలం అరగంటలో ఆవిరి చేశారు. రోహిత్ శర్మ సంచలన షాట్లతో అద్భుతమైన ఆరంభాన్ని అందించాక... శిఖర్ ధావన్, కోహ్లి తమ కెరీర్లోనే గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరూ షాట్లు ఆడిన తీరు చూస్తే లక్ష్యం నాలుగొందలైనా ఊదిపారేయొచ్చని అనిపించింది. 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 37వ ఓవర్ ముగిసేసరికి 274 పరుగులు చేసింది. అంటే ఇక 78 బంతుల్లో 75 పరుగులు చేస్తే గెలుస్తాం. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో మ్యాచ్ పోగొట్టుకునే జట్టు ఏదీ ఉండదేమో. ఫామ్‌లో ఉన్న రహానే గాయం కారణంగా బ్యాటింగ్ చేస్తాడో లేదో తెలియని స్థితి. అందుకే కోహ్లి, ధావన్‌ల అద్భుత భాగస్వామ్యం చూస్తే ముచ్చటేసింది. కానీ బాగా ఆడుతున్న సమయంలో ఏదో ఒక తిక్క షాట్ ఆడి అవుటవ్వడం ధావన్‌కు కొత్తేం కాదు. ఈసారి కూడా అదే చేశాడు. విజయం సాధించేశామనే ధీమాతో నిర్లక్ష్యపు షాట్ ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ షాట్లు ఆడతారా? ఆస్ట్రేలియా క్రికెటర్లకు చిన్న అవకాశం దొరికితే మ్యాచ్‌ను లాగేసుకుంటారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తరఫున ఉత్తమ బౌలర్ హేస్టింగ్స్. తన చివరి ఓవర్లో ధావన్‌తో పాటు ధోనిని కూడా అతను ఆఖరి బంతికి అవుట్ చేశాడు. నిజానికి ఈ ఓవర్ తర్వాత ఆస్ట్రేలియా ఎవరితో బౌలింగ్ చేయించాలో కూడా తెలియని స్థితి. కానీ ధోని అత్యంత నిర్లక్ష్యంగా ఆడి అవుటయ్యాడు. ఇప్పటికే తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ షాట్ తన కెరీర్ ముగింపును మరింత వేగవంతం చేసినా ఆశ్చర్యం లేదు. ఇక ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే కోహ్లి కూడా పేలవంగా ఆడి అవుటయ్యాడు. అప్పటివరకూ ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా కచ్చితమైన షాట్లు ఆడిన కోహ్లి... ఇలాంటి లూజ్ షాట్ ఆడతాడని కనీసం ఊహించలేం. కెప్టెన్‌కే బాధ్యత లేనప్పుడు నాకెందుకు అనుకున్నాడా? లేక దురదృష్టమా? దీనికి సమాధానం కోహ్లి ఒక్కడికే తెలుసు. రాత్రికి రాత్రే హీరోలు కాలేరు రవీంద్ర జడేజా ఇటీవల కాలంలో నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్. అనుభవం కూడా ఉంది. అందుకే అతను జాగ్రత్తగా ఒక ఎండ్‌లో నిలబడ్డాడు. రహానే కనీసం బ్యాట్ పట్టుకునే స్థితిలో లేకపోయినా వచ్చి ఆడినందుకు అభినందించాలి. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య నాలుగు కుట్లు పడ్డా... పెయిన్ కిల్లర్ తీసుకుని వచ్చి ఆడాడు. కాబట్టి అతని నుంచి పెద్దగా ఆశించడం కూడా తప్పు. కానీ గుర్కీరత్, రిషి ధావన్ అనే ఇద్దరు కొత్త క్రికెటర్లు మాత్రం దారుణంగా నిరాశపరిచారు. ఇద్దరిలోనూ మంచి నైపుణ్యం ఉంది. దేశవాళీ క్రికెట్లో అద రగొట్టారు. క్రీజులోకి వచ్చాక చక్కటి షాట్లతో చెరో బౌండరీ కూడా కొట్టారు. సింగిల్స్ తీసి జడేజాకు స్ట్రయికింగ్ ఇస్తే పని పూర్తయ్యేది. కానీ రాత్రికి రాత్రే హీరోలు కావాలనే తపనేమో... భారీ షాట్ల కోసం ప్రయత్నించి అవుటయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ఆడే కుర్రాళ్లకు భారత జట్టులో చోటు కల్పించడం కూడా అనవసరం. ‘తోక’కు ఏమైందో... టి20 క్రికెట్... ముఖ్యంగా ఐపీఎల్ వచ్చాక బౌలర్లంతా నెట్స్‌లో కొద్దిసేపైనా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సెంచరీలు బాదిన బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్‌లు కూడా ఏ మాత్రం తెలివి చూపించలేదు. అందరూ భారీ షాట్లకే వెళ్లారు. ఫలితం ఓ ఎండ్‌లో జడేజా బొమ్మలా నిలబడిపోయాడు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే ఏ క్రికెటర్ అయినా బాధ్యతగా ఆడాలి. ‘ఇలాగే ఆడు’ అని ఎవరూ బొట్టుపెట్టి చెప్పరు. ఓ ఎండ్‌లో టపటపా వికెట్లు పడుతుంటే కనీసం జడేజా వెళ్లి ఎవరినీ గైడ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్, డెరైక్టర్ ఏమైనా చెప్పారో లేదో తెలియదు. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో కేవలం 25 పరుగుల తేడాతో ఓడిపోవడం పెద్ద విషయంలా కనిపించకపోవచ్చు. కానీ ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఆడిన తీరు... నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇటీవలి కాలంలోనే అత్యంత చెత్త ప్రదర్శన. పూర్తిగా బాధ్యతారాహిత్యం. -సాక్షి క్రీడావిభాగం స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఇషాంత్ 93; ఫించ్ (సి) ఇషాంత్ (బి) ఉమేశ్ 107; మార్ష్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 33; స్మిత్ (సి) గుర్కీరత్ (బి) ఇషాంత్ 51; మ్యాక్స్‌వెల్ (సి) (సబ్) పాండే (బి) ఇషాంత్ 41; బెయిలీ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 10; ఫాల్క్‌నర్ (బి) ఉమేశ్ 0; వేడ్ (రనౌట్) 0; హేస్టింగ్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 348. వికెట్ల పతనం: 1-187; 2-221; 3-288; 4-298; 5-319; 6-319; 7-321; 8-348. బౌలింగ్: ఉమేశ్ 10-1-67-3; భువనేశ్వర్ 8-0-69-0; ఇషాంత్ 10-0-77-4; గుర్కీరత్ 3-0-24-0; రిషి ధావన్ 9-0-53-0; జడేజా 10-0-51-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వేడ్ (బి) రిచర్డ్సన్ 41; శిఖర్ ధావన్ (సి) బెయిలీ (బి) హేస్టింగ్స్ 126; కోహ్లి (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 106; ధోని (సి) వేడ్ (బి) హేస్టింగ్స్ 0; గుర్కీరత్ (సి) (సబ్) షాన్‌మార్ష్ (బి) లయోన్ 5; జడేజా (నాటౌట్) 24; రహానే (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 2; రిషి ధావన్ (సి) వార్నర్ (బి) రిచర్డ్సన్ 9; భువనేశ్వర్ (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 2; ఉమేశ్ (సి) బెయిలీ (బి) మార్ష్ 2; ఇషాంత్ (సి) వేడ్ (బి) మార్ష్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 323. వికెట్ల పతనం: 1-65; 2-277; 3-277; 4-278; 5-286; 6-294; 7-308; 8- 311; 9-315; 10-323. బౌలింగ్: లయోన్ 10-0-76-1; రిచర్డ్సన్ 10-1-68-5; హేస్టింగ్స్ 10-2-50-2; ఫాల్క్‌నర్ 7-0-48-0; మార్ష్ 9.2-0-55-2; మ్యాక్స్‌వెల్ 1-0-10-0; స్మిత్ 2-0-16-0. -
ఇక పరువు కోసం...
* భారత్, ఆస్ట్రేలియాల నాలుగో వన్డే నేడు * విజయం కోసం ధోనిసేన ఆరాటం * క్లీన్‌స్వీప్ స్మిత్ బృందం లక్ష్యం ఆస్ట్రేలియా పర్యటనలో సాధారణంగా బ్యాట్స్‌మెన్ విఫలమై సిరీస్‌లు అప్పజెప్పడం చాలాకాలంగా భారత్‌కు ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేస్తున్నా మ్యాచ్‌లు గెలవలేకపోతున్నారు. ఐదు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ధోనిసేన మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే పరువు దక్కించుకుంటుంది. మరోవైపు తొలిసారి భారత్‌తో స్వదేశంలో ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేయాలనేది ఆస్ట్రేలియా లక్ష్యం. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. కాన్బెర్రా: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆస్ట్రేలియా పిచ్‌లపై పరుగుల వరద పారుతోంది. సిరీస్‌లో తొలి మూడు వన్డేల్లోనూ ఊహించని విధంగా భారీ స్కోర్లు వచ్చాయి. నాలుగో వన్డే కూడా దీనికి అతీతం కాకపోవచ్చు. మరోసారి ఫ్లాట్ పిచ్‌పై సమరానికి రెండు జట్లు సిద్ధమయ్యాయి. మనుకా ఓవల్ మైదానంలో నేడు (బుధవారం) జరిగే నాలుగో వన్డేలో భారీ స్కోర్లు రావచ్చనేది అంచనా. ఇప్పటికే సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారీ లక్ష్యాలని ఛేదించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా... కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తున్న భారత జట్టు కూర్పు విషయంలో గందరగోళంతో ఉంది. మళ్లీ మార్పులు! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింక్య రహానే ముగ్గురూ సూపర్ ఫామ్‌లో ఉన్నందున భారత్ వరుసగా ప్రతి మ్యాచ్‌లోనూ భారీస్కోరు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఇబ్బందిపడ్డా మూడో వన్డేలో ధావన్ కాస్త కుదురుకున్నాడు. ధోని కూడా టచ్‌లోనే కనిపిస్తున్నందున బ్యాటింగ్ విభాగంలో సమస్యలు ఉండకపోవచ్చు. గుర్కీరత్, రిషి ధావన్‌లకు ఇంకో అవకాశం ఇవ్వొచ్చు. బౌలింగ్ విభాగంలో మాత్రం మళ్లీ మార్పులు తప్పకపోవచ్చు. పిచ్ స్వభావం దృష్ట్యా మళ్లీ అశ్విన్ తుది జట్టులోకి రావచ్చు. ఉమేశ్ స్థానంలో అతణ్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రిషి ధావన్ మూడో పేసర్‌గా సరిపోడని భావిస్తే మాత్రం తను కూడా బెంచ్ మీద కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు భువనేశ్వర్‌కు అవకాశం రావచ్చు. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా ధోనిసేన తుది జట్టు కూర్పు విషయంలో తీవ్ర గందరగోళంలో ఉంది. తుది జట్టులో లియోన్ ఇక ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌లో మార్పులు చేయక తప్పదు. కూతురు పుట్టినందున రెండు వన్డేలకు సెలవు తీసుకున్న వార్నర్ తిరిగి జట్టుతో చేరాడు. అయితే వార్నర్ స్థానంలో ఆడిన షాన్‌మార్ష్ రెండు మ్యాచ్‌ల్లోనూ విశేషంగా రాణించాడు. అయినా సరే ఆస్ట్రేలియా జట్టు ఎంపికలో సెంటిమెంట్లను పట్టించుకోదు. కాబట్టి షాన్‌మార్ష్ స్థానంలో వార్నర్ తుది జట్టులోకి రావడం ఖాయం. బెయిలీ, స్మిత్, మ్యాక్స్‌వెల్ అందరూ ఫామ్‌లో ఉన్నందున ఆసీస్ శిబిరం పూర్తిగా రిలాక్స్‌గా ఉంది. బౌలింగ్ విభాగంలో మాత్రం ఒక స్పిన్నర్ తుది జట్టులో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించారు. దీంతో నాథన్ లియోన్ జట్టులోకి వచ్చాడు. బోలాండ్‌ను తప్పించి లియోన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), కోహ్లి, ధావన్, రోహిత్, రహానే, గుర్కీరత్, జడేజా, అశ్విన్, ఇషాంత్, బరిందర్, రిషి ధావన్/భువనేశ్వర్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, బెయిలీ, మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్, వేడ్, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, రిచర్డ్సన్, లియోన్. పిచ్, వాతావరణం మరోసారి ఫ్లాట్ వికెట్ సిద్ధంగా ఉంది. వర్షం పడే అవకాశాలు లేవు. భారీస్కోర్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. వన్డేల్లో ప్రతి చోటా ఫ్లాట్ వికెట్లు ఎదురవడం వల్ల బౌలర్లు ఇబ్బంది పడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్ బాగున్నవారే పరుగులను నియంత్రిస్తారు. మా జట్టు మొదటి మూడు వన్డేల్లోనూ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ అందరూ పూర్తి నియంత్రణతో ఆడుతున్నారు. కచ్చితంగా క్లీన్‌స్వీప్ మా లక్ష్యం. -వార్నర్ మా బౌలర్లకు పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల తప్పులు చేస్తున్నారు. వీటి నుంచి పాఠాలు నేర్చుకుని రాణిస్తేనే క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోగలం. సిరీస్ ఓడిపోవడం అందరికీ బాధ కలిగించింది. అయితే సిగ్గుపడాల్సిన స్థాయిలో ఘోరంగా మా జట్టు ఆడలేదు. కేవలం ఆరు రోజుల వ్యవధిలో మూడు టైమ్ జోన్లకు వెళ్లి ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోతారు. కాబట్టి ఇలాంటి పర్యటనలకు ఎక్కువమంది క్రికెటర్లతో రావడం వల్ల రొటేషన్‌ను అమలు చేయొచ్చు. - రవిశాస్త్రి, భారత్ టీమ్ డెరైక్టర్ ఉ. గం. 8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం 2 గత నాలుగేళ్లలో భారత్ ఆస్ట్రేలియాతో వారి దేశంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 19 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు టెస్టులు ‘డ్రా’ కాగా... ఒక వన్డే, ఒక టి20లో గెలిచింది. మిగిలిన 15 మ్యాచ్‌ల్లోనూ ఓడింది. 1 కాన్బెర్రాలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. గతంలో ఈ మైదానంలో 2008లో శ్రీలంకతో ఆడిన వన్డేలో భారత్ ఓడిపోయింది.