ప్రయోగాల సమయం | Today is the fourth ODI against Sri Lanka | Sakshi
Sakshi News home page

ప్రయోగాల సమయం

Published Thu, Aug 31 2017 12:40 AM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

ప్రయోగాల సమయం

ప్రయోగాల సమయం

తుది జట్టులో మార్పులకు భారత్‌ సిద్ధం
∙ నేడు శ్రీలంకతో నాలుగో వన్డే
∙ ఆతిథ్య జట్టుకు విజయం దక్కేనా!


టెస్టు సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌... వన్డే సిరీస్‌ ఇప్పటికే సొంతం... శ్రీలంక గడ్డపై అడుగు పెట్టిన నాటినుంచి ఎదురు లేకుండా సాగుతున్న భారత క్రికెట్‌ జట్టు ఆడుతూ పాడుతూ విజయాలు అందుకుంటోంది. ఇప్పుడు ఇదే జోరులో మరో మ్యాచ్‌ కోసం కోహ్లి సేన సన్నద్ధమైంది. దాంతో పాటు ఇప్పటి వరకు అవకాశం దక్కని ఆటగాళ్లను పరీక్షించేందుకు కూడా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే లక్ష్యం మాత్రం మరో గెలుపే.వరుసగా మూడు వన్డేల్లో ఓటమి, ఆటగాళ్ల సమష్టి వైఫల్యం, ఇప్పటికే ఇద్దరు కెప్టెన్లు మారారు... సెలక్టర్ల రాజీనామా, గత మ్యాచ్‌పై విచారణ, మరో కెప్టెన్‌తో మ్యాచ్‌ బరిలోకి... శ్రీలంక కష్టాల జాబితా చాంతాడంత ఉంది. ఇలాంటి స్థితిలో ఆ జట్టు ఎంత వరకు కోలుకోగలదు? సమస్యలను పక్కన పెట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలదా? సొంతగడ్డపై ఆ జట్టు ఆశిస్తున్న మొదటి విజయం దక్కే అవకాశం ఏమాత్రమైనా ఉందా!   

కొలంబో: శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 3–0తో సొంతం చేసుకున్న భారత్, ఈ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉండగా... స్వదేశంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక కాస్తయినా పరువు దక్కించుకోవాలంటే ఒక మ్యాచ్‌లోనైనా విజయం సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు ఇక్కడ జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌ ఆడిన టీమ్‌నుంచి ఒకటి, రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉండగా...లంక జట్టులో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.  

పాండే, కుల్దీప్‌లకు చాన్స్‌!  
ప్రపంచ కప్‌ సన్నాహకాల్లో భాగంగా అందరికీ అవకాశాలు కల్పిస్తామని కెప్టెన్‌ కోహ్లి పదే పదే చెబుతున్నాడు. ఇప్పటికే సిరీస్‌ గెలవడంతో నాలుగో వన్డేలో భారత జట్టులో మార్పులు ఉండవచ్చు. కుల్దీప్‌ను ఆడించేందుకు సిద్ధమంటూ కోహ్లి ఇప్పటికే పరోక్షంగా చెప్పేశాడు. కాబట్టి అక్షర్, చహల్‌లో ఒకరిని తప్పించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో రోహిత్‌ గత రెండు మ్యాచ్‌లలోనూ చెలరేగాడు. ధావన్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లి, ధావన్‌ బ్యాటింగ్‌ గురించి ఆందోళనే అనవసరం. అయితే తనకు పెద్దగా అలవాటు లేని నాలుగో స్థానంలో రాహుల్‌ కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. అతను ఒక చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. ఇక ధనంజయ స్పిన్‌ను ఆడలేక వరుసగా విఫలమైన కేదార్‌ జాదవ్‌ స్థానంలో మనీశ్‌ పాండేను ఆడించవచ్చు. మున్ముందు తుది జట్టులో రెగ్యులర్‌ అయ్యే అవకాశం ఉన్న పాండేకు ఇక్కడ కనీసం రెండు మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వడం ముఖ్యం. అయితే తుది జట్టు కూర్పును బట్టి చూస్తే రహానే, శార్దుల్‌ ఠాకూర్‌లు మాత్రం మళ్లీ బెంచీకే పరిమితం అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇక కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్‌ బరిలోకి దిగుతున్న ధోని ఈ మ్యాచ్‌ను ఎలా చిరస్మరణీయం చేసుకుంటాడనేది ఆసక్తికరం.
 
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్, రాహుల్, పాండే, పాండ్యా, ధోని, అక్షర్‌/చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా.  
శ్రీలంక: మలింగ (కెప్టెన్‌), డిక్‌వెలా, మునవీరా, కుషాల్‌ మెండిస్, తిరిమన్నె, మాథ్యూస్, ధనంజయ డి సిల్వ, సిరివర్ధన, అఖిల ధనంజయ, చమీరా, ఫెర్నాండో

కపుగెడెరపై విచారణ
మూడో వన్డేలో టాస్‌ గెలిచిన తర్వాత కూడా బ్యాటింగ్‌ ఎంచుకోవడంపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు విచారణ చేపట్టనుంది. మ్యాచ్‌కు ముందు రోజు టాస్‌ గెలిస్తే ఫీల్డింగ్‌ తీసుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. టాస్‌ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లంతా ఫీల్డింగ్‌కు సిద్ధమైపోయారు. అయితే కెప్టెన్‌ కపుగెడెర వచ్చి అనూహ్యంగా బ్యాటింగ్‌ అని చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. పరిస్థితులు పేస్‌కు అనుకూలంగా ఉండటంతో లంక తొలుత బ్యాటింగ్‌ చేసి 217 పరుగులు మాత్రమే చేసింది.  

పిచ్, వాతావరణం: ప్రేమదాస స్టేడియంలోని పిచ్‌పై ఎక్కువ సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే ఆరంభంలో పేస్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. వర్షం అంతరాయం కలిగించవచ్చు.  

కెప్టెన్‌గా మలింగ...
తొలి రెండు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఉపుల్‌ తరంగ సస్పెన్షన్‌తో దూరం కాగా, మూడో వన్డేలో కెప్టెన్‌గా ఉన్న కపుగెడెర గాయంతో సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో లసిత్‌ మలింగ నాయకత్వంలో శ్రీలంక బరిలోకి దిగుతోంది. అయితే కెప్టెన్‌ ఎవరైనా జట్టులో ఇప్పుడు స్ఫూర్తి నింపడం అవసరం. గత ఏడాది కాలంలో శ్రీలంక వన్డే జట్టులోకి 40 మంది ఎంపిక కావడం ఆ టీమ్‌ నిలకడలేమిని చూపిస్తోంది. గత మ్యాచ్‌లో ఆడిన చండిమాల్‌ కూడా గాయంతో తప్పుకున్నాడు. ఇలాంటి స్థితిలో లంక విజయం సాధించాలంటే అసాధారణ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాటింగ్‌లో డిక్‌వెలా, కుషాల్‌ పెరీరా మాత్రం కొంత వరకు ఫర్వాలేదనిపిస్తున్నారు. గత మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన తిరిమన్నె మళ్లీ రాణించాలని లంక కోరుకుంటోంది. మాజీ కెప్టెన్‌ మాథ్యూస్‌ ఇప్పటి వరకు టీమ్‌కు ఉపయుక్తమైన ఆటతీరు ప్రదర్శించలేకపోవడం జట్టును మరింత దెబ్బ తీస్తోంది. మలింగ బౌలింగ్‌లో మునుపటి వాడి లేకపోవడంతో లంక పేస్‌ బలహీనంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం ధనంజయ డి సిల్వ, దిల్షాన్‌ మునవీరాలను లంక జట్టులోకి తీసుకుంది.  

మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement