Dhoni Sena
-
ఆడుతూ... పాడుతూ...
మరోసారి సేమ్ టు సేమ్ సీన్...ఎలాంటి తడబాటు లేదు, ఎలాంటి వైఫల్యమూ లేదు, జింబాబ్వేపై ధోని సేన సంపూర్ణ ఆధిపత్యం... ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని మరింత తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత యువ జట్టు ఆ తర్వాత సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ప్రయోగంగా భావించిన పర్యటనలో కొత్త కుర్రాళ్లతో కూడా భారత్ అలవోకగా సిరీస్ విజయాన్ని అందుకుంది. ♦ రెండో వన్డే కూడా భారత్‌దే ♦ 8 వికెట్లతో జింబాబ్వే చిత్తు ♦ 2-0తో సిరీస్ సొంతం హరారే: జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. సోమవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 34.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. వుసీ సిబాందా (69 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ (3/25) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం భారత్ 26.5 ఓవర్లలో 2 వికెట్లకు 129 పరుగులు చేసింది. అంబటి రాయుడు (44 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (68 బంతుల్లో 39; 5 ఫోర్లు), రాహుల్ (50 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ భారత్ సొంతమైంది. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది. చహల్‌కు మూడు వికెట్లు జింబాబ్వే బ్యాటింగ్ గత మ్యాచ్‌ను తలదన్నే రీతిలోనే సాగింది. ఒక దశలో 106/3తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టు 9.1 ఓవర్లలో 20 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడిన జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగగా... బరీందర్ తన వరుస ఓవర్లలో మసకద్జా (9), మూర్ (1)లను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. చిబాబా (21)ను ధావల్ వెనక్కి పంపడంతో 10 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో సిబాందా, రజా (16) కొద్ది సేపు క్రీజ్‌లో నిలదొక్కుకొని జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 15.2 ఓవర్లలో 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సిబాందా 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జింబాబ్వే కోలుకుంటున్న సమయంలో లెగ్‌స్పిన్నర్ చహల్ అద్భుత బౌలింగ్ ఆ జట్టును దెబ్బ తీసింది. భారీ షాట్ ఆడబోయిన రజా లాంగాన్‌లో చిక్కగా, తర్వాతి బంతికే చిగుంబురా (0) వెనుదిరిగాడు. చహల్ తన తర్వాతి ఓవర్లోనే సిబాందాను అవుట్ చేయడంతో జింబాబ్వే కుప్పకూలింది. తన చివరి 2 ఓవర్లను మెయిడిన్‌గా వేసిన చహల్ 3 వికెట్లు తీయడం విశేషం. అనంతరం జింబాబ్వే ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇర్విన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన విలియమ్స్ టాస్ తర్వాత గాయపడి బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. అలవోకగా... స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి మ్యాచ్‌లాగే రాహుల్ మళ్లీ ఆకట్టుకోగా, ఈ సారి కరుణ్ నాయర్ కూడా రాణించాడు. చటారా వేసిన వరుస ఓవర్లలో వీరిద్దరు చెరో రెండు బౌండరీలు బాది ధాటిని ప్రదర్శించారు. అయితే అర్ధ సెంచరీ భాగస్వామ్యం తర్వాత చిబాబా వేసిన బంతిని రాహుల్ వికెట్లపైకి ఆడుకోవడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం నాయర్, రాయుడు కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జత చేశారు. చిగుంబురా, చిబాబా ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన రాయుడు వేగంగా జట్టును విజయానికి చేరువ చేశాడు. మరో 2 పరుగులు చేయాల్సిన సమయంలో నాయర్ అవుటైనా, పాండే (4 నాటౌట్) ముగించాడు. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మసకద్జా (సి) బుమ్రా (బి) బరీందర్ 9; చిబాబా (ఎల్బీ) (బి) ధావల్ 21; మూర్ (ఎల్బీ) (బి) బరీందర్ 1; సిబాందా (సి) జాదవ్ (బి) చహల్ 53; రజా (సి) జాదవ్ (బి) చహల్ 16; చిగుంబురా (ఎల్బీ) (బి) చహల్ 0; ముతుంబామి (సి) ధోని (బి) బుమ్రా 2; క్రీమర్ (నాటౌట్) 7; చటారా (బి) ధావల్ 2; ముజరబని (ఎల్బీ) (బి) అక్షర్ 5; సీన్ విలియమ్స్ (ఆబ్సెంట్హర్ట్); ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (34.3 ఓవర్లలో ఆలౌట్) 126. వికెట్ల పతనం: 1-19; 2-21; 3-39; 4-106; 5-106; 6-107; 7-112; 8-115; 9-126. బౌలింగ్: బరీందర్ 6-1-17-2; ధావల్ 9-1-31-2; బుమ్రా 6-0-27-1; అక్షర్ 7.3-0-22-1; చహల్ 6-2-25-3. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) చిబాబా 33; నాయర్ (ఎల్బీ) (బి) రజా 39; రాయుడు (నాటౌట్) 41; పాండే (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (26.5 ఓవర్లలో 2 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1-58; 2-125. ; బౌలింగ్: చటారా 8-1-40-0; ముజరబని 3-1-13-0; చిబాబా 9-1-31-1; క్రీమర్ 3-0-17-0; చిగుంబురా 2-0-20-0; రజా 1.5-0-7-1. -
ఇక పరువు కోసం...
* భారత్, ఆస్ట్రేలియాల నాలుగో వన్డే నేడు * విజయం కోసం ధోనిసేన ఆరాటం * క్లీన్‌స్వీప్ స్మిత్ బృందం లక్ష్యం ఆస్ట్రేలియా పర్యటనలో సాధారణంగా బ్యాట్స్‌మెన్ విఫలమై సిరీస్‌లు అప్పజెప్పడం చాలాకాలంగా భారత్‌కు ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేస్తున్నా మ్యాచ్‌లు గెలవలేకపోతున్నారు. ఐదు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ధోనిసేన మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే పరువు దక్కించుకుంటుంది. మరోవైపు తొలిసారి భారత్‌తో స్వదేశంలో ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేయాలనేది ఆస్ట్రేలియా లక్ష్యం. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. కాన్బెర్రా: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆస్ట్రేలియా పిచ్‌లపై పరుగుల వరద పారుతోంది. సిరీస్‌లో తొలి మూడు వన్డేల్లోనూ ఊహించని విధంగా భారీ స్కోర్లు వచ్చాయి. నాలుగో వన్డే కూడా దీనికి అతీతం కాకపోవచ్చు. మరోసారి ఫ్లాట్ పిచ్‌పై సమరానికి రెండు జట్లు సిద్ధమయ్యాయి. మనుకా ఓవల్ మైదానంలో నేడు (బుధవారం) జరిగే నాలుగో వన్డేలో భారీ స్కోర్లు రావచ్చనేది అంచనా. ఇప్పటికే సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారీ లక్ష్యాలని ఛేదించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా... కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తున్న భారత జట్టు కూర్పు విషయంలో గందరగోళంతో ఉంది. మళ్లీ మార్పులు! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింక్య రహానే ముగ్గురూ సూపర్ ఫామ్‌లో ఉన్నందున భారత్ వరుసగా ప్రతి మ్యాచ్‌లోనూ భారీస్కోరు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఇబ్బందిపడ్డా మూడో వన్డేలో ధావన్ కాస్త కుదురుకున్నాడు. ధోని కూడా టచ్‌లోనే కనిపిస్తున్నందున బ్యాటింగ్ విభాగంలో సమస్యలు ఉండకపోవచ్చు. గుర్కీరత్, రిషి ధావన్‌లకు ఇంకో అవకాశం ఇవ్వొచ్చు. బౌలింగ్ విభాగంలో మాత్రం మళ్లీ మార్పులు తప్పకపోవచ్చు. పిచ్ స్వభావం దృష్ట్యా మళ్లీ అశ్విన్ తుది జట్టులోకి రావచ్చు. ఉమేశ్ స్థానంలో అతణ్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రిషి ధావన్ మూడో పేసర్‌గా సరిపోడని భావిస్తే మాత్రం తను కూడా బెంచ్ మీద కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు భువనేశ్వర్‌కు అవకాశం రావచ్చు. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా ధోనిసేన తుది జట్టు కూర్పు విషయంలో తీవ్ర గందరగోళంలో ఉంది. తుది జట్టులో లియోన్ ఇక ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌లో మార్పులు చేయక తప్పదు. కూతురు పుట్టినందున రెండు వన్డేలకు సెలవు తీసుకున్న వార్నర్ తిరిగి జట్టుతో చేరాడు. అయితే వార్నర్ స్థానంలో ఆడిన షాన్‌మార్ష్ రెండు మ్యాచ్‌ల్లోనూ విశేషంగా రాణించాడు. అయినా సరే ఆస్ట్రేలియా జట్టు ఎంపికలో సెంటిమెంట్లను పట్టించుకోదు. కాబట్టి షాన్‌మార్ష్ స్థానంలో వార్నర్ తుది జట్టులోకి రావడం ఖాయం. బెయిలీ, స్మిత్, మ్యాక్స్‌వెల్ అందరూ ఫామ్‌లో ఉన్నందున ఆసీస్ శిబిరం పూర్తిగా రిలాక్స్‌గా ఉంది. బౌలింగ్ విభాగంలో మాత్రం ఒక స్పిన్నర్ తుది జట్టులో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించారు. దీంతో నాథన్ లియోన్ జట్టులోకి వచ్చాడు. బోలాండ్‌ను తప్పించి లియోన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), కోహ్లి, ధావన్, రోహిత్, రహానే, గుర్కీరత్, జడేజా, అశ్విన్, ఇషాంత్, బరిందర్, రిషి ధావన్/భువనేశ్వర్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, బెయిలీ, మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్, వేడ్, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, రిచర్డ్సన్, లియోన్. పిచ్, వాతావరణం మరోసారి ఫ్లాట్ వికెట్ సిద్ధంగా ఉంది. వర్షం పడే అవకాశాలు లేవు. భారీస్కోర్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. వన్డేల్లో ప్రతి చోటా ఫ్లాట్ వికెట్లు ఎదురవడం వల్ల బౌలర్లు ఇబ్బంది పడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్ బాగున్నవారే పరుగులను నియంత్రిస్తారు. మా జట్టు మొదటి మూడు వన్డేల్లోనూ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ అందరూ పూర్తి నియంత్రణతో ఆడుతున్నారు. కచ్చితంగా క్లీన్‌స్వీప్ మా లక్ష్యం. -వార్నర్ మా బౌలర్లకు పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల తప్పులు చేస్తున్నారు. వీటి నుంచి పాఠాలు నేర్చుకుని రాణిస్తేనే క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోగలం. సిరీస్ ఓడిపోవడం అందరికీ బాధ కలిగించింది. అయితే సిగ్గుపడాల్సిన స్థాయిలో ఘోరంగా మా జట్టు ఆడలేదు. కేవలం ఆరు రోజుల వ్యవధిలో మూడు టైమ్ జోన్లకు వెళ్లి ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోతారు. కాబట్టి ఇలాంటి పర్యటనలకు ఎక్కువమంది క్రికెటర్లతో రావడం వల్ల రొటేషన్‌ను అమలు చేయొచ్చు. - రవిశాస్త్రి, భారత్ టీమ్ డెరైక్టర్ ఉ. గం. 8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం 2 గత నాలుగేళ్లలో భారత్ ఆస్ట్రేలియాతో వారి దేశంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 19 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు టెస్టులు ‘డ్రా’ కాగా... ఒక వన్డే, ఒక టి20లో గెలిచింది. మిగిలిన 15 మ్యాచ్‌ల్లోనూ ఓడింది. 1 కాన్బెర్రాలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. గతంలో ఈ మైదానంలో 2008లో శ్రీలంకతో ఆడిన వన్డేలో భారత్ ఓడిపోయింది. -
ఆఖరి అవకాశం!
మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో భారత్ 0-4తో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత సొంత గడ్డపై కూడా 1-2తో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఒకేసారి ఆ రెండింటికీ ప్రతీకారం తీర్చుకుంటామనే పట్టుదల ఈ సిరీస్‌కు ముందు భారత యువ జట్టులో కనిపించింది. ఇంగ్లండ్ పేలవమైన ఫామ్‌లో ఉండటం అందుకు కారణమైంది. ఇక లార్డ్స్‌లో విజయం సాధించగానే భారత్ తిరుగులేని స్థితిలో నిలిచినట్లు అనిపించింది. అయితే... ఒక్కసారిగా ధోని సేన సుడి మారిపోయింది! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా ఏదీ కలిసి రాలేదు. దాంతో వరుసగా రెండు టెస్టుల్లో ఘోర పరాజయం ఎదురైంది. ఫలితంగా మన జట్టు ఆత్మవిశ్వాసం అడుగంటితే... ప్రత్యర్థి మాత్రం అమితోత్సాహంతో ఉంది. ఇకపై సిరీస్ గెలిచే అవకాశం ఎలాగూ లేదు. కనీసం సమం చేసినా భారత్ పరువు నిలబడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సిరీస్ కోల్పోలేదన్న సంతృప్తి దక్కుతుంది. అలా జరగాలంటే ఇప్పుడు ఆఖరి అవకాశం జట్టు ముంగిట నిలిచింది. అయితే ఏ ఒక్కరో కాకుండా జట్టంతా సమష్టిగా రాణిస్తేనే అది సాధ్యమవుతుంది. ►ధోని సేన సత్తాకు పరీక్ష ►తీవ్ర ఒత్తిడిలో భారత్ ►సిరీస్‌పై ఇంగ్లండ్ గురి నేటినుంచి ఆఖరి టెస్టు మ.గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం లండన్: ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టెస్టు సిరీస్ కోల్పోకూడదని పట్టుదలగా ఉన్న భారత జట్టు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌లో 1-2తో వెనుకబడ్డ ధోని బృందం నేటినుంచి ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగే చివరిదైన ఐదో టెస్టుకు సమాయాత్తమైంది. సిరీస్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలన్నా... ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం తప్పనిసరి. మరోవైపు మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’ చేసుకోగలిగినా సిరీస్‌ను గెలుచుకునే స్థితిలో ఇంగ్లండ్ ఉంది. ఆటగాళ్ల ఫామ్‌తో పాటు తుది జట్టు కూర్పు వరకు టీమిండియా సమస్యల్లో ఉండగా... కుక్ సేన మాత్రం వరుస విజయాలు ఇచ్చిన జోరుతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ఇషాంత్ ఖాయం... లార్డ్స్‌లో సంచలన బౌలింగ్ తర్వాత గాయంతో రెండు టెస్టులకు దూరమైన ఇషాంత్ ఈ టెస్టు బరిలోకి దిగనున్నాడు. మేనేజ్మెంట్ ఈ విషయాన్ని నిర్ధారించింది. రెండు రోజుల పాటు అతను ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. పంకజ్ సింగ్ స్థానంలో అతను తుది జట్టులోకి రానున్నాడు. ఇషాంత్ వస్తే భువనేశ్వర్, ఆరోన్లతో కలిసి జట్టు పేస్ బౌలింగ్ పదునెక్కుతుంది. గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో ఆడనున్నట్లు ధోని ప్రకటించాడు. ముగ్గురు పేసర్లతో పాటు అశ్విన్ కూడా జట్టులో ఉంటాడు. అయితే ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా స్థానంలో స్టువర్ట్ బిన్నీని తీసుకురావచ్చని అంచనా. ప్రాక్టీస్ సెషన్లో బిన్నీ సుదీర్ఘంగా సాధన చేయడం కూడా దీనికి సంకేతంగా చెప్పవచ్చు. మరోవైపు గంభీర్, ధావన్‌లలో ఎవరిని తీసుకోవాలనే విషయంపైనే మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. మొదటి మూడు టెస్టులు ధావన్ ఆడాడు కాబట్టి... గంభీర్‌కే మరో చాన్స్ ఇవ్వవచ్చని వినిపిస్తోంది. లార్డ్స్‌లో ఆకట్టుకున్న రహానే తర్వాతి రెండు టెస్టుల్లో రాణించలేదు. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను రాణించడం జట్టుకు ఎంతో అవసరం. అన్నింటికి మించి పుజారా, కోహ్లిల ప్రదర్శనపైనే జట్టు విజయావకాశాలు ఉన్నాయనేది స్పష్టం. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే గౌరవప్రదంగా సిరీస్ ముగించవచ్చు. రాబ్సన్ మినహా... మరోవైపు ఇంగ్లండ్ జట్టు మాత్రం తమ జోరును కొనసాగించాలని భావిస్తోంది. జట్టులోని ఆటగాళ్లలో ఓపెనర్ రాబ్సన్ మినహా అందరూ ఏదో ఒక దశలో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మూడో టెస్టులో రాణించినా... కుక్ గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అయితే ఈ సారైనా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఇక ఈ సిరీస్‌లో జట్టు టాప్ స్కోరర్‌గా ఉన్న గ్యారీ బ్యాలెన్స్, ఫామ్‌లో ఉన్న మరో బ్యాట్స్‌మన్ జో రూట్ బ్యాటింగ్ భారాన్ని మోస్తారు. సీనియర్ బెల్‌తో పాటు కీపర్ బట్లర్ బ్యాటింగ్ కూడా కీలకం కానుంది. తన స్పిన్‌తో భారత బ్యాటింగ్ పనిపట్టిన ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. ఈసారి అతను రాణిస్తాడని ఇంగ్లండ్ ఆశిస్తోంది. రాబ్సన్ విఫలమవుతున్నా... విజయాల జట్టును మార్చే ఆలోచన ఇంగ్లండ్ మేనేజ్మెంట్కు లేదు. గాయం నుంచి కోలుకున్న బ్రాడ్ మ్యాచ్ ఆడనున్నాడు. ముఖానికి ప్లాస్టర్ ఉన్నా... అతను ఎలాంటి అసౌకర్యం లేకుండా గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇక టీమిండియాపై మైదానంలోనూ, బయటా సమస్యగా మారిన అండర్సన్‌పై ఆ జట్టు ఎంతో ఆధారపడుతోంది. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), విజయ్, గంభీర్, పుజారా, కోహ్లి, రహానే, జడేజా/బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, ఆరోన్, ఇషాంత్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), రాబ్సన్, బ్యాలెన్స్, ఇయాన్ బెల్, రూట్, మొయిన్ అలీ, బట్లర్, వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, జోర్డాన్. ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో పాటు అండర్సన్కూ మంచి రికార్డు లేకపోవడం భారత్‌లో ఉత్సాహం నింపే అంశం. గత నాలుగేళ్లలో ఓవల్‌లో ఇంగ్లండ్ ఒక్కటే టెస్టు నెగ్గింది. 2010 నుంచి ఆ జట్టుకు ఇతర వేదికల్లో ఎక్కడా ఇలాంటి పేలవ రికార్డు లేదు. ఈ మైదానంలో అండర్సన్ ఒక్కసారి కూడా ఐదు వికెట్లు తీయలేకపోయాడు. ఇక్కడ గత తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అతను ఒకేసారి రెండుకు మించి వికెట్లు తీయగలిగాడు. మరోవైపు ఇంగ్లండ్‌లోని ఇతర మైదానాలతో పోలిస్తే భారత్‌కు ఓవల్‌లోనే కాస్త మెరుగైన రికార్డు ఉంది. పైగా ప్రపంచంలోని ఏ గ్రౌండ్లో కూడా భారత్ ఇన్ని (7) మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించలేదు. గత ఆరు టెస్టుల్లో ఐదింటిలో ఏదో ఒక ఇన్నింగ్స్‌లో భారత్ కనీసం 400 పరుగులు దాటగలిగింది. పిచ్ ఓవల్ పిచ్ గతంలో స్పిన్‌కు బాగా అనుకూలించినా ఇటీవల ఆ పరిస్థితి లేదు. అయితే నాలుగో టెస్టుతో పోలిస్తే ఇక్కడ వేగం, బౌన్స్ తక్కువ. భారత జట్టుకు ఇది అనుకూలాంశమనే చెప్పాలి. వాతావరణం గురువారం ఒక్కసారిగా వర్షం రావడంతో భారత్ ప్రాక్టీస్ అర్ధాంతరంగా ఆగిపోయింది. టెస్టు జరిగే సమయంలో కూడా వర్షానికి అవకాశం ఉన్నా... మ్యాచ్‌కు అంతరాయం కలగకపోవచ్చు.