ఇక పరువు కోసం... | India Vs Australia | Sakshi
Sakshi News home page

ఇక పరువు కోసం...

Published Wed, Jan 20 2016 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

ఇక పరువు కోసం...

ఇక పరువు కోసం...

* భారత్, ఆస్ట్రేలియాల నాలుగో వన్డే నేడు    
* విజయం కోసం ధోనిసేన ఆరాటం   
* క్లీన్‌స్వీప్ స్మిత్ బృందం లక్ష్యం

 
ఆస్ట్రేలియా పర్యటనలో సాధారణంగా బ్యాట్స్‌మెన్ విఫలమై సిరీస్‌లు అప్పజెప్పడం చాలాకాలంగా భారత్‌కు ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేస్తున్నా మ్యాచ్‌లు గెలవలేకపోతున్నారు. ఐదు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ధోనిసేన మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే పరువు దక్కించుకుంటుంది. మరోవైపు తొలిసారి భారత్‌తో స్వదేశంలో ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేయాలనేది ఆస్ట్రేలియా లక్ష్యం. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
 
కాన్‌బెర్రా: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆస్ట్రేలియా పిచ్‌లపై పరుగుల వరద పారుతోంది. సిరీస్‌లో తొలి మూడు వన్డేల్లోనూ ఊహించని విధంగా భారీ స్కోర్లు వచ్చాయి.  నాలుగో వన్డే కూడా దీనికి అతీతం కాకపోవచ్చు. మరోసారి ఫ్లాట్ పిచ్‌పై సమరానికి రెండు జట్లు సిద్ధమయ్యాయి. మనుకా ఓవల్ మైదానంలో నేడు (బుధవారం) జరిగే నాలుగో వన్డేలో భారీ స్కోర్లు రావచ్చనేది అంచనా. ఇప్పటికే సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారీ లక్ష్యాలని ఛేదించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా... కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తున్న భారత జట్టు కూర్పు విషయంలో గందరగోళంతో ఉంది.
 
మళ్లీ మార్పులు!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింక్య రహానే ముగ్గురూ సూపర్ ఫామ్‌లో ఉన్నందున భారత్ వరుసగా ప్రతి మ్యాచ్‌లోనూ భారీస్కోరు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఇబ్బందిపడ్డా మూడో వన్డేలో ధావన్ కాస్త కుదురుకున్నాడు. ధోని కూడా టచ్‌లోనే కనిపిస్తున్నందున బ్యాటింగ్ విభాగంలో సమస్యలు ఉండకపోవచ్చు. గుర్‌కీరత్, రిషి ధావన్‌లకు ఇంకో అవకాశం ఇవ్వొచ్చు. బౌలింగ్ విభాగంలో మాత్రం మళ్లీ మార్పులు తప్పకపోవచ్చు. పిచ్ స్వభావం దృష్ట్యా మళ్లీ అశ్విన్ తుది జట్టులోకి రావచ్చు.

ఉమేశ్ స్థానంలో అతణ్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రిషి ధావన్ మూడో పేసర్‌గా సరిపోడని భావిస్తే మాత్రం తను కూడా బెంచ్ మీద కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు భువనేశ్వర్‌కు అవకాశం రావచ్చు. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా ధోనిసేన తుది జట్టు కూర్పు విషయంలో తీవ్ర గందరగోళంలో ఉంది.
 
తుది జట్టులో లియోన్
ఇక ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌లో మార్పులు చేయక తప్పదు. కూతురు పుట్టినందున రెండు వన్డేలకు సెలవు తీసుకున్న వార్నర్ తిరిగి జట్టుతో చేరాడు. అయితే వార్నర్ స్థానంలో ఆడిన షాన్‌మార్ష్ రెండు మ్యాచ్‌ల్లోనూ విశేషంగా రాణించాడు. అయినా సరే ఆస్ట్రేలియా జట్టు ఎంపికలో సెంటిమెంట్లను పట్టించుకోదు. కాబట్టి షాన్‌మార్ష్ స్థానంలో వార్నర్ తుది జట్టులోకి రావడం ఖాయం. బెయిలీ, స్మిత్, మ్యాక్స్‌వెల్ అందరూ ఫామ్‌లో ఉన్నందున ఆసీస్ శిబిరం పూర్తిగా రిలాక్స్‌గా ఉంది. బౌలింగ్ విభాగంలో మాత్రం ఒక స్పిన్నర్ తుది జట్టులో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించారు. దీంతో నాథన్ లియోన్ జట్టులోకి వచ్చాడు. బోలాండ్‌ను తప్పించి లియోన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.  
 
జట్లు (అంచనా)

భారత్: ధోని (కెప్టెన్), కోహ్లి, ధావన్, రోహిత్, రహానే, గుర్‌కీరత్, జడేజా, అశ్విన్, ఇషాంత్, బరిందర్, రిషి ధావన్/భువనేశ్వర్.
 
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, బెయిలీ, మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్, వేడ్, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, రిచర్డ్‌సన్, లియోన్.
 
పిచ్, వాతావరణం
మరోసారి ఫ్లాట్ వికెట్ సిద్ధంగా ఉంది. వర్షం పడే అవకాశాలు లేవు. భారీస్కోర్లు ఖాయంగా కనిపిస్తున్నాయి.
 
వన్డేల్లో ప్రతి చోటా ఫ్లాట్ వికెట్లు ఎదురవడం వల్ల బౌలర్లు ఇబ్బంది పడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్ బాగున్నవారే పరుగులను నియంత్రిస్తారు. మా జట్టు మొదటి మూడు వన్డేల్లోనూ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ అందరూ పూర్తి నియంత్రణతో ఆడుతున్నారు. కచ్చితంగా క్లీన్‌స్వీప్ మా లక్ష్యం.      
-వార్నర్
 
మా బౌలర్లకు పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల తప్పులు చేస్తున్నారు. వీటి నుంచి పాఠాలు నేర్చుకుని రాణిస్తేనే క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోగలం. సిరీస్ ఓడిపోవడం అందరికీ బాధ కలిగించింది. అయితే సిగ్గుపడాల్సిన స్థాయిలో ఘోరంగా మా జట్టు ఆడలేదు. కేవలం ఆరు రోజుల వ్యవధిలో మూడు టైమ్ జోన్లకు వెళ్లి ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోతారు. కాబట్టి ఇలాంటి పర్యటనలకు ఎక్కువమంది క్రికెటర్లతో రావడం వల్ల రొటేషన్‌ను అమలు చేయొచ్చు.
- రవిశాస్త్రి, భారత్ టీమ్ డెరైక్టర్
 
ఉ. గం. 8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
2
గత నాలుగేళ్లలో భారత్ ఆస్ట్రేలియాతో వారి దేశంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 19 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు టెస్టులు ‘డ్రా’ కాగా... ఒక వన్డే, ఒక టి20లో గెలిచింది. మిగిలిన 15 మ్యాచ్‌ల్లోనూ ఓడింది.
 
1
కాన్‌బెర్రాలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. గతంలో ఈ మైదానంలో 2008లో శ్రీలంకతో ఆడిన వన్డేలో భారత్ ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement